విద్యుత్ అదనపు చార్జీల భారాన్ని రద్దు చేయాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ అదనపు చార్జీల భారాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఎం నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ సర్కిల్‌లో సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ అదనపు భారాలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని, అదాని ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు తిరగకముందే రూ.15,484 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై వేయడం దారుణమన్నారు. 2022 –23 సంవత్సరాల్లో వినియోగించుకున్న విద్యుత్ పై రూ. 6072 కోట్ల రూపాయల సర్దుబాటు చార్జీల పేరుతో నేడు జనం నుంచి వసూలు చేయటం శోచనీయమన్నారు. విద్యుత్ ఛార్జీలు 30 శాతం ఉండగా సర్దుబాటు చార్జీలు, అదనపు చార్జీలు 70 శాతం ఉండటం దారుణమన్నారు. మరో విద్యుత్ పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కమిటీ సభ్యురాలు జమీలా, కామనూరు శ్రీనివాస్ రెడ్డి, దస్తగిరి రెడ్డి, కుమారస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment