23న జిల్లా స్థాయి క్విజ్ పోటీలు
కడప ఎడ్యుకేషన్: ఈ నెల 23న ఉదయం పది గంటలకు కడప రిమ్స్ వద్దగల కేంద్రీయ విద్యాలయంలో జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ మీనాక్షి తెలిపారు. పోటీల్లో పాల్గొనే 9, 10వ తరగతి విద్యార్థులు 23న ఉదయం 8.30 గంటలకు రిమ్స్ వద్ద కేంద్రీయ విద్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని డీఈఓ మీనాక్షి తెలిపారు. వివరాలకు 9490633934 నెంబర్‌లో సంప్రదించాలని ఆమె తెలిపారు.
ప్రశాంతంగా
నవోదయ ప్రవేశ పరీక్ష
రాయచోటి: జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. శనివారం అన్నమయ్య జిల్లాలో 26 పరీక్షా కేంద్రాలలో ప్రవేశ పరీక్షలను నిర్వహించారు. 6వ తరగతిలో ప్రవేశం పొందేందుకు 5058 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. శనివారం నిర్వహించిన పరీక్షలలో 4242 మంది విద్యార్థులు హాజరుకాగా 816 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం పరిశీలించారు.
గణతంత్ర వేడుకలకు
నూలివీడు విద్యార్థులు
గాలివీడు: విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జనవరి 26వ తేదీన జరగనున్న గణతంత్ర వేడుకల పెరేడ్‌లో నూలివీడు విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ హైస్కూల్ స్కౌట్ మాస్టర్ కరకోటి చంద్రశేఖర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ 76వ భారత గణతంత్ర రాష్ట్ర స్థాయి వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో రాయలసీమ జోన్ (8 జిల్లాలు) నుంచి నూలివీడు జిల్లాపరిషత్ హైస్కూల్ 9వ తరగతి ఇద్దరు గైడ్ విద్యార్థులు కె.వైష్ణవి, పి.గీతామాధురి, ఇద్దరు స్కౌట్ విద్యార్థులు డి.నరసింహా, పి.గణేష్ ఎంపికయ్యారన్నారు. రాష్ట్రస్థాయి పెరేడ్‌కు మారుమూల ప్రాంతమైన నూలివీడు హైస్కూల్ విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు, చైర్మన్ జనార్దన్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
హుండీ ఆదాయం
రూ.7 లక్షల 21వేలు
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయానికి హుండీ ద్వారా రూ.7,21,112 ఆదాయం సమకూరింది. శనివారం స్థానిక ఆలయంలో రాయచోటి దేవదాయశాఖ అధికారి శశికుమార్ ఆధ్వర్యంలో అమ్మవారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మూడు నెలల కాలానికి సంబంధించి వివిధ కానుకలు, నగదు రూపంలో రూ.7,21,112, బంగారు ఆభరణాలు 29 గ్రాములు, వెండి 425 గ్రాములు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మొత్తాన్ని వాల్మీకిపురం సప్తగిరి గ్రామీణ బ్యాంకులో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శశికుమార్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
అగ్గిపుల్లే.. అగ్గి పుల్లే!
కురబలకోట: సినీ హీరో కిరణ్ అబ్బవరం శనివారం రాత్రి అంగళ్లులో సందడి చేశారు. వచ్చే నెల 14న విడుదల కానున్న దిల్ రూబా సినిమాలోని అగ్గిపుల్లే అనే పాటను అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో అట్టహాసంగా విద్యార్థుల హర్షధ్వానాల మధ్య విడుదల చేశారు. అంతకు ముందు ప్రదర్శించిన టీజర్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ విశ్వకరుణ్ దర్శకత్వంలో హీరోయిన్‌గా రుక్సానా ధిల్లాన్ నటిస్తున్న దిల్ రూబా సినిమాను వచ్చే నెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నామన్నారు. లవ్, రొమాంటిక్, యాక్షన్, ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను చిత్రీకరించామన్నారు. గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందన్నారు. సక్సెస్ అవుతుందన్న ధీమా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment