అదివో.. అల్లదివో..
పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు. ఆయన కలియుగదైవం వెంకటేశ్వరుడికి చేసిన సంకీర్తనా గానం అమృతమయం. ఆ వాగ్గేయకారుడి కీర్తనలు విశ్వవ్యాప్తం చేయడానికి ఆయన వంశీకులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సంకీర్తన, ఆధ్యాత్మిక, సామాజిక సేవ అంశంగా తీసుకుని ఊరూరా.. అన్నమయ్య.. ఇంటింటా అన్నమయ్య అనే నినాదంతో ముందుకువెళుతున్నారు. పలు ఆలయాలలో సంకీర్తనాగానంతో పాటు చిన్నారులకు కోలాట ప్రదర్శనలో శిక్షణ ఇస్తున్నారు. శుక్రవారం అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకలో ఇంటింటా అన్నమయ్య కార్యక్రమం భక్తుల కోలాహలం మధ్య ఘనంగా చేపట్టారు.
రాజంపేట: పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలు విశ్వవ్యాప్తి చేయడానికి అన్నమయ్య వారసులు నడుంబిగించారు. ఈ నేపథ్యంలో 2005 ఆగస్టు 30న శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్‌ను తిరుపతిలో ప్రారంభించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల లో సంకీర్తనల సేవతోపాటు ఆధ్యాత్మిక, సామాజిక సేవలను కొనసాగిస్తూ వస్తున్నారు. 12వ తరం అన్నమయ్య వారసులు ఏర్పాటుతో ప్రారంభమైన ఆ సేవ ఇప్పుడు 13వ తరం వారసులు కూడా శుక్రవారం చేపట్టిన కార్యక్రమాలతో ముందుకు తీసుకెళుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అన్నమయ్య సేవాసంస్కృతి అన్న నామాలతో ప్రసిద్ధి చెందింది. ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు.
ఊరూరా అన్నమయ్యలో..
ఊరూరా అన్నమయ్య కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆలయానికి వెళ్లి అక్కడ సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విష్ణుపురాణం, హనుమాన్ చాలీషా, నగర సంకీర్తన తదితర కార్యక్రమాలు చేపడుతున్నారు. అన్నమయ్య పల్లకీసేవ కార్యక్ర మాలు నిర్వహిస్తున్నారు.
సంకీర్తనలు, కోలాటంలో ఉచితంగా శిక్షణ
అన్నమాచార్య సంకీర్తనలు, కోలాటాలలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. సామాజిక సేవ, ఆధ్యాత్మిక సేవ, అన్న మయ్య సంకీర్తన ప్రచారసేవ, సాంస్కృతి సేవ, భక్తిసేవ, సంగీత సేవ కార్యక్రమాలతో పాటు పాఠశాలలలో విద్యార్థులకు ఉచితంగా అన్నమయ్య సంకీర్తనలు నేర్పిస్తున్నారు. కోలాటంలో కూడా శిక్షణ ఇస్తున్నారు. భక్తిగాన మంజరి కార్యక్రమాలపై పిల్లలలో అవగాహన కోసం స్తోత్ర మంజరి పై కార్యక్రమాలను నిర్వహించి వరల్డ్ రికార్డ్స్ సాధించారు.
ఏటా అన్నమయ్య ఆరాధనోత్సవాలు
ప్రతి ఏటా అన్నమయ్య ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీటీడీ నిర్వహించే అన్నమయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు అన్నమయ్య 12 వ తరానికి చెందిన హరిస్వామి విధిగా పాల్గొంటున్నారు. ఈ ట్రస్ట్ చైర్మన్‌గా తాళ్లపాక రామ్‌చరణ్, వైస్‌చైర్మన్‌గా తాళ్లపాక కృష్ణధీరజ్, సెక్రటరీగా తాళ్లపాక గౌరీ ప్రసన్న, ఉభయ రాష్ట్రాల డైరక్టర్లుగా కొఠారి సునీత, మీనాక్షి అన్నమయ్య వ్యవహరిస్తున్నారు.
సామాజికసేవలోనూ..
ప్రతి సంవత్సరం మార్చి నుంచి జూన్ వరకు వేసవిలో విశాఖ, కర్నూలు నగరాలలో భక్తులకు దాహం తీర్చేందుకు మంచినీళ్లు, మజ్జిగ వితరణ కేంద్రాలను ఏర్పాటుచేసి అన్నమయ్య సేవను అందిస్తున్నారు. అలాగే పల్స్‌పోలియో, మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం కొనసాగుతోంది.
అన్నమయ్య జన్మస్థలిలో ..
కార్తీక పౌర్ణమి రోజున తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాకలో ఊరూర అన్నమయ్య.. ఇంటింటా అన్నమయ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భక్తులను అన్నమయ్య వారసులు కోరుతున్నారు.
అన్నమయ్య సంకీర్తనలకు విస్తృత ప్రచారం
తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలకు విస్తృతప్రచారం నిర్వహిస్తున్నాం. ఊరూర అన్నమయ్య..ఇంటింటా అన్నమయ్య కార్యక్రమాలను ఏపీ, తెలంగాణాలో దిగ్విజయంగా నిర్వహిస్తున్నామంటే భక్తుల సహకారం ఎంతో ఉంది. టీటీడీ సహకారం అన్నమయ్య వారసులకు ఉండటం వల్ల మేము ఆధ్యాత్మికసేవను ముందుకు తీసుకెళుతున్నాం. – తాళ్లపాక గౌరీ ప్రసన్న, ట్రస్ట్ సెక్రటరీ, తిరుమల
ఊరూరా అన్నమయ్యకు విశేష స్పందన
ఊరూరా అన్నమయ్య...ఇంటింటా అన్నమయ్య కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అన్నమాచార్యుని సంకీర్తనల వ్యాప్తి, శిక్షణ, ఆధ్యాత్మిక సేవ, సామాజిక సేవలను నిర్వహిస్తున్నాం. భక్తి,సేవపరంగా అన్నమయ్య చూపిన మార్గంలో మేము ముందుకెళుతున్నాం. – మీనాక్షి అన్నమయ్య, డైరక్టరు, తెలంగాణా అన్నమయ్య సేవాసంస్కృతి
Comments
Please login to add a commentAdd a comment