గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా
కొండాపురం : మండల పరిధిలోని ఏటూరు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిలో శనివారం రాత్రి గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా పడింది. అనంతపురం నుంచి ఒంగోలు వెళుతున్న లారీ బోల్తా పటడంతో డ్రైవర్ వెంకటేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారిలో వాహనాల రద్దీ ఎక్కువ ఉన్నప్పటికి ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
అథ్లెటిక్స్ మీట్‌లో మంజుల కిరణ్‌కు బంగారు పతకం
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆలిండియా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు అథ్లెటిక్ మీట్–2024లో కడప ఆర్టీసీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న మంజుల కిరణ్ 50 ఏళ్లలోపు వంద మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచారు. విశాఖపట్టణంలో ఏపీఎస్ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్, ఏఎస్ ఆర్‌టీయూ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీలలో 18 రాష్ట్రాల నుంచి ఉద్యోగులు పాల్గొన్నారు. వీరిలో కడపకు చెందిన మంజుల కిరణ్ మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించడం అభినందనీయమని కడప ఆర్టీసీ డిపో అసోసియేషన్ నాయకులు సగినాల శ్రీనివాసులు, దాసు, వాసుదేవరెడ్డి, ఇస్మాయిల్, మురళి ,సూపర్‌వైజర్ల తరుపున లలిత, నాగమణి పేర్కొన్నారు. ఆదివారం ఆమెను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు విఠల్, కేవీఎన్‌ఎం రావు పాల్గొన్నారు.
శతాధిక కవి సమ్మేళనంలో వైవీయూ అధ్యాపకుడు
కడప ఎడ్యుకేషన్ : రాయలసీమ మహా కవిసమ్మేళనంలో భాగంగా ఆదివారం అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో నిర్వహించిన శతాధిక కవి సమ్మేళనంలో కడప యోగివేమన విశ్వ విద్యాలయం లలిత కళల విభాగం రంగస్థల కళల అధ్యాపకుడు డాక్టర్ కొప్పోలు రెడ్ది శేఖర్ రెడ్డి కవితా గానం చేశారు. వైసీవీ రెడ్డి–జీవితం– సాహిత్యం గురించి ‘దర్పణం‘ అనే శీర్షికతో కవిత్వం వినిపించారు. రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బండి నారాయణ స్వామి తదితర సాహితీ వేత్తలతో సన్మానం పొందారు. వైవీయూ వీసీ ఆచార్య కృష్ణారెడ్డి, కులసచివులు ఆచార్య పి.పద్మ, ప్రధానాచార్యులు ఎస్.రఘునాథ రెడ్డి, లలిత కళల విభాగం అధిపతి డాక్టర్ కోట మృత్యుంజయ రావు అభినందించారు.
ముగ్గురి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబ సభ్యులు బాధితులను వెంటనే మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment