నాయీబ్రాహ్మణుల ఉపాధిపై ‘కత్తెర’ పడింది. ఏళ్ల తరబడి నమ్మ
కడప సెవెన్‌రోడ్స్: ఆధునిక సెలూన్స్ వచ్చి సంప్రదాయ వృత్తినే నమ్ముకున్న క్షురకుల జీవనోపాధిని చిధ్రం చేస్తున్నాయి. ఎంతోమంది ఉపాధి కోల్పొయి రోడ్డున పడుతున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల వల్ల వీరికి ఆర్థిక భరోసా ఉండేది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు డీబీటీ పథకాలు ఎత్తివేశారు. దీంతో ఓ వైపు ఉపాధి లేక.. మరోవైపు ప్రభుత్వం నుంచి చేయూత కానరాక క్షురకులు అష్టకష్టాలు పడుతున్నారు.
● జిల్లాలో నాయీ బ్రాహ్మణులు చాలా మంది సాంప్రదాయంగా వస్తున్న తమ కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. కొందరు అద్దె గదుల్లో క్షౌరశాలలు ఏర్పాటు చేసుకుని బతుకుతుంటే... మరికొందరు వీధుల్లో బంకులు ఏర్పాటు చేసుకుని పొట్టపోసుకుంటున్నారు. ఇలాంటి వారు ఒక్క కడప నగరంలో 400 కు పైబడే ఉంటారని అంచనా. వీరు క్షౌరానికి రూ. 70–100 తీసుకుంటారు. షేవింగ్‌కు రూ. 20 అడుగుతారు. తల వెంట్రుకలకు రంగు వేసేందుకు రూ. 50 వసూలు చేస్తారు. పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలు వీరి వద్దకు వెళుతుంటారు. క్షౌర వృత్తితో పాటు వాయిద్యం తెలిసిన వీరు వివాహాలు, ఉత్సవాలు, చావులకు వెళుతుంటారు. కులవృత్తిని నమ్ము కున్న వీరికి రోజుకు సగటున రూ. 600 రాబడి ఉంటుందని తెలుస్తోంది. నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, ఆరోగ్యం, పిల్లల చదువులు ఇలా జీవన వ్యయం రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితుల్లో వచ్చే రాబడితో కష్టంగా కుటుంబాలను నెట్టుకొచ్చేస్తున్నామని చెబుతున్నారు.
జగన్ సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసా..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేయూత కింద ఏడాదికి రూ.10 వేలు ఉచితంగా ఇస్తుండేవారని, ఆ డబ్బులు విద్యుత్ చార్జీలు, ఇతర ఖర్చులకు ఉపయోగపడేదని చెబుతున్నారు. అలాగే జగన్ అమలు చేసిన ఇతర సంక్షేమ పథకాల ద్వారా తాము లబ్ది పొందేవారమని చెబుతున్నారు. అలాగే తమ సామాజిక వర్గానికి టీటీడీ పాలక మండలిలో స్థానం కల్పించిన ఘనత కూడా ఆయనకే దక్కిందని పలువురు గుర్తు చేశారు. వీటితోపాటు దేవస్థానాల్లో తమకు ఉపాధి ఏర్పాటు చేశారని చెబుతున్నారు. దీంతో తమకు ఎంతో ఆర్థిక భరోసా ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఈ పథకాలన్నీ రద్దు చేయడంతో తమలాంటి వారి బతుకు దుర్భరంగా మారిదంటూ వాపోతున్నారు.
క్షురకుల పొట్టకొడుతున్న ఆధునిక సెలూన్లు
భారీగా తగ్గిన రోజువారి రాబడి
వృత్తిని వదులుకోవాల్సిన దుస్థితి
ఇతర మార్గాల అన్వేషణలో పలువురు
ప్రభుత్వం ఆదుకోవాలి
సంప్రదాయ వృత్తినే నమ్ము కుని జీవిస్తున్న నిరుపేద క్షుర కులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్ట ళ్లు, జువైనల్ హోంలో వీరికి అవకాశం కల్పించాలి. షాపులను ఆధునీకరించుకోవడం కోసం సబ్సిడీ రుణాలు విరివిగా మంజూరు చేయాలి. అలాగే మంగళ వాయిద్య పరికరాలు సబ్సిడీతో పంపిణీ చేయాలి. వృద్ధులై పనిచేయలేని క్షురకులకు కళాకారుల పెన్షన్లు మంజూరు చేయాలి. – జేవీ రమణ, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, కడప
ఉపాధిపై పెద్ద దెబ్బ
నేను బీకాం కంప్యూటర్స్ చదివాను. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూనే సాంప్రదాయంగా వస్తున్న మా కుల వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. ఇప్పుడు ఆధునిక సెలూన్లు రావడం వల్ల మా ఉపాధిపై పెద్ద దెబ్బ పడింది. రోజుకు సగటున రూ. 600 మాత్రమే వస్తుండడంతో ఎలా నెట్టుకు రావాలో అర్థం కావడం లేదు.
– జి.నాగేంద్ర, వైఎస్సార్ కాలనీ, కడప
బతుకుదెరువు భారంగా మారింది
పెద్దపెద్ద సెలూన్లు రాకవల్ల మాకు గిరాకీలు బాగా తగ్గిపోయాయి. గతంతో పోలిస్తే రోజువారి ఆదాయం సగానికి పైగానే పడిపోయింది. నేను చదువుకోలేదు. మా కుల వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నాను. వృద్దులైన మా తల్లితండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆదాయం తగ్గిపోవడం వల్ల బతుకుదెరువు భారంగా మారింది. కొందరు వృత్తిని వదిలేసి కువైట్ వంటి దేశాలకు వలస వెళ్తున్నారు. – ఇ.వెంకటేశ్, సిద్దవటం
Comments
Please login to add a commentAdd a comment