డాక్టర్ అవతారమెత్తి!
తిరుపతి తుడా : పేద రోగులే టార్గెట్‌గా దొంగల ముఠా రుయాలో హల్ చల్ చేస్తోంది... రోగుల సహాయకులుగా తరచూ పేషంట్ వార్డుల్లో తిరుగుతూ సెల్‌ఫోన్లు, పర్సులు దొంగతనం చేసే ముఠా ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. ఏకంగా తెల్ల కోటు ధరించి డాక్టర్ అవుతారమెత్తి దొంగతనాలకు పాల్పడడం కలకలం రేపుతోంది. రుయా ఆస్పత్రిలో తరచూ మొబైల్ ఫోన్లు, పర్సులు, ఏటీఎం కార్డులు, బైక్ దొంగతనాలు జరగడం సర్వసాధారణమైంది. రుయాలో సీసీ నిఘా, సెక్యూరిటీ వ్యవస్థ పటిష్టంగా ఉన్నా దొంగలు రోజుకో అవతారం ఎత్తుతున్నారు.
బంగారు చైన్ కొట్టేసి..
తెల్ల కోటుతో వచ్చి రోగులను బురిడీ కొట్టించి ఐదు సవర్ల బంగారు చైను చోరీ చేసిన యువతిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం రుయాలో జరిగింది. వైఎస్సార్ జిల్లా వల్లూరుకు చెందిన శ్రీవాణి అనే యువతి తెల్ల కోటు ధరించి అనస్థీషియా టెక్నీషియన్ అని రోగులకు చెప్పుకుంటూ అత్యవసర విభాగంలో హల్‌చల్ చేయసాగింది. ఈ క్రమంలో అప్పుడే రేణిగుంట నుంచి గాయాలతో వైద్యం కోసం వచ్చిన వెస్లీ అనే మహిళను గుర్తించి ఆమెతో పరిచయం చేసుకొని ఆమెను స్కానింగ్ కోసం తీసుకెళ్లి అక్కడ ఒంటిపై నగలు తీసేయాలని సూచించింది. వెస్లీ తన ఒంటిపై ఉన్న రెండు బంగారు చైన్లు, రెండు బంగారు గాజులను తీసి ఆ యువతి చేతికి ఇచ్చి బయట తన భర్త చేతికి ఇవ్వాలని చెప్పింది. ఆ నగల్లో ఐదు సవర్ల బంగారు గొలుసును తన బ్యాగులో వేసుకొని మిగిలిన వస్తువులను వెస్లీ భర్త చేతికి ఇచ్చింది. ఇందులో మరో చైన్ ఉండాలని వెస్లీ భర్త విక్టరీ అడగటంతో మాకేం తెలుసు అంటూ ఆ యువతి అక్కడినుంచి వెళ్లిపోయింది. అనంతరం స్కానింగ్ నుంచి బయటికి వచ్చిన వెస్లీ నగలు చూసి అందులో ఒక చైన్ లేకపోవడాన్ని గుర్తించి ఆ విషయాన్ని వెంటనే సెక్యూరిటీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై వెతకగా అక్కడే ఉన్న యువతిని గుర్తించి ఆమె బ్యాగులో ఐదు సవర్ల బంగారు చైన్‌ను గుర్తించారు. వెంటనే విషయాన్ని వెస్ట్ పోలీసులకు తెలిపి ఆ యువతిని పోలీసులకు అప్పగించారు.
● రోగి నుంచి చైన్ కొట్టేసిన యువతి
● తిరుపతి రుయాలో ఘటన
● నిందితురాలిది వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment