సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో వ్యాధులు ప్రబలుతున్నాయి. విష జ్వరాలు, కలరా, మలేరియా, ఫుడ్ పాయిజన్, డెంగీ, చికున్‌గున్యా, స్వైన్‌ఫ్లూ వంటి ప్రమాదకర కేసులు నమోదవుతున్నా జిల్లా యంత్రాంగం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులను లెక్కించుకుంటూ అంతా బాగుందని కళ్లు మూసుకుంటోంది. ప్రభుత్వ దవాఖానాల్లో అరకొర సేవలకు భయపడి చాలా మంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వీరి సంఖ్య ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసుల కంటే అనేక రెట్లు అధికం. కానీ ఈ సంఖ్య లెక్కలోకి రాదంటున్నారు అధికారులు. జిల్లా జనాభాలో 20శాతం మంది రోగాల బారిన పడితేనే స్పందిస్తామంటున్న వారి తీరు ఆశ్చర్యపరుస్తోంది. అక్టోబర్ నెలాఖరు నాటికి జిల్లాలోని సర్కారు దవాఖానాల్లో 1,94,833 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు.
ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాధులకు గురవుతుంటే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ మాత్రం.. ఇదంతా సహజమేనంటూ తేలిగ్గా తీసుకుంటోంది. ఇవన్నీ నిత్యం ఉండేవేనంటూ బుకాయిస్తోంది. పైగా జనాభాలో 20శాతం మందికిపైగా రోగాల బారిన పడితేనే వ్యాధుల తీవ్రత ఉన్నట్టని, ప్రస్తుతం ప్రమాదమేమీ లేదని కప్పిపుచ్చుతోంది. ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. కాలువలు, కుంటల్లో నీళ్లు చేరడం వ్యాధులకు కారణమవుతోంది. జిల్లా యంత్రాంగం సైతం వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులను సమాయత్తం చేసింది. గత నెలాఖరులో మొయినాబాద్ మండలం అప్పారెడ్డిగూడ, సురంగల్ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరం, కీళ్లవ్యాధి బారిన పడ్డారు. సర్కారు వైద్యంతో ఫలితం లేకపోవడంతో ప్రైవేటు బాటపట్టారు. జిల్లాలోని పలు మండలాల్లోనూ ఇదే తరహాలో వ్యాధులతో ఆస్పత్రుల బాట పట్టారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఔట్ పేషెంట్ లెక్కలు చూపిస్తున్న వైద్య శాఖ ప్రైవేటు ఆస్పత్రుల్లోని ఓపీ గణాంకాలను మాత్రం విస్మరిస్తోంది.
జిల్లా లో 47 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా.. 450కిపైగా ప్రైవేటు నర్సింగ్‌హోంలు, వేల సంఖ్యలో క్లీనిక్‌లున్నాయి. వీటన్నింటి నుంచి నెలవారీగా ఓపీ వివరాలు సేకరించి ప్రణాళికలు రూపొందించాల్సిన బాధ్యత జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు ఉంది. కానీ ప్రభు త్వ ఆస్పత్రుల లెక్కల్ని చూపిస్తూ జిల్లాలో వ్యాధులే లేవంటూ చెప్పడం గమనార్హం.
మూడు గంటల తర్వాత ఎవరూ దొరకరు!
సీజనల్ వ్యాధులేమీ జిల్లాలో లేవు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉండడం సహజం. జనాభాలో 2శాతం మంది తరుచూ రోగాలకు గురవుతుంటారు. 20శాతం కంటే ఎక్కువ మంది వ్యాధుల బారిన పడితే అప్పుడు సీజనల్ వ్యాధులని గుర్తించి చర్య లు తీసుకుంటాం. గ్రామానికి రూ.10 వేల చొప్పున 705 పంచాయతీలకు నాలుగు నెలల క్రితం శానిటేషన్ నిధులు విడుదల చేశాం. వాటితో పల్లెలన్నీ పరిశుభ్రంగా ఉం చాల్సిన బాధ్యత పంచాయతీల పాలకవర్గాలది. అసలే ఇది రంగారెడ్డి జిల్లా.. ఇక్కడ మధ్యాహ్నం 3గంటల తర్వాత కార్యాలయా ల్లో ఎవరూ దొరకరు. కలెక్టర్, జడ్పీ సీఈఓలు మీటింగులు పెట్టి ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తారు.. కానీ వాళ్లు పాలసీ మేకర్లు కారు కదా. మేం చేసేది చేస్తాం.
- సుధాకర్ నాయుడు, డీఎంహెచ్‌ఓ
వైద్య శాఖకు అనారోగ్యం
Published Mon, Nov 11 2013 2:24 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement