రహదారులపై నో సేఫ్టీ!
పేరుకే రోడ్ సేఫ్టీ కమిటీ..
రహదారులపై ప్రమాదాల నివారణకు కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు సేప్టీ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆర్‌ఆండ్‌బీ ఈఈ, డీసీపీ, జిల్లా రవాణా అధికారి, డీఎంహెచ్‌ఓ, నేషనల్ హైవే అథారిటీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ ఈఈ, ఆర్టీసీ డిపో మేనేజర్, ఎన్‌జీఓలు సభ్యులుగా ఉంటారు. వీరంతా ప్రతినెలా సమావేశమై రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాలి. కానీ, కమిటీ చేపడుతున్న చర్యలు మొక్కుబడిగా ఉంటున్నాయన్న విమర్శలున్నాయి.
సాక్షి, యాదాద్రి : 12 నెలలు, 100 ఘటనలు, 108 మంది మృతి, వందల సంఖ్యలో క్షతగాత్రులు.. జిల్లా పరిధిలోని జాతీయ రహదారులపై ప్రమాదాల తీవ్రతను తెలియజేస్తున్నాయి ఈ గణాంకాలు. గజానికో గుంత, అడుగుకో గొయ్యితో అదుపు తప్పిన వాహనాలకు లెక్కే లేదు. అతివేగాన్ని అదుపు చేయలేక, సూచిక బోర్డులు లేక, రోడ్లు మరమ్మతులకు నోచుకోక ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. రహదారి భద్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రయాణికుల ప్రాణాలకు భరోసా కల్పించాల్సిన రోడ్డు సేఫ్టీ కమిటీలు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలున్నాయి. బ్లాక్‌స్పాట్‌లను గుర్తించినా ప్రమాద నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నాయి.
బ్లాక్ స్పాట్ల గుర్తింపు
ఏడాదిలో ఒకే చోట ఐదు ప్రమాదాలు సంభవిస్తే ఆ ప్రాంతాన్ని బ్లాక్‌స్పాట్‌గా పరిగణిస్తారు. అటువంటి 18 బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారు.
ఫ హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హేవే 65పై తూప్రాన్‌పేట్ జంక్షన్, ఖైతాపుర్ జంక్షన్, కొయ్యలగూడెం, ధర్మోజిగూడెం, చౌటుప్పల్ ఆర్టీసీ బస్టాండ్ యూ టర్న్, చౌటుప్పల్‌లోని పద్మశ్రీ ఫంక్షన్ హాల్, లింగోజిగుడెం వద్ద ప్రమాదాలు అధికంగా జరుగుతుంటాయి. ఆయా ప్రాంతాల్లో గడిచిన ఏడాది కాలంలో 54 ప్రమాదాలు జరిగి 51 మంది మృతిచెందారు.
ఫ హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారి 163పై బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రి వద్ద, బీబీనగర్‌లోని షాలీమార్ హోటల్, గూడూరు చౌరస్తా, కొండమడుగు వద్ద, భువనగిరి పట్టణంలోని నల్లగొండ ఎక్స్‌రోడ్డు, భువనగిరి పట్టణంలోని వై జంక్షన్, భువనగిరి మండలం అనంతారం ఫ్లై ఓవర్ జంక్షన్, ఆలేరు మండలం మంతపురి, ఆలేరు పట్టణంలోని సాయిబాబా ఆలయం వద్ద, నల్లగొండ – వలిగొండ – తొర్రూరు ఎక్స్‌రోడ్డు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. 2023 జనవరి 1నుంచి 2024 డిసెంబర్ 31వ తేదీ వరకు ఆయా ప్రాంతాల్లో 46 ప్రమాదాలు చోటు చేసుకోగా 57 మంది మరణించారు.
స్పీడ్‌గన్‌లు ఎక్కడ?
అతి వేగం వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి జాతీయ రహదారులపై పలు చోట్ల స్పీడ్‌గన్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. స్పీడ్‌గన్‌లు ఉంటే మితిమీరిన వేగంతో వెళ్తే జరిమానా పడుతుందన్న భయంతో వాహనదారులు జాగ్రత్తగా వెళ్తారు. కానీ, జిల్లా పరిధిలోని జాతీయ రహదారులపై ఎక్కడా స్పీడ్‌గన్‌లు ఏర్పాటు చేయలేదు.
ప్రమాదాలకు అడ్డాగా నేషనల్ హైవేలు
ఫ బ్లాక్‌స్పాట్‌ల వద్ద మొక్కుబడి చర్యలు
ఫ కూడళ్లు, మలుపుల వద్ద అంధకారం
ఫ వేగ నియంత్రణకు స్పీడ్‌గన్‌లూ లేవు
ఫ ఏడాదిలో 100 ప్రమాదాలు,
108 మంది మృత్యువాత
డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్, మితిమీరిన వేగం
నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మితిమీరిన వేగం, రాంగ్‌రూట్ వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసు అధికారులు గతంలోనే గుర్తించారు. వీటితో పాటు డివైడర్లు సరిగా లేకపోవడం, జిబ్రాక్రాసింగ్, ఓవర్‌టేకింగ్, వాహనాలు జిగ్‌జాగ్‌గా రావడం, యూటర్న్‌లు, కూడళ్లు, మూలమలుపుల వద్ద లైటింగ్ సరిగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు గుర్తించారు. అయినా ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment