Travel
-
గూగుల్‌లో ఎక్కువగా వెతికిన పర్యాటక ప్రాంతాలివే
ప్రస్తుతమున్న రోజుల్లో గూగుల్ వాడకం బాగా పెరిగింది. ఎలాంటి సందేహాలు ఉన్నా క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. 2023కి త్వరలోనే ఎండ్‌కార్డ్ పడనుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఎక్కువగా వెతికిన ట్రావెల్ డెస్టినేషన్ లిస్ట్‌ను గూగుల్ రిలీజ్ చేసింది. మరి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్రాంతాలేంటి? టాప్ 10 లిస్ట్ ఏంటన్నది చూసేద్దాం. వియత్నాం గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్రాంతాల్లో వియత్నాం మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడి ప్రకృతి సోయగాలు,బీచ్‌లు,రుచికరమైన ఆహారం, చారిత్రక అంశాలతో మనసు దోచే ఈ ప్రాంతం టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తోంది. నవంబర్ నుంచి ఏప్రిల్ సీజన్లో వియత్నంలో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గుహకు నిలయమైన సోన్డూంగ్, ఫోంగ్ న్హా-కే బ్యాంగ్ నేషనల్ పార్క్, హాలాంగ్ బే, న్హా ట్రాంగ్, కాన్ దావో, ఫు క్వాక్, హోయ్ యాన్,నిన్ బిన్ ఇక్కడ తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలు. View this post on Instagram A post shared by Vietnam 🇻🇳 Travel | Hotels | Food | Tips (@vietnamtravelers) గోవా 2023లో మోస్ట్ సెర్చ్డ్ డెస్టినేషన్స్‌లో భారత్‌లోని గోవా రెండో స్థానంలో నిలవడం విశేషం. బీచ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన గోవా ట్రిప్ యూత్‌ను అట్రాక్ట్ చేస్తుంటుంది. ఇక్కడి బీచ్‌లు, చర్చ్‌లు, పచ్చదనం సహా ఎన్నో అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి. ప్రకృతి ప్రేమికుల కోసం సలీం అలీ బర్డ్ శాంక్చురీ,దూద్‌సాగర్ జలపాతాలు, బామ్ జీసస్, సే కేథడ్రల్ చర్చిలు, బోమ్ జీసస్ బసిలికా, ఫోర్ట్ అగ్వాడా ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు. బాలి భూతల స్వరంగా పిలిచే బాలి ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రాంతాల్లో మూడో స్థానంలో ఉంది. ఇండోనేషియాలోని జావా, లాంబాక్ దీవుల మధ్య లో బాలి దీవి ఉంటుంది. 17 వేల దీవులు ఉన్న ఇండోనేషియాలో బాలి ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలిఉస్తుంది. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. అందుకే బాలిని దేవతల నివాసంగా పిలుస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి ఈ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. సేక్రెడ్ మంకీ ఫారెస్ట్, ఉబుద్ ప్యాలెస్,ఉలువతు ఆలయం, లొవియానా వంటి ప్రాంతాలు ఇక్కడ అస్సలు మిస్ కావొద్దు. చదవండి: 2023లో గూగుల్‌లో అత్యధికంగా ఏ ఫుడ్ కోసం వెతికారో తెలుసా? View this post on Instagram A post shared by Bali - The Island of the Gods (@bali) శ్రీలంక గూగుల్ సెర్చ్‌లో ఈ ఏడాది ఎక్కువగా వెతికిన ట్రావెల్ డెస్టినేషన్‌లో శ్రీలంక నాలుగో స్థానంలో నిలిచింది.అందమైన ద్వీప దేశాల్లో శ్రీలంక ఒకటని చెప్పుకోవచ్చు. పురాతన శిథిలాలు, దేవాలయాలు, అందైన బీచ్‌లు, తేయకు తోటలు.. ఇలా ఎన్నో పేరుగాంచిన పర్యాటక ప్రదేశాలు శ్రీలంకలో ఉన్నాయి. ఇక్కడ సిగిరియా రాక్ ఫారెస్ట్,యాలా నేషనల్ పార్క్,మిరిస్సా బీచ్,ఎల్లా హిల్ స్టేషన్, బౌద్ధ దేవాలయం, డచ్ స్టైల్లో నిర్మించిన ఇళ్లు, హెరిటేజ్ మ్యూజియంలు, రెయిన్ ఫారెస్ట్లు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. థాయ్‌లాండ్ అందమైన ప్రకృతికి థాయ్‌లాండ్ పెట్టింది పేరు. ల్యాండ్ ఆఫ్ స్మైల్స్‌గా దీనికి పేరుంది. ఇక్కడ దట్టమైన అడవులు, థాయిలాండ్ ఫుకెట్, కో ఫై ఫై, క్రాబీ, కో స్యామ్యూయ్ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. థాయ్ టూర్లో ప్రత్యేకత బ్యాంకాక్‌లో ఉన్న ఎమరాల్డ్ బౌద్ధ ఆలయం. అంతేకాకుండా ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా టూరిస్టులను అట్రాక్ట్ చేస్తాయి. వీటితో పాటు కశ్మీర్, కూర్గ్, అండమాన్ నికోబార్ దీవులు,ఇటలీ, స్విట్జర్లాండ్ కూడా టాప్-10 డెస్టినేషన్ లిస్ట్‌లో ఉన్నాయని గూగుల్ వెల్లడించింది. -
వీసా లేకుండానే భారతీయులు ఈ దేశాలకు వెళ్లి రావొచ్చు
ట్రావెలింగ్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలితో కలిసి ఇష్టమైన ప్రాంతాలను చుట్టేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. పని ఒత్తిడితో విసిగిపోయి ఉన్న వారికి ఈ విహార యాత్రలు, ప్రయాణాలు ఎంతో ఊరట కలిగిస్తాయి. మన దేశంలో అయితే ఏ ప్రాంతానికి అయినా వెళ్లొచ్చు కానీ విదేశాలకు వెళ్లాలంటే మాత్రం వీసా ఉండాల్సిందే. అయితే వీసాతో పని లేకుండా భారతీయులను మా దేశానికి రండి అంటూ ఆహ్వానం పలుకున్నాయి కొన్ని దేశాలు. అవేంటో చూసేయండి. మలేషియా ఎంత చూసినా తనివి తీరని భౌగోళిక సౌందర్యం మలేషియా. పచ్చని అడవులు, అందమైన ద్వీపాలు,అడవులు.. ఇలా ఎంతో అందమైన పర్యాటక ప్రదేశంగా మలేషియాకు పేరుంది. ఇకపై అక్కడికి వెళ్లాలంటే వీసా అవసరం లేదు. సుమారు 30 రోజుల పాటు అక్కడ సేద తీరవచ్చు. బొలీవియా: ఇక్కడ సముద్రంలో ఉప్పు తయారీ, రంగురంగుల కొండలు తదితర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది. సమోవా: దీనిని 'కార్డెల్ ఆఫ్ పాలినేషియా' అని కూడా పిలుస్తారు, సమోవా అనేది ఉత్కంఠభరితమైన ద్వీపాల సమూహం. ఈ ద్వీప దేశానికి వెళ్లడానికి భారతీయులకు వీసా అవసరం లేదు. శ్రీలంక: భారతీయులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు ఇటీవలె శ్రీలంక అనుమతి ఇచ్చింది. కెన్యా: సముద్రంలో ఉప్పు తయారీ, రంగురంగుల కొండలు తదితర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది. మారిషస్: భారతీయులకు అతి గొప్ప ఆతిథ్యమిచ్చే ఆహ్లాదకరమైన దేశాల్లో మారిషస్ ఒకటి. అందమైన బీచ్‌లు, అడ్వెంచర్లు ఎన్నో ఉన్న ఈ దేశానికి మీకు వీసా అవసరం లేదు. మారిషస్‌ను వీసా లేకుండా, మీరు గరిష్టంగా 90 రోజులు పర్యటించవచ్చు. ఫిజీ: అందమైన దృశ్యాలు, పగడాలు, దీవులకు పెట్టింది పేరు ఫిజీ దేశం. ఈ దేశానికి భారతీయ పర్యాటకుల ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వీసా లేకుండా 120 రోజులు అంటే సుమారు నాలుగు నెలలు హాయిగా గడపొచ్చు. భూటాన్: భారతదేశానికి అత్యంత సమీపంలో, పొరుగు దేశంగా ఉన్న భూటాన్‌కు మీరు వీసా లేకుండానే వెళ్లవచ్చు. ఇది ప్రపంచంలోని సంతోషకరమైన దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.రోడ్డు, విమానం, రైలు ద్వారా కూడా భూటాన్ చేరుకోవచ్చు. బార్బడోస్: బార్బడోస్ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు.ప్రశాంతమైన దీవుల్లో సెలవులను గడపాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్. కాస్ట్లీ హోటళ్లు, తీర ప్రాంతాలు ఇక్కడి స్పెషల్. భారతీయ పౌరులు బార్బడోస్ సందర్శించడానికి వీసా అవసరం లేదు. మీరు ఇక్కడ వీసా లేకుండా 90 రోజుల వరకు గడపవచ్చు. వీటితో పాటు జమైకా, కజికిస్తాన్, ఇండోనేషియా,టాంజానియా, జోర్డాన్,లావోస్ కాంబోడియా,వంటి దేశాలకు కూడా వీసా లేకుండా చుట్టిరావొచ్చు. -
ప్రయాణ పాఠాలతో.. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న యువకుడు!
ప్రయాణ ప్రేమికుడైన అనునయ్ సూద్ 30 దేశాల వరకు వెళ్లివచ్చాడు. చిన్న వయసులోనే ట్రావెలింగ్ అండ్ ఫోటోగ్రఫీ రంగంలో పెద్ద పేరు తెచ్చుకున్నాడు నోయిడాకు చెందిన అనునయ్ సూద్. వ్లోగ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్‌తో సోషల్ మీడియాలో పాపులర్ అయిన అనునయ్ సూద్ ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్గా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్లు అందుకున్నాడు. ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్గా స్విట్జర్లాండ్ టూరిజం, విజిట్ సౌదీ, న్యూజిలాండ్ టూరిజం... మొదలైన సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు... ‘నాకు ట్రావెలింగ్ అంటే ఎందుకు ఇష్టం అంటే ట్రావెల్ చేయకుండా ఉండలేను కాబట్టి’ నవ్వుతూ అంటాడు అనునయ్ సూద్. ఇంజినీరింగ్ చేసిన అనునయ్ కొంత కాలం ఉద్యోగం చేశాడు. జీతం రాగానే ఆ బడ్జెట్లో ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేసేవాడు. ప్రయాణ మాధుర్యాన్ని మరింతగా ఆస్వాదించడానికి ఉద్యోగానికి రాజీనామా చేసి ఫ్లెక్సిబుల్ ప్రాజెక్ట్స్‌లో పనిచేశాడు. సాహసకృత్యాలను ఇష్టపడే వారి కోసం ట్రెక్ ఆర్గనైజింగ్ కమ్యూనిటీని స్టార్ట్ చేశాడు. ఈ కమ్యూనిటీలో గైడ్, టీమ్ లీడర్‌గా వ్యవహరించాడు. అనునయ్ ప్రతి ప్రయాణాన్ని కొత్త జీవితంతో పోల్చుతాడు. ప్రయాణ జ్ఞాపకాలను ఛాయాచిత్రాలలో భద్రపరిచే క్రమంలో ట్రావెల్ ఫొటోగ్రఫీలో కూడా నైపుణ్యం సాధించాడు. ట్రావెలింగ్, ఫొటోగ్రఫీపై ఉన్న ఇష్టాన్ని మిళితం చేసి డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా విజయం సాధించాడు. ఆ తరువాత ‘మెటా–సోషల్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాడు. ‘మెటా–సోషల్’ అనేది పెర్ఫార్మెన్స్ అండ్ మార్కెటింగ్ సొల్యూషన్ కంపెనీ. ‘ట్రావెలింగ్‌పై నాకు ఉన్న ఇష్టాన్ని కమర్షియలైజ్ చేసుకోవాలనుకోలేదు’ అంటున్న అనునయ్ ‘ప్రాజెక్ట్ ఘర్’ పేరుతో హోమ్‌స్టే సర్వీస్ వెంచర్‌ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటి వరకు 30 దేశాల వరకు వెళ్లి వచ్చిన అనునయ్ ‘ఫొటోగ్రఫీ విజన్, ట్రావెలింగ్‌పై ఫ్యాషన్ ఉంటే సాధారణ ప్రదేశాల నుంచి కూడా అసాధారణ అందాలను వీక్షించవచ్చు. ట్రావెల్ ఫొటోగ్రఫీపై మనకు విజన్ ఉంటే ఖరీదైన కెమెరాలతో పనిలేదు’ అంటున్నాడు అనునయ్ సూద్. కొత్తదారులలో... ప్రయాణ క్రమంలో ప్రకృతి నుంచి, సామాజిక బృందాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఎన్నో ఉంటాయి. దృష్టి విశాలం కావడానికి, చురుగ్గా ఉండడానికి, సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రయాణాలు ఉపయోగపడతాయి. కొత్త దారులు కొత్త ఆలోచనలకు దారి తీస్తాయి. – అనునయ్ సూద్ (చదవండి: ఇదు శ్రీలంక: చుక్ చుక్ చుక్... నాను వోయా టూ ఎల్లా !) -
హైదరాబాద్‌లో అడ్వెంచర్స్.. వీకెండ్లో చిల్ అవ్వండి
హైదరాబాద్‌లో అంటేనే నోరూరించే కమ్మని వంటకాలు, అనేక పర్యాటక ప్రదేశాలకు ఫేమస్. వీకెండ్ వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి వచ్చి రిలాక్స్ అవుతుంటారు. అడ్వెంచర్ యాక్టివిటిస్కి కూడా హైదరాబాద్ అడ్డాగా మారుతుంది. ఒకప్పుడు పారాగ్లైడింగ్ అంటే గోవా, బెంగళూరు వంటి ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ వేదికగా ఎన్నో అడ్వెంచర్ స్పాట్స్, అది కూడా తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చేశాయి. అవేంటో తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే. బంగీ జంపింగ్ లైఫ్‌లో ఒక్కసారైనా బంగీ జంపింగ్‌ను ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొండలు, బ్రిడ్జి వంటి ఎత్తైన ప్రదేశాల నుంచి తాళ్లతో శరీరాన్ని కట్టుకొని కిందకు దూకండి చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. బంగీజంపింగ్ చేయాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ అడ్వెంచర్ యాక్టివిటి కోసం మన హైదరాబాద్‌లోనే చాలా ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. వాటిలో రామోజీ ఫిల్మ్ సిటీ,లియోనియా రిసార్ట్, డిస్ట్రిక్ గ్రావిటి పార్క్ వంటి ప్రాంతాల్లో అందుబాలో ఉంది. దీని ధర సుమారు రూ.3500 నుంచి 4500 వరకు ఉంటుంది. 12 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వ్యక్తులు ఎవరైనా బంగీ జంప్ చేయొచ్చు. దీనికోసం ముందుగానే బీపీ, హార్ట్‌రేట్ వంటివి చెక్ చేస్తారు. ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తులకే బంగీ జంపింగ్ అనుమతిస్తారు. పారాగ్లైడింగ్ రెక్కలు కట్టుకొని ఆకాశలో ఎగురుతూ భూమిపై ఉన్న ప్రకృతి అందాలను చూడాలంటే పారాగ్లైడింగ్ బెస్ట్ ఛాయిస్.ఆకాశంలో పక్షలతో పోటీ పడి ఎగురుతూ భూమి పై అందాలను ఆస్వాదించవచ్చు. అయితే పారాగ్లైడింగ్ అన్ని చోట్ల వీలు పడదు. ఇందుకు కొంత ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులతో పాటు వాతావరణం కూడా అనుకూలించాలి. హైదరాబాద్‌లో కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర్లో అందుబాటులో ఉంది. ధర రూ.3500 జిప్‌లైన్ చాలా ప్రాంతాల్లో జిప్‌లైన్ కోసం 50 మీటర్ల నుంచి ఎత్తులో బ్యూటిఫుల్ నేచర్‌ను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. హైదరాబాద్‌లో శామీర్‌పేట్‌లోని డిస్ట్రిక్ట్ గ్రావిటీ అడ్వెంచర్ పార్క్, ఎక్సోటికా బొటిక్ రిసార్ట్ వంటి ప్రాంతాల్లో జిప్‌లైన్ యాక్టివిటి అందుబాలో ఉంటుంది. ధర రూ. 700-1000 వరకు ఉంటుంది. వీకెండ్స్‌లో ధర మారుతుంది) స్కై డైవింగ్ ఎత్తుగా ఉండే ప్రాంతాల నుంచి గాల్లోకి దూకే సాహసక్రీడను స్కై డైవింగ్ అంటారు. వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం నుంచి ఒక్కసారిగా కిందికి దూకుతూ చేసే స్కై డైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇండోర్‌లో కూడా పొందచ్చు. అది ఎక్కడంటే..గండిపేట సమీపంలో గ్రావిటీజిప్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో ఈ ఇండోర్ స్కై డైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందిచ్చు. ఇందుకోసం ఇండోర్ స్కైడైవింగ్ కోసం 23 అడుగుల ఎత్తుతో ప్రత్యేక సిలిండర్ రూపొందించారు. ధర సుమారు రూ. 3300 నుంచి 4300 వరకు ఉంటుంది. (వీకెండ్స్‌లో ధర మారుతుంటుంది) ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ కోసం సిటీలో చాలా ప్రాంతాలు ఉన్నా అనంతగిరి హిల్స్ బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. వీకెండ్ వస్తే చాలు ఇక్కడికి ఫ్రెండ్స్‌తో ఎక్కువగా హైదరబాదీలో ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు. ఇందుకోసం రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. క్లౌడ్ డైనింగ్ సాధారణంగా రెస్టారెంట్లో ఎవరైనా భోజనం చేస్తారు. కానీ ఆకాశానికి, భూమికి మధ్యలో ఎత్తైన ప్రదేశంలో భోజనం చేస్తే ఆ ఫీలింగే వరే. గాల్లోకి ఎగిరిపోయి అక్కడి నుంచి కిందకు చూస్తూ భోజనం చేస్తే ఆ థ్రిల్లింగ్ చెప్పక్కర్లేదు. ఇండియాలోనే మొట్టమొదటిసారి ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొందాలంటే హైదరాబాద్‌లోని క్లౌడ్ డైనింగ్‌కు వెళ్లాల్సిందే. ఇది హైటెక్ సిటీ సమీపంలో ఉంటుంది. ఈ క్లౌడ్ డైనింగ్.. భూమికి 160 ఎత్తుల అడుగులో ఉంటుంది. దాదాపు అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ భోజనం చేయాలంటే.. రూ.5,000 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. -
ఇదు శ్రీలంక: చుక్ చుక్ చుక్... నాను వోయా టూ ఎల్లా !
శ్రీలంకకు వాయుమార్గం, జలమార్గాల్లో వెళ్లవచ్చు. అక్కడి రోడ్లు నల్లగా నున్నగా మెరుస్తూ ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ద్రవ్యోల్బణంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన దేశ ఇదేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. విమాన ప్రయాణం, పడవ ప్రయాణం, రోడ్డు ప్రయాణం తర్వాత మిగిలింది రైలు ప్రయాణమే. శ్రీలంక ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే ట్రైన్లో ప్రయాణించాల్సిందే. గంటకు పాతిక కిమీమీటర్ల వేగంతో ప్రయాణించే టాయ్ ట్రైన్ జర్నీ ఆద్యతం అలరించడమే కాదు, ఆ దారిలో వచ్చే చిన్న చిన్న గ్రామాలు స్థానికుల సౌకర్యాలతో కూడిన నిరాడంబరమైన జీవనశైలిని కళ్లకు కడుతుంది. బౌద్ధ ప్రాశస్త్య్రాల పర్యటనలో భాగంగా తెలంగాణ నుంచి వెళ్లిన మా మహిళా విలేకరులమందరం ‘నాను వోయా’లో టాయ్ ట్రైన్ ఎక్కాం. పిల్లలతో ప్రయాణం టాయ్ ట్రైన్లో ఫస్ట్ క్లాస్ టికెట్లకు డిమాండ్ ఎక్కువ. ముందుగా రిజర్వ్ చేసుకోవాలి. మిగతా తరగతులు కూడా రద్దీగా ఉంటాయి. మేము వెళ్లిన రోజు ఒక స్కూల్ నుంచి దాదాపుగా డెబ్బై మంది పిల్లలు మాతో ప్రయాణించారు. వాళ్లు జురాసిక్ పార్క్ సినిమా చూడడానికి వెళ్తున్నారు. ‘ఎల్లా’ కంటే ముందు ఒక స్టేషన్లో దిగేశారు. ఆ పిల్లల పేర్లన్నీ భారతీయతతో ముడిపడినవే. సంస్కృత ద్రవిడ సమ్మేళనంగా ఉన్నాయి. అయితే నకారాంతాలుగా లేవు, అన్నీ అకారాంతాలే. పిల్లల స్కూల్ డ్రస్ మీద వాళ్ల పేర్లు కూడా ఎంబ్రాయిడరీ చేసి ఉన్నాయి. వాటిని మనసులో చదువుకుని పైకి పలుకుతుంటే ఏదో సొగసుదనం ఉంది. పిల్లలు చక్కటి ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు. రైలు ప్రయాణించే దారిలో వచ్చే స్టేషన్ల పేర్లను మేము తడుముకుంటూ చదువుతుంటే మా ఉచ్చారణను సరిదిద్దుతూ మా ప్రయాణానికి మరింత సంతోషాన్నద్దారా పిల్లలు. మబ్బుల్లో విహారం నాను వోయా స్టేషన్ క్యాండీ నగరానికి 70 కిమీల దూరంలో, నువారా ఎలియాకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిల్స్టేషన్ల మధ్య సాగే ప్రయాణం అది. దట్టంగా విస్తరించిన అడవుల మధ్య టక్‌టక్‌మని శబ్దం చేస్తూ వెళ్తుంది రైలు. ఆకాశాన్ని తాకడానికి పోటీ పడి పెరిగినట్లున్న వృక్షాల తలలను చూడడానికి తల వంచిన కిటికీలో నుంచి పైకి చూసే ప్రయత్నం అయితే చేస్తాం, కానీ మనకు మొదళ్లు కనిపించిన వృక్షాల తలలను చూడలేం. లోయలో నుంచి పెరిగి వచ్చిన వృక్షాల తలలను మాత్రమే చూడగలం. పచ్చటి ప్రకృతి చిత్రం చూస్తూ ఉండగానే మసకబారుతుంది. ఏంటా అని పరికించి చూస్తే మందపాటి మబ్బు ప్రయాణిస్తూ ఉంటుంది. రైలును తాకుతూ వెళ్లే మబ్బు కిటికీ లో నుంచి దూరి మనల్ని చల్లగా తాకి పలకరిస్తుంది. ఈ దారిలో కొండల మధ్య జలపాతాలు కూడా ఎక్కువే. జలపాతం సవ్వడి వినిపించనంత దూరంలో కనువిందు చేస్తుంటాయి. హాయ్ హాయ్‌గా... రైలు అర్ధచంద్రాకారపు మలుపుల్లో ప్రయాణించేటప్పుడు కిటికీలో నుంచి బయటకు చూస్తే లెక్కలేనన్ని చేతులు స్మార్ట్ ఫోన్లు, హ్యాండీకామ్‌లతో ఫొటో షూట్ చేస్తూ కనిపిస్తాయి. ఈ రైల్లో స్థానికులు వారి అవసరార్థం ప్రయాణిస్తారు. పర్యాటకులు ప్రకృతి పరవశం కోసమే ప్రయాణిస్తారు. ప్రతి విషయాన్ని స్వయంగా ఎక్స్పీరియన్స్ చేయాలనే పాశ్చాత్య పర్యాటకులు ఈ రైల్లో ఎక్కువగా కనిపిస్తారు. వాళ్లు ముందుగానే ఫస్ట్ క్లాస్‌లో బుక్ చేసుకుంటారు. కొండలను కలుపుతూ వేసిన వంతెనలు, కొండను తొలిచిన సొరంగాల మధ్య సాగే ఈ ప్రయాణం మన తెలుగు రాష్ట్రంలో విశాఖ– అరకు ప్రయాణాన్ని, ఊటీ టాయ్ ట్రైన్ జర్నీని తలపిస్తుంది. బ్రిటిష్ పాలకులు నిర్మించిన రైలు మార్గం ఇది. అప్పటి నుంచి నిరంతరాయంగా నడుస్తూనే ఉంది. పర్యాటకులు త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరపాటులో చేసే ప్రయాణం కాదిది. దృష్టి మరలిస్తే చూడాల్సిన వాటిలో ఏం మిస్సవుతామోనన్నంత ఉత్సుకతతో సాగే ప్రయాణం. మన స్టేషన్ త్వరగా రావాలని కూడా ఉండదు. రైల్లో ఒక బోగీలో వాళ్లకు మరో బోగీలో ఉన్న వాళ్లు ‘హాయ్’ చెప్పుకుంటూ చిన్న పిల్లల్లా కేరింతలు కొడుతూ ప్రయాణిస్తారు. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: రావణ్ ఫాల్స్... ఎల్లా!) -
ఇదు శ్రీలంక: రావణ్ ఫాల్స్... ఎల్లా!
శ్రీలంకలో హిందూమహాసముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఉంది ఈ జలపాతం. దట్టమైన అడవుల మధ్యలో ప్రవహించిన నీటిపాయలు వంద అడుగుల కిందనున్న భూభాగం మీదకు అలవోకగా జారిపడుతూ ఉంటుంది. శ్రీలంక పర్యాటక ప్రాధాన్యం గల దేశం కావడంతో ప్రతి ప్రకృతి సౌందర్యాన్ని పర్యాటకులకు అనువుగా మలుచుకుంటుంది. పర్యాటకులు జలపాతాన్ని వీక్షించడానికి, జలపాతం బ్యాక్‌డ్రాప్‌లో ఫొటో తీసుకోవడానికి వీలుగా వాటర్‌ఫాల్స్ దగ్గర చక్కటి ప్లాట్పామ్ ఉంది. రావణుడి గుహలు రావణ్ జలపాతం... ఎల్లా అనే చిన్న పట్టణానికి దగ్గరగా, ఎల్లా రైల్వేస్టేషన్‌కి ఆరు కిలోమీటర్ల దూరాన ఉంది. దాంతో ఈ జలపాతానికి రావణ్ ఎల్లా అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. ఈ జలపాతం వెనుకవైపు గుహలున్నాయి. రావణాసురుడు... సీతాదేవిని అపహరించిన తర్వాత కొంతకాలం ఈ గుహల్లో దాచి ఉంచాడని, అందుకే ఈ గుహలకు రావణుడి గుహలనే పేరు వచ్చిందని చెబుతారు. సముద్రమట్టానికి నాలుగున్నర వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుహల్లోకి వెళ్లడానికి వెడల్పాటి మెట్లు, మెట్ల మధ్యలో రెయిలింగ్ వంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ గుహలకు ఏడు కిలోమీటర్ల దూరాన బందరవేలా గుహలున్నాయి. పాతిక వేల ఏళ్ల కిందట ఆ గుహల్లో మనుషులు జీవించినట్లు ఆధారాలు దొరికాయి. ట్రెకింగ్ ఆసక్తి ఉన్న వాళ్లు ఈ ప్రదేశాల కోసం రెండు రోజులు ఉండేటట్లు టూర్ ప్లాన్ వేసుకోవాలి. జ్ఞాపికలే పెద్ద వ్యాపారం శ్రీలంకలో ప్రతి టూరిస్ట్ పాయింట్ దగ్గర సావనీర్ షాప్లుంటాయి. చిన్నదో పెద్దదో కనీసం ఒక్క స్టాల్ అయినా ఉంటుంది. డిజైనర్ దుస్తుల నుంచి శ్రీలంక గుర్తుగా తెచ్చుకోవడానికి జ్ఞాపికలు కూడా ఉంటాయి. పర్యాటకులు తమ టూర్ గుర్తుగా దాచుకోవడానికి, అలాగే స్నేహితులు, బంధువుల కోసం కూడా సావనీర్లను ఎక్కువగా కొంటారు. ప్రైస్ ట్యాగ్ చూడగానే భయం వేస్తుంది. కానీ శ్రీలంక రూపాయలను మన రూపాయల్లోకి మార్చుకున్నప్పుడు ధరలు మరీ ప్రియం అనిపించవు. మరో సౌకర్యం ఏమిటంటే షాపుల్లో మన కరెన్సీ కూడా తీసుకుంటారు. దుస్తుల విషయానికి వస్తే... ఫ్లోర్ లెంగ్త్ ఫ్రాక్‌ల వంటి మోడరన్ దుస్తులు బాగుంటాయి. కానీ కొలతలు భారతీయులకు అమరవు. పాశ్చాత్యుల పొడవుకు తగినట్లుంటాయి. శ్రీలంక వాసులు కూడా పొడవుగా, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి వారికీ చక్కగా అమరుతాయి. ఇక మనం అక్కడ కొనుక్కోగలిగిన దుస్తులు చీరలు, శాలువాలు, పిల్లలకు టీ షర్ట్లే. ఉన్ని శాలువాలు మంచి నేత పనితనంతో అందంగా ఉంటాయి. ఏనుగు బొమ్మలు ముద్రించిన టీ షర్ట్లుంటాయి. మక్కబుట్టకు ఉప్పుకారం చిరుతిండ్లు అమ్మే వాళ్లయితే మన ముఖాలు చూసి భారతీయులను గుర్తు పట్టేస్తారు. పాశ్చాత్యులు ఇష్టపడే రుచులు, భారతీయుల ఇష్టాలను గ్రహించి వ్యాపారం చేస్తారు. మనం మొక్క జొన్న కండెకు ఉప్పు, కారం పట్టించి తింటామని వాళ్లకు తెలుసు. మనల్ని చూడగానే ‘ఇండియన్స్’ అంటూ మసాలా రాయమంటారా అని అడుగుతారు. తమిళులు– సింహళీయులకు మధ్య పోరు గురించి తెలిసిన వారిగా మనకు కొంత జంకు, భారతీయులను స్వాగతిస్తారో లేదోననే భయం ఉంటుంది. కానీ, శ్రీలంక వాళ్లు భారతీయులను ఆత్మీయంగా చూస్తారు. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: క్యాండీ మ్యూజియంలో భారత బౌద్ధం!) -
ఇదు శ్రీలంక: క్యాండీ మ్యూజియంలో భారత బౌద్ధం!
ఐదు వేల వస్తువులను చూడటానికి రెండు కళ్లు చాలవు. చుట్టి రావడానికి కనీసం రెండు గంటల సమయం కావాలి. పదిహేడు దేశాలను ఒక్క చోట ప్రతిక్షేపించిందీ మ్యూజియం. అందులో మన దేశమూ ఉంది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు. మనదేశంలో చూడలేకపోయిన బౌద్ధక్షేత్రాల ప్రతీకలను ఇక్కడ చూద్దాం. ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ మ్యూజియం... శ్రీలంకలోని క్యాండీ నగరంలో ఉంది. క్యాండీలోని నేషనల్ మ్యూజియం భవనంలోనే ఉంది. ఇంటర్నేషనల్ మ్యూజియంలో శ్రీలంక, ఇండియా, జపాన్, చైనా , భూటాన్ దేశాలతోపాటు మొత్తం 17 దేశాల బౌద్ధ విశేషాలున్నాయి. ఇండియా గ్యాలరీ ఏర్పాటు బాధ్యతలను మన విదేశీ వ్యవహారాల శాఖ పూర్తి చేసింది. నిర్వహణ బాధ్యతను పదేళ్ల కిందట ‘శ్రీ దలాడ మలిగవ’కు అప్పగించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ మ్యూజియం ఇది. బౌద్ధానికి చెందిన ఫొటోలు, శిల్పాలు, ప్రతీకాత్మక శిల్పాలు, చిత్రాలు, నేషనల్ మ్యూజియంలో క్యాండీ రాజులు (17,18 శతాబ్దాల నాటివి) ఉపయోగించి ఆయుధాలు, ఆభరణాలు, దైనందిన జీవనం ఉపయోగించిన వస్తువులు, చారిత్రక శకలాలు... అన్నీ కలిసి ఐదు వేలకు పైగా ఉంటాయి. క్యాండీ రాజ్యం 1815లో బ్రిటిష్ రాజ్యంలో విలీనం అయినప్పుడు రాసుకున్న ఒప్పంద పత్రం ప్రతిని కూడా చూడవచ్చు. మ్యూజియంలోపల బ్రిటిష్ ఆనవాళ్లు మరేవీ కనిపించవు. కానీ మ్యూజియం ఏర్పాటులో కీలకంగా పని చేసిన సిలోన్ గవర్నర్ సర్ హెన్రీ వార్డ్ విగ్రహం ఉంది. తెలుగు– సింహళ బంధం ఇండియా విభాగంలో మన అమరావతి బౌద్ధ స్థూపం నమూనా కూడా ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బౌద్ధం విలసిల్లిందని చెప్పడానికి దోహదం చేసే ఆధారాలను, ఆనవాళ్లను చూడవచ్చు. సాంచి స్థూపం నమూనా, సారనాథ్ స్థూపం దగ్గర అశోకస్తంభం మీద గర్జించే సింహం నమూనా శిల్పం, ఎల్లోరా గుహలు వాటిలోని శిల్పాలు, అజంతా గుహలు– అందులోని వర్ణ చిత్రాలు, అశోకుని ధర్మచక్రం, మనం జాతీయ చిహ్నం నాలుగు సింహాల ప్రతిమలను చూడవచ్చు. ఇంకా... చైనా బుద్ధుని విగ్రహాలు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మిగిలిన అన్ని దేశాల బుద్ధుడి ప్రతిమల్లోనూ ఏకరూపత ఉంటుంది. కానీ చైనా బుద్ధుడు భిన్నంగా ఉంటాడు. పెంగ్షుయ్ వాస్తులో భాగంగా లాఫింగ్ బుద్ధ మనకు పాతికేళ్ల కిందటే పరిచయమై ఉన్నాడు కాబట్టి ఆ రూపాన్ని బుద్ధుడిగా స్వీకరించడానికి పెద్దగా ఇబ్బంది పడమన్నమాట. ఇక ఆశ్చర్యంతోపాటు ఒకింత అయోమయానికి గురి చేసేది భవిష్యత్తు బుద్ధుడి ఊహాశిల్పం. ఆ బుద్ధుడు మల్టీటాస్కింగ్‌కి ప్రతీకగా ఉంటుందా శిల్పం. మ్యూజియంతోపాటు ఈ భవనంలోనే కొన్ని గదుల్లో సావనీర్ విభాగం ఉంది. శ్రీలంక గుర్తుగా కప్పులు, ఫ్రిజ్ మ్యాగ్నట్ల వంటివి చాలా రకాలున్నాయి. అప్పటి అతిథిభవనం! ఈ మ్యూజియం రెండస్థుల భవనం. మ్యూజియంగా మార్చకముందు ఈ భవనం గెస్ట్‌హౌస్‌గా రాజ్యాతిథుల విడిదిగా ఉండేది. రాణివాస మహిళలకు కూడా కొంతకాలం ఇందులో నివసించినట్లు చెబుతారు. క్యాండీ రాజ్యం ఆర్కిటెక్ట్‌ల నైపుణ్యానికి సగౌరవంగా అభివాదం చేయాల్సిందే. మ్యూజియం భవనం, యునెస్కో గుర్తించి వరల్డ్ హెరిటేజ్ సైట్ టూత్ రిలిక్ టెంపుల్, రాజుల ప్యాలెస్‌లు ఒకే క్లస్టర్లో ఉంటాయి. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: బుద్ధుని దంతాలయం!) -
ఇదు శ్రీలంక: బుద్ధుని దంతాలయం!
శ్రీలంక దీవి హిందూ మహా సముద్రంలో చిన్న భూభాగం. ఇందులో సముద్ర మట్టానికి పదహారు వందల అడుగుల ఎత్తులో ఉంది కాండీ నగరం. ఈ నగరంలో ప్రధానంగా చూడాల్సిన ప్రదేశం బుద్ధుడి దంత అవశిష్టంతో నిర్మించిన ఆలయం. ఈ ఆలయాన్ని టూత్ రిలిక్ టెంపుల్ గా వ్యవహారిస్తారు. ఈ ఆలయం కంటే ముందు ఇక్కడ ఉన్న నేషనల్ మ్యూజియాన్ని తప్పక చూడాలి. రిలిక్ టెంపుల్ చుట్టూ ప్రాచీన రాజకుటుంబాల ప్యాలెస్‌లున్నాయి. ఆలయంతోపాటు రాజప్రాసాదాలు కూడా ఏటవాలు పై కప్పుతో మనదేశంలో కేరళలోని నిర్మాణాలను తలపిస్తాయి. శ్రీలంకలో తరచూ వర్షాలు కురుస్తుంటాయి, కాబట్టి నీరు సులువుగా జారిపోవడానికి ఒకప్పుడు ఎర్రటి బంగ్లా పెంకు కప్పే వాళ్లు. ఇప్పుడు ఆకుపచ్చ రంగు రేకులు కప్పుతున్నారు. ఇక ఈ నగరంలో మరో విశిష్ఠత ఏమిటంటే... పోర్చుగీసు, బ్రిటిష్ పరిపాలనలో ఉండడంతో కొన్ని ప్రదేశాలు కలోనియల్ కాలనీలను తలపిస్తున్నాయి. యూరప్ నిర్మాణశైలిలో ఉన్న క్వీన్స్ హోటల్‌ను చూసి తీరాలి. ఇక బ్రిటిష్ వాళ్లు హిల్ స్టేషన్లను ఎంత చక్కగా వేసవి విడుదులుగా మలుచుకున్నారో చెప్పడానికి కాండీ నగరం ఒక నిదర్శనం. నిర్మాణ పరంగా, చారిత్రక ప్రాధాన్యతలెన్ని ఉన్నప్పటికీ ఈ నగరానికి ఇంతటి పర్యాటక ప్రాముఖ్యత ఏర్పడడానికి కారణం బుద్ధుడి అవశిష్టమే. బౌద్ధమే ప్రధానం.. బుద్ధుడి దంతాన్ని ప్రతిష్ఠించి ఆ ఆలయాన్ని నిర్మించారు. ఆ దంత అవశిష్టం మన భారతదేశం నుంచి శ్రీలంక చేరడం కూడా రసవత్తరమైన నాటకీయతను తలపిస్తుంది. బుద్ధుడు మహా పరినిర్వాణం చెందిన తర్వాత ఎముకలు, దంతాలు ఇలా ఒక్కొక్క దేహభాగాలను ఒక్కొక్క ప్రదేశంలో ప్రతిష్ఠించి ఆలయాలను నిర్మించారు. అలా ఈ దంతాన్ని కళింగ రాజులు సొంతం చేసుకున్నారు. ఈ దంతం ఎక్కడ ఉంటే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందనే విశ్వాసం అప్పట్లో ఉండేది. యువరాణి హేమమాలిని, యువరాజు దంత ఈ దంతాన్ని రహస్యంగా లంకాపట్టణానికి తెచ్చారు. హేమమాలిని తల మీద శిఖలో దాచి తెచ్చిందని చెబుతారు. ఆ దంతాన్ని అనూరాధపురను పాలించిన రాజు సిరిమేఘవన్నకు ఇచ్చింది హేమమాలిని. మొదట ఆ దంతాన్ని మేఘగిరి విహార (ఇసురు మునియ) లో భద్రపరిచారు. క్రమంగా రాజుల్లో ఈ దంతాన్ని కలిగి ఉండడం ఆధిక్యతకు చిహ్నంగా భావించారు. శ్రీలంకలో రాజులు ఆ దంతం తమ రాజ్యంలో ఉండడం తమకు గొప్ప అన్నట్లు భావించేవారు. దాంతో ఎవరికి వారు ఆ దంతం తమ రాజ్యంలోనే ఉండాలని ఒకింత పోటీ పడేవారు కూడా. ఆలయ సౌందర్యం! ఆనాటి రాజులు బౌద్ధ స్థూపాలు, ఆలయాల నిర్మాణానికి తమవంతుగా సమృద్ధిగా నిధులు కేటాయించేవారు. కాండీలోని ఆలయనిర్మాణం అత్యంత సుందరంగా, అంతకు మించిన సంపన్నతతో ఉంది. ఆలయం ఆర్కిటెక్చర్ గొప్పతనానికి చేతులెత్తి మొక్కాల్సిందే. ఈ తలుపులను ఒకరు తెరవడం సాధ్యం కాదు. తిరుమల వేంకటేశ్వర ఆలయం మహాద్వారం తలుపుల్లాగ భారీగా ఉంటాయి. ఉలి నైపుణ్యం గోడలు, స్తంభాల్లోనే కాదు తలుపు గడియల్లో కూడా చూడవచ్చు. నెమలి పింఛం ఆకారంలో ఉన్న గడియ కనీసం రెండు కిలోల బరువుంటుంది. సరదాపడి పైకి తీద్దామన్నా ఒక చేతితో కదిలించలేం. మనకు ఆలయాల్లో ప్రవేశద్వారాలే తెలుసు, కానీ ఇక్కడ ప్రవేశ భవనమే ఉంది. తొలి భవనంలో అడుగు పెట్టగానే గర్భగుడి కోసం చూస్తాం. కానీ అదంతా ప్రవేశ మార్గమే. అసలు ఆలయంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి బుద్ధభగవానుడి దర్శనం చేసుకునే వరకు మనల్ని మనం మరిచిపోతాం. ఇప్పటి వరకు మనం చూడని మరోలోకంలో ఉన్న భావన కలుగుతుంది. ఆలయం పై కప్పు జామెట్రికల్ డిజైన్లు కూడా తేలికరంగులతో కంటికి హాయినిస్తూ నిర్మాణకౌశలానికి అద్దం పడుతుంటాయి. ప్రకృతి మనకు కలువలను ఎన్ని షేడ్లలో ఇస్తోందో ఈ ఆలయంలో చూడాల్సిందే. ఆలయ అలంకరణలో తెల్లని పూలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తారు. బౌద్ధావలంబకులు కూడా (భిక్కులు కాదు) బుద్ధుని దర్శనానికి శ్వేత వస్త్రాలు ధరించి వస్తారు. చంటిబిడ్డలకు కూడా తెల్లని వస్త్రాలే వేస్తారు. వర్షం పడినా చలి ఉండదు! కాండీ నగరం మొత్తం కనిపించే వ్యూ పాయింట్స్ ఉంటాయి. అక్కడ ఆగి నగరసౌందర్యాన్ని వీక్షించవచ్చు. ఇక్కడ ఒక సరస్సును, ఒడ్డున ధవళ బుద్ధుడిని మిస్ కాకూడదు. కాండీ నగరంలోని సరస్సు... మనదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముసోరి సరస్సును తలపిస్తుంది. కాండీ రిలిక్ టెంపుల్ నిర్మాణం దక్షిణ భారత ఆలయ నిర్మాణశైలిని తలపిస్తుంది. ఇక్కడ వర్షం సీజన్‌తో పని లేకుండా రోజూ ఏదో ఒక సమయంలో చిరుజల్లయినా పడుతుంది. అందుకే గొడుగు దగ్గర ఉండడం అవసరం. ఇక్కడ మనకు ఒకింత ఆశ్చర్యకలిగించే విషయం ఏమిటంటే వర్షం కురుస్తుంది, కానీ చలి ఉండదు. వర్షం జల్లు ఆగిన వెంటనే ఉక్కపోత కూడా ఉంటుంది. మొత్తానికి శ్రీలంకలో ఉన్నది ఎండాకాలం, వర్షాకాలం రెండు సీజన్లేనని అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: సీతా ఎలియా) -
ఇవిగివిగో... అవిగవిగో!
తాజాగా ఫోర్బ్స్ ఇండియా ‘డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించింది 24 సంవత్సరాల ఆకాంక్ష మోంగ. కన్సల్టెన్సీ జాబ్‌ను వదిలేసి ఫుల్‌టైమ్ ట్రావెలర్‌గా మారింది. పుణెకు చెందిన ఆకాంక్ష ట్రావెల్ అండ్ ఫొటోగ్రఫీ విభాగంలో మంచి పేరు తెచ్చుకుంది. ‘కంటెంట్‌ను ప్రేక్షకులకు వేగంగా చేరువ చేయడానికి సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయం లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలి’ అంటుంది ఆకాంక్ష. డిజిటల్ క్రియేటర్లు నిలువ నీరులా, గోడకు కొట్టిన మేకులా ఉండకూడదు అనే స్పృహతో యువ క్రియేటర్లు ఎప్పటికప్పుడు కొత్త టాపిక్స్‌పైనే కాదు టూల్స్ గురించి కూడా అవగాహన చేసుకుంటున్నారు. క్రియేటర్–ఫ్రెండ్లీ టూల్స్‌కు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల అప్డేట్స్ను వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. కంటెంట్ మేకింగ్‌లో మరింత క్రియేటివిటీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.... రెండు నెలల క్రితం ‘మీ షార్ట్స్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకు వెళ్లండి’ అంటూ యూట్యూబ్ కొత్త క్రియేషన్ టూల్స్‌ను తీసుకువచ్చింది. అందులో ఒకటి కొలాబ్. ఈ టూల్‌తో సైడ్–బై–సైడ్ ఫార్మట్‌లో ‘షార్ట్’ను రికార్డ్ చేయవచ్చు. క్రియేటర్లు తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవడానికి మల్టిపుల్ లే ఔట్ ఆప్షన్లు ఉంటాయి.గత నెలలో జరిగిన ‘మేడ్ ఆన్ యూట్యూబ్’ కార్యక్రమంలో క్రియేటర్స్‌కు ఉపకరించే కొత్త టూల్స్‌ను ప్రకటించింది కంపెనీ. ‘క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్కు కొత్త టూల్స్ తీసుకురానున్నాం. క్లిష్టం అనుకునే వాటిని సులభతరం, అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసే టూల్స్ ఇవి. క్రియేటివ్ పవర్‌కు దగ్గర కావడానికి ఉపకరిస్తాయి’ అన్నాడు యూ ట్యూబ్ సీయీవో నీల్ మోహన్.యూ ట్యూబ్ ప్రకటించిన కొన్ని టూల్స్.... డ్రీమ్ స్క్రీన్ యూట్యూబ్ షార్ట్స్ కోసం రూపొందించిన న్యూ జెనరేటివ్ ఫీచర్ ఇది. దీని ద్వారా తమ షార్ట్స్‌కు ఏఐ జనరేటెడ్ వీడియో లేదా ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేయడానికి వీలవుతుంది. పెద్దగా కష్టపడనక్కర్లేకుండానే పాప్ట్ ఇస్తే సరిపోతుంది. ‘డ్రీమ్ స్క్రీన్’ ద్వారా క్రియేటర్లు తమ షార్ట్స్‌కు న్యూ సెట్టింగ్స్ జ నరేట్ చేయవచ్చు. యూట్యూబ్ క్రియేట్ వీడియోలు క్రియేట్ చేయడానికి షేర్ చేయడానికి ఉపకరిస్తుంది. యూట్యూబ్ క్రియేట్ యాప్ ద్వారా ఖచ్చితత్వం, నాణ్యతతో కూడిన ఎడిటింగ్, ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ కాప్షనింగ్, వాయిస్ వోవర్, యాక్సెస్ టు లైబ్రరీ ఆఫ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, రాయల్టీ–ఫ్రీ మ్యూజిక్... మొదలైనవి క్రియేటర్లకు ఉపయోగపడతాయి. ఒక్క ముక్కలో చె΄్పాలంటే కాంప్లెక్స్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌తో పని లేకుండానే ప్రేక్షకులను ఆకట్టుకునేలా వీడియోలను సులభంగా క్రియేట్ చేయవచ్చు. క్రియేటర్ల నోట ‘హిట్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్’ అనే మాట తరచుగా వినిపిస్తుంటుంది. ప్రస్తుతం దీన్ని ఫీచర్‌గా మలచనున్నారు. ‘హిట్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్’ వినిపిస్తున్నప్పుడు ఈ బటన్లను సింక్‌లోని విజువల్ క్యూతో హైలైట్ చేస్తుంది. ఏఐ ఇన్సైట్స్ యూట్యూబ్‌లో ప్రేక్షకులు చూస్తున్న కంటెంట్ ఆధారంగా వీడియో ఐడియాలను తయారు చేసుకోవడానికి వీలవుతుంది. అలౌడ్ ఆటోమేటిక్ డబ్బింగ్ టూల్ ద్వారా కంటెంట్‌ను ఎక్కువ భాషల్లో క్రియేట్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అప్డేట్స్తో ముందుకు వస్తోంది. వాటిలో ఒకటి క్రియేటర్లు ‘రీల్స్’లో టాప్ ట్రెండింగ్ సాంగ్స్ గురించి తెలుసుకునే అవకాశం. ఆ ఆడియోనూ ఎన్నిసార్లు ఉపయోగించారో తెలుసుకోవచ్చు. సేవ్ చేసి అవసరమైన సందర్భంలో వాడుకోవచ్చు. ట్రెండింగ్ టాపిక్స్ ఏమిటో కూడా తెలుసుకోవచ్చు. ‘ప్రస్తుతం పాపులర్ ఏమిటి?’ అనేది తెలుసుకోవడానికి కొత్త డెడికేటెడ్ సెక్షన్ క్రియేటర్లకు ఉపకరిస్తుంది’ అని చెబుతుంది కంపెనీ.‘రీల్స్’ను ఎడిట్ చేయడాన్ని సులభతరం చేయడానికి వీడియో క్లిప్‌లు, ఆడియో, స్టిక్కర్స్, టెక్ట్స్‌ను ఒకేచోటుకు తీసుకువచ్చింది. తమ కంటెంట్ పెర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోవడానికి కొత్తగా తీసుకువచ్చిన ‘రీల్స్ ఇన్సైట్స్’తో యాక్సెస్ కావచ్చు. ఇన్స్టాగ్రామ్ కొత్తగా యాడ్ చేసిన ‘టోటల్ వాచ్ టైమ్’ మెట్రిక్, ‘యావరేజ్ టైమ్’ మెట్రిక్‌తో క్రియేటర్లు యాక్సెస్ కావచ్చు. రీల్స్‌లో ‘స్ట్రాంగర్ హుక్’ క్రియేట్ చేసి వీడియోను ఆకట్టుకునేలా చేయడానికి ఇది ఉపకరిçస్తుంది. అయిననూ... టెక్నాలజీ మాత్రమే సర్వస్వం, విజయ సోపానం అనుకోవడం లేదు యువ క్రియేటర్లు. ‘టెక్నాలజీ అంటే టూల్స్ మాత్రమే కాదు క్రియేటర్ పనితీరు. ప్రత్యేకత. సృజనాత్మకత’ అనే విషయంపై అవగాహన ఉన్న యువ క్రియేటర్లు నేల విడిచి సాము చేయడం లేదు. కంటెంట్, టెక్నాలజీని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. -
ఇదు శ్రీలంక: సీతా ఎలియా
శ్రీలంకలో పరిపాలన విభాగాలుగా బ్రిటిష్ వాళ్లు అనుసరించిన ప్రావిన్స్ విధానమే ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ‘సీతా ఎలియా’ అనే చిన్న గ్రామం శ్రీలంక సెంట్రల్ ప్రావిన్స్‌లో ఉంది. శ్రీలంకలో అందమైన హిల్ స్టేషన్ నువారా ఎలియాకు కిలోమీటరు దూరంలోనే ఉంది సీతా ఎలియా. ఎలియా అనే పదానికి సింహళలో వెలుతురు, కాంతి అనే అర్థాలు చెబుతారు. రామాయణ కాలంలో సీతాదేవి వనవాసం చేసిన అశోక వాటిక ఇదని చెబుతారు. ఇక్కడి ఆలయాన్ని ‘సీతా అమ్మన్ టెంపుల్’ అంటారు. అశోకవాటిక సీతాదేవిని రావణాసురుడు తన రాజ్యం శ్రీలంకకు అపహరించుకుని వెళ్లి అతడి రాజమందిరంలో ఆమెకు బస ఏర్పాటు చేస్తాడు. రావణాసురుడి రాజమందిరంలో నివసించడానికి సీతాదేవి అంగీకరించకపోవడంతో పైగా ఆమె ఎప్పుడూ అశోక చెట్టు కిందనే ఎక్కువ సమయం గడపడాన్ని గమనించిన రావణాసురుడు ఆమె ప్రకృతి ప్రేమికురాలని, ఆమెకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కోరుకుంటోందని గ్రహించి ఈ ప్రదేశంలో బస ఏర్పాటు చేసినట్లు చెబుతారు. రావణాసురుడి భార్య మండోదరి కూడా ఈ వనానికి వచ్చి సీతాదేవిని కలిసేదని కూడా చెబుతారు. అశోకవాటిక నిజానికి మనసులోని శోకాన్ని దూరం చేసే అందమైన ప్రదేశమే. ప్రకృతి సౌందర్యానికి నెలువెత్తు నిదర్శనం. రావణాసురుడు మంచి కళాభిరుచి కలిగిన వాడని, సీతాపహరణం తప్ప మరేరకమైన అవగుణం లేదని చదివే వాళ్లం. అశోకవాటికను చూసినప్పుడు నిజమేననిపించింది. సీత అభిరుచిని గ్రహించడంతోపాటు ఆమె కోసం ఇలాంటి అందమైన ప్రదేశాన్ని ఎంపిక చేయడం... రావణాసురుడి కళాహృదయానికి అద్దం పడుతోంది. ఇక్కడి సెలయేరు నిరంతరం ప్రవహిస్తుంటుంది. సెలయేటి తీరాన సీతాదేవి స్నానం చేసేదని చెప్పడానికి ఆనవాలుగా సిమెంటు నిర్మాణం ఉంది. సీతాన్వేషణలో భాగంగా శ్రీలంకకు వచ్చిన హనుమంతుడు... సీతాదేవిని కలిసింది ఇక్కడే. ఆ ఘట్టాన్ని ప్రతిబింబిస్తూ సెలయేటి తీరాన శిల్పాలున్నాయి. భారతీయులు కట్టిన ఆలయం అశోకవాటికలో ఉన్న సీతా అమ్మన్ ఆలయం దక్షిణ భారత నిర్మాణశైలిలో ఉంది. తమిళనాడు నుంచి శ్రీలంకకు వలస కూలీలుగా వెళ్లిన వాళ్లు ఈ ఆలయాన్ని నిర్మించారట. ఆలయం లోపలి విగ్రహాల శిల్పనైపుణ్యం అద్భుతంగా ఉంది. కానీ ఆలయగోపురం మీద ఉన్న విగ్రహాలు శిల్పశాస్త్ర గణితానికి లోబడి ఉన్నట్లు అనిపించదు. విగ్రహం ఎత్తును అనుసరించి తల, మెడ, భుజాలు, దేహం, కాళ్ల పొడవులకు శాస్త్రబద్ధమైన కొలతలుంటాయి. శిల్పాన్ని చెక్కడానికి అవే ప్రధాన ఆధారం.ఆ తర్వాత ఎవరి విగ్రహాన్ని చెక్కుతుంటే సాహిత్యంలో వర్ణించిన ఆ వ్యక్తి దేహాకృతి, రూపలావణ్యాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఆలయ గోపురం మీదున్న విగ్రహాలను చూస్తే శాస్త్రబద్ధమైన పొంతన సరిగ్గా కుదరలేదనిపిస్తుంది. మరి కొంత పరిశీలనగా చూస్తే మాత్రం... శ్రీలంక వాసుల దేహసౌష్ఠవం ప్రభావం ఈ శిల్పాల మీద ఉన్నట్లనిపిస్తుంది. అయితే కూలీలుగా వలస వెళ్లిన వాళ్లు తమకున్న పరిమితమైన వనరుసలతో చేసిన ప్రయత్నాన్ని గౌరవించకుండా ఉండలేం. యూ ట్యూబర్ల షూటింగ్ ఇక్కడ పర్యటనకు వచ్చే వాళ్లలో భారతీయులే ఎక్కువ. నేను వెళ్లినప్పుడు ఒక ఉత్తరాది మహిళ తన స్మార్ట్ ఫోన్లో ఆ ప్రదేశాన్ని షూట్ చేస్తూ కామెంటరీ ఇస్తూ కనిపించింది. మరికొంత మంది ఆకాశాన్నంటుతున్న మహావృక్షాలను, సెలయేటి జలప్రవాహ శబ్దాన్ని రికార్డు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రదేశం సౌందర్యాన్ని అచ్చంగా కళ్లకు కట్టాలంటే డ్రోన్ కెమెరాతో షూట్ చేయాల్సిందే. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: శ్రీగంగారామ మహా విహారాయ!) ఈ లింక్‌పై క్లిక్‌చేసి వాట్సాప్ ఛానెల్‌ని ఫాలోకండి -
ఇదు శ్రీలంక: శ్రీగంగారామ మహా విహారాయ!
ఈ విహారం శ్రీలంక రాజధాని కొలంబో నగరంలో ఉంది. వ్యవహారంలో ‘గంగారామయ టెంపుల్’ అంటారు కానీ సింహళంలో ‘శ్రీగంగారామ మహా విహారాయ’ అంటారు. మనం ‘విహారం’ అనే పదాన్ని వాళ్లు ‘విహారాయ’ అంటారు. బోధిచెట్టు, విహార మందిరం, సీమ మలక (సన్యాసుల సమావేశ మందిరం)... మూడు నిర్మాణాల సమూహం. మూడింటితోపాటు రెలిక్ కాంప్లెక్స్‌కి కూడా కలిపి ఒకటే టికెట్. శ్రీలంక రూపాయల్లో నాలుగు వందలు. ‘శ్రీ జినరత్న భిక్కు అభ్యాస విద్యాలయ’ పేరుతో రసీదు ఇచ్చారు. ఇది వర్షిప్ అండ్ లెర్నింగ్ సెంటర్. ఈ విహారం ఉన్న ప్రదేశాన్ని ‘జినరత్న రోడ్’ అంటారు. అతిపెద్ద పర్యాటక ప్రదేశం కావడంతో మన ఉచ్చారణలో స్పష్టత లేకపోయినప్పటికీ స్థానిక టాక్సీల వాళ్లు సులువుగా గుర్తించి తీసుకువెళ్తారు. ఇది బెయిరా సరస్సు ఒడ్డున ఉంది. అశోకుడి ధర్మచక్రం గంగారాయ మహా విహారాయలో కూడా తొలి ప్రాధాన్యం బోధివృక్షానిదే. అనూరాధపురాలో ఉన్న శ్రీ మహాబోధి వృక్షం నుంచి సేకరించిన మొక్కను ఇక్కడ నాటినట్లు చెబుతారు. ఈ బోధివృక్షం మొదట్లో చెట్టు వేళ్ల మధ్య అవుకాన బుద్ధ విగ్రహం ఉంది. ఆ పైన రెయిలింగ్‌తో కూడిన బేస్మెంట్ మీద అశోకుని ధర్మచక్రం. నోరు తెరిచి గర్జిస్తున్న నాలుగు సింహాల విగ్రహం ఉంది. లోపలికి వెళ్తే బుద్ధుడు బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాడు. ఆవరణలో బుద్ధుడి విగ్రహాలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టలేం. బుద్ధుడికి మకరతోరణంలా అమర్చిన ఏనుగు దంతాలను గమనించడం మర్చిపోకూడదు. నిలువెత్తు దంతాలవి. మనం ఆ దంతాల పక్కన నిలబడితే దంతాలే మనకంటే ఎత్తు ఉంటాయి. ఇక మ్యూజియంలోకి అడుగుపెడితే అది మరో ప్రపంచం. కనువిందు చేసే ప్రదేశమంటే ఇదేననిపిస్తుంది. అల్మరాల్లో పాలరాతి బుద్ధుడి విగ్రహాలు వరుసగా పేర్చి ఉన్నాయి. వాలుగా కూర్చుని ఉన్న భంగిమలో అర అడుగు విగ్రహాలు షోరూమ్‌లో అమ్మకానికి పెట్టినట్లున్నాయి. కింది వరుసలో నిలబడిన బుద్ధుడి రాతి విగ్రహాలు, వాటి మధ్యలో నాలుగడుగుల ఒకింత పెద్ద విగ్రహాలు... ఒక థీమ్ ప్రకారం అమర్చి ఉన్నాయి. మరో ర్యాక్‌లో కూడా బుద్ధుడి విగ్రహాల అమరిక అలాగే ఉంది కానీ మధ్యలో పెద్ద నటరాజు విగ్రహం ఉంది. బహుశా శ్రీలంకలో శైవం ప్రాచుర్యంలో ఉండడంతో బుద్ధుడిలో ఈశ్వరుడిని కూడా చూస్తున్నట్లుంది. మరకత బుద్ధుడు ఒకటిన్నర అడుగుల ఎత్తు, అడుగు వెడల్పు ఉన్న జాతి పచ్చ రాయిలో చెక్కిన విగ్రహం అది. ఏకరాతిని బుద్ధుడి రూపంలో చెక్కి, సర్వాలంకార భూతుడిని చేశారు. ఒంటి నిండా ఆభరణాలతో చూపరుల దృష్టిని ఆకర్షిస్తుంది. మరికొన్ని షెల్ఫుల్లో అరడుగు రూబీ (కెంపు) బుద్ధుడి విగ్రహాలు, గోమేధికం బుద్ధుడి విగ్రహాలున్నాయి. బుద్ధుడు ఆహారం తీసుకోనప్పుడు దేహం శుష్కించి పోయిన రూపాన్ని ప్రతిబింబించే విగ్రహం ఒక ఆశ్చర్యం. డొక్క ఎండిపోయిన లోహపు బుద్ధుడి విగ్రహం అన్నమాట. ముఖంలో సన్నని గీతలు కూడా డీటెయిల్డ్‌గా కనిపిస్తాయి. ఒక అల్మరాలో ఒక ఇత్తడి పాత్రలో ఇరవయ్యవ శతాబ్దం నాటి నాణేలున్నాయి. నాణేల్లో ఎక్కువ భాగం ఇత్తడివే. బ్రిటిష్ కాలంలోనూ స్వాతంత్య్రానంతరం మనదేశంలో చెలామణిలో ఉన్న నాణేలను పోలి ఉన్నాయవి. శయన బుద్ధుడు, చైనా బుద్ధుడు, సునిశితమైన చిత్రాలతో ఐదున్నర అడుగుల పింగాణి కూజాలు, అల్మెరాల్లో వెండి– బంగారు పాత్రలు, తొండం ఎత్తి ఘీంకరిస్తున్న ఏనుగులు, పడగెత్తిన వెండి నాగుపాములు కూడా లెక్కకు మించి ఉన్నాయి. లోహపు మారేడుదళం, పూలసజ్జలను చూస్తుంటే సాంస్కృతికంగా మన దక్షిణ భారత దేశానికి – శ్రీలంకకు మధ్య అవినాభావ బంధం ఉందనిపిస్తుంది. జినరతన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విభాగంలో ఉన్న లైబ్రరీ విశాలమైనది. ప్రపంచంలోని బౌద్ధ సాహిత్యం అంతా ఇక్కడ ఉంది. బెయిరా సరస్సులో రెలిక్ ప్రధాన విహారానికి ఒకవైపు నిలువెత్తు బ్రాస్వాల్ మీద బుద్ధుడి జీవితంలో దశలు, జాతక కథల కుడ్యశిల్పాలున్నాయి. రోడ్డు దాటి సరస్సు వైపు వస్తే అందులో బుద్ధుడి రెలిక్ కాంప్లెక్స్ ఉంది. అది సాంస్కృతికతను ఒడిసి పట్టిన అత్యంత అధునాతన నిర్మాణం. ఇక్కడ ఉంచిన రెలిక్ ఏమిటన్నది ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోయారు. రెలిక్ అని మాత్రమే చెబుతున్నారు. ఆవరణలో బుద్ధుడి విగ్రహాల వరుస ఉంది. మరో విషయం... ప్రపంచంలో అత్యంత భారీ విగ్రహంగా రికార్డు సాధించిన బోరోబుదూర్ బుద్ధుడి విగ్రహానికి ప్రతీకాత్మక రూపం ఇక్కడ ఉంది. బోరోబుదూర్ బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, కాబట్టి ఇప్పుడు ఇక్కడి రూపాన్ని చూసి సంతృప్తి చెందవచ్చు. బౌద్ధం నడిపించిన సమాజం శ్రీలంక. మనుషులు అత్యంత స్నేహపూర్వకంగా, మితభాషులుగా కనిపించారు. మరో విషయం ఇక్కడ సావనీర్ షాప్‌లో బుద్ధుడి జ్ఞాపికలతోపాటు ముత్యాల ఆభరణాలు కూడా ఉన్నాయి. అయితే దుకాణదారులు వాటి నాణ్యత విషయంలో స్పష్టత ఇవ్వలేకపోయారు. జాగ్రత్తగా కొనుగోలు చేయడం మంచిది. – వాకా మంజులారెడ్డి సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి (చదవండి: ఇదు శ్రీలంక: కేలనియా మహా విహారాయ!) -
ఇదు శ్రీలంక: కేలనియా మహా విహారాయ!
శ్రీలంకకు రాముడు ఒకసారి వెళ్తే బుద్ధుడు మూడుసార్లు వెళ్లాడు. మూడవసారి శ్రీలంక పర్యటనలో బుద్ధుడు అడుగుపెట్టిన ప్రదేశం కేలనియా ఆలయం. శ్రీలంకలో చరిత్రను చారిత్రక ఆధారాలతో డాక్యుమెంట్ చేయడం కంటే సాహిత్యం ఆధారంగా, అది కూడా ధార్మిక గ్రంథాల ఆధారంగా గతంలో ఆ నేల మీద ఏం జరిగిందో తెలుసుకోవడమే జరిగింది. నాటి సంస్కృతిని సంప్రదాయాల ఆధారంగా చరిత్రను అంచనా వేయాల్సి వచ్చింది. చిత్రాల్లో బుద్ధుడు శ్రీలంకలో కేలనియా గంగా నది తీరాన కొలంబో నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది కేలనియా మహా విహారాయ. విశాలమైన ఆలయ ప్రాంగణంలో పెద్ద బోధివక్షం, ఆ వృక్షం మొదట్లో భారీ ధవళ బుద్ధుడి విగ్రహం. కేలనియా మహా విహారాయ అద్భుతమైన శిల్పకళానైపుణ్యంతో కూడిన నిర్మాణం. అంతకంటే ఎక్కువగా ఈ ఆలయం అద్భుతమైన చిత్రాలకు నెలవు. గోడలు, పై కప్పు నిండా పెయింటింగ్సే. ఒక్కొక్కటి ఒక్కో సంఘటనను ప్రతిబింబిస్తుంది. బుద్ధుడు శ్రీలంకలో అడుగుపెట్టడం, త్రిపీటకాలను బోధించడం, అష్టాంగమార్గాలను విశదపరచి సమ్యక్ జీవనం దిశగా నడిపించడం, స్థానిక రాజులు బుద్ధుడికి అనుచరులుగా మారిపోవడం, సామాన్యులు బుద్ధుడిని చూడడానికి ఆతృత పడడం, బుద్ధుడి మాటలతో చైతన్యవంతమై వికసిత వదనాలతో సన్మార్గదారులవడం... వంటి దృశ్యాలన్నీ కనిపిస్తాయి. మరొక ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ చిత్రాల్లో విభీషణుడి జీవితంలో ముఖ్యమైన విభీషణుడి పట్టాభిషేకం ఘట్టం కూడా ఉంది. విభీషణుడి రాజభవనం కేలనియా నది తీరాన ఉన్నట్లు వాల్మీకి రామాయణంలో ఉందని చెబుతారు. ఈ ఆలయంలో విభీషణుడి విగ్రహం కూడా ఉంది. విభీషణుడిని సింహళీయులు విభీషణ్ దేవయా అని పిలుచుకుంటూ ప్రాచీనకాలంలో తమను పరిరక్షించిన దేవుడిగా కొలుస్తారు. విభీషణుడిని రాజుగా ప్రకటిస్తూ పట్టాభిషేకం చేసిన ప్రదేశం కేలనియా ఆలయ ప్రాంగణమేనని కూడా చెబుతారు. వాతావరణానికి అనువుగా నిర్మాణాలు! బౌద్ధ ప్రార్థనామందిరాల్లో డ్రెస్ కోడ్ ఉంటుంది. మన దుస్తులు భుజాలు, మోకాళ్లను కప్పేటట్లు ఉండాలి. అలా లేకపోతే ఆలయ ప్రాంగణంలో చున్నీ వంటి వస్త్రాన్ని ఇస్తారు. దాంతో భుజాలను కప్పుకోవాలి. మోకాళ్లు కనిపించే డ్రస్ అయితే ఆ వస్త్రాన్ని లుంగీలాగా చుట్టుకోవాలి. శ్రీలంక దీవి సతత హరితారణ్యాల నిలయం కావడంలో వర్షాలు అధికం. వర్షపు నీరు ఇంటి పై భాగాన నిలవ కుండా జారిపోవడానికి వీలుగా స్లాంట్ రూఫ్ ఉంటుంది. ఈ ఆలయం కూడా ఎర్ర పెంకుతో వాలు కప్పు నిర్మాణమే. దీనికి పక్కనే ఇదే ప్రాంగణంలో తెల్లగా మెరిసిపోతూ బౌద్ధ స్థూపం ఉంది. కేలనియా ఆలయంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ బుద్ధుడి విగ్రహానికి తల మీద బంగారు రంగులో లోహపు త్రిశూలం ఉంది. బుద్ధుడి వెనుక నీలాకాశం, తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ పర్వతాలను పోలిన నేపథ్యం ఉంది. స్థానికులు బుద్ధుడిని శివలింగం పూలతో పూజిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించే ప్రమిదల పెద్ద పెద్ద స్టాండులు నూనె ఓడుతూ ఉన్నాయి. కొంతమంది దీపాలు వెలిగిస్తున్నారు కూడా. కార్తీక మాసంలో మనదేశంలో శివాలయాల్లో కనిపించే దృశ్యం అన్నమాట. ధార్మికత సాధనలో ఎవరికి తోచిన మార్గం వారిది. 2,500 ఏళ్ల నాటి జ్ఞాపకాలకు ఆనవాలు కేలనియా మహావిహారాయ. భారతదేశం– శ్రీలంకల మధ్య వికసించిన మైత్రిబంధానికి ప్రతీక ఈ ఆలయం. వీటికి ప్రత్యక్ష సాక్షి ఆలయ ప్రాంగణంలో బోధివృక్షం. సింహళీయుల ఆత్మీయత తాజాగా తెలంగాణ రాష్ట్రం– శ్రీలంకలను కలుపుతున్న బౌద్ధం పరస్పర సహకారంతో పరిఢవిల్లనుంది. మనవాళ్లను చూడగానే సింహళీయులు ‘ఇండియన్స్’ అని చిరునవ్వుతో ప్రశ్నార్థకంగా చూస్తారు. తెలుగు వాళ్ల మీద కూడా వారికి ప్రత్యేకమైన అభిమానం వ్యక్తమవుతుంది. శ్రీలంకతో ప్రాచీన తెలుగుబంధం బుద్ధఘోషుడి రూపంలో ఏర్పడింది. ఈ ఆలయంలోని చిత్రాల్లో బుద్ధఘోషుడు తాను రాసిన విశుద్ధమగ్గ గ్రంథాన్ని శిష్యుడికి అందిస్తున్న పెయింటింగ్‌ని కూడా చూడవచ్చు. సింహళులు ఇష్టంగా అనుసరించే ధార్మికత బౌద్ధం పుట్టింది భారతదేశంలోనే కాబట్టి వారు భారతీయుల పట్ల ఆత్మీయంగా ఉంటారు. సోదర ప్రేమను పంచుతారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు స్థానికులు తెలుగువారిని దక్షిణాది వారన్నట్లు తక్కువగా చూడడం ఎవరూ కాదనలేని సత్యం. శ్రీలంక సింహళీయులు మాత్రం బౌద్ధంతో మనతో బంధాన్ని కలుపుకుంటారు. సింహళీయుల ఆత్మీయత మనల్ని కట్టిపడేస్తుంది. – వాకా మంజులా రెడ్డి (చదవండి: రివర్ సఫారీ! శ్రీదీవిలో దీవుల మధ్య విహారం) -
రివర్ సఫారీ! శ్రీదీవిలో దీవుల మధ్య విహారం
సెప్టెంబర్‌లో నెలలో ఓ వారం రోజుల పాటు శ్రీలంకలో పర్యటించే అవకాశం వచ్చింది. నేను చూసిన శ్రీలంకకు అక్షరరూప పరంపర ఇది. మొదట మదుగంగలో రివర్ సఫారీ మదుగంగ... ఈ నది శ్రీలంక దీవిలో ప్రవహిస్తోంది. బాల్‌పిటియా అనే చిన్న పట్టణం నుంచి ఈ నదిలో రివర్ సఫారీ చేయవచ్చు. ఈ ప్రదేశం కొలంబో– గాలే హైవేలో వస్తుంది. బెన్తోట నుంచి అరగంట ప్రయాణ (18 కి.మీలు) దూరంలో ఉంది బాల్‌పిటియా. ఇక్కడ మదుగంగ నది విశాలమైన సరస్సును తలపిస్తూ ఉంటుంది. నీరు నిశ్చలంగా అనిపిస్తుంది. ఈ ప్రదేశం నుంచి పడవలో ప్రయాణం మొదలు పెడితే ఒకటిన్నర గంట నదిలో విహరించవచ్చు. నది మధ్యలో ఉన్న దీవులను చుట్టిరావచ్చు. మధ్యలో బుద్ధుడి విగ్రహాన్ని, వినాయకుడి మందిరాన్ని చూడవచ్చు. ముఖ్యంగా ఇది ప్రకృతి రమణీయతను, మాన్‌గ్రోవ్ (మడ అడవులు) బారులను చూడడానికి వెళ్లాల్సిన ప్రదేశం. నదికి మహా స్వాగతం మదు గంగ నది తీరమంతా మడ అడవులు దట్టంగా ఉంటాయి. చెట్ల కొమ్మల నుంచి పుట్టుకొచ్చిన వేళ్లు నదిలోని నీటి కోసం ఊడల్లాగ కిందకు వేళ్లాడుతుంటాయి. బాల్‌పిటియా దగ్గర మొదలైన రివర్ సఫారీ మొదట మదుగంగ నది హిందూమహాసముద్రంలో కలిసే ప్రదేశం వరకు సాగుతుంది. నిశ్చలంగా ప్రవహించిన నదికి హిందూ మహా సముద్రం అలలతో స్వాగతం పలుకుతున్న అద్భుతాన్ని చూసిన తరవాత దీవుల పరిక్రమ దిశగా సాగింది మా పడవ. ప్రకృతి ప్రపంచమిది శ్రీలంకలో ఎటు చూసినా పచ్చదనమే. అయితే ఈ నది మధ్య ఉన్న దీవులు ఇంకా దట్టమైనవి, ఇంకా పచ్చనైనవి. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కనిపించినట్లు దట్టమైన అడవులవి. ఈ దీవులు కొన్ని ప్రైవేట్ వ్యక్తులవి. కొన్ని సామాన్య జనావాసాలు. ఒక దీవిలో పూర్తిగా దాల్చిన చెక్కను చెక్కే వాళ్లే నివసిస్తున్నారు. మొత్తం ఇరవై కుటుంబాలు. దాల్చిన చెక్క చెట్ల నుంచి బెరడును సేకరించడం, సినమిన్ ఆయిల్ తయారు చేయడమే ఆ దీవిలో నివసించే వారి వృత్తి. పడవలన్నీ ఆ దీవి దగ్గర ఆగుతాయి. ఒక ఇంట్లోకి వెళ్లగానే ఒక చిన్న గది, పర్యాటకులు కూర్చోవడానికి చేసిన ఏర్పాటు ఉంది. మనం వెళ్లగానే ఒక వ్యక్తి సినమిన్ ఆకులు రెండింటిని మన చేతిలో పెట్టి వాసన చూడమంటాడు. ఆ తర్వాత ఒక కర్రను చూపించి బెరడును ఒలుస్తాడు. ఆ తర్వాత పర్యాటకులందరికీ గాజు కప్పుల్లో దాల్చిన చెక్క టీ ఇస్తారు. చేపల పట్టే అమ్మాయి టీ తాగిన తర్వాత వారి వద్దనున్న దాల్చిన చెక్కతోపాటు సినమిన్ పౌడర్ ప్యాకెట్లు, సినమిన్ ఆయిల్ సీసాలను మన ముందు పెడతారు. కావల్సినవి కొనుక్కున్న తర్వాత పడవ ఇతర దీవుల వైపు సాగుతుంది. ఈ మధ్యలో బుద్ధుని విగ్రహం దగ్గర కొంతసేపు ఆగవచ్చు. ఒక్కో దీవిని చుట్టి వస్తుంటే మనం ప్రకృతి ప్రపంచాన్ని చుట్టి వస్తున్న విజేతగా ఒకింత అతిశయంగా ఫీలవుతాం. అన్నట్లు చేపలతో ఫుట్ మసాజ్ సౌకర్యం కూడా ఒక దీవిలో ఉంది. చేపలు పట్టే అమ్మాయి మదుగంగలో ఒకమ్మాయి చిన్న తెడ్డు పడవలో చేపలు పడుతూ కనిపించింది. ‘నువ్వు ఆడపిల్లవి, ఈ పనులు నువ్వు చేసేవి కాదు’ అని అడ్డగించే వాళ్లు లేకపోతే అమ్మాయిలు ఏ పనిలోనైనా అద్భుతాలు సాధిస్తారనిపించింది. ఆ అమ్మాయికి హాయ్ చెప్పి, మనసులోనే సెల్యూట్ చేసుకుని ముందుకు సాగిపోయాం. తిరుగు ప్రయాణంలో ఒక దీవి దగ్గర గబ్బిలాలు భయం గొల్పాయి. దీవి నిండా చెట్లకు తలకిందుగా వేళ్లాడుతూ నల్లటి పెద్ద పెద్ద గబ్బిలాలు. ఇంకొద్ది సేపు చూడాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ ఆ దృశ్యం ఆహ్లాదంగా అనిపించక ముందుకు సాగిపోయాం. ఇక్కడ ముందుకు సాగిపోవడం అంటే బయలుదేరిన ప్రదేశం వైపుగా అన్నమాట. పడవ దిగేటప్పటికి రెస్టారెంట్లో వంట సిద్ధంగా ఉంది. రివర్ సఫారీకి బయలుదేరేటప్పుడే ఫుడ్ ఆర్డర్ తీసుకున్నారు. రకరకాల కూరగాలయలను కొబ్బరి పాలతో ఉడికించిన కూరలతో మంచి భోజనం పెట్టారు. చేపల కూర కూడా రుచిగా ఉంది. ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్... మాన్‌గ్రోవ్ బారుల మధ్య నదిలో విహారం అద్భుతంగా ఉంటుంది. చెట్లు ఒక్కో చోట నదిని ఇరుకు చేస్తాయి. గుహలోకి వెళ్లినట్లు పడవ కొమ్మల మధ్య దూరి పోతుంది. నది మీద ఇనుప వంతెనలుంటాయి. వాటి దగ్గరకు వచ్చినప్పుడు దేహాన్ని బాగా వంచి పడవలో ఒదిగి కూర్చోవడం, చిన్నపిల్లల్లాగ భయంభయంగా వంతెన వెళ్లిపోయిన తరవాత పైకి లేవడం, ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్... లండన్ బ్రిడ్జి ఫాలింగ్ డౌన్ అని పాడుకున్నట్లే... ఈ రివర్ సఫారీలో ‘కమింగ్ సూన్ కమింగ్ సూన్ వన్మోర్ బ్రిడ్జ్ ఈజ్ కమింగ్ సూన్’ అని పాడుకుంటూ పడవలో దాక్కోవడం... పర్యాటకులను చిన్న పిల్లలను చేస్తుంది. – వాకా మంజులారెడ్డి (చదవండి: పర్యాటకుల స్వర్గధామం కోనసీమ, ఆతిథ్యం నుంచి ఆత్మీయత వరకు..) -
గోదావరి అందాలు.. ఒక్కసారి చూస్తే మైమరిచిపోవాల్సిందే!
కోనసీమ అందాల సీమ. బంగాళాఖాతం తీరాన్ని ఆనుకుని.. సప్త నదీపాయల మధ్య కొలువైన సీమ. పచ్చని తివాచీ పరిచినట్టు ఉండే చేలు, కొబ్బరితోపులు, గోదావరి నదీపాయలు, వంపులు తిరుగుతూ పారే పంట కాలువలు, తెరచాప పడవలు, ప్రసిద్ధి చెందిన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, మడ అడవులు, గోదావరి మధ్య లంక గ్రామాలు, మండువా లోగిళ్లు, రైతుల మకాంలు.. వీటన్నింటికీ మించి ఆత్మీయత, మమకారంతో కలిసిన ఆతిథ్యం ఇలా చెప్పుకుంటూ పోతే కోనసీమ పర్యాటకులకు స్వర్గధామం. రైతులు, కూలీలు, మత్స్యకారులు, మహిళల జీవనం విధానం, కట్టూబొట్టూ, పండగలు, పబ్బాలు, జాతరలు.. ఇలా ఇక్కడ అన్నింటా ఒక ప్రత్యేక ముద్ర. ఇటీవల కాలంలో గోదావరి, సముద్ర తీరంలో వెలుస్తున్న రిసార్ట్స్, రైతుల పొలాల వద్ద ఫామ్ హౌస్‌లు, పర్యాటక రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం వంటి చర్యల కారణంగా కోనసీమకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ‘సప్త’వర్ణాల కోనసీమ.. పర్యాటకంగా కూడా ‘సప్త’రకాలుగా ఆకట్టుకుంటోంది. సెప్టెంబరు 27 ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా కథనం. ఆధ్యాత్మికంగా.. ఆధ్యాత్మిక రంగంలో కోనసీమ జిల్లాకు ప్రముఖ స్థానం ఉంది. లెక్కలేనన్ని ఆలయాలు, పురాణ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు కోనసీమ సొంతం. వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక విమానాలలో భక్తులు వస్తున్నారు. వీటితోపాటు అంతర్వేది లక్ష్మీ నర్శింహస్వామి, మందపల్లి శనీశ్వర స్వామి, అయినవిల్లి శ్రీ విఘేశ్వరస్వామి, అప్పనపల్లి బాలబాలాజీ, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వచ్చే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. బౌద్ధులు.. రాజుల చారిత్రక ఆనవాళ్లు చారిత్రాత్మక ప్రదేశాలలో పర్యాటకానికి వస్తే రామచంద్రపురంలో 17వ శతాబ్ధం నాటి కోట ఉంది. మామిడికుదురు మండలం ఆదుర్రులో క్రీస్తు పూర్వం రెండవ శతాబ్ధం నాటి పురాతన బౌద్ధ స్థూపాలున్నాయి. కపిలేశ్వరపురం జమీందార్ల పురాతన భవనాలు, రాజుల కోటలను తలపించే మండువా లోగిళ్ల ఇళ్లు పర్యాటకులకు ముచ్చటగొల్పుతాయి. అగ్రి టూరిజం పర్యాటకంలో ఇటీవల కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది అగ్రి టూరిజానికే. దేశంలో కేరళలో మొదలైన ఈ పర్యాటకం విస్తరిస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని ఐటీ వంటి రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు చేసేవారు ఒత్తిడి నుంచి బయటపడేందుకు అగ్రి టూరిజం బాట పడుతున్నారు. ఇటువంటి వారికి కోనసీమ అగ్రి టూరిజం ఒక అద్భుతం. పచ్చని తివాచీ పరచినట్టు ఉండే వరిచేలు, కొబ్బరి, అరటి తోటలు, లంక గ్రామాల్లో పలు రకాల పంటలు, పాడి, ఆక్వా చెరువులు, తోటల్లోని రైతుల మకాం (వ్యవసాయ శాలలు) విశేషంగా ఆకర్షిస్తాయి. గోదావరి హొయలు గోదావరి నదీ అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. నది మధ్యలో లంక గ్రామాలు, వాటిలో సాగయ్యే పంటలు, ఇసుక తిన్నెలు, చెంగుచెంగున ఎగిరే కృష్ణ జింకలు, తెరచాప పడవలు, పంటులు, హౌస్బోట్లపై సాగే ప్రయాణం, నదీపాయలపై వంతెనలు.. గోదావరి కాలువలకు లాకులు,ఇలా చెప్పుకుంటూ పోతే గోదావరి హొయలు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మైమరపించే మడ అడవులు ఐ.పోలవరం మండలం భైరవపాలెం నుంచి అంతర్వేది సముద్ర తీరం వరకు నదీపాయలతోపాటు, మురుగునీటి కాలువలు సముద్రంలో కలిసే ప్రాంతాలలో ఉన్న మడ అడవులలో పర్యాటకం అద్భుతమనే చెప్పాలి. నదీ, కాలువ పాయల మధ్య మడ అడవులు మీదుగా సాగే ప్రయాణం మధురానుభూతిని పంచుతుంది. ఆతిథ్యం అద్భుతం అతిథి మర్యాదంటేనే గోదావరి జిల్లాలు. మరీ ముఖ్యంగా కోనసీమ ఆహారం.. అతిథ్యానికి ఫిదా అవ్వాల్సిందే. పర్యాటకుల జిహ్వ చాపల్యాన్ని తీర్చే రకరకాల స్వీట్లు, హాట్లు, టిఫిన్లు, బిర్యానీలు, మాంసహార కూరలు ఎన్నో.. ఎన్నెన్నో. ఆత్రేయపురం పూతరేకులు.. అవిడి పాలకోవా, మినప రొట్టి, చెరుకుపానకం, పెసరెట్టు ఉప్మా, పనస పొట్టు కూర, ముద్దపప్పు.. గుమ్మడి పులుసు, ఉల్లి గారెలు... నాటు కోడి కూర, చుక్కపీత ఇగురు.. పులసల పులుసు ఇలా ఎన్నో రకాల వంటకాలు పర్యాటకులను లోట్టలు వేయిస్తాయి. -
విశాఖ అందాలు..మంత్రముగ్ధులను చేసే సాగర కెరటాల హోయలు
విశాఖపట్నం: కై లాసగిరి కొండ అంచు నుంచి సాగర కెరటాల హోయలను చూస్తూ నైట్ స్టే చేస్తే.. కొండపై నుంచి విశాఖ అందాలను చూస్తూ నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఆరగిస్తుంటే.. ఊహించుకోడానికే ఎంతో బాగుంది కదూ.. సముద్ర తీరాన భారీ నౌకలో అతిథ్యం.. కారవాన్‌లో విహారం.. విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించేలా నేచ్యురల్ హిస్టరీ పార్కు.. సైన్స్ మ్యూజియం.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. పర్యాటకులను మంత్రముగ్ధులను చేసేలా వినూత్న, బృహత్తర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి తోడు దిగ్గజ సంస్థలు విశాఖలో 7 స్టార్ హోటళ్లు, రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్లు, షాపింగ్ మాల్స్ నిర్మాణాలకు పోటీ పడుతున్నాయి. విశాఖ కేంద్రంగా త్వరలోనే పాలన ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆతిథ్య రంగం మరింతగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్‌లో విశాఖలో అలరించే సరికొత్త ప్రాజక్టుల వివరాలతో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. ఎటు చూసినా అందమే.. ఎటు చూసినా ఆనందమే.. చూసే కనులకు మనసుంటే.. ఆ మనసుకు కూడా కళ్లుంటే.. అని చెప్పిన సినీ కవి మాటలు.. అచ్చుగుద్దినట్లు ప్రకృతి రమణీయతతో ఓలలాడే విశాఖకు సరిపోతాయి. విశాఖను చూసేందుకు దేశ, విదేశాల పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఒకవైపు విశాఖ అభివృద్ధితో పాటు మరో వైపు పర్యాటకంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రాజెక్ట్‌లను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కొన్ని కార్యరూపం దాల్చగా.. మరికొన్ని సమగ్ర నివేదిక దశలో.. ఇంకొన్ని ప్రణాళికల దశలో ఉన్నాయి. నగరం నుంచి భీమిలి వరకు సుదీర్ఘ తీర ప్రాంతం ఉండడంతో పలు బీచ్‌ల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. రుషికొండ బీచ్‌లో చేపట్టిన అభివృద్ధితో ప్రతిష్టాత్మక బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ లభించింది. విశాఖపై దిగ్గజ సంస్థల ఆసక్తి అతిథ్య రంగంలో విశాఖ ఇప్పటికే తనదైన ముద్ర వేస్తోంది. నగరంలో త్రీస్టార్ నుంచి ఫైవ్‌స్టార్ హోటళ్లు అనేకమున్నాయి. విశాఖ కేంద్రంగా పరిపాలన కార్యకలాపాలు ప్రారంభమైతే ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల తాకిడి పెరుగుతుంది. తద్వారా హోటళ్లు, రిసార్టుల వ్యాపారం రెట్టింపవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి తగ్గట్టుగానే విశాఖలో దిగ్గజ అతిథ్య రంగ సంస్థలు ఒబెరాయ్, మేఫెయిర్ సంస్థలు 7 స్టార్ హోటళ్ల నిర్మాణానికి ముందుకొచ్చాయి. ఒబెరాయ్ సంస్థ భీమిలి మండలం అన్నవరంలో 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.350 కోట్ల వ్యయంతో విల్లా రిసార్టుల నిర్మాణం చేపడుతోంది. ఈ రిసార్టు పనులకు ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేశారు. అలాగే భీమిలి మండలం అన్నవరంలోనే మేఫెయిర్ సంస్థ 40 ఎకరాల్లో రూ.525 కోట్లతో 7 స్టార్ హోటల్‌తో పాటు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ముందుకొచ్చింది. వీటితో పాటు వీఎంఆర్డీఏ పార్కు వెనుక మైస్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. భవిష్యత్‌లో విశాఖ అతిథ్య రంగానికి ఉన్న డిమాండ్‌కు ఈ సంస్థల రాకే నిదర్శనం. వైద్య, ఆధ్యాత్మిక పర్యాటకంపై దృష్టి విశాఖలో వైద్య, ఆధ్యాత్మిక పర్యాటకంపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. సింహాచలం, కనకమహాలక్ష్మి దేవస్థానాలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నారు. ప్రసాదం స్కీమ్‌లో భాగంగా సింహాచలం ఆలయం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇక్కడ ప్రాచీన ఆలయాలను సర్క్యూట్‌గా చేసి స్పిరిచ్యువల్ టూరిజంను అభివృద్ధి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాలన ప్రారంభమైతే నగరానికి పెద్ద ఎత్తున పర్యాటకులు పెరిగే అవకాశాలు ఉంటాయి. తద్వారా విమాన సర్వీసులు కూడా రెట్టింపవుతాయి. అంతర్జాతీయ విమానాల సంఖ్య పెరగడం ద్వారా మెడికల్, స్పిరిచ్యువల్ టూరిజంకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. పర్యాటకంలో విశాఖకు అవార్డుల పంట దొండపర్తి: పర్యాటకంలో విశాఖకు అవార్డుల పంట పండింది. రాష్ట్ర వార్షిక టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డులను వివిధ కేటగిరీల కింద విశాఖలో ఉన్న హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లు, ట్రావెల్ సంస్థలు సొంతం చేసుకున్నాయి. బెస్ట్ 5 స్టార్ హోటల్‌గా రాడిసన్ బ్లూ అవార్డును దక్కించుకుంది. అలాగే 4 స్టార్ విభాగంలో హోటల్ దసపల్లా, బెస్ట్ బడ్జెట్ హోటల్‌గా ఎలిగంట్ హోటల్, బెస్ట్ హరితా హోటల్‌గా అరకు హరిత వ్యాలీ రిసార్ట్, బెస్ట్ హోటల్ బేస్డ్ మీటింగ్ వెన్యూగా వరుణ్బీచ్ నోవోటెల్, బెస్ట్ రెస్టారెంట్ ఇన్ హోటల్‌గా గ్రీన్‌పార్క్‌లో మెకాంగ్ రెస్టారెంట్, బెస్ట్ స్టాండ్–అలోన్ రెస్టారెంట్‌గా టైకూన్ అండ్ హెరిటేజ్ రెస్టారెంట్, బెస్ట్ స్టాండ్ అలోన్ కన్వెన్షన్ సెంటర్‌గా వైజాగ్ కన్వెన్షన్స్ అవార్డును సొంతం చేసుకున్నాయి. అలాగే బెస్ట్ ఇన్‌బౌండ్ టూర్ ఆపరేటర్(డొమస్టిక్)గా ట్రావెల్ హోం, బెస్ట్ ఇన్‌బౌండ్ టూర్ ఆపరేటర్‌గా ట్రావెల్ ఐక్యూ గ్లోబల్ సొల్యూషన్స్, మోస్ట్ ఇన్నోవేటివ్ ఇన్‌బౌండ్ టూర్ ఆపరేటర్‌గా హాలిడే వరల్డ్, బెస్ట్ టూరిజం ప్రమోషన్ కొల్లాటిరల్ పబ్లిసిటీ మెటీరియల్‌గా విశాఖపట్నం పాకెట్ టూరిస్ట్ గైడ్, మోస్ట్ ఇన్నోవేటివ్ యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/బెస్ట్ టూరిజం వెబ్‌సైట్‌గా యో వైజాగ్‌కు అవార్డులు లభించాయి. అతిథ్య రంగానికి మహర్దశ విశాఖలో పరిపాలన ప్రారంభమైతే అతిథ్య రంగానికి మహర్దశ పడుతుంది. ప్రముఖుల రాకతో హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్ల వ్యాపారం బాగుంటుంది. తద్వారా అనేక సంస్థలు విశాఖలో హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి రూ.కోట్ల పెట్టుబడులతో ముందుకొస్తాయి. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పర్యాటక, ఆతిథ్య రంగం అభివృద్ధి చెందితే దాని ప్రభావంతో అన్ని రంగాలు కూడా పుంజుకుంటాయి. – పవన్ కార్తీక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హోటల్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా.. ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే విశాఖలో అతిథ్య రంగం పుంజుకుంది. ఒబెరాయ్, మేఫెయిర్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో 7 స్టార్ లగ్జరీ హోటళ్లు నిర్మాణానికి ముందుకొచ్చాయి. వీటితో పాటు మెడికల్, స్పిరిచ్యుటవల్ టూరిజంపై కూడా దృష్టి పెడుతున్నాం. విశాఖలో పర్యాటక రంగం అభివృద్ధి చెందితే తద్వారా పెట్టుబడులు, దాంతో ఉద్యోగావకాశాలు విపరీతంగా పెరుగుతాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఆ దిశగా పర్యాటక శాఖ అడుగులు వేస్తోంది. – శ్రీనివాస్ పాని, రీజినల్ డైరెక్టర్, పర్యాటక శాఖ -
Karnataka Sakaleshapura : సకలేశపుర చూడడానికి రెండు కళ్లు చాలవు.!
బనశంకరి: కన్నడనాట సుందరమైన పర్యాటక ప్రాంతాలకు కొదవలేదు. కొంచెం ఓపిక చేసుకుని వెళితే జీవితాంతం గుర్తుంచుకునే మధురమైన పర్యాటక యాత్రలు చేయవచ్చు. ఇదే కోవలోకి వస్తుందని హాసన్ జిల్లాలోని సకలేశపుర హిల్‌స్టేషన్. సకలేశపుర బెంగళూరు నుంచి 220 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇది పశ్చిమకనుమల్లో కలిసిపోయిన ఒక చిన్న పర్వత ప్రాంతం. టూరిస్టులకు ఎంతో డిమాండ్ ఉన్న విహార స్థలంగా మారింది. ఈ ప్రాంత ఇటు బెంగళూరు అటు మైసూరుకు సమీపంలో ఉండటం వల్ల వారాంతాల్లో టూర్ కు చాలా అనువైన ప్రదేశం. సకలేశపుర పట్టణం సముద్రమట్టానికి 949 మీటర్లు ఎత్తున ఉండి బెంగళూరు, మైసూరు నుంచి తేలికగా ప్రయాణించేలా ఉంటుంది. పర్యాటకులకు ట్రెక్కింగ్‌కు తగినట్లుగా ఉంటుంది. పర్యాటకులు బిస్లే అభయారణ్యంలో యువత, దేశ విదేశాల నుంచి వచ్చే యువ పర్యాటకులు ట్రెక్కింగ్ చేసి ఆనందిస్తారు. ఆ అందాలకు అంతే లేదు సకలేశపుర సమీపంలో అద్భుతమైన ఆకుపచ్చదనం కప్పుకున్న ఎత్తైన కొండలు, కాఫీ తోటలు పరుచుకున్న లోయలతో పర్యాటకులను ఆహ్వానిస్తాయి. ఈ రెండింటి మధ్యలో ఉండే సన్నటి ఘాట్‌రోడ్‌పై మలుపులు తిరిగే ప్రయాణం మరచిపోలేని అనుభూతి కలిగిస్తుంది. దట్టమైన అడవులు, ఆకాశాన్ని తాకుతున్నట్లు అనిపించే ఎత్తైన వృక్షసంపద ఆహా అనిపిస్తాయి. జలపాతాల హోరు కొండల్ని చీల్చుకుంటూ రైలుపట్టాల ఏర్పాటుకోసం తవ్విన గుహలు, పాయల గుండా హోరెత్తుతుంటాయి. అప్పుడప్పుడూ శబ్దం చేస్తూ దూసుకొచ్చే రైళ్లు పర్యాటకులను పలకరిస్తాయి. Green Route is a railway segment along the Bengaluru - Mangaluru railway line from Sakaleshpura to Kukke Subramanya. It is 52 km long, with 57 tunnels and 109 bridges, and is also a Trekkers Paradise.♥️ 📸Credit: Insta: Rajography 🙏#VisitUdupipic.twitter.com/uqyFpHsVLd — Visit Udupi (@VisitUdupi) April 20, 2022 ఆ పేరెలా వచ్చిందంటే హాసన్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో గల సకలేశపుర ఊరు చిన్నదే. కాఫీ, యాలకులు, మిరియాల తోటలతో పాటు అక్కడక్కడ టీ తోటలతో సంపన్న ప్రాంతంగా కనిపిస్తుంది. పర్వతారోహకులకు స్వర్గం వంటిది సకలేశపుర. ఒకప్పుడు మైసూరు రాజుల పాలనలో ఉండేది వీరికి ముందు హొయసళులు, చాళు క్యులు పరిపాలించారు. హొయసళుల కాలంలో ఈ ప్రాంతానికి సకలేశపుర అనే పేరువచ్చింది. హొయసళులు అక్కడకు వచ్చినప్పుడు ఒక శివలింగం విరిగిపడి ఉండటం గమనించారని, అంతా ఈశ్వర మహిమ అని పేరు వచ్చేలా సకలేశ్పుర అని పేరు పెట్టారని స్థానికులు చెబుతారు. కానీ మరికొందరు పట్టణనివాసులు వ్యవసాయం వల్ల ధనికులు కావడంతో ఈ పేరు పెట్టారని కూడా చెబుతారు. సదాశివాలయం నాగారం శైలిలో ఉండే గోపురంతో సదాశివాలయాన్ని ఏకకూట నిర్మాణశైలిలో నిర్మించారు. ఈ పుణ్యక్షేత్రంలోని గర్భగుడిలో పెద్ద శివలింగం ఉంది. రాతి గవాక్షాలతో కూడుకున్న ఒక పెద్ద గుడిలో అందంగా చెక్కిన నందివిగ్రహం ఉంచారు. అక్కడికి చేరుకోగానే అమ్మవారి గుడి వద్ద శివాలయం బయట రెండు వినాయకుడి విగ్రహాలు ఉండటం గమనించవచ్చు. Workers at a construction site in Sakaleshpura of Karnataka found this idol of Sri Vasudev. Idol was secured after few minor damages. pic.twitter.com/px36IHjjuu — Chiru Bhat | ಚಿರು ಭಟ್ (@mechirubhat) March 25, 2021 పర్వతాల శ్రేణులు సకలేశపుర ప్రవేశంలోనే కాఫీ, టీ తోటల పరిమళాలు పర్యాటకులను స్వాగతం పలుకుతాయి. ఇక్కడ బిస్లే రిజర్వు ఫారెస్ట్, పుష్పగరి వైల్డ్ లైఫ్ సాంచురీ చూడవచ్చు. అందమైన పడమటి కనుమల శ్రేణి మైమరిపిస్తుంది. కుమారపర్వతం, పుష్పగిరి, దొడ్డబెట్ట, పట్టబెట్ట పర్వతాలను ఎంతసేపు చూసినా తనివి తీరదు. సాహసక్రీడలను ఆస్వాదించేవారు కుమార పర్వతం అధిరోహణానికి వెళ్లవచ్చు. Manjarabad Fort is a 8-sided, star-shaped fort built by ‘Tiger of Mysore’ Tipu Sultan in 1792 w/ help of French architects Manjarabad— translated as ‘beautiful scene’— is a picturesque site in Sakaleshpura, Hassan (Western Ghats) Appaji, Megha, & I had an adventure to remember pic.twitter.com/HrnTNr4YDW — Chetan Kumar Ahimsa / ಚೇತನ್ ಅಹಿಂಸಾ (@ChetanAhimsa) January 2, 2022 మంజూరాబాద్ కోట దగ్గరలో మంజురాబాద్ కోట ప్రధాన ఆకర్షణ. 1790లలో దీనిని టిప్పుసుల్తాన్ నిర్మించారు. ఆకాశం నుంచి చూస్తే ఇది నక్షత్ర ఆకారంలో కనిపిస్తుంది. టెక్నాలజీ లేని రోజుల్లో ఇంత కచ్చితత్వంతో నిర్మించడం అబ్బురమే. కోటలోకి వెళ్తే రహస్య సొరంగాలు అబ్బురపరుస్తాయి. అప్పట్లో ఇక్కడ టిప్పు సైన్యం ఉండేది. మధురం రైలు ప్రయాణం సకలేశపుర నుంచి 59 కిలోమీటర్ల దూరంలో కుక్కె వరకు రైలు మార్గంలో సాహసయాత్ర మధురానుభూతి లభిస్తుంది. బెంగళూరు నుంచి సకలేశపుర –సకలేశపుర నుంచి కుక్కేకు రైలులో పరుగులు తీస్తుంటే పులకించే సంఘటనలు ఎదురవుతాయి. చిక్కని అడవి మధ్యలో పెద్దపెద్ద చీకటి సొరంగాల మధ్య నుంచి రైలు వెళ్తుంది. ఆ సమయంలో ప్రయాణికులు పిల్లా పెద్ద భేదం మరచి కేరింతలతో సందడి చేస్తారు. Railways introduces Vista-dome coaches on Bengaluru - Mangalore train route. Most beautiful journey. Sakaleshpura to Subramanya ghat is breathtaking! Don’t miss the train during Monsoon! #Karnataka pic.twitter.com/uyYRNiOboX — DP SATISH (@dp_satish) July 11, 2021 ఎలా వెళ్లాలి సకలేశపుర మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉంది. మంగళూరు, బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, టూరిజం విభాగం వాహనాలు వెళ్తాయి. రైలు సౌకర్యం కూడా ఉంది. -
చంటి బిడ్డతో ప్రయాణమా? మీకోసమే 'ట్రావెల్ విత్ కిడ్స్'
ప్రయాణాల మీద బోలెడు ఆసక్తి ఉన్నప్పటికీ పిల్లలు ఒక వయసు వచ్చాకగానీ ఇల్లు దాటని తల్లులు ఎందరో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, డెంటిస్ట్‌లు సాక్షి గులాటీ, నికిత మాథుర్‌లు యంగ్ మదర్స్ కోసం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ అనే ట్రావెల్ గ్రూప్‌ను ప్రారంభించారు. ప్రయాణాలలో తల్లీపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు... సాక్షి గులాటీ, నికిత మాథుర్‌లు పర్యాటక ప్రేమికులు. వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా సరే ప్రయాణాలకు మాత్రం దూరంగా ఉండేవారు కాదు. నాలుగున్నర సంవత్సరాల క్రితం సాక్షి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లడానికి ఆలోచనలు చేస్తున్నప్పుడు ‘చంటి బిడ్డతో ప్రయాణమా!!’ అని ఆశ్చర్యపోవడమే కాదు ప్రయాణాలు వద్దంటే వద్దన్నారు చాలామంది. ఒక బిడ్డకు తల్లి అయిన నికితకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎవరి మాటలు పట్టించుకోకుండా చెన్నైకి చెందిన సాక్షి తన మూడు నెలల బిడ్డతో కలిసి మహాబలిపురానికి వెళ్లింది. చాలా కాలం తరువాత పర్యాటక ప్రదేశానికి వచ్చింది. మరోవైపు బెంగళూరుకు చెందిన నికిత మూడు నెలల పిల్లాడితో కలిసి మైసూర్‌కు వెళ్లింది. ‘బేబీతో ప్రయాణం కష్టమని చాలామంది భయపెట్టారు. ఇది నిజం కాదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. మొదటి మూడు నాలుగు నెలలు మాత్రమే కష్టం’ అంటుంది సాక్షి. చెన్నైలో ఉండే సాక్షి, బెంగళూరులో ఉండే నికితలు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. ఒకే రకమైన వృత్తి, అభిరుచులు వారిని సన్నిహిత స్నేహితులుగా మార్చాయి. సినిమాల నుంచి పర్యాటకం వరకు ఇద్దరు స్నేహితులు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. అలా ఒకరోజు వారి మధ్య చంటిబిడ్డలు ఉన్న తల్లుల ప్రస్తావన వచ్చింది. మహిళల కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. సోలో ట్రావెలర్స్, సీనియర్ సిటిజన్లు... మొదలైన వారి కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. కాని మదర్స్ అండ్ కిడ్స్ కోసం మాత్రం లేవు. ఈ లోటును భర్తి చేయడానికి రెండు సంవత్సరాల క్రితం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ పేరుతో ట్రావెల్ గ్రూప్‌ను ప్రారంభించారు. తొలి ‘మదర్ అండ్ కిడ్స్’ ట్రిప్‌ను పాండిచ్చేరికి ప్లాన్ చేశారు. సాక్షికి పాండిచ్చేరి కొట్టిన పిండి. పాండిచ్చేరి ట్రిప్‌కు సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే మంచి స్పందన లభించింది. ఈ ట్రిపుల్ ఆరుగురు తల్లులు వారి పిల్లలను తీసుకువెళ్లారు. ఈ ప్రయాణం విజయవంతం కావడంతో ఇద్దరు స్నేహితులకు ఎంతో ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత వివిధ ప్రాంతాలకు సంబంధించి అయిదు ట్రిప్‌లు ప్లాన్ చేశారు. తమ వృత్తిలో బిజీగా ఉండే సాక్షి, నికితలు వీకెండ్స్‌లో ప్లానింగ్ చేస్తుంటారు. ‘చంటి బిడ్డలు ఉన్నారని ఇంటి నాలుగు గోడలకే పరిమితం కానక్కర్లేదు. బయటి ప్రపంచలోకి వస్తే కొత్త ఉత్సాహం, శక్తి వస్తాయి’ అంటున్నారు సాక్షి, నికిత. ‘పర్యాటక ప్రదేశాలకు వెళ్లి కొత్త అనుభూతిని సొంతం చేసుకునేలా చంటి బిడ్డల తల్లులను ప్రేరేపించడం ఒక లక్ష్యం అయితే, ప్రయాణాలలో తల్లీబిడ్డలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం అనేది మా ప్రధాన లక్ష్యం’ అంటుంది నికిత. ఈ ట్రావెల్ గ్రూప్ ప్రత్యేకత ఏమిటంటే, ఒక ట్రిప్ ప్లాన్ చేయడానికి ముందు సాక్షి, నికితలలో ఒకరు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి వస్తారు. అక్కడి పరిస్థితులను అంచనా వేస్తారు. రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ‘ట్రిప్ బుక్ చేసుకున్న వారి కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. దీనిద్వారా తల్లుల ఆహారపు అలవాట్లతో పాటు వారి ఇష్టయిష్టాలు, తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకునే అవకాశం దొరికింది’ అంటుంది సాక్షి. చెన్నై. బెంగళూరు, ముంబై, జైపుర్, కోచి, కోల్‌కతా... ఇలా ఎన్నో నగరాల నుంచి తల్లులు ఈ ట్రిప్‌లలో భాగం అవుతున్నారు. తన పిల్లాడితో కలిసి పాండిచ్చేరికి వెళ్లిన దీపిక ఇలా అంటుంది... ‘ట్రిప్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఎప్పుడైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు తిండి సహించేది కాదు. ఈ ప్రయాణంలో మాత్రం ఇంటి తిండిని మరిపించేలా చేశారు. ఈ ట్రిప్ ద్వారా ఎంతోమంది స్నేహితులయ్యారు’ ట్రిప్‌ల ద్వారా పరిచయం అయిన వారు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి కలుసుకోవడం, ఆ కుటుంబంలో వ్యక్తిలా మారడం మరో విషయం. ‘కిడ్–ఫ్రెండ్లీగా లేవని కొన్ని ప్రదేశాలకు దూరంగా ఉంటాం. అయితే పిల్లలు మొరాకో నుంచి ఈజిప్ట్ వరకు ఎక్కడైనా సరే తమ ఆనందాన్ని తామే వెదుక్కుంటారు. పిల్లలు పార్క్‌లు, జూలలలో మాత్రమే ఆనందిస్తారనేది సరికాదు’ అంటుంది సాక్షి. సింగిల్ మదర్స్ ఈ ట్రిప్స్‌పై ఆసక్తి ప్రదర్శించడం మరో కోణం. స్థూలంగా చెప్పాలంటే ‘ట్రావెల్ విత్ కిడ్స్’ తల్లుల పర్యాటక సంతోషానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఒకే రకంగా ఆలోచించే వారిని ఒక దగ్గరికి తీసుకువచ్చింది. కొత్త స్నేహితుల రూపంలో కొత్త బలాన్ని కానుకగా ఇస్తోంది. -
పర్యాటకులతో సందడిగా ఉండే ఆ బీచ్..హఠాత్తుగా మూతపడింది!
పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన ఆ బీచ్ సడెన్‌గా మూతపడింది. పర్యాటకులను ఎంతగానే ఆకర్షించే ఆ బీచ్ నిశబ్ధంలోకి వెళ్లిపోయింది. కారణం వింటే నిజంగా షాకవ్వుతారు. ఎప్పుడూ మళ్లీ ఇదివరుకటి రోజుల్లా ఆ బీచ్ ఉంటుందా అని చాలామంది పర్యాటకులు ఎదురు చూస్తున్నారు. అసలు ఎందుకు ఆ బీచ్ క్లోజ్ అయ్యింది? మంచి ఆదాయాన్ని ఇచ్చేదే పర్యాటక రంగం. అందులోనూ పర్యాటకానికి పేరుగాంచిన బీచ్‌లు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరీ అలాంటి బీచ్ ఎందుకు అలా మూగబోయింది. దాగున్న రహస్యం ఏంటంటే.. థాయ్‌లాండ్‌లోని కో ఫై ఫై లేహ్ ద్వీపంలో కొండల మధ్య ఉన్న "మాయా బే బీచ్" మంచి పర్యాటక స్పాట్‌గా పేరు. పగడపు దీవులకు ప్రసిద్ధిగాంచింది. ఈ మాయా బే పర్యాటకులను ఎంతగా ఆకర్షిస్తుందంటే చుట్టూ ఉన్న దట్టమైన మొక్కలు, నీలిరంగులో స్పష్టంగా కనిపించే నీళ్లు, బంగారు ఇసుక చూస్తే.. భూతల స్వర్గంలా ఉంటుంది. ఎప్పుడూ నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండేది. అయితే ధాయ్ అధికారులు ఒక రోజు సడెన్‌గా మూసేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఏదో కొన్ని రోజులు అన్నుకున్నారు అక్కడున్న నగరవాసులు కానీ నిరవధికంగా ఏళ్ల పాటు మూతపడిపోయింది. రూ. 100 కోట్లకు పైగా ఆదాయం నిజానికి ధాయ్ అధికారులు ఈ బీచ్‌ని మూసేయడానికి ఇష్టపడలేదు. కానీ పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లుసంబంధిత ఆధారాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు అధికారులకి. థాయ్‌లాండ్‌కి పర్యాటకంగా ఈ బీచ్ నుంచే ఏకంగా రూ. 100 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. ఇక్కడకు పర్యాటకులు కారణంగా వేలాది బోట్లు వచ్చేవి. దీంతో కాలుష్యం ఏర్పడిందని, బీచ్ అంతా చెత్త చెదారంతో నిండిపోయింది. పర్యాటకుల తాకిడి కారణంగా అక్కడ ఉండే పగడపు దిబ్బలకు నష్టం వాటిల్లింది. పెద్ద సంఖ్యలో పగడపు దిబ్బలు మాయం అయినట్లు నిపుణులు అంచనా వేశారు. దీంతో థాయిలాండ్ జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణులు,మొక్కల సంరక్షణ విభాగం అధికారులు బీచ్ మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు మూత వేయబడుతుందని ప్రకటించారు. మొదట నాలుగు నెలలు అన్నారు అలా ఏకంగా నాలుగేళ్లు మూతపడిపోయింది. మళ్లీ ఇటీవలే గత మే నెల నుంచి రీ ఓపెన్ అయ్యింది. ఏదీ ఏమైనా..మంచి ఆదాయ మార్గమని పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం మంచిదే కానీ దాంతో పర్యావరణ స్ప్రుహ ఉండటం అత్యంత ముఖ్యం అని చాటి చెప్పారు ఈ థాయ్ అధికారులు. (చదవండి: పూజారి కమ్ బైక్ రేసర్.. ఒకేసారి రెండు విభిన్న రంగాల్లో..) -
పగలు పూజారి.. రాత్రిళ్లు బైక్ రేసర్!
ఒకేసారి రెండూ విభిన్న రంగాల్లో రాణించడం అందరికీ సాధ్యం కాదేమో. కొందరూ మాత్రం వాటిని అలవోకగా సాధిస్తారు. వారు ఉన్న రంగానికి ఎంచుకున్న రంగానికి చాలా తేడా ఉంటుంది. చూసే వాళ్లు సైతం ఇది నిజమా అని ఆశ్చర్యపోయాలా సమర్థవంతంగా దూసుకుపోతారు. అభిరుచిని వదులోకోవాల్సి అవసరం లేదు మనం ఎందులో ఉన్న మన కలను నిజం చేసుకోవచ్చు అని తెలియజెప్పుతారు కొందరూ వ్యక్తులు. ఆ కోవకే చెందుతారు కేరళకు చెందిన ఓ పూజారి. వివరాల్లోకెళ్తే..కేరళలో కొట్టాయం జిల్లాకు చెందిన ఉన్ని కృష్ణన్ పగలు ఆలయంలో పూజరిగా విధులు నిర్వర్తిస్తుంటాడు. అతను ఓ సాధారణ పూజరి మాత్రమే కాదు. అతనిలో ఓ రైసర్ కూడా దాగున్నాడు. రాత్రిళ్లు ఎక్స్‌పల్స్ 200 మోటార్ బైక్‌పై రయ్ మంటూ దూసుకుపోతుంటాడు. అతను గ్లోవ్స్, బూట్లు, హెల్మెట్ ధరించి ఓ రైసర్లా దూసకుపోతుంటాడు. అతని గురించి తెలుసుకున్న స్థానికులు సైతం ఆశ్చర్యపోయారు. ఉన్నికృష్ణన్న్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకున్న విద్యావంతుడు. Temple priest at dawn, dirtbike racer by dusk.Meet Unnikrishnan (34), melshanti of Pudhukkulamgara Devi temple in Kottayam, Kerala, an avid motorcross rider who recently raced in INRC 2023 in Coimbatore. A former IT engineer, this priest-racer is training for a race in Bengaluru pic.twitter.com/9c3TJ2WtKl— Petlee Peter (@petleepeter) August 14, 2023 2013 వరకు ఐటీ రంగంలో పనిచేశాడు కూడా. ఐతే అతడి మనసు ఎప్పుడూ ఆధ్యాత్మికత వైపే వెళ్తుండటతో ఇక ఈ రంగంలోకి వచ్చేశాడు. అదీగాక 2019లో పూజారి అయిన తన తండ్రి గతించడంతో ఉన్నికృష్ణన్ తన కుటుంబ సంప్రదాయ వృత్తిని తాను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 2021లో అధికారికంగా పుదుక్కులంగర దేవి ఆలయంలో పూజారిగా బాధ్యతలు తీసుకున్నాడు. 2023లో మోటార్ సైక్లింగ్‌లో లైసెన్స్ పొందడమే గాక కోయంబత్తూరులో జరిగిన ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని రేసర్‌గా తన సత్తా ఏంటో చూపించాడు. నిజంగా ఉన్ని కృష్ణన్ చూస్తే..అభిరుచికి లిమిట్స్ ఉండవు. మనిషిలో తగినంత సామర్థ్యం, ప్రతిభ ఉంటే ఏ ఫీల్డ్‌లో ఉన్నా గెలుపు తీరాన్ని అందుకోగలడని అవగతమవుతోంది కదూ. (చదవండి: సింగిల్‌గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే..) -
విధ్వంసంతో ఆస్తులే కాదు, ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి
వాతావరణంలో గత కొన్నాళ్లుగా వచ్చిన మార్పుల వల్ల, కుంభవృష్టి, క్లౌడ్ బరస్ట్ లాంటివి సాధారణం అయిపోయాయి. విస్తారంగా.. అంటే అనేక చోట్ల కురవాల్సిన వర్షం ఒకే చోట కురిస్తే ?అదీ.. కేవలం కొద్దిసేపట్లో, నాలుగైదు రోజుల్లోనే ఏడాదంతా పడాల్సిన వర్షమంతా పడితే? వాగులు, వంకలు నిండిపోతాయి. కొండచరియలు విరిగిపడతాయి. నదులు పొంగి పొర్లుతాయి. గత నెల రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి చోట్ల వర్షాలు సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు. దీని వల్ల వేల కోట్ల ఆస్తుల నష్టంతో పాటు వందల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ► జులై, ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో విహారయాత్రలు, తీర్థయాత్రలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా కొండ ప్రాంతాలకు పోవద్దు. చార్ధామ్, అమర్నాథ్ యాత్రలు చేయాలనుకునేవారు వర్షాకాలానికి ముందే ప్లాన్ చేసుకోండి. ► పొంగి ప్రవహిస్తున్న బ్రిడ్జిలు, కల్వర్ట్లు మొదలైన వాటిపై పయనించొద్దు. ప్రవహించే నీటి గతిశక్తిని తక్కువ అంచనా వేయొద్దు. నీరు వాహనంలోకి ప్రవేశిస్తే దాని బరువు పెరిగి, మునిగిపోతుంది. ► అనేక రాష్ట్రాల్లో రోడ్లు, వంతెనలు, డ్యాంల నిర్వహణ ఏమాత్రం బాగా లేదు. ఇప్పటికే అనేకం శిథిలావస్థకు చేరుకున్నాయి. దిగువ తట్టు ప్రాంతాల్లో ఉన్నవారు క్షేమంగా ఉండాలంటే, చెరువు కట్టలు, బ్యాములు సరిగా నిర్వహించేలా ప్రజాప్రతినిశులపై ఒత్తిడి తీసుకురండి. ఎందుకంటే.. అథిదులు ఇంటికొచ్చాక పంట పండించలేము కదా, అలాగే వర్షకాలంలో మేలుకుంటే సరిపోదు, డ్యాములు, బ్రిడ్జిలు లాంటి నిర్వహణ ఏడాది పొడవునా జరగాలి. ► ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో వీటి స్థితిపై స్ర్టక్చరల్ ఆడిటింగ్ జరగాలి. అవి ధృడంగా ఉన్నాయని ఇంజనీర్లు సర్టిఫై చేయాలి. లేకపోతే వానాకాలంలో నిద్రలోనే జలసమాధి అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది ► నదుల్లోకి దిగొద్దు. మీరు దిగినప్పుడు నీరు తక్కువ ఉండొచ్చు. కానీ ఎగువ ప్రాంతంలో డ్యాం తెరవడం, భారీ వర్షం లాంటి కారణాల వల్ల క్షణాల్లో నీటి ప్రవాహం పెరిగి ఉపద్రవం సంభవించవచ్చు. ► కొండమార్గాల్లో అంటే, ఘాట్రూట్లలో వర్షాకాలంలో ప్రయాణాలు వద్దు. భారీ వర్షాలు కురిసినప్పుడు పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడతాయి. ఒక పెద్ద బండరాయి క్షణాల్లో కిందకు వచ్చి అక్కడ పయనిస్తున్న వాహనాన్ని లోపలికి తీసుకొని వెళ్లిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. ►ఎక్కడో కొండప్రాంతాల్లో కాదు.మహానగరాల్లో జలప్రళయం సాధారణం అయిపోయింది. చెరువులు కుంటలు ఉన్న ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరుచుకోవద్దు . స్మార్ట్ ఫోనుల్లో కంపాస్ అనేది ఉంటుంది . అందులో చెక్ చేసుకొంటే మీరున్న ప్రాంతం ఎత్తు ఎంతో , ఇట్టే తెలిసిపోతుంది . ► రాబోయే రోజుల్లో జలప్రళయాలు సాధారణం అయిపోతాయి. ప్రభుత్వాలు కూడా లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవి నివాస యోగ్యం కావని ముందే హెచ్చరికలు జారీ చెయ్యాలి. ఇంట్లోకి నీళ్లు ప్రవేశిస్తే ఇంట్లోని సామాగ్రి మొత్తం పాడై వేలల్లో నష్టం జరుగుతుంది. పాములు, తేళ్లు, మొసళ్లు వంటివి ఇంట్లోకి వస్తే ప్రాణానికే ప్రమాదం. ► చెట్లు నాటడం, వన సంరక్షణ, డ్రైనేజీ వ్యవస్థలు, బ్రిడ్జిలు ఇతరత్రా మౌలిక సదుపాయాల నిర్వహణ ప్రభుత్వాలు బాధ్యత . వాటిని ఆయా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు వదలకుండా ఏటా ఇంత అని టార్గెట్ పెట్టి ఆ లక్ష్యాన్ని అందుకోవడం తప్పని సరి చేస్తూ పార్లమెంట్ చట్టం తేవాలి . లక్ష్యాన్ని అందుకొని ప్రభుత్వాల పై రాజ్యాంగ పరమయిన చర్యలు ఉండాలి . ► అహ నా పెళ్ళంట సినిమా లో కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ " నా కేంటి .. నా కేంటి " అంటుంటుంది . మనం పడవ లో పయనిస్తున్నాము . దానికి చిల్లు పడితే అందరం పోతాము . మనం బతకాలంటే మంది కూడా బతకాలి అనే ఇంగిత జ్ఞానం ప్రజల్లో రావాలి. ఆలా కాకపోతే ఒక వర్షాకాలం రాత్రికి రాత్రే ఒక భారీ డ్యాం పగిలి ఒక పెద్ద నగరం, అనేక గ్రామాలు కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. -వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, విద్యావేత్త -
ఆహ్లాదం.. ఆధ్యాత్మికం.. ఉడుపి
