ఏది బెటరు?
ఏది బెటరు?
Published Mon, Jan 27 2014 2:46 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన చీపురుపల్లి భయపెడుతోందా? ఎస్.కోట రావద్దందా? కాలం కలిసిరాకపోతే తాడే పామై భయపెడుతుందన్న చందాన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని శాసించే స్థాయికి ఎదిగిన పీసీసీ చీఫ్,మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితి తయారైంది. ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్‌పై ఆయన ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎం దుకొచ్చిన తలనొప్పి అని భావించిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటేనే మేలని భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులతో పెద్దల సభకు వెళ్లడమే సరైనదన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రస్తుత పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రథసారథి, మంత్రి బొత్స సత్యనారాయణ భవి ష్యత్ రాజకీయంపై అయోమయం నెలకొంది. రానున్న ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా? లేదా అన్న ఊగిసలాట సాగుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయం తరువాత రోజురోజుకూ సీమాంధ్రలో దిగజారుతున్న పార్టీ పరిస్థితి, సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఆ యనపై వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ఆయన ఇమేజ్ చాలావరకు పడిపోయింది. ఒకప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి, ప్రత్యేకించి విజయనగరం జిల్లాకు అహం బ్రహ్మాస్మి అని భావించిన ఆయన ఇప్పుడు ఇంటి పోరునే సరిదిద్దుకోలేకపోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికలు సమీ పిస్తుండడంతో బొత్స శిబిరంలో ఆందోళన మొదలైంది. పదేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమంత బాగులేదు. వ్యక్తిగతంగా కూడా ఆయనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. తన సామాజిక వర్గం అండతో అంచెలంచెలుగాా ఎదిగినా ఇప్పుడు ఆ సామాజిక వర్గంలోనే అసమ్మతి పెరిగింది. గత ఎన్నికల్లోనే అత్తెసరు మెజార్టీతో గట్టెక్కిన బొత్సకు తర్వాత కూడా వ్యతిరేక పవనాలు వీయడంతో ఈసారి పరిస్థితి అనుకూలించేలా లేదని ముందస్తుగానే గుర్తించి ఎస్.కోటపై కన్నేశారన్న వాదనలొచ్చాయి.
ఆ దూరదృష్టితోనే ఎస్‌కోట కాంగ్రెస్ నాయకులు ఇందుకూరి రఘురాజుకు గ్రంథాలయసంస్థ చైర్మన్‌గా, గుడివాడ రాజేశ్వరరావును మార్కెటింగ్ కమిటీ చైర్మన్‌గా, మూకల కస్తూరిని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించారని సొంత పార్టీనేతలే చెప్పుకొచ్చారు. 2014 అసెంబ్లీఎన్నికల్లో మంత్రి బొత్స ఎస్.కోట నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగుతారనే ప్రచారం కూడా జోరుగా సాగింది.
అందుకు అనుగుణంగానే ఎస్.కోట నియోజక వర్గంలో వరుస పర్యటనలతో, నిధుల వర దతో హోరెత్తించారు. నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ నేతల ఇళ్లలో శుభకార్యాలకు, పరామర్శలకు సైతం పరుగులు తీశారు. ఇటీవల సంభవించిన తుపాను నష్టాలను చూసేందుకు, మండలాల్లో జరిగిన రచ్చబండ సమావేశాలకు హాజరయ్యారు. అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఇలా సందర్భం వచ్చిన ప్రతిసారీ నియోజకవర్గంపై తన ముద్రవేసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎస్.కోట లో నిర్వహించిన రచ్చబండ సమావేశం రసాభాస కావడం, రచ్చబండ సమావేశాలకు ఆశించిన స్థాయిలో జన స్పందన కొరవడడం, తాను ఆశించిన సామాజిక వర్గం బలం తగ్గడం, బొత్స వీరవిధేయులుగా ముద్రపడిన నాయకులపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో పరిస్థితి అయోమయంగా తయారైంది.
అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి పరాజయం పాలైన అల్లు జోగినాయుడు బొత్స అభ్యర్థిత్వాన్ని బాహాటంగానే వ్యతిరేకించడం, కాదూ కూడదని పోటీచేస్తే ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని పరోక్షంగా హెచ్చరించడంతో బొత్స ఒకింత వెనుకడుగు వేసినట్లు తెలిసింది. దీంతో చీపురుపల్లిపై మళ్లీ యూటర్న్ తీసుకున్నట్టు సమాచారం. కానీ ఇక్కడ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా తయారవడం, వైఎస్సార్‌సీపీ బలపడుతుండడంతో గెలుపుపై ధీమా సన్నగిల్లినట్టు తెలుస్తోంది.
ఇదంతా ఎందుకని, ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దల సభ మేలని, ఎన్నికల్లో పోటీ చేయకుండానే పదవిలో ఉండొచ్చని పునరాలోచనకొచ్చినట్టు సమా చా రం. ఆ ఉద్దేశంతోనే పార్టీ విధేయునిగా ఉన్నానని, రాష్ట్రవిభజన ప్రకటనతో చోటు చేసుకున్న క్లిష్ట పరిస్థితులో కూడా పార్టీకి అండగా ఉన్నానని చెప్పుకుంటూ రాజ్యసభ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకనుగుణంగా రాజ్యసభ రేసులో బొత్స ఉన్నట్టు మీడియాలో కథనాలొస్తున్నాయి. ఇవన్నీ గమనిస్తున్న పార్టీశ్రేణులు బొత్స ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు చర్చించుకుంటున్నాయి. కానీ ఆయన ఏం చేస్తారో? ఏమిటో అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.
Advertisement