ఒక్క చాన్స్ ఇస్తే.. స్వర్ణాంధ్రను చేస్తా: చంద్రబాబు
సాక్షి, నెల్లూరు: ‘‘నాకు ఒక్క అవకాశం ఇస్తే సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తా.. తెలంగాణను సామాజిక తెలంగాణ చేస్తా.. సీమాంధ్ర నుంచి 25 పార్లమెంట్ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిపిస్తే మళ్లీ ఢిల్లీలో చక్రం తిప్పుతా’’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు అధికారమిచ్చిన ప్రతిసారీ ఆ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి 33 ఎంపీ స్థానాలు పొంది అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత మరచి తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టిందని మండిపడ్డారు. రాష్ట్ర విభజన ఎంతో బాధ కలిగించిందన్నారు. విభజనతో నదీజలాల సమస్య వస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానని శపథం చేశారు.
టీడీపీ ఐదో ప్రజాగర్జనను బాబు బుధవారం నెల్లూరు జిల్లా కేంద్రంలోని వీఆర్‌సీ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది టీడీపీ ఒక్కటేనన్నారు. ‘‘హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది నేనే.. ఈ దొంగ కాంగ్రెస్, కేసీఆర్ కాదు’’ అని పేర్కొన్నారు. తనకు ప్రధాని పదవి ఇస్తామని చెప్పినా తెలుగుజాతి కోసం వదులుకున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అడ్రస్ లేకుండా చేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో తన ప్రజాగర్జన ఎన్నికల శంఖారావంలా మారిందని బాబు పేర్కొన్నారు. అంతకుముందు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఓ కల్యాణ మండపంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు సభలో బాబు పలు ఎన్నికల హామీలను కుమ్మరించారు. అవేమిటంటే...
* రైతులను ఆదుకునేందుకు రుణాలను రద్దు చేస్తా.
* డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా.
* వృద్ధులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్లు ఇస్తా.
* బీసీలకు 100 అసెంబ్లీ సీట్లు ఇస్తాం.
* బీసీ డిక్లరేషన్ తెస్తాం.. బడ్జెట్‌లో సబ్‌ప్లాన్ అమలు చేస్తాం.
* కాపుల పేదరికాన్ని పోగొట్టేందుకు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్.
* దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా.
* ముస్లింల రిజర్వేషన్లు కొనసాగిస్తా. వారికి రాజకీయ ప్రాధాన్యత
* బ్రాహ్మణుల అభివృద్ధికి రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం.
* నుంచి బాబు వరుస గర్జనలు
చంద్రబాబు ఈ నెల 8 నుంచి నెలాఖరు వరకూ వరుసగా వివిధ వర్గాల గర్జనలు, ప్రజాగర్జనలు నిర్వహించనున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 8న హైదరాబాద్‌లో మహిళ , 16న గుంటూరులో రైతు, 18న అనంతపురంలో బీసీ, 20న హైదరాబాద్‌లో యువ, 23న వరంగల్‌లో ఎస్సీ,ఎస్టీ, 28న ఆదిలాబాద్‌లో గిరిజన గర్జన నిర్వహిస్తారు. 12న విశాఖ, 15న ఖమ్మం, 17న కృష్ణా, 19న కర్నూలు, 21న శ్రీకాకుళం, 22న తూ.గో., 24న కరీంనగర్, 25న మహబూబ్‌నగర్, 27న కడపల్లో ప్రజాగర్జనలు నిర్వహిస్తారు.
బాబును కలసిన సబితారెడ్డి: మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం చంద్రబాబును కలిశారు. ఈ నెల 9న హైటెక్స్‌లో జరిగే తన కుమారుడి వివాహానికి ఆయనను ఆహ్వానించారు. ఇదిలావుంటే.. ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి మంగళవారం బాబుతో భేటీ అయ్యారు. వీరిద్దరూ ఎప్పటి నుంచో టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.