మమతను చంపేశారు.! | husband kills his wife in krishna | Sakshi
Sakshi News home page

మమతను చంపేశారు.!

Published Tue, Sep 5 2017 9:45 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

మమతను చంపేశారు.! - Sakshi

మమతను చంపేశారు.!

► భర్త చేతిలో నవవధువు దారుణ హత్య
► గోనెసంచిలో కట్టి పూడ్చివేత
► అదనపు కట్నం కోసమేనంటున్న మృతురాలి బంధువులు 
► పోలీసుల అదుపులో నిందితుడు
 
తమ కుమార్తె వందేళ్ల పాటు పిల్లాపాపలతో సంతోషంగా కాపురం చేయాలనుకున్న ఆ తల్లిదండ్రుల కలలు కల్లలుగానే మిగిలాయి. భర్తతో ఆనందంగా గడపాలనుకున్న ఆ ఇల్లాలి ఆశలు మూడు నెలలు గడవకముందే అడియాసలయ్యాయి. అత్తవారింట్లో సందడి చేయాల్సిన తన కుమార్తె.. మృతదేహమై గోనె సంచిలో ఉండటం చూసి ఆ అమ్మానాన్న కళ్లు కన్నీటి వాగులయ్యాయి. 
 
గూడూరు (కృష్ణా): భార్యను అత్యంత దారుణంగా హత్యచేసి, గోనె సంచిలో కట్టి ఇంటి పరిసరాల్లోనే పాతిపెట్టిన సంఘటన మండల కేంద్రమైన గూడూరులో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. గుడివాడ దనియాలపేటకు చెందిన యార్లగడ్డ నాగమమత (24) గూడూరులోని రజకుల బజారుకు చెందిన యార్లగడ్డ నాగరాజుకు మూడు నెలల క్రితం వివాహమైంది. వీరి కాపురం కొన్నాళ్లు అన్యోన్యంగా సాగింది. మమత గతనెల 31వ తేదీన తండ్రి శ్రీనివాసరావుకు ఫోన్‌చేసి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంది. ఆ తరువాత రోజు నాగరాజు.. శ్రీనివాసరావుకు ఫోన్‌చేసి ‘మీకు ఆరోగ్యం బాగోలేదని మీ అమ్మాయి మిమ్మల్ని చూసేందుకు బయల్దేరింది. వచ్చిందా, లేదా..’ అని ఆరా తీశారు. కూతురు ఇంటికి చేరకుండా అల్లుడు ఫోన్‌చేసి అడగటంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. 2వ తేదీన గూడూరు వచ్చి మమత అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. నాగరాజు ఇంటి వద్ద గాలింపు చేపట్టారు. ఇంటి ఆవరణలోని ముళ్లకంచెలో మట్టి తవ్వినట్లు ఆనవాలు కనిపించింది. అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
 
మృతదేహం వెలికితీత
తహసీల్దార్‌ పెద్ది రోజాకు సమాచారం అందించి, అక్కడి మట్టిని తవ్వారు. అందులో గోనె సంచి, సంచి, ఆ సంచిలో మమత మృతదేహం కనిపించాయి. దీంతో మమత కుటుంబ సభ్యులంతా బోరున విలపించారు. 
 
అధిక కట్నం కోసమే..
నాగరాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసమే తన కూతుర్ని హతమార్చారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి సమయంలో అడిగినంత కట్నం ఇచ్చి వివాహం జరిపించామని, ఇటువంటి పరిస్థితుల్లో తన కూతురును చూడాల్సిన పరిస్థితి వచ్చిందని వారు కన్నీటి పర్యంతమయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement