సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
- నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు!
- సెలవులో ఉన్నా కార్యాలయూనికి వచ్చిన సబ్ రిజిస్ట్రార్
- రూ.52 వేలు స్వాధీనం
తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం రాత్రి ఆకస్మిక దాడి చేశారు. నిబంధనలకు విరుద్దంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న సమాచారం మేరకు కార్యాల యంలో తనిఖీలు నిర్వహించారు. రికార్డులలో నమో దు చేయకుండా కార్యాలయంలో ఉన్న రూ.52 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడి ఆస్తినైనా.. ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అయినా రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో ఏలూరు సమీపంలోని వట్లూరు గ్రామంలో గల 30 ఎకరాల భూమిని ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సంబంధిత వ్యక్తులు వచ్చా రు. ఆ భూమికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు ఫిర్యాదు అందటంతో ఏసీబీ అధికారులు దాడి చేశారు.
ఇక్కడ సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్త్ను ఆర్.శ్రీనివాసరావు సెలవులో ఉండగా, కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పి.శేఖర్ ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన వద్ద రూ.80 మాత్రమే ఉన్నట్టు రికార్డుల్లో నమోదు కాగా, రూ.52 వేల నగదు అదనంగా ఉండటంతో ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో సెలవులో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆర్.శ్రీనివాసరావు కార్యాల యంలో ఉండటం విశేషం. వట్లూరు భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సెలవులో ఉన్న రిజిస్ట్రార్ పాత్రపై ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయూలంటే ఆర్‌వోఆర్, అడంగల్, టైటిల్ డీడ్ ఉండాలని, వట్లూరు భూములకు ఎలాంటి దస్తావేజులు లేకుండానే రిజిస్ట్రేషన్ చేశారని ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు విలేకరులకు తెలిపారు.
ఇలాంటి సందర్భాల్లో జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయూల్సి ఉందన్నారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న శేఖర్‌కు, సిబ్బందికి మధ్య అంతరాలు ఉన్నట్టు తమకు సమాచారం అందిందని ఆయన చెప్పారు. రిజి స్ట్రేషన్ చేయించుకునే వారినుంచి మామూళ్ల రూపంలో తీసుకునే మొత్తాలను కిందిస్థారుు సిబ్బందికి పంచని కారణంగా విభేదాలు పెరిగినట్టు తెలుస్తోందన్నారు. సోమవారం 30 రిజిస్ట్రేషన్లు జరిగాయని, వీటి నిమిత్తం రూ.52 వేల రూపాయలు అనామతుగా వచ్చినట్టుగా భావిస్తున్నామన్నారు. మొత్తం సమాచారాన్ని నివేదిక రూపంలో ఏసీబీ డెరైక్టర్ జనరల్‌కు పంపిస్తామని, అక్కడ నుంచి వచ్చే ఆదేశాలు, ప్రభుత్వ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయని డీఎస్పీ పేర్కొన్నారు. తనిఖీల్లో ఏసీబీ సీఐ యూజె విల్సన్ సిబ్బంది పాల్గొన్నారు.
సొమ్ములు లేకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు
సరైన పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సి ఉంటుందని, ఇందుకోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లో సొమ్ము చెల్లించాల్సిన పనిలేదని డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల విషయంలో ఎవరైనా సొమ్ము అడిగితే తమను సంప్రదించాలని కోరారు. ఇలాంటి సమాచారం ఉంటే తన నంబర్ 94404 46157 లేదా 94404 46158, సీఐ నంబర్ 94404 46159కు ఫోన్ చేయూలని సూచించారు.