తాగు నీటి మోటారు వైర్లు చోరీ
అట్లూరు : మండల పరిధిలోని కమలకూరు బీసీ కాలనీలో తాగు నీటి మోటారుకు సంబంధించిన వైర్లు చోరీకి గురయ్యాయి. దీంతో పండగ పూట తాగు నీటి కోసం కాలనీ వాసులు ఇబ్బందులకు గురయ్యారు. కాలనీలో సుమా రు 100 కుటుంబాల వారు నివసిస్తున్నారు. కాలనీ వాసుల తాగునీటి కోసం ఏర్పాటు చేసిన మోటారు వెళ్లే వైర్లు, అలాగై విద్యుత్ లైన్ మీద నుంచి స్టార్టర్‌కు వెళ్లే వైర్లు మంగళవారం రాత్రి కత్తిరించుకుని వెళ్లారు. దీంతో బుధవారం కనుమ పండుగ రోజు కాలనీ వాసులు గ్రామంలోకి, చేతి పంపులు, పొలాల వద్దకు వెళ్లి తాగు నీరు తెచ్చుకోవాల్సి వచ్చింది. కాగా కాలనీ వాసులంతా వైఎస్సార్‌సీపీకి చెందిన వారు. ఎవరైనా గిట్టని వారు చేశారా లేక కాపర్ కోసం దొంగలు చేశారా? ఒక వేళ దొంగల పని అయితే స్టార్టర్ కూడా ఎత్తుకు వెళతారు కదా? అని చర్చించుకుంటున్నారు. కాగా ఈ విషయం తెలిసిన వెంటనే కమలకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ వడ్డమాను సుబ్రమణ్యంశాస్త్రి చోరీకి గురైన వైర్ల స్థానంలో కొత్త వైర్లు తెప్పించి మరమ్మతులు చేయించారు.
ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్ వైరు..
పులివెందుల రూరల్ : పట్టణంలోని కదిరి రోడ్డులోని ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలో ఉన్న మోపూరి రామంజనమ్మ తోటలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పగులగొట్టి అందులోని కాపర్ వైరును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. అలాగే తోటలోని గదిలో ఉన్న మోటారు పైపులు, కేబుల్ వైర్లతో పాటు సామగ్రి దొంగిలించారు. సుమారు రూ.2 లక్షలు విలువ చేసే కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జోరుగా కోడి పందేలు
లింగాల : లింగాల మండలం దొండ్లవాగు, మురారి చింతల గ్రామాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు జోరుగా సాగాయి. 3 రోజుల పాటు ఈ పందేలు కొనసాగాయి. జూదంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. ఆయా గ్రామాల టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో కోడి పందేలు నిర్వహించారు. మండలం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది కోడి పందేల కోసం వచ్చారు.
బావిలో పడి వ్యక్తి మృతి
చాపాడు : మండల పరిధిలోని నక్కలదిన్నె గ్రామ సమీపంలోని పంట పొలాలలో బుధవారం మధ్యాహ్నం కొట్టాలు గ్రామానికి చెందిన సండ్రా వెంకటయ్య(38) అనే వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటయ్య పంట పొలాల్లోని బావి దగ్గరికి వెళ్లి కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. గత ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడు ప్రమాదశాత్తు పడ్డాడా లేక మద్యం సేవించి బావిలో పడ్డాడా అనే విషయం పోస్టుమార్టం నివేదికలో తేలుతుందని ఎస్‌ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. మృతుడికి భార్య యశోద, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని
యువకుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె : ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం రాత్రి కురబలకోట మండలంలో జరిగింది. బి.కొత్తకోట మండలం బడికాయలపల్లెకు చెందిన చిన్నప్ప(24) కుటుంబ పోషణ నిమిత్తం ఊరూరా తిరిగి తినుబండారాల వ్యాపారం చేస్తుంటాడు. మంగళవారం వ్యాపారం ముగించుకుని ద్విచక్రవాహనంలో తిరిగి వెళుతుండగా దొమ్మన్నబావి వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment