వైరల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చలిగాలులు జనాల్ని కలవరపెడుతున్నాయి. సూరీడు పడమటింటికి జారకముందే మొదలయ్యి.. తెల్లారి తూరుపు కొండల్లో ఉదయించే దాకా వీర విహారమే చేస్తున్నాయి. మెల్లగా ఇంట్లోకి.. ఆపై ఒంట్లోకి చొరబడి వణికిస్తున్నాయి. జలుబుతో మొదలెట్టి.. విష జ్వరాల దాకా తీసుకెళ్తూ మనిషిని ‘మంచాన’పడేస్తున్నాయి. ఆస్తమా.. గుండె సంబంధిత రోగులకు ‘ఊపిరి’ఆడనీయకుండా చేస్తున్నాయి. ఇక నిమోనియాగా మారి ‘ఉసురు’ తీస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండడం.. విష జ్వరాలు సోకుతున్న వైనంపై కథనం.
ఎవరూ పట్టించుకోవడం లేదు
రెండు రోజులుగా జ్వరం విపరీతంగా వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రికికి రాగా పెద్ద డాక్టర్లు సెలవు పెట్టారని, అసిస్టెంట్ డాక్టర్ మందుల చీటీ ఇచ్చి బెడ్డుపైన పడుకోమని చెప్పారు. ఆసుపత్రికి వచ్చి రెండు గంటలైనా ఎవరూ పట్టించుకోలేదు.
– ఓబులమ్మ,జ్వర పీడితురాలు, వేంపల్లె
మెరుగైన వైద్య సేవలకు చర్యలు
జ్వరాలతో ఆసుపత్రికి వచ్చే సంఖ్య అధికంగా కనిపిస్తోంది. వాటిని అదుపు చేసేందుకు కావాల్సిన మందులు, సరిపడా బెడ్లు అందుబాటులో ఉన్నాయి. పేదలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాం. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఎవరూ ఇబ్బందులు పడొద్దు. శీతాకాలం ముగిసే వరకు పిల్లలు, వృద్ధులు తెల్లారే సమయంలో, సాయంత్రం చీకటి పడిన తర్వాత బయట తిరగడం మంచిది కాదు. వెచ్చని దుస్తులు ధరించాలి. – శేఖర్, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్, వేంపల్లె
జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది
పీహెచ్‌సీల్లోనూ మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాం. సీజనల్ వ్యాధుల దృష్ట్యా జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. వైరల్ ఫీవర్లతోపాటు టైఫాయిడ్ కేసులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలి. పరిసరాలతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. జ్వరమని తెలియగానే సమీప ఆసుపత్రులలో సత్వరం చికిత్స చేయించుకోవాలి. – స్వాతిసాయి,
పీహెచ్‌సీ వైద్యురాలు, తాళ్లపల్లె
వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న జ్వర పీడితులు
వేంపల్లె: జిల్లాను వైరల్ ఫీవర్లు వణికిస్తున్నాయి. రెండు నెలల నుంచి తుపాను ప్రభావంతో వర్షాలతో పాటు వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో మంచు అధికంగా కప్పేస్తోంది. ఫలితంగా రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో చాలా మంది జలుబు, జ్వరాలతో.. శ్వాస కోశవ్యాధుల సమస్యలతో అవస్థలు పడుతున్నారు. సాధారణ జ్వరాలతోపాటు వైరల్ డెంగ్యూ, టైఫాయిడ్ కేసులు తోడవడంతో ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వేంపల్లెలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌తోపాటు తాళ్లపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మరో 50 ప్రైవేట్ క్లినిక్‌లలో సుమారు 3వేల మంది ఓపీ చికిత్సలకు వస్తుండడం గమనార్హం. వీరిలో జ్వరాలతో బాధపడే వారి సంఖ్య అధికం. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో ఐపీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. బెడ్లు కొరత లేకుండా సర్దుబాటు చేయాల్సి వస్తోంది. చలికాలం తగినంత పోషకాహారం, నీరు తీసుకోకపోవడంతో రోగ నిరోధక శక్తి తగ్గి వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ ఆసుపత్రులు, ఆర్‌ఎంపీలు రోగుల జేబులను ఖాళీ చేస్తున్నారు.
అమ్మో... నిమోనియా..!
శీతాకాలం వచ్చిందంటే చాలు ఆస్తమా, అలర్జీ ఉన్న వారికి ఒంట్లో వణుకు పుడుతుంది. చలి గాలికి జ్వరాలతోపాటు అలర్జీ సమస్యలు తీవ్రమవుతాయి. ముఖ్యంగా చాలామంది చిన్నారులు నిమోనియా బారినపడుతున్నారు. ఈ లక్షణాలతో ఇటీవల వేంపల్లె మండలంలో ముగ్గురు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిమోనియా వ్యాధుల కేసుల తీవ్రత మరింత ఎక్కువ కనిపిస్తోంది. ఇక వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూ జ్వర పీడితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఇంట్లోనూ జ్వర బాధితులు ఇద్దరు, ముగ్గురు కనిపిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు
చలి తీవ్రతతో రోగాలు విజృంభణ
రోగులతో కిక్కిరిసిపోతున్న ఆసుపత్రులు
ఓపీ, ఐపీల్లో పెరుగుతున్న జ్వర పీడితులు
ప్రస్తుతం..
పగలు: 28
డిగ్రీల సెల్సియస్
రాత్రి: 17
డిగ్రీల సెల్సియస్
గత వారంలో..
పగలు: 32
డిగ్రీల సెల్సియస్
రాత్రి: 25డిగ్రీల సెల్సియస్
కలుషిత నీరు, మాంసాహారం తీసుకున్న వారికి టైఫాయిడ్ సోకుతుంది. ఇక దోమకాటు బారిన పడిన వారిలో వైరల్, డెంగ్యూ జ్వర లక్షణాలు, రక్త కణాలు తగ్గుతాయి.
దోమతెరలు వాడడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
రోజుకు 3నుంచి 5లీటర్ల నీరు తాగడం మంచిది.
జ్వరం తీవ్రత తగ్గకపోతే ఓఆర్‌ఎస్ తీసుకోవాలి.
ఆస్తమా, ఆయాసం ఉన్న వారు మంచులో నడవాల్సి వస్తే తగిన జాగ్రత్తలు పాటించాలి.
పొగ తాగేవారు చలిలో వాకింగ్ చేయకపోవడమే ఉత్తమం. బీపీ, షుగర్ ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.
ముఖ్యంగా చిన్న పిల్లల్లో చెవిపోటు, గొంతు నొప్పి, జలుబు వచ్చే అవకాశం ఉన్నందున సూర్యరష్మి వచ్చిన తర్వాతే వారిని బయటకు పంపించాలి.
వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలి. అందుకోసం పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ ఉడకబెట్టిన గుడ్లు తీసుకోవడం ఉత్తమం
Comments
Please login to add a commentAdd a comment