నైతిక విలువలుంటే రాజీనామా చేయండి
కడప కార్పొరేషన్ : తెలుగుదేశం పార్టీలో చేరిన కార్పొరేటర్లకు ఏమాత్రం నైతిక విలువలున్నా వైఎస్సార్‌సీపీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు సీహెచ్ వినోద్ కుమార్, వి. రామక్రిష్ణారెడ్డి, బి. మరియలు, శ్రీరంజన్‌రెడ్డి,త్యాగరాజు, కార్పొరేటర్లు కె. బాబు, సానపురెడ్డి శివకోటిరెడ్డి, రామలక్ష్మణ్‌రెడ్డి తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఎవరైనా తమ పార్టీకి రావాలంటే రాజీనామా చేసి రావాలని చెప్పారని, అందుకు విరుద్ధంగా కార్పొరేటర్లను టీడీపీ లో చేర్చుకోవడం సరికాదన్నారు. టీడీపీకి రాష్ట్రంలో ఓ రూలు, జిల్లాల్లో మరో రూలు ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మాటకే వారు విలువ ఇవ్వడం లేదని చెప్పారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన విధంగా ఆ కార్పొరేటర్లు తమ స్వలాభాల కోసం, తమ ఆస్తులను కాపాడుకోవడానికే పార్టీ మారారని ధ్వజమెత్తారు. ప్రజలు వారిని చూసి ఓట్లు వేయలేదని, వైఎస్‌జగన్‌ను చూసే వారికి ఓట్లు వేశారని గుర్తు చేశారు. అభివృద్దిని చూసి తమ పార్టీలో చేరారని ఎమ్మెల్యే మాధవి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులరెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో కడపలో రూ.1300కోట్లు ఖర్చు చేసి రహదారులు, పార్కులు, విస్తరణ పనులు పూర్తి చేశామన్నారు. బుగ్గవంక బ్రిడ్జిలను ఆరునెలల్లో పూర్తి చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే మాధవి తన మాట నిలబెట్టుకోలేక పోయారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు నాగమల్లారెడ్డి, షఫీ, కంచుపాటి బాబు పాల్గొన్నారు.
స్వార్థంతో, ఆస్తులు కాపాడుకోవడానికే పార్టీ మారారు
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దడం దారుణం
ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment