అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్:ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం సభాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి స్వయంగా వెళ్లి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారాప్రజల నుంచి అందిన విజ్ఞప్తులలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి.
● తన భర్తను ఈనెల 6వ తేది బంధువులు హత్య చేశారని, తనకు ఎలాంటి జీవనాధారం లేనందున ఆర్థిక సహాయంతో ఆదుకోవాలని చక్రాయపేట మండలం గండికొవ్వూరుకు చెందిన దళిత మహిళ దండు శివ లక్ష్మీదేవి కోరారు.
● అట్లూరు క్రాస్ రోడ్డులో దేవాలయ నిర్మాణానికి స్థలాన్ని ఇప్పించాలని అట్లూరు మండల కేంద్రానికి చెందిన ఎం.అబ్రహం విన్నవించారు.
● తమకు ఇంటి స్థలం మంజూరు చేయాలని కడపఇందిరా నగర్‌కు చెందిన కె.ఓబులేసు కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విశ్వేశ్వర్ నాయుడు, జడ్పి సీఈవో ఓబులమ్మ, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, జిల్లా వ్యవసాయశాఖాధికారి నాగేశ్వరరావు, ఎస్డీసి లు వెంకటపతి, శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment