TS Special
-
10 రోజుల్లో నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూసంబంధిత సమస్యలు, ధరణి పోర్టల్ అంశాలపై పది రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ‘ధరణి పోర్టల్‌ను ఎలా డిజైన్ చేశారు? భూ రికార్డులు అందులో ఎలా భద్రపరిచారు? సదరు డేటా ఎక్కడ ఉంది? పోర్టల్ నిర్వహిస్తున్న కంపెనీ కాంట్రాక్టు ఎప్పటివరకు ఉంది? ఆ కంపెనీ మళ్లీ ఎందుకు వేరే కంపెనీలకు లీజుకిచ్చింది? ఈ పోర్టల్ నిర్వహిస్తున్న, నిర్వహించిన కంపెనీలకు ఉన్న చట్టబద్ధత ఏంటి? ఒకవేళ పోర్టల్‌లోని రికార్డులు కరప్ట్ అయి వివరాలన్నీ పోతే రాష్ట్రంలోని భూములకు మాన్యువల్ రికార్డులు అందుబాటులో ఉన్నాయా? ఈ పోర్టల్ ద్వారా వస్తున్న దరఖాస్తులు ఏడాదిన్నరగా ఎందుకు పెండింగ్‌లో ఉంటున్నాయి?’ అని ప్రశ్నించారు. అన్ని అంశాల తో నివేదిక రూపొందించిన తర్వాత మళ్లీ సమావేశమవుదామని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కోనేరు రంగారావు కమిటీ తరహాలో రాష్ట్రంలోని భూసమస్యల అధ్యయనానికి క మిటీ కూర్పుపై అధ్యయనం చేయాలని చెప్పారు. భూదాన్, అసైన్డ్ భూముల అంశాలపై ఇంకోసారి సమావేశమై సమగ్రంగా చర్చిద్దామని అన్నారు. బు ధవారం మధ్యాహ్నం సచివాలయంలో ధరణి పోర్ట ల్ నిర్వహణపై సీఎం సమీక్ష నిర్వహించారు. డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్ శాంతికుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్ మిత్తల్, అధికారులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, భూచట్టాల నిపుణుడు సునీల్‌కుమార్, రెవెన్యూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులపై ప్రశ్నల వర్షం సమీక్ష సందర్భంగా సీఎంతో పాటు పలువురు మంత్రులు రెవెన్యూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘నారాయణపేట జెడ్పీ చైర్మన్ ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. తన దరఖాస్తు పరిష్కారం కాకపోగా ఆ డబ్బులు మీరు తిరిగి ఇవ్వలేదు. ఆయన కోర్టుకు వెళ్లి తన డబ్బులు తనకివ్వాలని ఆర్డర్ తెచ్చుకున్నా మీరు స్పందించలేదు. ధరణి పోర్టల్ కింద చేసుకునే ప్రతి దరఖాస్తుకు రైతుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు? ఎందుకు వసూలు చేస్తున్నారు? ఆ డబ్బులు నేరుగా ప్రభుత్వ ఖాతాకే వస్తున్నాయా? ప్రైవేటు కంపెనీకి వెళ్లి మళ్లీ ప్రభుత్వానికి వస్తున్నాయా? భూముల రికార్డులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడం వల్ల భూ యజమానుల హక్కులకు భంగం కలుగుతుంది కదా? డేటాను దుర్వినియోగం చేయకుండా నియంత్రించే మెకానిజం ఏంటి? స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రద్దు చేసుకుంటే ఆ డబ్బులు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు? నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములపై విచారణ సుమోటోగా ఎందుకు చేయొద్దు? నోషనల్ ఖాతా అంటే ఏంటి? ఆ ఖాతాలో భూములెందుకున్నాయి? 31 కాలమ్స్ ఉన్న పహాణీలో 16వది అయిన అనుభవదారు కాలమ్ ఎందుకు తీసేశారు?..’ అని రేవంత్ ప్రశ్నించారు. నివేదికపై సంతకం పెట్టి ఇవ్వండి ధరణి పోర్టల్‌కు, రైతుబంధుకు సంబంధమేంటని సీసీఎల్ఏ మిత్తల్‌ను సీఎం ప్రశ్నించారు. సంబంధమేమీ లేదని మిత్తల్ చెప్పగా, ఇదే విషయాన్ని ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో పొందుపర్చాలని రే వంత్ సూచించినట్టు తెలిసింది. నివేదికను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో కాకుండా అధికారికంగా సంతకం పెట్టి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైఎస్ జగన్ వేగం మీకెందుకు లేదు? కాంగ్రెస్ హయాంలో రెవెన్యూ సదస్సులు పెట్టిన తీరు, అనుసరించాల్సిన విధివిధానాలపై కాంగ్రెస్ నేత కోదండరెడ్డి నివేదికను సమర్పించారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఉన్న వేగం మీకెందుకు లేకుండా పోయిందని ప్రశ్నించారు. భూముల సర్వే, టైటిల్ గ్యారంటీ, అసైన్డ్ భూముల చట్టం, కౌలు రైతుల చట్టం అమలు లాంటి విషయాల్లో జగన్ వేగంగా దూసుకుపోతుంటే మీరేం చేశారని ప్రశ్నించారు. కమిటీ ఏర్పాటు చేయండి: భూమి సునీల్ రాష్ట్రంలోని భూసమస్యలపై సమగ్రంగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని, ఈ సమస్యలపై అధ్యయనం చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని భూమి సునీల్ కోరారు. భూ సంబంధిత అంశాలపై ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చారు. సాదా బైనామాల చట్ట సవరణ చేయాలని, రెవెన్యూ సదస్సులు పెట్టి సుమోటోగా రైతుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పెండింగ్‌లో 2.30 లక్షల దరఖాస్తులు సమీక్షలో భాగంగా రెవెన్యూ శాఖ, సీసీఎల్ఏ అధికారులు ధరణిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ పోర్టల్ ద్వారా భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన మాడ్యూల్స్‌లో ఎన్ని దరఖాస్తులు వస్తే ఎన్ని పరిష్కారమయ్యాయో వివరించారు. టెక్నికల్ మాడ్యూల్ 1 నుంచి టీఎం 33 వరకు మొత్తం 2.30 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, 1.80 లక్షల ఎకరాలకు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. సమీక్షలో కాంగ్రెస్ నేతలు అన్వేష్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, మన్నె నర్సింహారెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి, ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, రాజ్ ఠాకూర్లతో పాటు ట్రెసా ప్రతినిధులు వంగ రవీందర్‌రెడ్డి, కె.గౌతమ్‌కుమార్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం తరఫున వి.లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వేగంగా ముగిసిన ర్యాటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల ధ్రువీకరణ (ర్యాటిఫికేషన్) ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. కొన్నేళ్ళతో పోలిస్తే ఈ ప్రక్రియను ఇంత వేగంగా ముగించడం ఇదే తొలిసారి. వాస్తవానికి ర్యాటిఫికేషన్ కోసం ఉన్నత విద్యా మండలి అధికారులు ప్రతి ఏటా కుస్తీ పడుతుంటారు. ప్రతి ప్రైవేటు కాలేజీకి కేటాయించిన సీటును నిశితంగా పరిశీలించి, ఎలాంటి అభ్యంతరాలు లేవని మండలి సభ్యులు నిర్ణయించిన తర్వాతే ఆమోదం తెలుపుతారు. ఈ కారణంగా ర్యాటిఫికేషన్ ప్రక్రియ ప్రతి సంవత్సరం మార్చి వరకూ కొనసాగతుంది. మండలి కార్యాలయంలో దీనికి ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తారు. రోజుకు కొన్ని కాలేజీలు చొప్పున పెద్ద ఎత్తున ఫైళ్ళతో వస్తుంటాయి. ఈసారి మాత్రం ఈ హడావుడి ఏమీ కన్పించలేదు. రాష్ట్రంలోని 150కి పైగా ప్రైవేటు కాలేజీల్లో ఉండే 25 వేల మేనేజ్మెంట్ కోటా సీట్లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన ఇంత వేగంగా ముగించడం, అన్నీ సక్రమమేనంటూ ధ్రువీకరించడంపై పలు విద్యార్థి సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఫిర్యాదులకు ఆధారాల్లేవా? ప్రతి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీకి కొన్ని సీట్లు కేటాయిస్తారు. ఇందులో 70 శాతం కన్వినర్ కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం ప్రవాస భారతీయుల పిల్లలు, ఎన్ఆర్ఐలు సిఫారసు చేసిన వారికి కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను యాజమాన్య కోటా (బి కేటగిరీ) కింద భర్తీ చేస్తారు. అయితే వీటి విషయంలో కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. జేఈఈ ర్యాంకర్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. వాళ్ళు లేకుంటే ఎంసెట్ ర్యాంకర్లకు, ఆ తర్వాత ఇంటర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారికి ఇవ్వాలి. సర్టిఫికెట్లు అన్నీ సరిగ్గా ఉండాలి. బి కేటగిరీ కింద కేటాయించిన సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే తీసుకోవాలి. అయితే కాలేజీలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టుగా ప్రతి ఏటా మండలికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఏడాది కూడా 34 కాలేజీలపై 42 ఫిర్యాదులు వచ్చి నట్టు మండలి వర్గాలే తెలిపాయి. అయితే వీటిని పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీని ఎలాంటి చర్యలు తీసుకున్నది అధికారులు వెల్లడించడం లేదు. అదే సమయంలో ఆధారాలుంటే తప్ప ఫిర్యాదుల విషయంలో తామేమీ చేయలేమని అంటున్నారు. ప్రైవేటు కాలేజీలు ఖుషీ ర్యాటిఫికేషన్ ప్రక్రియ ఈసారి సజావుగా సాగిపోవడంతో ప్రైవేటు కాలేజీల యా జమాన్యాలు సంతోషంగా ఉన్నాయి. మండలికి అందిన ఫిర్యాదులన్నీ అవాస్తవమని చెబుతున్నాయి. విద్యార్థి సంఘాల పేరుతో సీట్లు డిమాండ్ చేశారని, వాటిని తిరస్కరించడం వల్లే మండలికి ఫిర్యాదు చేశారని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇష్టానుసారం సీట్లు అమ్ముకున్నట్టుగా ఆరోపణలున్న కాలేజీల పట్ల అధికారులు సానుకూలంగా వ్యవహరించారంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు సంఘాలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. -
కేసీఆర్‌కు ప్రముఖుల పరామర్శ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును బుధవారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. కేసీఆర్‌ను పరామర్శించిన వారిలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, సినీ నటుడు నాగార్జున ఉన్నారు. కేసీఆర్‌ను పరామర్శించిన వారిలో రాష్ట్ర ప్రణాళిక బోర్డు మాజీ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఉన్నారు. -
తెలంగాణ: 2024 సెలవుల్ని ప్రకటించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: మరికొన్నిరోజుల్లో కొత్త ఏడాది రాబోతోంది. ఈ క్రమంలో సెలవులపై మంగళవారం ఒక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాదిలో అన్ని పండుగలతో కలిపి 27 సాధారణ(జనరల్), 25 ఆఫ్షనల్(ఐచ్ఛిక సెలవులు) హాలీడేస్ ఇస్తున్నట్లు ఉత్వర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. జనవరి 15న సంక్రాంతి సెలవు, మార్చి 8న మహా శివరాత్రి, మార్చి 25న హోలి, ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 17న శ్రీరామనవమి, జూన్ 17న బక్రీద్, సెప్టెంబర్ 7న వినాయక చవితి, అక్టోబర్ 10న దసరా, అక్టోబర్ 31న దీపావళికి సెలవులుగా పేర్కొంది. -
సీపీఎంకు భంగపాటు.. తమ్మినేనికి ఎదురుదెబ్బ!
ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట అనేవారు. ఇప్పుడు కంచుకోట కనుమరుగైపోయింది. కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ ఒక సీటు గెలుచుకుంది. ఒంటరిగా బరిలోకి దిగిన సీపీఎం కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శికి కూడా డిపాజిట్ దక్కలేదు. ఇంత పతనాన్ని సీపీఎం నాయకులు ఊహించలేదా? ఊహించినా నిర్లక్ష్యంగా వ్యవహరించారా? తాజా ఎన్నికలతో కమ్యూనిస్టుల ప్రస్తుత వాస్తవ బలం ఎంతో తెలిసిందా?.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ప్రస్తుతం ఉన్న ప్రజా బలం ఎంతో తేలిపోయింది. సీపీఐ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం సీటు ఒక్కటి తీసుకుని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. సీపీఎం మాత్రం సీట్ల బేరం కుదరక ఒంటరిగా బరిలోకి దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 19 స్థానాల్లో పోటీ చేయగా.. కనీసం ఒక్క చోట కూడా డిజాజిట్ దక్కలేదు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు సొంత ఊరులో కూడా అతి స్వల్పంగా ఓట్లు రావడం ఆ పార్టీ దయనీయ పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఒకనాడు ఎర్ర జెండాల రెపరెపలతో కళకళలాడిన ఖమ్మం జిల్లాలో సీపీఎంకు ఇంతటి దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ పార్టీ నేతలు కూడా ఊహించి ఉండరనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తమ బలాన్ని అతిగా అంచనా వేసుకుని తమకు సీట్లు ఇవ్వని కాంగ్రెస్‌ను దెబ్బ కొడదామనుకున్నారా? లేక వాస్తవాలు తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సమయంలో 2014లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలకు చెరో సీటు దక్కింది. గత సభలో రెండు పార్టీలు ఒక్కో స్థానం కూడా పొందలేకపోయాయి. తాజా ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేస్తామని చెప్పినా.. ఆచరణలో అలా జరగలేదు. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు పెట్టుకోగా.. సీపీఎం ఒంటరిగా పోటీ చేసింది. పాలేరు నుంచి పోటీ చేసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు కూడా సీపీఎం ఓటర్లు ఝలక్ ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా సీపీఎంకు 18 వేల నుంచి 20 వేల ఓట్లు ఉన్నట్లు చెబుతున్నా.. తమ్మినేని కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. రాష్ట్రంలో సీపీఎం పరిస్థితిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. తమ్మినేని వీరభద్రంకు కేవలం 5వేల 308 ఓట్లు మాత్రమే వచ్చాయి. సొంతూరు తెల్దారపల్లిలో సైతం అతి తక్కువ ఓట్లు రావడంతో తమ్మినేని జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఎంకు అన్ని నియోజకవర్గాల్లో కొంత ఓటు బ్యాంకు ఉంది. పాలేరు, మధిర, వైరా, భద్రాచలం నియోజకవర్గాల్లో సీపీఎంకు ఓట్ బ్యాంక్ ఉంది. ఈ నాలుగు స్థానాల్లోనూ గత ఎన్నికల్లో కంటే ఈసారి చాలా తక్కువ ఓట్లు సీపీఎంకు దక్కాయి. ఈసారి మధిర నియోజకవర్గంలో పోటీ చేసిన సీపీఎం అభ్యర్థికి అత్యధికంగా 6,575 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లు గత ఎన్నికల్లో నాలుగో వంతు మాత్రమే. ఇక అత్యల్పంగా హైదరాబాద్‌లోని ముషీరాబాద్ అభ్యర్థికి 835 మాత్రమే పోలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన 19 సీపీఎం అభ్యర్థులకు కలిపినా మొత్తం 50 వేల ఓట్లు కూడా పోలవ్వలేదు. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు మిర్యాలగూడెం అసెంబ్లీ సీటుతో పాటు రెండు ఎమ్మెల్సీలకు అంగీకరించి ఉంటే గౌరవంగా ఉండేదన్న అభిప్రాయాలు ఇప్పుడు సీపీఎం నాయకత్వంలో వ్యక్తమవుతున్నట్లు టాక్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోగా.. కనీసం ఆశించిన స్థాయిలో కూడా ఓట్లు రాకపోవడంతో మండలాల వారీగా సమావేశం ఏర్పాటు చేసి జరిగిన పొరపాట్లను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకుని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసుకుని మళ్లీ జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవాలని సీపీఎం నాయకత్వం భావిస్తోంది. -
బీజేపీలో కొత్త చర్చ.. రాజాసింగ్‌కే మద్దతు?
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు?. గత సభలో ఫ్లోర్ లీడర్‌గా ఉన్న రాజాసింగ్‌నే కంటిన్యూ చేస్తారా?. లేక కొత్తగా ఎన్నికైనవారిలో ఎవరికైనా అప్పగిస్తారా?. తాజాగా అసెంబ్లీకి ఎన్నికైన ఎనిమిది మంది కమలం పార్టీ ఎమ్మెల్యేల్లో అందరికంటే సీనియర్ రాజాసింగ్ మాత్రమే. అందుకే ఇప్పుడీ విషయంపై బీజేపీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. అసలు బీజేపీ నిర్ణయం ఎలా ఉండబోతోంది?.. తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ తరపున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని గోషామహల్లో రాజాసింగ్ మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో ఏలేటి మహేశ్వరరెడ్డి రెండోసారి గెలుపొందారు. అయితే, ఏలేటి కొంతకాలం క్రితమే బీజేపీలో చేరారు. ఇక మిగిలిన ఆరుగురు ఎమ్మెల్మేలు మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో ముగ్గురు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి, మరో ముగ్గురు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి గెలుపొందారు. పార్టీలో కీలక పదవుల్లో ఉన్నవారు, సీనియర్లు బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు వంటివారంతా ఓడిపోయారు. అసెంబ్లీ కార్యకలాపాల విషయంలో అనుభవం ఉన్నవారు ఇద్దరే ఉండటంతో శాసనసభాపక్ష నేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ కమలం పార్టీలో జరుగుతోంది. గత అసెంబ్లీలో రాజాసింగ్ ఒక్కరే గెలవడంతో ఆయనే సభాపక్ష నేతగా కొనసాగారు. తర్వాత ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్‌రావు, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలుపొందినా ఫ్లోర్ లీడర్‌గా రాజాసింగ్‌నే కొనసాగించారు. రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా ఆ పదవి మరొకరికి ఇవ్వలేదు. ఇప్పుడు మూడోసారి గెలిచిన రాజాసింగ్‌నే మరోసారి పార్టీ ఫ్లోర్ లీడర్‌గా కమలం పార్టీ నాయకత్వం కొనసాగిస్తుందా? లేక మరొకరికి ఆ బాధ్యత అప్పగిస్తుందా అనే టాక్ నడుస్తోంది. రాజాసింగ్ ఇలా.. రాజాసింగ్ తన నియోజకవర్గమైన గోషామహల్‌కే పరిమితం అవుతున్నారు. పైగా ఆయనకు తెలుగు భాషపై కూడా పట్టు లేదు. రాష్ట్ర సమస్యల మీదా అవగాహన లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ, మూడోసారి గెలిచారు గనుక ఆయనకే ఫ్లోర్ లీడర్ బాధ్యత అప్పగించాలని కొందరు పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్ రెడ్డినే ఫ్లోర్ లీడర్‌గా నియమించే అవకాశం ఉందంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం మహేశ్వరరెడ్డికి ఉంది. రాష్ట్రంలోని సమస్యల పట్ల కూడా ఆయనకు అవగాహన ఉంది. కాబట్టి ఆయనకు ఛాన్స్ ఇవ్వవచ్చని అనుకుంటున్నారు. కాటిపల్లికి ఛాన్స్.. కానీ, కామారెడ్డిలో అనూహ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ను, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డిని ఏకకాలంలో ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డిని బీజేపీ శాసనసభ పక్ష నేతగా చేయాలంటూ ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. ఆయనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకొని రాష్ట్రమంతా తిప్పాలని బీజేపీ శ్రేణులు కోరుతున్నాయి. బెంగాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారిని బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎంపిక చేసి ఆయన్ను రాష్ట్రమంతా తిప్పుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా కాటిపల్లిని ఫ్లోర్ లీడర్ చేయాలని సూచిస్తున్నారు. కాటిపల్లి సమస్యలపై మాట్లాడగలరని, ఆయనలో పోరాటం చేసే తత్వం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే, కాటిపల్లి వెంకటరమణారెడ్డి రాష్ట్ర స్థాయి రాజకీయాలకు కొత్త, ఎక్కువగా తన నియోజకవర్గానికి పరిమితమైనటువంటి వ్యక్తి కావడంతో పార్టీ హై కమాండ్ ఏ మేరకు ఆయన వైపు మొగ్గు చూపుతుందనేది సందేహమే అంటున్నారు మరికొందరు నేతలు. ఏదేమైనా అసెంబ్లీలో బీజేపీ నేత ఎవరనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
కేసుల్లేని మంత్రులు ముగ్గురే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కొత్తగా కొలువుతీరిన ప్రభుత్వంలోని 12 మంది అమాత్యుల్లో సీఎం రేవంత్‌రెడ్డి సహా తొమ్మిది మంది మంత్రులపై కలిపి మొత్తం 136 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డిపై అత్యధికంగా 89 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో తీవ్రమైన క్రిమినల్ కేసులు 50 ఉన్నాయి. ఇక తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు ఐదుగురు మంత్రులు ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లలో వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావుపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్, తెలంగాణ ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సహా 12 మంది మంత్రుల అఫిడవిట్ల «ఆధారంగా వారి నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు తదితర అంశాలపై సమీక్ష చేపట్టిన ఏడీఆర్ సంస్థ శనివారం ఒక నివేదికను విడుదల చేసింది. రేవంత్ తర్వాత ఉత్తమ్, పొన్నం పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి తర్వాతి స్థానంలో 11 కేసులతో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. ఆయన తర్వాత 7 కేసులతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, 6 కేసుల చొప్పున ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దాసరి అనసూయ సీతక్క, 5 కేసుల చొప్పున ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, 3 కేసుల చొప్పున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎౖMð్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. సీతక్క మినహా అందరూ కోటేశ్వరులే మంత్రివర్గంలోని సీఎం సహా మొత్తం 12 మంది మంత్రుల్లో 11 మంది కోటీశ్వరులే ఉన్నారు. ఏడీఆర్ విశ్లేíÙంచిన 12 మంది మంత్రుల ఆస్తుల లెక్క చూస్తే.. రూ.433.93 కోట్ల విలువైన ఆస్తులతో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అత్యధికంగా ఆస్తులు ఉన్న మంత్రిగా అగ్రస్థానంలో నిలిచారు. కాగా 10 మంది మంత్రులు తమకు అప్పులు ఉన్నాయని ప్రకటించగా....అప్పుల జాబితా లోనూ రూ.43.53 కోట్లతో మంత్రి పొంగులేటి టాప్‌లో ఉన్నారు. ఆస్తుల విషయంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తర్వాత రూ.46.66 కోట్లతో దామోదర రాజనర్సింహ, రూ.39.55 కోట్లతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రూ.30.04 కోట్లతో సీఎం రేవంత్‌రెడ్డి ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు. అయితే రూ.82.83 లక్షల ఆస్తులతో మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అత్యల్ప ఆస్తులున్న మంత్రిగా ఉన్నారు. -
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకెళ్తాం
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకాంక్షల మేరకు రాష్ట్రంలో అధికార సాధన దిశగా బీజేపీ దూసుకుపోతుందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గతంలోని ఒక సీటుతో పోలిస్తే 8 సీట్లలో గెలవడంతోపాటు రెండింతల ఓట్ల శాతాన్ని సాధించిందని తెలిపారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, నేతలు డా. ఎస్.ప్రకాశ్‌రెడ్డి, టి. ఆచారి, మురళీయాదవ్, నరహరి వేణుగోపాల్‌రెడ్డిలతో కలసి ఈటల మీడియాతో మాట్లాడుతూ ఇతర పార్టీలు డబ్బు సంచులు పంచినా ప్రజలు తమకు ఇంత గొప్ప విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 36 లక్షల ఓట్లు (15 శాతం ఓట్లు) సాధించేలా చేశారన్నారు. అందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఈటల పేర్కొన్నారు. ప్రజలు, కార్యకర్తలు అందించిన విశ్వాసం, నమ్మకంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 2019లో గెలిచిన సీట్ల కంటే రాష్ట్రంలో అధిక స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా బీజేపీ 400 సీట్లలో గెలిచి సత్తా చాటుతుందని ఈటల విశ్వాసం వ్యక్తంచేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం గురించి తనకేమీ తెలియదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. దీనిపై పార్టీ నాయకత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కడియం వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: రఘునందన్ బీఆర్ఎస్ 39 సీట్లతోపాటు బీజేపీకి 8, ఎంఐఎంకు 7 సీట్లు కలిస్తే తమ బలం పెరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో టీడీపీలోని ఆయన పాత మిత్రుడైన కడియం శ్రీహరి కలవదలుచుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ప్రజలిచ్చిన తీర్పుతో రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించనుందని, ఎంఐఎంతో అంటకాగే పార్టీలతో బీజేపీ ఎలాంటి సంబంధాలు పెట్టుకోదని ఆయన స్పష్టంచేశారు. బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, ఈ ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని ముందుకు సాగుతామన్నారు. సోషల్ మీడియాలో పోస్టులొద్దు... బీజేపీ నేతలపై సోషల్ మీడియాలో పెడుతున్న అభ్యంతరకర పోస్టులను పార్టీ నాయకత్వం గమనిస్తోందని రఘునందన్‌రావు ఒక ప్రశ్నకు బదులిచ్చారు. వాటిపై సరైన సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. అప్పటివరకు అందరూ సంయమనం పాటించాలని, ఓటమి బాధతో సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. కార్యకర్తలు నిరుత్సాహానికి గురికావొద్దని, మళ్లీ పూర్తిస్థాయి శక్తితో పుంజుకుంటామన్నారు. -
కొలువుదీరిన మూడో శాసనసభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ శనివారం కొలువుదీరింది. ఉదయం 11.00 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు ప్రమాణం చేశారు. అనంతరం మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసిన తరువాత అక్షర క్రమంలో సభలోని సభ్యులతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 61 మంది, బీఆర్ఎస్ నుంచి 32 మంది, ఎంఐఎం నుంచి ఆరుగురు, సీపీఐ నుంచి గెలిచిన ఒక్కరు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడాన్ని నిరసిస్తూ బీజేపీకి చెందిన 8 మంది సభ్యులు సభకు హాజరు కాలేదు. కాలు జారి పడిన కారణంగా శస్త్ర చికిత్స చేయించుకొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయనకు సహాయకారిగా ఉన్న మాజీ మంత్రి కె. తారక రామారావు సహా ఏడుగురు బీఆర్ఎస్ సభ్యులు, వ్యక్తిగత కారణాలతో ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ప్రమాణం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరే.. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, దామోదర రాజ నర్సింహ, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, చిట్టెం పర్ణికా రెడ్డి, మట్టా రాగమయి, పద్మావతి రెడ్డి, యశస్విని రెడ్డి, ఆది శ్రీనివాస్, ఆదినారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అనిరుధ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, బాలు నాయక్ నేనావత్, చిక్కుడు వంశీకృష్ణ, చింతకుంట విజయ రమణారావు, దొంతి మాధవరెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, గడ్డం వినోద్, గండ్ర సత్యనారాయణ రావు, జి. మధుసూదన్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, రామ్‌చందర్ నాయక్, కేఆర్ నాగరాజు, కే శంకరయ్య, కసిరెడ్డి నారాయణరెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కోరం కనకయ్య, కె.రాజేశ్‌రెడ్డి, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, కుందూరు జయవీర్‌రెడ్డి, తోట లక్ష్మీకాంతారావు, కె. మదన్ మోహన్ రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మల్ రెడ్డి రంగారెడ్డి, మందుల సామ్యేల్, మేడిపల్లి సత్యం, తుడి మేఘారెడ్డి, మురళీ నాయక్ భుక్యా, మైనంపల్లి రోహిత్, నాయిని రాజేందర్‌రెడ్డి, పి. సుదర్శన్‌రెడ్డి, పటోళ్ల సంజీవ్ రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ మాలోత్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, రేకులపల్లి భూపతి రెడ్డి, టి. రామ్మోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వెడ్మ బొజ్జు, వేముల వీరేశం, గడ్డం వివేక్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి 32 మంది కోవా లక్ష్మి, లాస్య నందిత, పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, అరికెపూడి గాంధీ, బండారి లక్ష్మారెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, చింతా ప్రభాకర్, దానం నాగేందర్, దేవిరెడ్డి సు«దీర్ రెడ్డి, గంగుల కమలాకర్, గూడెం మహిపాల్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, కేపీ వివేకానంద, కాలే యాదయ్య, కాలేరు వెంకటేశ్, కల్వకుంట్ల సంజయ్, మాణిక్ రావు, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, ముఠా గోపాల్, వేముల ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, టి. ప్రకాశ్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, తెల్లం వెంకట్రావ్, హరీశ్‌రావు, విజయుడు. ఎంఐఎం నుంచి అందరూ ఎంఐఎం నుంచి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, జాఫర్ హుస్సేన్, కౌసర్ మెయినుద్దీన్, జుల్ఫీకర్ అలీ, మహ్మద్ మాజీద్ హుస్సేన్, మహ్మద్ మోబిన్ ప్రమాణం చేయగా, ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన అక్బరుద్దీన్ ఒవైసీ అంతకు ముందే గవర్నర్ సమక్షంలో ప్రమాణం చేశారు. సీఐపీ నుంచి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గైర్హాజరైన సభ్యులు ఎవరంటే కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ నుంచి రాజాసింగ్ , ఏలేటి మహేశ్వర్ రెడ్డి, హరీశ్‌బాబు, కె. వెంకట రమణా రెడ్డి, పాయల్ శంకర్, రామారావు పవార్, పైడి రాకేశ్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గైర్హాజరయ్యారు. -
ఆ విషయంపై క్లారిటీ కావాలి: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ పెట్టుబడిపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని.. క్లారిటీ కావాలంటూ కొత్త ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. రైతులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందన్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాల ముగింపు అనంతరం మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. విమర్శలు చేయడానికి తాము రాలేదన్నారు. ‘‘ఓ వైపు వర్షాలు పడుతున్నాయి. బోనస్ ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. రైతు బంధు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. డిసెంబర్ 9న ఇస్తామని చెప్పింది కానీ ఇవ్వటం లేదు. మేం అధికారంలో ఉన్నపుడు నవంబర్ చివరి వారం, డిసెంబర్ మొదటి వారంలో వేశాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా ఎప్పటి లోగా ఇస్తారో స్పష్టత ఇవ్వాలి. యాసంగి పంట వేసే సమయం వచ్చింది దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. డిసెంబర్ 9న వచ్చిన ప్రభుత్వం నుంచి స్పందన లేదు’’ అని హరీష్‌రావు విమర్శించారు. ఇదీ చదవండి: మహాలక్ష్మీ పథకం ప్రారంభం.. మహిళలకు ఉచిత ప్రయాణం -
Telangana: మంత్రులకు శాఖల కేటాయింపు.. ఐటీ మంత్రి ఎవరంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మంత్రులకు నేడు శాఖలను కేటాయించారు. మంత్రుల శాఖలపై సీఎం రేవంత్ ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపారు. దీంతో, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే అంశంపై క్లారిటీ తీసుకొని కేటాయింపు జరిగింది. కీలకమైన హోంశాఖ సీఎం రేవంత్ వద్దే ఉంది. మంత్రులు, వారి శాఖలు ఇవే.. రేవంత్ రెడ్డి.. హోం శాఖ, మున్సిపాలిటీ, విద్య మల్లు భట్టి విక్రమార్క: ఆర్థిక శాఖ, విద్యుత్ దామోదర రాజనర్సింహ: వైద్య, ఆరోగ్యశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి: సివిల్ సప్లై, నీటి పారుదల, సీతక్క: పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ వెల్ఫర్ శ్రీధర్‌బాబు: ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు కొండా సురేఖ: అటవీ శాఖ, దేవాదాయ, పర్యావరణ పొంగులేటి శ్రీనివాస్: సమాచార శాఖ, రెవెన్యూ, హౌసింగ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి: ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ జూపల్లి: ఎక్సైజ్, పర్యాటక శాఖ, పురావస్తు తుమ్మల నాగేశ్వరరావు: వ్యవసాయ శాఖ, చేనేత, అనుబంధ సంస్థలు పొన్నం ప్రభాకర్: రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ -
తిరుమలలో ఎమ్మెల్యే వివేక్.. సింగరేణిపై కీలక వ్యాఖ్యలు
సాక్షి, తిరుమల: చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తిరుమల పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని వివేక్ దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని వివేక్ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం, వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నియంతృత్వ పాలన అంతమైంది. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా ప్రభుత్వం వచ్చింది. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. మిషన్ భగీరథ ఫెయిల్ అయింది, ఎక్కడా మంచి నీరు రావడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు బాధితులకు న్యాయం చేస్తాం. పది సంవత్సరాలలో ప్రజాధనం దుర్వినియోగంపై శ్వేతపత్రం తీసుకురావాల్సి ఉంది. అవినీతి సొమ్ముతో ఇతర రాష్ట్రాలలో రాజకీయాలకు దుర్వినియోగం చేశారు. ధరణి పోర్టల్‌తో కల్వకుంట్ల కుటుంబం భూ దందాకు పాల్పడింది.రాష్ట్రంలో దోపిడిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించడం జరిగింది అని కామెంట్స్ చేశారు. -
15మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 15మంది సీఐలకు పదోన్నతిపై డీఎస్పీలుగా పోస్టింగులు ఇచ్చారు. వీరి పదోన్నతులను ప్రభుత్వం ఆగస్టులో ఖరారు చేసింది. కాగా వారికి తాజాగా పోస్టింగులు ఇస్తూ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి: ఎస్.వహీద్ బాషా( సీఐడీ), ఎం.హనుమంతరావు(సీఐడీ), టీవీ రాధా స్వామి (ఎస్బీ, గుంటూరు), డి.శ్రీహరిరావు (ఏసీబీ), జి.రాజేంద్ర ప్రసాద్ (ఇంటెలిజెన్స్), బి.పార్థసారథి ( సీఎస్బీ, విజయవాడ), కె.రసూల్ సాహెబ్ (సీఐడీ), ఎం.కిశోర్ బాబు ( విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), డీఎన్వీ ప్రసాద్ (ఇంటెలిజెన్స్), జి.రత్న రాజు ( పోలవరం), పి.రవిబాబు (ఇంటెలిజెన్స్), షేక్ అబ్దుల్ కరీమ్ (పీసీఎస్ అండ్ ఎస్), ఎస్. తాతారావు (విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), కోంపల్లి వెంకటేశ్వరరావు(విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), సీహెచ్.ఎస్.ఆర్.కోటేశ్వరరావు(ఏసీబీ). -
తేలని శాఖలు
ఎంపీ పదవికి రేవంత్ రాజీనామా కొడంగల్ ఎమ్మెల్యేగా విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి, తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజక వర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఆయన, స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా సమర్పించారు. సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీ కారం చేసిన నేతలకు శాఖల కేటాయింపుపై సస్పెన్స్ కొనసాగుతోంది. శుక్రవారం ఈ అంశంపై స్పష్టత వస్తుందని భావించినా ఏమీ తేల్లేదు. ఈ అంశంపై చర్చించేందుకు ఢిల్లీ కి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైకమాండ్ పెద్దలతో భేటీ కావాల్సి ఉన్నప్పటికీ వా రంతా బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ ఎన్నికల ఫలితాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ రోజంతా సమీక్షల్లో పాల్గొన్నారు. దీంతో పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ దాదాపు రెండు గంటల సేపు భేటీ అయి శాఖల కేటాయింపుపై చర్చించారు. హోం, ఆరిక్థ, రెవెన్యూ, వైద్యం, మునిసిపల్, విద్యుత్, నీటిపారుదల వంటి కీలక శాఖల కేటాయింపుపై సీనియర్ల నుంచి వస్తున్న వినతులపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో మంత్రులుగా పనిచేసిన సీనియర్లకే కీలక శాఖలు ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు వంటి సీనియర్లకు కీలక శాఖలు ఇవ్వాలని, వారి సేవలను వినియోగించుకోవాలని కేసీ సూచించినట్లు సమాచారం. అయితే ఎవరికి ఏ శాఖ ఇచ్చేలా నిర్ణయం జరిగిందన్న విషయం బయటకు రాలేదు. కాగా ఈ భేటీ అనంతరం కేసీ, ఠాక్రే, రేవంత్ కలిసి ఖర్గే నివాసానికి వెళ్లారు. కాసేపటి తర్వాత రాహుల్ కూడా వారితో చేరారు. అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి. శనివారం ఉదయానికి ఈ అంశంపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఇక మిగిలిన ఎమ్మెల్యేలలో ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి? అనే దానిపై మరోసారి చర్చిద్దామని వేణుగోపాల్ సూచించడంతో దీనిపై నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. -
బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు శనివారం ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ తరపున శాసనసభకు ఎన్నికైన 38 మంది ఎమ్మెల్యేలు తెలంగాణభవన్‌లో భేటీ అవుతున్నారు. తుంటి ఎముక చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ ఈ భేటీకి హాజరయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేల భేటీకి అధ్యక్షత వహిస్తారు. కేసీఆర్‌ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వీలుగా ఈ భేటీలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆమోదిస్తారు. శాసనసభాపక్ష నేత ఎన్నిక అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ ఆల్పాహారం చేస్తారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక వాహనంలో అసెంబ్లీ ప్రాంగణం ఎదుట ఉన్న గన్‌పార్కుకు చేరుకొని తెలంగాణ అమరుల స్తూపానికి నివాళి అర్పిస్తారు. ఉదయం 11 గంటలకు ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన ప్రారంభమయ్యే తెలంగాణ మూడో శాసనసభ తొలి విడత సమావేశాలకు బీఆర్ఎస్ సభ్యులు హాజరవుతారు. ప్రొటెం స్పీకర్ సమక్షంలో నిబంధనలకు అనుగుణంగా ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ తరపున ఎన్నికైన నేతలు ప్రమాణ స్వీకారం చేస్తారు. విపక్ష నేతగా ఉండేందుకు కేసీఆర్ మొగ్గు శాసనసభలో 119 మంది సభ్యులకుగాను బీఆర్ఎస్ తర పున 39 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అవతరించిన నేపథ్యంలో పార్టీ శాసనసభాపక్ష నేతకు కేబినెట్ హోదా దక్కుతుంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉండేందుకు మొగ్గు చూపినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే కేటీఆర్ లేదా మాజీ మంత్రి హరీశ్‌రావు బీఆర్ఎస్ శాసనసభా పక్షనేతగా వ్యవహరిస్తారనే ప్రచారం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్, శాసనసభా పక్ష నేతగా హరీశ్‌రావుకు చెరో పదవి అప్పగిస్తారని బీఆర్ఎస్లో చర్చ కూడా జరిగింది. తాము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ తరపున కేసీఆర్ శాసనసభా పక్ష నేతగా వ్యవహరిస్తే అటు పారీ్టకి, ఇటు ప్రజలకు మేలు జరుగుతుందనే భావన వ్యక్తమైనట్టు సమాచారం. -
‘ట్రోలింగ్’ వెనుక ఎవరున్నారు?
సాక్షి, హైదరాబాద్: వివిధ సామాజిక మాధ్యమాల్లో పార్టీ నేతలే లక్ష్యంగా ‘ట్రోలింగ్’సాగడంపై బీజేపీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లకే పరిమితం కావడాన్ని ఎత్తిచూపుతూ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో వివిధ రకాల మీమ్స్, సందేశాలు ప్రచారం చేస్తుండటాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఇతర నేతలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ప్రచారం చేయడం వల్ల పరోక్షంగా బీజేపీ ఇమేజీ కూడా దెబ్బతింటోందని అంటున్నారు. పార్టీని, నేతలను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్య మాల్లో పెడుతున్న పోస్టులను చూసి ముఖ్యనేతలు మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఇలాంటి వాటివల్ల అంతిమంగా పార్టీకే నష్టం జరగనున్నందున ట్రోలింగ్ అంశంపై నాయకత్వం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ప్రతికూల ప్రచా రం పట్ల పార్టీ నాయకులు, శ్రేణులు అప్రమత్తమై అలాంటి వాటిని ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు షేరింగ్‌లు చేయకుండా జాగ్రత్తలు తీసు కోవాలని పార్టీలో అంతర్గత సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఇలాంటి అభ్యంతరకర పోస్టులను తిప్పికొడుతూ పోస్టింగ్‌లు కూడా పెట్టాలని సూచించినట్టు తెలిసింది. శాసన సభ ఎన్నికల నేపథ్యంలో కొంతకాలంగా పార్టీ లోని కొందరు నేతలు సొంతంగా సోషల్ మీడి యా టీమ్‌లను ఏర్పాటు చేసుకుని తమ ప్రచా రాన్ని సాగిస్తున్న విషయం విదితమే. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పార్టీని, నేతలను టార్గెట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టింగ్‌లు, కొందరు నేతలను టార్గెట్ చేస్తూ పనిగట్టుకుని ట్రోలింగ్ చేయడం వెనక పార్టీలోని వారే ఉన్నారనే అనుమానాలు కూడా వ్యక్త మతున్నాయి. వీటి వెనక ఎవరున్నారు, అసలు ఆయా నేతలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అందుకు కారణాలు ఏమిటన్న దానిపై రాష్ట్ర పార్టీ లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఓ వైపు పాలన.. మరోవైపు పదవులు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు కీలక టాస్క్‌లు ఎదుర్కోబోతున్నారు. ఓ వైపు పాలనతో పాటు మరోవైపు పదవుల పందేరం కూడా ఆయనకు పెద్ద పరీక్షగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేక పదేళ్లు కావడం, తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారి అధికారంలోకి రావడంతో వేలాది మంది పార్టీ నేతలు పదవుల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వీరికి పోస్టుల పంపిణీ ఒక ఎత్తయితే ఆ పదవుల పందేరం ఫలితంగా ఎదుర్కొనే పరిస్థితులను సమన్వయం చేయాల్సి ఉండడం పెద్ద టాస్క్ అనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. పదవుల పంపిణీతో పాటు పాలనా వ్యవహారాలపై దృష్టి సారించి తనదైన మార్కు పరిపాలన అందించడం కోసం రేవంత్ జోడెడ్ల స్వారీ చేయాల్సిందేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీనే కీలకం...: రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియామకం మొదలు నుంచి సీఎంగా ఎంపికయ్యేంతవరకు కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు ఆయన్ను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆ కొందరు నేతల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. అధిష్టానం వద్ద పట్టుపట్టి తామూ కీలకం అన్న ’గుర్తింపు’సాధించడంలో సఫలీకృతులయ్యారన్న వాదనలూ ఉన్నాయి. ఇందుకోసం అధిష్టానం పెద్దలు కూడా సహకరించారనే చర్చ జరుగుతోంది. రేవంత్‌రెడ్డి నాయకత్వం పట్ల ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో ఏకాభిప్రాయంతో కూడిన సానుకూలత ఉన్నప్పటికీ సొంత పార్టీలోని కొందరు నాయకుల వైఖరి ఆయనకు పగ్గాలు అప్పగించేందుకు అడ్డంకి కాకూడదన్న ఆలోచనతోనే హైకమాండ్ రాజీధోరణిని అందిపుచ్చుకుందని గాంధీభవన్ వర్గాలంటున్నా యి. ఈ ధోరణి మరికొన్నాళ్లు కొనసాగుతుందని, పాలనపై పూర్తి స్థాయిలో పట్టు సాధించి, తనదైన మార్కు వేసేంతవరకు పార్టీలోని సీనియర్లతో సీఎం రేవంత్‌కు సమన్వయం తప్పదని చెపుతున్నాయి. ఠాక్రేతో పాటు సీనియర్లను సమన్వయం చేసుకునే.. ఇప్పటికే మంత్రివర్గం కూర్పు, శాఖల పంపిణీలో కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం మార్కు రాజకీయాలు స్పష్టం కాగా, భవిష్యత్తులో జరిగే నామినేటెడ్ పదవుల పంపకంలోనూ హైకమాండ్ జోక్యం ఉంటుందని చెబుతున్నారు. హైకమాండ్ సూచనల మేరకు సీనియర్ కాంగ్రెస్ నేతల ప్రతిపాదనలపై ఆయన సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పదవుల పందేరం కోసం రాష్ట్రంలోని కొందరు ముఖ్య కాంగ్రెస్ నాయకులతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో మాట్లాడి సమన్వయం చేసుకోవాలని అధిష్టానం ప్రతిపాదించిందని సమాచారం. -
ప్రజాస్వామ్య పద్ధతిలో సభ నిర్వహిస్తా
సాక్షి, హైదరాబాద్: పాలక, ప్రతిపక్ష సభ్యులను సమన్వయం చేసుకుంటూ శాసనసభ ఔ న్నత్యం ఇనుమడింపజేసేలా ప్రజాస్వామ్య ప ద్ధతిలో సభా కార్యక్రమాలు నిర్వహిస్తానని వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఎన్నికకానున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. స్పీకర్ పదవికి కాంగ్రెస్ తనను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని... దళితుడికి ఇంత పెద్ద హోదా కేవలం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమన్నారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే... మంత్రి పదవి వస్తుందని అనుకున్నా... నాతో పాటు నియోజకవర్గ, జిల్లా ప్రజలు కూడా ఈసారి నాకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నాం. కానీ పార్టీ అధిష్టానం ఇంకా గొప్పగా ఆలోచించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్ద బాధ్యత అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తను నేను. పార్టీ ఏ పదవి ఇచ్చినా కాదనకుండా చేసుకుంటూపోతా. కాంగ్రెస్ పేరుకు దెబ్బ తగలకుండా ఇచ్చిన పదవికి గౌరవం తెచ్చేలా పనిచేస్తా. రెండు పర్యాయాలుస్పీకర్ నామమాత్ర పాత్రనే... గత రెండు పర్యాయాలు శాసనసభ కార్యక్రమాల నిర్వహణను రాష్ట్ర ప్రజలంతా గమనించారు. నియంతృత్వ ధోరణిలో ప్రతిపక్షాలను లెక్క చేయకుండా ఏకపక్షంగా సభానాయకుడే సభలో నిర్ణయాలు తీసుకున్న పరిస్థితిని గమనించాం. స్పీకర్ పాత్ర నామమాత్రమైంది. నేను స్పీకర్‌గా ఎన్నికైతే ప్రజాస్వామ్య పద్ధతిలో, సభ గౌరవం తగ్గకుండా, స్పీకర్ విలువ పెంచేలా సభను నడిపిస్తా. మహామహులు సభలో ఉన్నా... సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మాజీ సీఎం కేసీఆర్ ఇతర సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. పాలక, ప్రతిపక్షాల సభ్యులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతా. ఇప్పటి వరకు పాలక పక్షం చెప్పిందే వేదంగా సాగేది. సభలో ప్రతిపక్షాలకు కూడా తగిన సమయం ఇస్తా. అందరినీ కలుపుకొని ముందుకు వెళతా. మొదటి దళిత స్పీకర్‌ను నేనే అవుతా... నేను ఎన్నికైతే తెలంగాణ శాసనసభలో తొలి దళిత స్పీకర్‌గా నాదే రికార్డు అవుతుంది. ఉమ్మడి ఏపీలో ప్రతిభాభారతి తొలి దళిత స్పీకర్‌గా ఉండేవారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇంత పెద్ద పదవి దక్కింది కూడా నాకే. -
అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు శనివారం ప్రమాణం చేసేందుకు ఉద్దేశించిన ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు హాజరుకావడం లేదన్నారు. శనివారం ఉదయం తమ పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితో ఎమ్మెల్యేలు సమావేశమై, ఆయా అంశాలపై చర్చిస్తామని తెలిపారు. బీజేఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శుక్రవారం రాజాసింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎందరో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్‌గా నియమించినందున తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రజాకార్ల సైన్యానికి నాయకత్వం వహించిన ఖాసిం రజ్వీ వారసులైన ఎంఐఎం పార్టీ నేతల ఎదుట ప్రమాణం చేయదలుచుకోలేదని రాజాసింగ్ చెప్పారు. ఆ తర్వాత స్పీకర్ ఎదుట ఎప్పుడైనా ప్రమాణం చేస్తామని తెలిపారు. 2018లోనూ ప్రొటెమ్ స్పీకర్‌గా ఉన్నందున ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్ ఎదుట రాజాసింగ్ ప్రమాణం చేయలేదు. -
ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలు వినేందుకే ప్రజాదర్బార్ ఏర్పాటు చేశామని, వీలైనంత త్వరలోనే వారి సమస్యల్ని పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వినేందుకే ప్రగతిభవన్‌కు ఉండే అడ్డుగోడలను తొలగించి ప్రజాభవన్‌గా మార్చామని పొన్నం తెలిపారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కె.సత్యనారాయణతో పాటు సీపీఐ నాయకులను కలిసేందుకు శుక్రవారం హైదరాబాద్‌లోని మఖ్దూమ్‌భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మతో సమావేశమయ్యారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజా సమస్యలను చెప్పుకునేందుకు, ప్రతిపక్ష నేతలు కలిసేందుకు కూడా అవకాశం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయంలో సీపీఐ సంపూర్ణ సహకారం, మద్దతు ఉందని, భవిష్యత్‌లో కూడా తాము కలిసే ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ విజయంతో రాష్ట్రంలో ప్రజాస్వామిక పునాది పడిందన్నారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సురవరం వారికి అభినందనలు తెలిపారు. -
దింపుడు కళ్లెం ఆశలన్నీ ఆవిరి..!
పోయింది. పరువంతా పోయింది. తెలంగాణ గట్టు మీద వేసిన పొలిటికల్ పిల్లిగంతులను ఓటర్లు అదిరిపోయే రేంజ్లో తిప్పికొట్టారు. తెలంగాణలో పార్టీ జెండా పీకేసినా.. చంద్రబాబుకి ఫలితం దక్కలేదు. ఓట్ల వేటలో దత్తపుత్రుడికి డిపాజిట్లు దక్కలేదు. ఇక్కడేదో చేసేసి.. ఆ ప్రభావంతో ఏపీలో ఏదేదో చేసేద్దామని పన్నిన కుట్రలు ఈవీఏంల సాక్షిగా కుళ్లు కంపు కొట్టేశాయి. ఇప్పుడు ఇక ఏపీ వంతు. ఎవరికి ఎవరు ఏం అవుతారు ? ఎవరు ఎవరితో కలుస్తారు ? పార్టీలు కలిసినంత మాత్రానా క్యాడర్ కలుస్తుందా ? టీడీపీ, జనసేన, మధ్యలో బీజేపీ. ఈ గజిబిజి గందరగోళానికి తెర పడేదెప్పుడు ? తెలంగాణ ఎన్నికల్లో స్విచ్ వేస్తే.. ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద లైట్ వెలగాలి. చంద్రబాబు గీసిన స్కెచ్ సారంశం అదే. అందులో భాగంగానే దత్తపుత్రుడ్ని కూడా రంగంలోకి దింపి.. బీజేపీతో పొత్తు సరాగాలు ఆలపించేలా చేసింది చంద్రబాబే అని రాజకీయ వర్గాల్లో టాక్. ఏపీ అదిరిపోయేలా తెలంగాణ ఎన్నికల్లో స్విచ్ వేయాలని చంద్రబాబు తలిస్తే.. బాబుకి, దత్తపుత్రుడికి తలతిరిగేలా ఓటర్లు షాక్ ఇచ్చారు. సీమాంధ్ర ఓటర్లంతా మావాళ్లే అని తెగచెప్పే విజనరీకి కనువిప్పు కలిగిస్తూ గ్రేటర్ అంతా బీఆర్ఎస్కి జై కొట్టింది. ఇక పవన్కళ్యాణ్కొచ్చిన కష్టమైతే పగొళ్లకి కూడా రాకూడదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకవైపు డిపాజిట్లు పోయి బోరుమంటుంటే...మరోవైపు బర్రెలక్క పాటి విలువ లేదు ప్యాకేజీ స్టార్‌కి అంటూ మొదలైన పొలికలు జనసేనకి జ్వరం వచ్చేలా చేశాయంటున్నారు పొలిటికల్ ఎనలిస్ట్‌లు. సరే... ఏదో అనుకుంటే ఏదో అయింది. ఇక ఏపీ వైపు చూద్దామనుకునే లోపు...కథ మరో మలుపు తిరిగిందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెల్చుకున్న హిందీ బెల్ట్‌లోని మూడు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ ఊపు చూస్తుంటే.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీని సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అందుకే బీజేపీకి దగ్గర కావడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అవలంభించిన వైఖరితో.. బీజేపీ మరింతగా దూరం పెడుతోంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా పార్టీ ఓటు బ్యాంకుని కాంగ్రెస్ వైపు మళ్లించే చచ్చు వ్యూహానికి చంద్రబాబు పదును పెట్టారో.. ఇటు బీజేపీ కూడా ఓపెన్ అయిపోయింది. ఇప్పటి దాకా జనసేనతోనే పొత్తు అంటూ వచ్చిన బీజేపీ.. ఇప్పుడు "టీడీపీ కాంగ్రెస్‌తోనూ, ఇండియా కూటమిలోనూ ఉండొచ్చు. ఆ పార్టీతో మాకు సంబంధం ఏంటని" ఎదురు ప్రశ్నిస్తోంది. పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు అయ్యాక...ఇక ఆల్ ఈజ్ వెల్ అన్న భావనలోనే చంద్రబాబు వెళ్లిపోయారు. అటు పురంధేశ్వరి కూడా టీడీపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ పార్టీ క్యాడర్ని ఆశ్చర్యపరిచారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుని వెనకేసుకురావడం, చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్‌కి జాతీయ స్థాయి నేతల అపాయింట్మెంట్ ఇప్పించడం కోసం విశ్వప్రయత్నాలు చేయడం. ఇలా చాలానే చేశారు. చివరకు మీరు...మాకు అధ్యక్షురాలా ? టీడీపీకా అంటూ బీజేపీ నేతలు బహిరంగంగా పురంధేశ్వరిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. క్లుప్తంగా చెప్పాలంటే...పురంధేశ్వరి కూడా టీడీపీని బీజేపీకి దగ్గర చేయలేకపోయింది. తెలంగాణ ఎన్నికల తర్వాత టీడీపీ ఇండియా కూటమిలో చేరుతుందేమో అనే దాకా బీజేపీ నేతలొచ్చేశారు. మరోవైపు క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన మధ్య సాగుతోన్న వార్ ఎపిసోడ్స్ ఇటు చంద్రబాబులో, అటు పవన్‌కళ్యాణ్‌లో టెన్షన్ పెంచేస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల తర్వాత చంద్రబాబు-పవన్ భేటీ అయ్యారు. రోలు మద్దెలతో మొరపెట్టుకున్నట్టుగా ఈ భేటీని అభివర్ణిస్తున్నాయి రాజకీయ వర్గాలు. టీడీపీ ఎత్తుగడలు తెలంగాణలో చిత్తు అయ్యాయి. ఈ తరుణంలో డిపాజిట్లు కోల్పోయిన పవన్ తన కష్టాలు చెప్పుకుంటే...ఆయన ఓదార్చేదేం ఉంటుంది ? ఈ విషయం పక్కన పెడితే...ఈ రెండు పార్టీలకు ఇప్పుడు ఏపీలో...క్షేత్రస్థాయిలో క్యాడర్ నుంచి కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. క్యాడర్ కన్నా, పార్టీ కన్నా టీడీపీనే మిన్న అన్న సంకేతాలను పంపిన దత్తపుత్రుడు తీరుతో.. జనసైనికులు షాక్ అవుతున్నారట. జనసేన పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా...పట్టుమని పదిమంది లీడర్లు లేరు. క్షేత్రస్థాయిలో పార్టీకి బలం లేదు. పార్టీని బలోపేతం చేయడం పై కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఫోకస్ పెట్టలేదు. కేవలం చంద్రబాబు ఆదేశాల మేరకు, చంద్ర బాబుకి అవసరం అయినప్పుడు స్పందిస్తూ వచ్చారు పవన్‌కళ్యాణ్. బలమైన రాజకీయ నిర్మాణం లేకపోయినా...ఈ పదేళ్లు జనసేనని క్షేత్రస్థాయిలో మోస్తూ వచ్చిన వాళ్లంతా...తాము టీడీపీ ప్రయోజనాల కోసమే పనిచేయాలన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో.. రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన కలిసి చేసే రాజకీయానికి ఇటు క్యాడర్ నుంచి, అటు లీడర్స్ నుంచి ఎంత వరకు మద్దతు వస్తుందన్నది ప్రశ్నార్థకమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ.. టీడీపీకి ఈ దుస్థితి ఏమిటో? -
కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Live Updates.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ మంత్రులకు శాఖల కేటాయింపులపై చర్చ సమావేశంలో తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు థాకరే ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్.. కాసేపట్లో ఢిల్లీకి రేవంత్ సీఎం రేవంత్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, మిగతా బెర్తులపై అధిష్టానంతో రేవంత్ చర్చించనున్నారు. రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సెషన్ అసెంబ్లీలో మంత్రుల ప్రమాణ స్వీకారం. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష సమీక్షకు హాజరు కాని సీఎండీ ప్రభాకర్ రావు. సమావేశానికి రావాలని ఆదేశించినా హాజరు కాని ప్రభాకర్ రావు. విద్యుత్ శాఖలో ఇప్పటి వరకు రూ.85వేల కోట్ల అప్పులు ఉన్నాయన్న అధికారులు మహిళలకు ఉచిత ప్రయాణంపై సీఎం రేవంత్ సమీక్ష సమీక్షకు హాజరైన రవాణాశాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు మహిళలకు ఉచిత ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదల చేయనున్న ప్రభుత్వం. రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. విధివిధానాలను రూపొందించాలని అధికారులకు రేవంత్ ఆదేశం. ఆర్టీసీ పరిస్థితులు, ఆదాయం, వ్యయంపై సీఎం రేవంత్ ఆరా. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీపై రోజుకు రూ.4కోట్ల భారం పడే అవకాశం. ఆర్టీసీ బస్సుల్లో రోజూ 12-13 లక్షల మంది ప్రయాణం. ►కాసేపట్లో విద్యుత్ శాఖ, ఆర్టీసీపై సీఎం రేవంత్ సమీక్ష ►మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రివ్యూ. ►మహిళలకు ఉచిత ప్రయాణంపై నేడు మార్గదర్శకాలు. ►నిన్న తొలి కేబినెట్లోనే విద్యుత్ శాఖపై వాడీవేడి చర్చ ►నేడు సమీక్షకు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రెడ్డి హాజరుకావాలన్న సీఎం రేవంత్. ►ప్రజా దర్బార్ ముగించుకుని సెక్రటేరియట్ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి ►విద్యుత్ శాఖపై సెక్రటేరియట్లో రివ్యూ చేయనున్న సీఎం రేవంత్ ►సీఎం రేవంత్‌ను కలిసిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకులు ►జెన్కో ఏఈ నియామక పరీక్ష వాయిదా వేయాలని వినతి. ►సీఎం రేవంత్‌ను కలిసి సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలు. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన సీఎం రేవంత్. ప్రజా దర్బార్‌లో సీఎంను కలిసిన కొండపోచమ్మ ముంపు బాధితులు. ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని సీఎంకు వివరించిన బాధితులు. ►ఇక, ప్రజా దర్బార్‌కు ప్రత్యేక యంత్రాగం. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ ఫిర్యాదును పరిశీలించేందుకు 20 మంది సిబ్బంది. వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లకు, సంబంధిత శాఖ అధికారులకు సిఫార్స్ చేస్తున్న సీఎం రేవంత్. వచ్చిన ఫిర్యాదులపై మళ్లీ సమీక్ష చేయాలని నిర్ణయించుకున్న సీఎం రేవంత్. ప్రతీ నెల వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష. ►కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా దర్బార్ ప్రారంభమైంది. అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. ►జూబ్లీహిల్స్ నివాసం నుంచి జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌కు బయలు దేరిన సీఎం రేవంత్ రెడ్డి.. ►మరికాసేపట్లో ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్‌కు హాజరు కానున్న సీఎం రేవంత్ ►కాసేపట్లో ప్రజా దర్బార్.. ►ప్రజా దర్భార్‌లో కోసం భారీగా వచ్చిన ప్రజలు.. గడీల పాలన అంతం కోసం ఇనుప కంచెలను తొలగించి, జ్యోతిరావు పూలే ప్రజా భవన్ కు తెలంగాణ ప్రజలను ఆహ్వానించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. ప్రజా దర్బార్ లో తమ సమస్యలను విన్నవించుకునేందుకు ప్రజా భవన్ కు తరలివచ్చిన ప్రజలు.@revanth_anumula#PrajalaTelanganaSarkaar pic.twitter.com/quqLv4pKeT — Telangana Congress (@INCTelangana) December 8, 2023 తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిన్న(గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు. ఇదిలా ఉండగా.. నేడు, జ్యోతిరావు పూలే అంబేద్కర్ ప్రజా భవన్(ప్రగతి భవన్)లో నేటి నుంచి ప్రజా దర్బార్‌ను నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రజా దర్బర్ నిర్వహించనున్నారు. ఈ ప్రజాదర్బార్‌లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొననున్నారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ తొలి అడుగు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఎన్నికల సమయంలో రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక, విద్యుత్‌పై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. సెక్రటేరియట్లో విద్యుత్ శాఖపై మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేపట్టనున్నారు. సీఏండీ ప్రభాకర్ రావును రివ్యూకు అటెండ్ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సంస్థలో 85వేల కోట్ల అప్పులపై ఆరా తీయనున్నారు. నేడు సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మరోవైపు, విద్యుత్ సంక్షోభం సృష్టించే కుట్ర జరిగిందని తొలి క్యాబినెట్ సమావేశంలో వ్యాఖ్యానించిన సీఎం రేవంత్. అయితే, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. Praja Telangana - ప్రజల తెలంగాణ 10 గంటలకు ప్రజాభవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్. -- తమ వినతులతో ప్రజా భవన్ కు భారీగా చేరుకున్న ప్రజలు. Telangana Chief Minister Revanth Reddy Praja Darbar at Praja Bhavan at 10 o'clock. -- People reached the Praja… pic.twitter.com/aZUhEhzd43 — Congress for Telangana (@Congress4TS) December 8, 2023 -
యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్‌కు సర్జరీ
Updates.. కేసీఆర్ హెల్త్ బులెటిన్ మాజీ సీఎం కేసీఆర్‌కు ఎడమ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ శస్త్రచికిత్స నిర్వహించిన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్లు, అనస్థీషియాలజిస్టుల బృందం విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ ► యశోద ఆస్పత్రి డాక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స. ► మరికాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్న యశోద ఆస్పత్రి డాక్టర్లు ►యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్‌కు సర్జరీ ►కొద్దిసేపటి క్రితమే కేసీఆర్‌కు ప్రారంభమైన ఆపరేషన్ ►కేసీఆర్‌కు ఎడమ తుంటిలో ఫ్యాక్చర్ ►గత రాత్రి ఇంట్లో జారిపడ్డ కేసీఆర్ ►హుటాహుటిన రాత్రే ఆసుపత్రికి తరలించిన కుటుంబసభ్యులు ► యశోద ఆసుపత్రి నాలుగో ఫ్లోర్‌లోని ఆపరేషన్ థియేటర్‌కు కేసీఆర్‌ను షిఫ్ట్ చేస్తున్న వైద్యులు ► కాసేపట్లో ఎడమ కాలు తుంటికి శస్త్ర చికిత్స అందించనున్న యశోద వైద్యులు ► కాసేపట్లో కేసీఆర్‌కు సర్జరీ ►యశోద ఆసుపత్రి నాలుగో అంతస్తులో ఆపరేషన్ ► మాజీ సీఎం కేసీఆర్ సేవలు భవిష్యత్తులో తెలంగాణకు అవసరం: మురళీధర్ రావు బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ ► ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం ► క్రియాశీలక రాజకీయాల్లోకి కేసీఆర్ ఆరోగ్యంగా వస్తారని ఆశిస్తున్నాం. యశోద ఆసుపత్రిలో హరీశ్ రావు కామెంట్స్ కేసీఆర్ గారికి యశోద ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. హిప్ రీప్లేస్మెంట్ చేయాలని వైద్యులు సూచించారు. ఈరోజు సాయంత్రం సర్జరీ జరుగుతుంది. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండటంతో డాక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేసీఆర్ అభిమానులు ఎవరూ ఆసుపత్రి వద్దకు రావద్దు. సాయంత్రం సర్జరీ జరిగిన తర్వాత డాక్టర్లు హెల్త్ బెలిటెన్ను విడుదల చేస్తారు. కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించిన కేటీఆర్ ►కేటీఆర్‌లో ట్విట్టర్లో..‘బాత్రూంలో పడిపోవడంతో కేసీఆర్ గారికి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపుతున్న వారందరికీ ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేశారు. Sri KCR Garu needs to undergo a Hip Replacement Surgery today after he had a fall in his bathroom Thanks to all those who have been sending messages for his speedy recovery pic.twitter.com/PbLiucRUpi — KTR (@KTRBRS) December 8, 2023 మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ ఆరా.. ►యశోదా ఆసుపత్రి దగ్గర భద్రతను పెంచిన ప్రభుత్వం ►కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందించాలని సూచించిన రేవంత్ ►మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. ఎడమ తుంటి మార్పిడి చేయాలని ప్రకటించిన వైద్యులు కేసీఆర్ కి సిటి స్కాన్ చేసి ఎడమ తుంటి విరిగినట్టు గుర్తించిన వైద్యులు సిటీ స్కాన్లతో సహా, హిప్ ఫ్రాక్చర్ ఉన్నట్టు గుర్తించిన వైద్యులు. ఎడమ హిప్ రీప్లేస్మెంట్ అవసరమని సూచించిన వైద్యులు ఇలాంటి కేసుల్లో కోలుకునేందుకు ఆరు నుంచి ఎనిమది వారాల రెస్ట్ అవసరం ఆర్థోపెడిక్, అనస్థీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్‌తో సహా వైద్య బృందం అతన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సర్జరీ చేయనున్న వైద్యులు ►కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేసీఆర్ గారికి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. Distressed to know that former Telangana CM Shri KCR Garu has suffered an injury. I pray for his speedy recovery and good health. — Narendra Modi (@narendramodi) December 8, 2023 ►మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఈ సందర్బంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆరోగ్యశాఖ కార్యదర్శిని యశోద ఆసుపత్రికి పంపించారు సీఎం రేవంత్. ►తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయనకు చికిత్స కల్పించేందుకు హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ►గజ్వేల్ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో శుక్రవారం తెల్లవారుజాము 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైనట్లు సమాచారం. బాత్రూమ్లో కాలుజారి పడిపోవడంతో ఆయన ఎడమ కాలి తుంటికి గాయాలైనట్లు తెలిసింది. తుంటికి రెండు చోట్ల గాయమైనట్టు వైద్యులు తెలిపారు. దీంతో, తుంటి భాగంగాలో స్టీల్ ప్లేట్ వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ►కాగా, ప్రమాదంలో తుంటి బాల్ డ్యామేజీ అయినట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతో, ఆయనను సోమాజిగూడలోని యశోదకు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈరోజు సాయంత్రం మైనర్ సర్జరీ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
రేపటి నుంచే ఆర్టీసీ బస్సుల్లో..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ప్రధానమైన ఆరు గ్యారంటీలలో రెండింటిని సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా శనివారం నుంచే (ఈనెల 9) అమల్లోకి తేవాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో దీనికి పచ్చజెండా ఊపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల పరిమితిని రూ.10 లక్షలకు పెంచే హామీల అమలుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షించి, దశలవారీగా పకడ్బందీగా ఆరు గ్యారంటీలను అమలు చేయాలని ఆలోచనకు వచ్చారు. ఈ భేటీ అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రులు దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. ఆరు గ్యారంటీలపై సుదీర్ఘ చర్చ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలపై కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్టు మంత్రులు తెలిపారు. ఈ హామీలను దశలవారీగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని తీర్మానించినట్టు వివరించారు. ఆరు గ్యారంటీలతోపాటు ప్రజలకు ఇచ్చిన ఇతర హామీలను ఐదేళ్లలోగా నెరవేర్చడమే తమ ప్రభుత్వ కర్తవ్యమన్నారు. ముందుగా ఈ నెల 9వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆధార్, రేషన్‌కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని బస్సుల్లో వెళ్లవచ్చని తెలిపారు. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా చర్చ జరిగిందని మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ‘‘2014 నుంచి గురువారం (డిసెంబర్ 7వ తేదీ) వరకు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఏయే ప్రభుత్వ విభాగాలు ఎంత ఖర్చు చేశాయి? దేని కోసం, ఏం ప్రయోజనాల కోసం ఖర్చు చేశాయి? ఆ ఖర్చులతో ఒనగూరిన ప్రయోజనాలేమిటన్న అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు వివరాలు అందజేయాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన ఖర్చు, చేకూరిన ప్రయోజనాలు తెలంగాణ ప్రజలందరికీ తెలియజేసేలా అన్ని వివరాలు కావాలని అధికారులను ఆదేశించారు’’ అని మంత్రులు వివరించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి, గ్యారంటీల అమలుకు అవసరమైన ఆర్థిక వనరులను సేకరించి హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్టు తెలిపారు. గ్రూప్–1, 2 పరీక్షల అంశంపైనా కేబినెట్ చర్చించినట్టు వివరించారు. నేడు విద్యుత్ అధికారులతో సమావేశం రాష్ట్రంలో రైతులకు, పరిశ్రమలకు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ అందించాలని మంత్రివర్గం సమావేశంలో తీర్మానించినట్టు మంత్రులు వెల్లడించారు. ఈ క్రమంలో 2014 నుంచి ఇప్పటివరకు విద్యుత్ అంశానికి సంబంధించి చోటు చేసుకున్న తప్పుడు నిర్ణయాలపై చర్చించామని, ఆయా అంశాల్లో అధికారుల వివరణ కోరామని తె లిపారు. శుక్రవారం విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి, అధి కారులతో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు వివరించారు. గత పదేళ్లలో విద్యుత్‌కు సంబంధించి అనేక అంశాల్లో తప్పులు జరిగాయని, వాటిని స మీక్షించి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై తగిన నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా అమలుపైనా చర్చించనున్నట్టు వెల్లడించారు. 9న కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కొత్త శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని 9వ తేదీన చేపట్టాలని కేబినెట్ భేటీలో నిర్ణయించినట్టు మంత్రులు తెలిపారు. ఇందుకోసం అసెంబ్లీలో సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకోవడం జరుగుతుందని.. తర్వాత స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం తదితర కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. పూర్తి స్థాయి కేబినెట్ కూర్పుపై సీఎం, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. రెవెన్యూ గ్రామంగా జయశంకర్ ఊరు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ప్రకటించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి గురువారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం అక్కంపేట గ్రామం పెద్దాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి గ్రామం–బి లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద స్మృతి వనం సుందరీకరణ, అభివృద్ధి కోసం ఎకరం భూమి కేటాయిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనులను వెంటనే చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. -
జీవన్‌రెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు
ఆర్మూర్: అధికారం చేజారగానే బీఆర్ఎస్కు చెందిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు ఏకకా లంలో బకాయిల వసూ లుకు చర్యలు ప్రారంభిస్తూ షాక్ ఇచ్చారు. పూర్వా పరాలిలా.. ఆర్మూర్ పట్టణంలోని టీఎస్ ఆర్టీసీ స్థలాన్ని జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డి తాను మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న విష్ణుజిత్ ఇన్‌ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట లీజ్‌కు తీసుకుని మాల్ అండ్ మల్టిప్లెక్స్ పేరిట 5 అంతస్తుల భారీ షాపింగ్ మాల్ నిర్మించారు. గతేడాది దసరా రోజున ప్రారంభించిన ఈ మాల్లో రిలయన్స్ స్మార్ట్, ట్రెండ్స్, ఎలక్ట్రానిక్స్, కేఎఫ్‌సీ, పీవీఆర్ సినిమా హాళ్లకు అద్దెకు ఇచ్చారు. మొన్నటి వరకు జీవన్‌రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఈ మాల్ అద్దె బకా యిలు వసూలు చేయడంలో ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో విష్ణుజిత్ ఇన్‌ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ .. ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె 7 కోట్ల 23 లక్షల 71 వేల 807 రూపాయలు, విద్యుత్‌కు సంబంధించి ట్రాన్స్‌కోకు 2 కోట్ల 57 లక్షల 20 వేల 2 రూపాయలు బకాయిలుగా పేరుకుపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో, నియోజకవర్గంలో అధికార మార్పు జరగగానే ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు ఈ బకాయిల వసూళ్లకు నడుం బిగించారు. మూడు రోజుల్లో చెల్లించాలి ఆర్టీసీ నిజామాబాద్ ఆర్ఎం జానీరెడ్డి, ఆర్మూర్ డిపో ఇన్చార్జి మేనేజర్ పృథ్వీరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన పోలీసు అధికారులు తోడు రాగా జీవన్ మాల్లో గురువారం హెచ్చరికలు జారీ చేసారు. మూడు రోజుల్లో లీజుదారులు అద్దె బకాయిలు చెల్లించని పక్షంలో మల్టీప్లెక్స్‌ను సీజ్ చేస్తామంటూ మైక్‌లో హెచ్చరించారు. మరో వైపు ట్రాన్స్‌కో ఆర్మూర్ ఏడీఈ శ్రీధర్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో అధికారులు సైతం మూడు రోజుల్లో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో షాపింగ్ మాల్‌కు జనరేటర్లతో విద్యుత్ సరఫరా చేస్తున్నారు.