దళిత సంక్షేమ పథకాలను అమలు చేయాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : దళితుల సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం నిలిపివేసిన 27 దళిత సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కావస్తున్నా బడ్జెట్లో దళితులకు నిధుల కేటాయింపులు ఏమాత్రం చేయకుండా మోసపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ ప్రకారం దళిత సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అలాగే ఈ భారతదేశ రాజ్యాంగం రూపకల్పన మంత్రాలతో ప్రార్థనలతో, విశ్వాసాలతో, నమ్మకాలతో, రూపొందించిన రాజ్యాంగం కాదన్నారు. ఈ దేశంలో అణగారిన వర్గాలకు ఆర్దిక సామాజిక సమానత్వం స్వాతంత్రం కోసం రాజ్యాంగంలో హక్కులు అవకాశాలు ఏర్పరచడం జరిగిందన్నారు. మేధావి అంబేడ్కర్ పేరును రాజ్యసభలో గౌరవ సభ్యులు తలుచుకుంటే మనువాది అమిత్‌షా మతోన్మాద పిచ్చితో మాట్లాడడం ఈ దేశ పౌరుల ఆరాధ్య దైవమైన అంబేడ్కర్‌ను అవమానించడమే అన్నారు. అంబేడ్కర్‌ను అవమానించిన అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించి వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. కార్యక్రమంలో డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగ దాసరి ఇమ్మానియేల్, కానగల మునెయ్య జిల్లా నాయకులు పడిగ వెంకటరమణ, నాగేశ్వరరావు, పెంచలయ్య, ప్రసాద్, చంద్రగుప్త, ఏసురత్నం. గోవిందు తదితర నాయకులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment