నీలి చిత్రాలు, పైరసీ సీడీలు స్వాధీనం
భీమవరం అర్బన్ : స్థానిక టూటౌన్‌లోని పలు వీడియో సీడీ షాపులపై గురువారం పోలీసులు దాడులు చేశారు. శ్రీరామపురం, అడ్డవంతెన, డీఎన్నార్ కళాశాల రోడ్డుల్లోని మూడు షాపుల్లో ఏకకాలంలో దాడులు చేశారు. రెండు షాపుల్లో మొత్తం 163 నీలి చిత్రాల , 57 పైరసీ (కొత్త సినిమాల) సీడీలు లభ్యమయ్యాయి. టూటౌన్ సీఐ జయసూర్య మాట్లాడుతూ తమకందిన సమాచారం మేరకు గురువారం మూడు వీడియో, ఆడియో షాపులపై దాడులు చేశామన్నారు. శ్రీరామపురంలోని సాయికృష్ణ ఆడియో, వీడియో షాపులో 110 నీలి చిత్రాల, 50 పైరసీ సీడీలు లభ్యమయ్యాయని, వాటిని స్వాధీనం చేసుకుని యజమాని పి.హరిబాలకృష్ణను అరెస్టు చేసినట్టు తెలిపారు.
డీఎన్నార్ కళాశాల రోడ్డులోని గీత ఆడియో, వీడియో షాపులో 53 నీలిచిత్రాల, 7 పైరసీ సీడీలు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకుని యజమాని బొండా జగన్నాథాన్ని అరెస్టు చేసినట్టు చెప్పారు. అడ్డవంతెన సమీపంలోని మరో షాపులో తనిఖీ చేయగా అక్కడ పైరసీ, నీలిచిత్రాలు లభించలేదన్నారు. ఇకపై తరచుగా వీడియో, ఆడియో షాపులను తనిఖీ చేస్తూంటామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. సీఐ ఆధ్వర్యంలో ఎస్సైలు విష్ణుమూర్తి, శ్రీనివాసకుమార్ తమ సిబ్బందితో ఈ దాడులు చేశారు.