సీఎంకే తుది నిర్ణయం బాధ్యత
►ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక
► విషయంలో ఊగిసలాటలో దేశం
► సీఎంకే తుది నిర్ణయం బాధ్యత
► అప్పగించిన మంత్రుల బృందం
► విశాఖ సీటు తేలాకే కొలిక్కి వచ్చే అవకాశం
►మహిళ లేదా వెలమ సామాజిక వర్గానికి
► ఇవ్వాలనే యోచన
సాక్షి ప్రతినిధి, విజయనగరం : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలో చంద్రబాబు తన పాత సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో నామినేషన్ల ఆఖరి తేదీ వరకు ఎమ్మెల్యేల టిక్కెట్లు కేటాయించలేదు. అదే పంథాను ప్రస్తుత ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ కొనసాగిస్తున్నారు. ఎంపికపై ఇంకా ఊగిసలాటలోనే ఉన్నారు. శుక్రవారం కొలిక్కి వస్తుందని ఆశావహులు ఎదురు చూసినా చివరికి నిరీక్షణే మిగిలింది. రాత్రి పొద్దు పోయే వరకు ఎటూ తేల్చలేదు. శనివారమో, ఆదివారమో చెప్పలేమన్న పరిస్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.
కాకపోతే, మంత్రుల బృందం ఆశావహుల వడబోత కార్యక్రమాన్ని శుక్రవారం పూర్తి చేసింది, నలుగురి పేర్లను సీఎం చంద్రబాబునాయుడికి అందజేసింది. నిర్ణయాన్ని సీఎంకే వదిలేసింది. కేంద్ర, రాష్ర్ట మంత్రులు అశోక్ గజపతిరాజు, పల్లె రఘునాథరెడ్డి, కిమిడి మృణాళిని మరోసారి సమావేశమయ్యారు. తెంటు లక్ష్ముంనాయుడు, తూముల భాస్కరరావు, ద్వారపురెడ్డి జగదీష్, శోభా హైమావతి పేర్లను ప్రతిపాదిత జాబితాలో పేర్కొన్నారు. సాయంత్రం 4.30గంటల సమయంలో సీఎం చంద్రబాబునాయుడికి ఆ జాబితాను అందజేశారు. మంత్రులు సూచించిన జాబితాపై సీఎం చర్చించారు. సామాజిక వర్గ సమీకరణాలు బేరీజు వేసుకున్నారు. కానీ, ఆ నలుగురిలో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలన్న తేల్చలేదు.
కాకపోతే, రెండు మూడు వాదనలు వినిపించాయి. విశాఖపట్నం ఎమ్మెల్సీ సీటుతో ఇక్కడ ఎంపికను ముడిపెట్టారని ఒక వాదన విన్పిస్తోంది. ఆ జిల్లాలో పురుషుడికి ఇస్తే ఇక్కడ మహిళకు ఇవ్వాలని, అక్కడ మహిళకిస్తే ఇక్కడ పురుషుడికి ఇవ్వాలన్న ఆలోచన చేసినట్టు తెలిసింది. విశాఖపట్నం జిల్లాలో అనకాాపల్లికి చెందిన విజయలక్ష్మి ఆశిస్తున్నారు. ఆమెను అక్కడ ఖరారు చేస్తే ఇక్కడ శోభా హైమావతి ఆశలు గల్లంతైనట్టే. ఒకవేళ అక్కడ పురుషుడికిస్తే శోభా హైమావతికి కాసింత అవకాశం ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. ఇక,వెలమ సామాజిక వర్గానికే ఇవ్వాలని మరో వాదన కూడా వినిపిస్తోంది. అదే జరిగితే ఆ సామాజిక వర్గానికి చెందిన తెంటు లక్ష్ముంనాయుడు, ద్వారపురెడ్డి జగదీష్ పేర్లు పరిశీలించవచ్చు.
వెలమ దొర వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే తూముల భాస్కరరావును ఖరారు చేయవచ్చని తెలుస్తోంది. తెరవెనుక సిఫార్సులకు పెద్దపీట వేస్తే పై నలుగురిలో కాకుండా మరొకరు కావచ్చు. అయితే, శుక్రవారం వడబోత ఫలితాలు వెలుగు చూసాక కొందరిలో నైరాశ్యం ఆవరించింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో టిక్కెట్‌ను వదులుకుని, అధిష్టానం హామీతో పోటీకి దూరంగా ఉండిపోయిన కే. త్రిమూర్తులరాజుకు అన్యాయం చేసినట్టు అయ్యిందన్న వాదన ఊపందుకుంది. అలాగే, ఐవీపీరాజు, మహంతి చిన్నంనాయుడు, కరణం శివరామకృష్ణ తదితరులకు దాదాపు ప్రతికూల సంకేతాలొచ్చినట్టు అయ్యింది. పార్టీలు మారిన నేతలుగా గద్దే బాబూరావు, కొండపల్లి కొండలరావు ఇప్పటికే ఛాన్స్ కోల్పోయారు. చివరి నిమిషంలో అశోక్ గజపతిరాజు పునరాలోచనకొస్తే తప్ప వీరికి ఛాన్స్ లేదనే చెప్పొచ్చు.