బనశంకరి: కన్నడనాట అందమైన తీరప్రాంతం ఉడుపి. ఇక్కడ పురాతన దేవాలయాలనుంచి అందమైన బీచ్‌లు, దట్టమైన అడవులు, ప్రకృతి సోయగాల వరకు అన్నీ చూడదగ్గ ప్రదేశాలే. ముఖ్యంగా శీతాకాలంలో ఈ ప్రాంతం ప్రధాన టూరిస్ట్ స్పాట్‌గా మారుతుంది. వర్షాకాలంలో కూడా చూడడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఉడుపి నగరం మంగళూరుకు 55 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరుకు పశ్చిమ దిక్కున 422 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఇది ఉడుపి జిల్లా కేంద్రమే కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం.అలాగే ప్రధాన పర్యాటక స్థలం ఈ నేపథ్యంలో ఉడుపి జిల్లా కర్ణాటకలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. సముద్ర రుచులు, సంప్రదాయ శాకాహార వంటకాలకు ఈ జిల్లా ప్రసిద్ధి. సువర్ణ నది– అరేబియా సముద్రం ఆనుకుని ఉండే కోడి బీచ్ ఇది సముద్రంలో సెయింట్ మేరీస్ ఐలాండ్స్ ఉడుపిలో మల్పె బీచ్ నుంచి కొన్ని కిలోమీటర్లు అరేబియా సముద్రంలో వెళితే సెయింట్ మెరీస్ దీవులను చేరవచ్చు. ఇది కూడా ప్రత్యేకమైన పర్యాటక స్థలం. మొత్తం నాలుగు ద్వీపాల సమూహాన్ని కోకోనట్ ఐలాండ్స్ అని కూడా అంటారు. ఇక్కడ ఉండే బసాల్ట్ రాళ్లు ఎవరో పేర్చినట్లుగా చక్కగా అమరి ఉంటాయి. ఇటువంటి రాళ్లు భారతదేశంలో మరెక్కడా లేవు. పెద్ద పెద్ద అలలతో కూడిన సముద్రంలో చిన్న చిన్న పడవల్లో ఈ దీవికి చేరుకోవాలంటే కొంచెం ధైర్యం ఉండాలి. ఇక మల్పే బీచ్ కూడా టూరిస్ట్‌స్పాట్. కోడి బీచ్.. సాగర సంగమం ఉడుపి నుంచి 36 కిలోమీటర్లు దూరంలో ఉండే కోడి బీచ్ కూడా ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం. ప్రశాంతమైన వాతావరణంలో ఉండే బీచ్‌కు తక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. దీంతో ఇక్కడ ప్రశాంతంగా ఆస్వాదించవచ్చు. ఈ బీచ్‌కు మూడుదిక్కులా సముద్రమే ఉండటంతో చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ సువర్ణా నది అరేబియా సముద్రంలో కలిసే సాగర సంగమం పాయింట్ కూడా ఉంది. సెయింట్ లారెన్స్ చర్చ్ సెయింట్ లారెన్స్ చర్చ్ ఉడుపి బస్టాండ్ నుంచి 18 కిలోమీటర్లు దూరంలోని అత్తూర్ చర్చ్ లేదా సెయింట్లారెన్స్ చర్చ్ కూడా సందర్శించాల్సిన ప్రాంతమే. ఇది రోమన్ క్యాథలిక్ చర్చ్ కావడం విశేషం.ఇక్కడ ఒక పాఠశాలతో పాటు అనాథాశ్రమం కూడా నిర్వహిస్తున్నారు. టిప్పు సుల్తాన్ కాలంలో ఇక్కడ ఒక కట్టడంలో క్రైస్తవులను బంధించారు. క్రైస్తవులు విడుదలైన తరువాత ఆ కట్టడాన్ని చర్చిగా నిర్మించుకొన్నారు. ఈ చర్చ్ మహిమ గల ప్రార్థనా మందిరంగా గుర్తింపు పొందింది. మల్పె బీచ్ నుంచి సముద్రంలోకి వెళ్తే కనిపించే సెయింట్ మేరీస్ ద్వీపం సుందర సముద్ర తీరాల విడిది శ్రీకృష్ణ ఆలయం.. 13 వ శాతాబ్దంలో నిర్మించిన శ్రీకృష్ణమఠం అని పిలిచే శ్రీకృష్ణుని ఆలయం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయాన్ని జగద్గురు శ్రీమద్వాచార్యులు స్థాపించారు. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే నవగ్రహ కిండి అని పిలిచే 9 రంధ్రాలతో కూడిన కిటికీ నుంచి నల్లనయ్యను దర్శించుకోవాలి. ఈ ఆలయాన్ని తెల్లవారుజామునుంచి రాత్రి 9 గంటల వరకు దర్శించుకోవచ్చు. భక్త కనకదాసుకు శ్రీకృష్ణుడు ఈ ఆలయంలో ప్రత్యేకంగా దర్శనమిచ్చాడని ప్రతీతి. మూకాంబికా అభయారణ్యం జిల్లాలోని కొల్లూరు సమీపంలో ఉండే మూకాంబికా అభయారణ్యం కూడా సందర్శించదగ్గ ప్రదేశం. పశ్చిమ కనుమలు ఉండే ఈ వన్యజీవి సంరక్షణ కేంద్రం జంతుప్రేమికులకు అమితంగా నచ్చుతుంది. మొత్తం పచ్చదనంతో నిండిన దట్టమైన అటవీప్రాంతంలో విహరించడం మంచి అనుభూతినిస్తుంది. అలాగే చుట్టుపక్కల మూకాంబికా దేవాలయం, అబ్బే వాటర్ ఫాల్స్, అరసినగుండి జలపాతం అలరిస్తాయి. తీరంలో మడ అడవుల్లో పడవల్లో విహారం కూడా చేయవచ్చు. -
కర్ణాటక వెళ్తే గెర్సొప్పా జలపాతం చూడాల్సిందే
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ జోగ్ (గెర్సొప్పా) జలాశయం ఎట్టకేలకు పరవళ్లు తొక్కుతోంది. నలభై రోజులుగా సరైన వర్షాలు లేకపోవడంతో నదులు, వాగులు, వంకలు వట్టిపోయాయి. దీంతో రాష్ట్రంలో ప్రముఖ జలపాతాలు మూగనోము పట్టాయి. అయితే సుమారు వారంరోజులుగా రుతుపవన వర్షాలు ముమ్మరం కావడంతో నదులు, వాగులకు కొత్త జీవం వచ్చింది. దీంతో శరావతి నదికి ప్రవాహం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో జోగ్ వద్ద శరావతి ప్రవాహంతో జలపాతం నురగలు కక్కుతోంది. 253 మీటర్ల ఎత్తు నుంచి జలధారలు పడుతుంటే నీటి తుంపరలు రేగి సుందరమైన దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి. దేశంలోనే ఇది రెండవ ఎత్తైన వాటర్ ఫాల్స్‌గా పేరు గడించింది. One of the most beautiful Waterfalls in the World.Jog Falls, located in Shimoga district of Karnataka, India🇮🇳 pic.twitter.com/WtwEZzGNGW— Raghu (@IndiaTales7) September 14, 2022 పర్యాటకుల వరద జోగ్ సౌందర్యాన్ని చూడటానికి వేలాది పర్యాటకులు తరలి వస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో జోగ్ పరిసరాలు కిక్కిరిశాయి. మొన్నటివరకు నీరు లేక బోసి పోయిన జోగ్ జలపాతం కొత్తందాలను చూసి సందర్శకులు మురిసిపోయారు. పైగా ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతూ, పొగమంచు కొమ్ముకోవడంతో ఆ ప్రాంతంగా ఆహ్లాదమయం అయ్యింది. ఎక్కడెక్కడి నుంచో కార్లు, బస్సులు, బైక్‌లపై సందర్శకులు వచ్చారు. ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. Jogh falls very less water.. pic.twitter.com/aNCYinrBhJ— prathap cta (@PrathapCta) September 2, 2017 Sound of Jog Falls. Meditative. River Sharavathi has been like this for millions of years. Water to #Bengaluru will completely kill this indescribable beauty. If no excess water, no waterfalls. #Shimoga #Karnataka #Monsoon2019 pic.twitter.com/nxNEYLSYVZ— DP SATISH (@dp_satish) July 21, 2019 -
ఈ పల్లెటూరును చూడటానికి విదేశాల నుంచి వస్తుంటారు.. ఏమిటంత స్పెషల్?
ఊళ్లలోని దృశ్యాలు సాధారణంగా అంత అందంగా ఉండవు. ఊరికి అవతల ఉండే పొలాలు, తోటలు కొంత అందంగా కనిపించినా, ఊళ్లలోని వీథుల్లోకి అడుగుపెడితే చెత్తచెదారాలు తారసపడతాయి. ఇరుకిరుకు ఇళ్లు కనిపిస్తాయి. మన దేశంలోనే కాదు, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఊళ్లలోని దృశ్యాలు అంత అందంగా ఉండవు. ఊళ్లలోని పరిస్థితులు అంత అద్భుతంగానూ ఉండవు. అయితే, అందాల తేరులాంటి ఊరు ఒకటి ఉంది. బహుశా అది ప్రపంచంలోనే అత్యంత అందమైన ఊరు. అలాగని అదేమీ అంత ఘనమైన గ్రామం కాదు, మారుమూలనున్న కుగ్రామం. ఆ ఊరును చూస్తే, ఊరు కాదు ఉద్యానవనం అనుకుంటారు ఎవరైనా! ఇంగ్లండ్‌లో ఉన్న ఆ ఊరి పేరు బర్టన్–ఆన్–ద–వాటర్. కొత్తగా వచ్చే పర్యాటకులు చూడటానికి థీమ్పార్కులా కనిపించే ఈ ఊళ్లోకి అడుగుపెడితే, డబ్బులు అడుగుతారేమోనని జంకుతారు గాని, ఈ ఊళ్లోకి ప్రవేశం ఉచితం. ఈ సంగతిని ఈ ఊరి అధికారిక వెబ్సైట్ స్పష్టంగా చెబుతుంది. దాదాపు నాలుగువేల జనాభా ఉండే ఈ ఊళ్లోని ఇళ్లన్నీ పాతకాలం పద్ధతిలో నిర్మించిన పెంకుటిళ్లే! ఇక్కడి దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు పర్యాటకులను బాగా ఆకట్టుకుంటాయి. విండ్రష్ నది మధ్యలో ఉన్న ఈ గ్రామానికి చేరుకోవడానికి ఐదు వంతెనల మీదుగా దారులున్నాయి. రోడ్డు మార్గంలో లండన్ నుంచి ఇక్కడకు రెండుగంటల్లోగా చేరుకోవచ్చు. పరిశుభ్రమైన వీథులు, నది ఒడ్డున పచ్చిక బయళ్లు, చుట్టూ చెట్టూ చేమలతో నిండిన పరిసరాలతో బర్టన్–ఆన్–ద–వాటర్ భూతలస్వర్గాన్ని తలపిస్తుంది. ఇంగ్లండ్ వాసులతో పాటు, విదేశీ పర్యాటకులు కూడా ఈ ఊరిని చూడటానికి వస్తుంటారు. The charming village of Bourton-on-the-Water in Gloucestershire is known as the "Venice of the Cotswolds". Featured photo credit: Sussex-based photographer Daniel Beaumont pic.twitter.com/jDRiyzMCU5 — René Champion (@ReneChampion1) January 20, 2023 A Quiet Place Bourton-on-the-Water is a village and civil parish in Gloucestershire, England, that lies on a wide flat vale within the Cotswolds Area of Outstanding Natural Beauty. pic.twitter.com/NJLmFHJEP3 — Murphy (@cfmbetricky2) June 4, 2021 -
మూడు కొండలెక్కితేగానీ చేరుకోని ఆ ఆలయానికి..
హిందూ దేవుళ్లలో హనుమంతుని ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అంతా హనుమంతుడిని భక్తిగా కొలుస్తారు. అలాంటి హనుమంతుని జన్మస్థలంగా భావించే నాసిక్‌లో అంజనేరి కొండల వద్ద ఉన్న ఆ స్వామి గుడిని సందర్శించడాని భక్తులు ఎన్నో ప్రయాసలు పడి వెళ్లాల్సి వస్తోంది. నిటారుగా ఉన్న ఆ రహదారి వెంబడి వెళ్లాలంటే సుమారు రెండు నుంచి మూడు గంటలు పడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆలయానికి త్వరితగతిన చేరుకునేలా రోప్‌వే నిర్మించాలని నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో బ్రహ్మగిరి ట్రెక్కింగ్ పాయింట్ నుంచి అంజనేరి కొండల వరకు ఈ రోప్ వేని నిర్మించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏ1) పర్వరత్మల పథకం కింద ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టెండర్లను ఆహ్వానించింది. ఇక హనుమంతుని జన్మస్థలం అయిన అంజనేరి కొండలు వద్ద ఆ స్వామికి సంబంధించిన గుహ తోపాటు అంజనీమాత ఆలయం కూడా ఉంది. వీటిని యాత్రికులు, ట్రెక్కర్లు సందర్శిస్తారు. సుమారు 4 వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే మూడు పర్వతాలు ఎక్కాలి. ఇక్కడకు 5.7 కి.మీ పొడవున్న రోప్‌వే మూడు పర్వతాల మీదుగా వస్తే పైకి వెళ్లే ప్రయాణం కొన్ని నిమిషాలకు తగ్గిపోతుంది. కాగా, 2024 నాటికి మొత్తం 18 రోప్‌వే ప్రాజెక్టులను కేంద్ర ప్లాన్ చేస్తునట్లు సమాచారం. (చదవండి: కోడి ముందా.. గుడ్డు ముందా? ఎట్టకేలకు సమాధానం ఇచ్చిన శాస్త్రవేత్తలు) -
భూగర్భ హోటల్..అక్కడికి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే!
ఇంతవరకు ఎన్నో లగ్జరీ హోటళ్ల గురించి విని ఉంటాం. ఆకాశంలోనూ, సముద్రం అడుగున ఉండే అత్యంత ఖరీదైన హోటళ్లను చూశాం. కానీ భూగర్భంలో వేల అడుగుల లోతుల్లో హోటల్.. అంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఐతే అక్కడకి వెళ్లాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఒకరకంగా సాహసంతో కూడిన పని. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడుందంటే.. యూకేలో నార్త్ వేల్స్లో ఎరారీ నేషనల్ పార్క్‌లోని స్నోడోనియా పర్వతాల కింద ఉంది. భూగర్భంలో ఏకంగా 1,375 అడుగుల దిగువున ఉంది. అందుకే ఈ హోటల్ ప్రపంచంలోనే అత్యంత లోతుగా ఉండే హోటల్‌గా గుర్తింపు పొందింది. దీని పేరు 'డీప్ స్లీప్ హోటల్'. ఈ హోటల్‌కు వెళ్లడమే ఓ అడ్వెంచర్. ఎరారీ నేషనల్ పార్క్‌లో పర్వతాల కింద ఉండే ఈ హోటల్లో క్యాబిన్లు, రూమ్‌ల సెటప్ అదిపోతుంది. ఈ హోటల్లోకి వచ్చేక అక్కడ ఉన్న ఆతిథ్యాన్ని చూసి.. అక్కడకి చేరుకోవడానికి పడ్డ పాట్లన్నింటిని మర్చిపోతారు. ఇందులో ట్విన్ బెడ్లతో కూడిన నాలుగు క్యాబిన్లు, డబుల్ బెడ్‌తో ప్రత్యేకు గుహలాంటి రూములు అతిధులను మత్రముగ్దుల్ని చేస్తాయి. ఇక్కడ ఏడాది ఏడాది పొడవునా 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ..క్యాబిన్లకు థర్మల్ లైనింగ్ ఉండటంతో వెచ్చగానే ఉంటుంది. అయినప్పటికీ ఈ అండర్ గ్రౌండ్ హోటల్లో బస చేసేందుకు వెచ్చగా ఉండే దుస్తులనే ధరించాల్సి ఉంటుంది. ఆ హోటల్ కేవలం రాత్రి పూట బస చేయడానికి అతిథులను ఆహ్వానిస్తుంది. అదికూడా కేవలం శనివారం రాత్రి నుంచి ఉదయ వరకు మాత్రమే అక్కడ బస. ఈ హోటల్‌కి చేరుకోవడం అలాంటి ఇలాంటి ఫీట్ కాదు. ఓ సాహస యాత్ర. మొదటగా పర్యాటకులు పర్వతాల మీదకు కాలినడన శిఖరాన చేరకున్న తర్వాత హోటల్ నిర్వాహకులు భూగర్భంలోకి వెళ్లడానికి కావాల్సిన హెల్మెట్, లైట్, బూట్లు ఇతరత్రా వస్తువులకి సంబంధించి సంరక్షణ కిట్‌ని ఇస్తారు. వాటిని ధరించి గైడ్ సమక్షంలో బండ రాళ్ల వెంట ట్రెక్కింగ్ చేసుకుంటూ..మెట్ల బావులు, వంతెనలు దాటుకుంటూ కఠిన దారుల వెంట ప్రయాణించాలి. అలా ప్రయాణించక పెద్ద ఐరన్ డోర్ వస్తుంది. కానీ ఇక్కడకు పిల్లలకు మాత్రం 14 ఏళ్లు దాటితేనే అనుమతిస్తారు. ఇక ప్రైవేట్ క్యాబిన్లో ఇద్దరికి బస రూ. 36 వేలు కాగా , గుహ లాంటి గదికి గానూ రూ. 56 వేలు వెచ్చించాల్సి ఉంది. అయితే ఇక్కడకు వచ్చే పర్యాటకులు మాత్రం ఇంత పెద్ద సాహసయాత్ర చేసి ఆ హోటల్లో బస చేయడం ఓ గొప్ప అనుభూతి అంటున్నారు. అంతేగాదు తమ జీవితంలో మంచి నిద్రను పొందామని ఆనందంగా చెబుతున్నారు పర్యాటకులు. (చదవండి: ఈ టూర్ యాప్ మహిళల కోసమే.. ఇందులో ప్రత్యేకతలు ఏంటో చూసేయండి)