మా బిడ్డ మృతదేహం వెలికితీయరా.!
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ దద్దాలవారిపల్లె సమీప క్వారీ నీటి గుంతల్లో ఈనెల 15న ఈతకెళ్లి మృతి చెందిన యువ ఇంజినీర్ బి.వెంకటరత్నం మృతదేహాన్ని రెండురోజులైనా పోలీసులు వెలికితీయలేదు. దీంతో ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. రెండు రోజులుగా పోలీసుల తీరు సరిగ్గా లేదంటూ మృతుడి తండ్రి రోడ్డుపై బోరున విలపించడం అందరినీ కలచివేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. కలకడ మండలం గుడిబండ పంచాయతీ చొక్కనవారిపల్లెకు చెందిన బి. సూరి కుమారుడు బి. వెంకటరత్నం(25) సంక్రాంతి పండుగరోజున ఈనెల 15న దద్దాలవారిపల్లె క్వారీ గుంతల్లో స్నేహితులతో కలిసి సరదాగా ఈతకెళ్లి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌కు 15 రోజుల్లో ఉద్యోగంలో చేరడానికి బయలుదేరి ఉండాల్సి ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి పీలేరు, వాల్మీకిఫురం, రాయచోటికి చెందిన అగ్నిమాపక సిబ్బంది దద్దాలవారిపల్లె వద్ద ఉన్న క్వారీ నీటి గుంతల వద్దకు చేరుకున్నారు. తమ సామగ్రితో నీటి గుంతల్లో మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు. గత రెండురోజులుగా గాలింపు చర్యలు ముమ్మరంగా నిర్వహించినా మృతదేహాన్ని పోలీసులు వెలికి తీయలేక పోయారు. పోలీసులు మళ్లీ ఇద్దరు గజ ఈతగాళ్లను నీటి గుంతల్లోకి దింపి మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసుల చర్యలు రెండు రోజులుగా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదని మృతుడి బంధువులు ఆరోపించారు. యువ ఇంజినీర్ మృతి వార్త తెలుసుకుని కలకడ మండలం నుంచి బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు పెద్ద ఎత్తున క్వారీ గుంతల వద్దకు చేరుకున్నారు. సాయంకాలం వరకు ఓపిక పట్టిన అందరూ ఒక్కసారిగా పోలీసులపై తిరగబడ్డారు. క్వారీ గుంతల పక్కనే ఉన్న ఎన్‌హెచ్ 340 జాతీయ రహదారి, కడప–బెంగళూరు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. అమరావతి నుంచి ఎస్‌డీఎస్ బలగాలను ఎందుకు పిలిపించలేదని అధికారులపై మండిపడ్డారు. నా బిడ్డ మృతదేహాన్ని బయటకు తీయడంలో పోలీసులు సహకరించడం లేదంటూ మృతుడి తండ్రి సూరి రోడ్డుపై బోరున విలపిస్తుంటే ప్రతి ఒక్కరూ చలించిపోయారు. వాల్మీకిపురం సీఐ ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్‌ఐ మధురామచంద్రుడులు ధర్నా చేస్తున్న వారితో చర్చలు జరిపినా ఫలితం కనిపించలేదు. చివరకు కర్నూలు నుంచి ఎస్‌డీఎస్ బలగాలను రాత్రికి దింపి మృతదేహాన్ని వెలికితీసే పనులు ముమ్మరం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. రెండు రోజులైనా మృతదేహాన్ని వెలికితీయలేకపోవడంతో మృతుడి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల తీరుపై యువ ఇంజినీర్
బంధువులు, గ్రామస్తుల ఆగ్రహం
జాతీయ రహదారిపై ధర్నా
కన్నీరుమున్నీరైన మృతుడి తండ్రి
Comments
Please login to add a commentAdd a comment