విషద్రావణం తాగి మహిళ ఆత్మహత్య
లింగాల : గుణకణపల్లి గ్రామంలో హసీనా 40 అనే మహిళ విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇన్‌చార్జి ఎస్‌ఐ నాగ తులసి ప్రసాద్ కథనం మేరకు .. హసీనా అప్పులు చేసి కువైట్‌లో ఉద్యోగం కోసం వెళ్లింది. అక్కడ ఉద్యోగం దొరక్క తిరిగి వచ్చేసింది. కువైట్ వెళ్లేందుకు వీసా, విమాన ఖర్చులు కలిపి సుమారు నాలుగు లక్షల రూపాయల దాకా అప్పు చేసింది. దీంతో అప్పు తీర్చే మార్గం కనిపించక ఈనెల 10వ తేదీన ఇంటిలో విషద్రావణం తాగింది. వెంటనే ఆమెను కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిందని ఎస్‌ఐ తెలిపారు. ఆమెకు భర్త సంజీవ్, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
అనారోగ్య కారణాలతో..
పెద్దముడియం : మండలంలోని పాలూరు గ్రామంలో ఉండే తిరుపతి నాగలక్షుమ్మ(70) అనే వృద్ధురాలు అనారోగ్య కారణాలతో కుందూ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు నాగలక్షుమ్మ కట్టుబడిగా పని చేసేది. గత కొంత కాలంగా వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉండేది. ఈ నెల 13న కర్నూలు జిల్లా ఆదోనిలో ఉండే కూతురు దగ్గరకు వెళుతున్నానని చెప్పి కుందూ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి అల్లుడు ప్రతాప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కలకడ : అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం కలకడ–గుర్రంకొండ మార్గంలోని కె.దొడ్డిపల్లె పంచాయతీ బుడ్డకాలువ వంక సమీపంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలకడ మండలం, రాతిగుంటపల్లె మాజీ సర్పంచ్ మద్దిశెట్టి రమాదేవి భర్త రామ్మోహన్ (52) తన ద్విచక్రవాహనంలో కలకడలో తన వ్యక్తి గత పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. స్వగ్రామం చేరుకుంటున్న సమయంలో మార్గమధ్యంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. ప్రమాదం జరిగిన స్థలంలోనే దుర్మరణం చెందాడు. ద్విచక్రవాహనం దెబ్బతినకపోవడంతో మృతిపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతుడికి భార్య రమాదేవి, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు హరీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కలకడ పోలీసులు కేసు నమోదు చేశారు.
వ్యక్తిపై దాడి
మదనపల్లె : వాహనం బాడుగకు కావాలని డ్రైవర్‌ను పిలిపించి దాడిచేసిన ఘటన మంగళవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. సీటీఎంకు చెందిన ఆంజనేయులు(45) టాటా ఏస్ వాహనం బాడుగకు నిర్వహిస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో స్థానికుడైన సునీల్, బెంగళూరుకు బాడుగ ఉందని, సప్పలమ్మ గుడివద్దకు రావాలని ఆంజనేయులును కోరాడు. దీంతో ఆంజనేయులు సప్పలమ్మ గుడి వద్దకు చేరుకోగా, బెంగళూరుకు బాడుగ ఎంతని వారు అడగటం, రూ.10వేలు అవుతుందని ఆంజనేయులు చెప్పడంతో, రూ.7 వేలకు రావాల్సిందిగా సునీల్, మహేష్, నీల్, ఒత్తిడి చేశారు. దీంతో ఈ విషయమై వివాదం రేగగా, ఆంజనేయులుపై ముగ్గురూ కలిసి దాడిచేసి గాయపరిచారు. గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment