●రైఫిల్ షూటింగ్‌లో ఉబైద్ ప్రతిభ
అల్లరి చేయాల్సిన బాల్యంలో అలలై
ఎగిసిపడుతున్నారు.. సెల్లుల వలలో చిక్కుకుపోకుండా కలల్ని సాకారం
చేసుకునే దిశగా అడుగులేస్తున్నారు.. ఆటలాడుతూ పతకాల వేట సాగిస్తున్నారు. ‘చేతి గీత’లతో తమ రాతను కొత్తగా రాస్తున్నారు. మేం పిల్లలం కాదు... చిచ్చర పిడుగులం.. భావిభారత ఆశాకిరణాలం అంటూ ఎలుగెత్తి చాటుతున్నారు. బాలల దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో రాణిస్తున్న బాలలపై ప్రత్యేక కథనం.
ప్రొద్దుటూరు కల్చరల్: ప్రొద్దుటూరు పట్టణంలోని గ్రీన్‌వ్యాలీ అపార్ట్‌మెంట్‌కు చెందిన షేక్ జాకీర్‌హుస్సేన్ (ల్యాబ్‌టెక్నీషియన్), అప్సానా భాను మొదటి కుమారుడు మహ్మద్ ఉబైద్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. జార్జ్‌కారొనేషన్ క్లబ్‌లో రైఫిల్ షూటింగ్ శిక్షకుడు రాఘవ వద్ద శిక్షణ పొందుతూ పలు రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ సత్తాచాటి 9 బంగారు పతకాలు సాధించడంతో పాటు 2 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. 2022లో హైదరాబాదులో రైఫిల్‌షూటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టేట్‌లెవల్ పోటీల్లో ఓపన్ సైట్ సబ్‌యూత్, యూత్ విభాగంలో రెండు బంగారు పతకాలు సాధించారు. 2022లో రాజమండ్రిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఓపన్‌సైట్ అండర్ –19 విభాగంలో బంగారు పతకం సాధించాడు. 2024లో హైదరాబాద్‌లో రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపన్ సైట్ కేటగిరి సబ్‌యూత్, యూత్, జూనియర్ మెన్, మెన్ విభాగంలో 4 బంగారు పతకాలు సాధించడం విశేషం. త్వరలో భోపాల్‌లో జరుగనున్న జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొననున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment