శ్రీనివాసులరెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు’.. ఈ సామెత ఇప్పుడు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డికి వర్తిస్తుంది. సొంత సోదరుడు, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో రివర్స్ గేర్ అందుకున్నారు. కష్టపడ్డ తనను కాదని మరొకర్ని ప్రోత్సహిస్తారా.? టీడీపీలో తాను పల్లకి మోసే బోయీగా మిగిలిపోవాలా? ఇకపై తన సత్తా ఏమిటో చూపుతానని వ్యూహాత్మక హెచ్చరికలు చేస్తున్నారు. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పరిస్థితి చక్కబెట్టాల్సిన శ్రీనివాసులరెడ్డి ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని తెలుగుతమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. మా వ్యతిరేకుల్ని చేరదీస్తూ పార్టీలో వర్గాలను ప్రోత్సహించడం కాదు, చేతనైతే సొంత అన్న చేత టీడీపీ జెండా పట్టించాలని నియోజకవర్గ ఇన్‌చార్జిలు సవాల్ విసురుతున్నారు.
దివంగత మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి రాజకీయ వారసుడిగా రమేష్‌కుమార్‌రెడ్డి అరంగ్రేటం చేశారు. 1999లో లక్కిరెడ్డిపల్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో లక్కిరెడ్డిపల్లె రద్దు అయింది. రాయచోటి నియోజవకర్గంలో మూడు మండలాలు కలిసిపోయాయి. 2009 ఎన్నికల్లో టీడీపీ అవకాశం కల్పించలేదు. 2014, 19లలో రాయచోటి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రమేష్‌కుమార్‌రెడ్డి 1999 నుంచి ఇప్పటివరకు టీడీపీ నాయకుడిగా చలామణి అవుతున్నారు. కాంట్రాక్టర్‌గా స్థిరపడిన ఆయన సోదరుడు శ్రీనివాసులరెడ్డి 2014 వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014లో తొలిసారి కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి లక్షా తొంభైవేల పైచిలుకు ఓట్ల తేడాతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు.
స్వలాభం కోసమే రాజకీయాల్లోకి....
సోదరుడు రాజకీయాల్లో ఉన్నా.. పదవీకాంక్ష శ్రీనివాసులరెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేలా చేసిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కడప పార్లమెంట్‌కు పోటీ చేసి ఎన్నికల ఖర్చు భరిస్తే ఓడినా రాజ్యసభ సీటు ఇస్తామని టీడీపీ అధిష్టానం ఆఫర్ ఇచ్చిందని పలు వురు చెప్పుకొస్తున్నారు. ఈమేరకు పార్టీలో దూకుడు పెంచినట్లు రెడ్డెప్పగారి కుటుంబ సన్నిహితులు వివరిస్తున్నారు. తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుడిగా టీడీపీ అవకాశం కల్పించింది. ఈక్రమంలో కడప అసెంబ్లీ ఇన్‌చార్జిగా తన సతీమణి మాధవీరెడ్డిని నియమించేలా చేసుకున్నారు. కడప పార్లమెంట్, అసెంబ్లీ టికెట్లను భార్యభర్తలు ఆశిస్తున్నారు. ఈక్రమంలో రాయ చోటి ఇన్‌చార్జిగా ఉన్న రమేష్‌కుమార్‌రెడ్డి సీటు ప్రశ్నార్థకమైందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తాజా రాజకీయ పరిణామం రమేష్‌కుమార్‌రెడ్డి ఇజ్జత్‌కు సవాల్‌గా నిలుస్తోంది. 1999 నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ బాధ్యతగా పనిచేస్తున్న తనను కాదని, తమ్ముడి కుటుంబాన్ని ప్రోత్సహిస్తారా? అని టీడీపీ అధినేత పట్ల రగిలిపోతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో శక్తి వంచన లేకుండా టీడీపీ అభ్యర్థుల ఓటమికి పనిచేయాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అవసరమైతే కడపలో కూడా శ్రీనివాసులరెడ్డికి వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొనాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
వాసు శైలిని నిలదీస్తున్న ఇన్‌చార్జిలు
నియోజకవర్గ ఇన్‌చార్జిలకు అండగా నిలవాల్సిందిపోయి, వర్గాలను ప్రోత్సహించేలా శ్రీనివాసులరెడ్డి చర్యలు ఉన్నాయని ఆయా నియోజకవర్గాల ఇన్‌చా ర్జిలు వాపోతున్నారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిని ప్రోత్సహిస్తూ ఇన్‌చార్జి పుత్తానరసింహారెడ్డికి ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆయన వర్గీ యులు వాపోతున్నారు. ఇదే విషయమై పుత్తా నరసింహారెడ్డి హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే మైదుకూరు ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌తో నిమిత్తం లేకుండా ఆయన వ్యతిరేకుల్ని చేరదీస్తున్నట్లు తెలిసింది. ఇలాంటివి దృష్టిలో ఉంచుకొని ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జిలు ముందు తన సోద రుడు రమేష్‌కుమార్‌రెడ్డిని నియంత్రించుకోవాలని శ్రీనివాసులరెడ్డికి సవాల్ విసురుతున్నారు. టీడీపీ జెండాలు లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సోదరుడికి సర్దిచెప్పుకోలేని నాయ కుడు మాపై పెత్తనం చేయడం ఏమిటని నిలదీస్తున్నట్లు సమాచారం. పార్టీ శ్రేయస్సు కంటే స్వప్రయోజనాలు ఆశించడంతోనే ఇలాంటి వ్యవహారాలు తెరపైకి వస్తున్నట్లు విశ్లేషకులు చెప్పుకొస్తుండటం గమనార్హం.
తెలుగుదేశం పార్టీలో రివర్స్ గేర్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి
ఆత్మీయులు, అనుచరులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు
పొలిట్ బ్యూరో సభ్యుడుగాకట్టడి చేయలేని వైనం
Comments
Please login to add a commentAdd a comment