నీళ్లు నములుతున్నారు!
రాజంపేట: గుత్తి–రేణిగుంట రైలుమార్గంలోని వివిధ రైళ్లకు నందలూరు స్టేషన్‌లో నీటి సౌకర్యం కల్పించాలనే ప్రతిపాదన పట్టాలెక్కలేదు. రైళ్లకు నందలూరులో నీటి సౌకర్యం కల్పించేందుకు అవసరమైన పనులకు రూ.34లక్షలకుపైగా వ్యయం అవుతుందని అంచనాలను రూపొందించినట్లు రైల్వే వర్గాల ద్వారా తెలిసింది. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో అప్పట్లో ఈ ప్రతిపాదనను రైల్వే శాఖ అటకెక్కించింది. కరోనా మహమ్మారి ప్రభావం ముగిసి ఐదేళ్లయినా ఈ ప్రతిపాదనను అమలు చేయాలన్న దిశగా రైల్వే ఉన్నతాధికారులు ఆలోచించడం లేదు. అక్టోబరు 4న విజయవాడలో జరిగిన రైల్వే అధికారుల సమావేశంలో రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డిలు నందలూరురైల్వేకు పూర్వవైభవం కల్పించే అంశాలను ప్రస్తావించారు.
నందలూరు నీళ్ల ప్రాముఖ్యత..
దక్షిణ మధ్య రైల్వేలో గుంతకల్లు డివిజన్‌లో నందలూరు నీళ్లకున్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ఇటీవల ఇదే అంశంపై దిల్లీలో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్‌ను నందలూరు ఐకేపీఎస్ నేతలు కలిసిన సందర్భంలో ఆయన కూడా నందలూరు నీళ్ల ప్రాముఖ్యతను గుర్తు చేశారు. నందలూరు నీటితోనే రైల్వే పుట్టుక ఆరంభమైంది. 1864లో బ్రిటీషర్లు నందలూరులో నీటి లభ్యతను ఆధారం చేసుకొని స్టీమ్ ఇంజిన్ లోకోషెడ్ నిర్మించారు. ఈ నీటి వల్ల నీటి ఆవిరికి సంబంధించిన పింగాణి తుప్పు పట్టకుండా ఉంటుందని అప్పట్లోనే బ్రిటీషు రైల్వే పాలకులు నీటి నాణ్యతపై పరిశోధనలు చేశారు. రైల్వేకేంద్రానికి అవసరమైన నీటి కోసం యేటి నొడ్డున బావిని తవ్వించారు.
నీటి కోసం ‘తిరుమల’ పరుగులు..
విశాఖ –తిరుపతి మధ్య నడిచే తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు నీటి కోసం కడప నుంచి కొండాపురం వరకు పరుగులు తీయకతప్పడంలేదు. ఫలితంగా రైల్వే వ్యయం వృథా అవుతోంది. అనవసర ఖర్చులు, భారం రైల్వేపై పడుతోందని రైల్వే వర్గాలు అంటున్నాయి. కేవలం రైల్వే అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల పరోక్షంగా నష్టం కలుగుతోందన్న విమర్శలు రైల్వేవర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ మార్గంలో నడిచే రైళ్లకు నీళ్లు పట్టుకునేందుకు నందలూరు అనుకూలమని ఇప్పటి డివిజన్ ఉన్నతాధికారులకు తెలుసు. కడప నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందలూరులో తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు వాటరింగ్, క్లీనింగ్ పెట్టుకోకుండా కడప నుంచి 90 కిలోమీటర్ల దూరంలోని కొండాపురం తీసుకెళ్లి, మళ్లీ కడపకు తీసుకొచ్చి నడిపించడం చూస్తుంటే విడ్డూరంగా ఉందని కార్మిక సంఘాలు పెదవి విరుస్తున్నాయి.
ప్యూరిఫైడ్ నీళ్లుగా గుర్తింపు
తెల్లదొరలు నందలూరు నీటిని ప్యూరిఫైడ్ నీటిగా గుర్తించారు. అందువల్లనే వారు నందలూరుకు రైల్వేపరంగా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు. నందలూరు నీటిలో పొటాషియం, కాల్షియంతోపాటు ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. టీడీఎస్ 188 పాయింట్లు చూపిస్తోంది. అదే కంపెనీ వాటర్ బాటిళ్లలో 25 నుంచి 35 పాయింట్లు చూపిస్తోంది. అంటే మినరల్ వాటర్ కూడా నందలూరు నీళ్లకన్నా నాణ్యతలో తక్కువేనని పేర్కొంటున్నారు.
నందలూరు నుంచే వాటర్ ట్యాంకర్ రైళ్లు నడిచాయి..
స్టీమ్ ఇంజిన్ లోకోషెడ్ కొనసాగిన సమయంలో నందలూరు నుంచే వాటర్ ట్యాంకర్ రైళ్లు నడిచాయి. గుంతకల్ డివిజన్ ఉన్నతాధికారులు ప్యాసింజర్ రైళ్ల బ్రేక్‌లలో నీటి క్యాన్‌లతో సరఫరా జరిగేది. 1977లో గుంతకల్లు డివిజన్ సదరన్ రైల్వే నుంచి విడిపోయి దక్షిణ మధ్య రైల్వేలో విలీనం అయినప్పటికీ ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది ఉద్యోగులు ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారంటే నీళ్లే కారణంగా చెబుతున్నారు.
రైళ్లకు నందలూరులో నీటి సౌకర్యం కల్పించే ప్రతిపాదన పెండింగ్‌లోనే..
అప్పట్లో రూ.34 లక్షలకుపైగా వ్యయంతో అంచనాలు
నందలూరు నీళ్ల ప్రాముఖ్యతను విస్మరిస్తున్న రైల్వే శాఖ
రైల్వే అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment