అమలాపురం, న్యూస్‌లైన్ : పంచాయతీలో వార్డు మెంబరుగా గెలవాలంటేనే ఎన్నో వ్యయ ప్రయాసలకు లోను కావాల్సిన రోజులివి. సర్వశక్తులూ ఒడ్డి పోరాడితేగాని విజేతలు కాలేరు. అభ్యర్థి విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టాలి. మద్యాన్ని ఏరులా పారించాలి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరానిపాట్లు పడాలి. వార్డు అభ్యర్థి గెలుపుకోసమే ఇన్ని పాట్లు పడితే శాసనసభ్యులు కావాలంటే.. ఇంకెంత కష్టపడాలో అర్థం చేసుకోవచ్చు.
అదీ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి గెలవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మరీ ముఖ్యంగా రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే తూర్పుగోదావరి వంటి జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలను కాదని, అప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ ఇచ్చే ‘గుర్తు’ను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి గెలవడమంటే మాటలు కాదు. అయితే ప్రజాభిమానం, స్థానిక పరిస్థితులు కలిసి వచ్చి కొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచి తమ సత్తా చాటారు. వీరిలో కొందరు ఈ గెలుపునే రాజకీయ పునాదిగా మార్చుకుని ఉన్నత పదవులు అలంకరించారు.
స్వతంత్ర అభ్యర్థులు సత్తాచాటిన నియోజకవర్గాలు అనగానే జిల్లాలో ముందుగా గుర్తుకు వచ్చేది అమలాపురం, రామచంద్రపురం. ఈ నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మంది స్వతంత్రులుగా గెలిచి చరిత్ర సృష్టించారు. కోనసీమ కేంద్రమైన అమలాపురం నియోజకవర్గంలో తొలి నుంచి ప్రభావం చూపిస్తున్న కుడుపూడి కుటుంబీకుల రాజకీయ ప్రస్థానం స్వతంత్ర అభ్యర్థులుగానే ఆరంభమైంది. ఈ కుటుంబానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. వీరు ముగ్గురూ స్వతంత్రులుగానే రాజకీయరంగ ప్రవేశం చేసి విజేతలు కావడం విశేషం. వీరు ముగ్గురూ బంధువులు కూడా కావడం గమనార్హం.
తొలిసారి గా కుడుపూడి సూర్యనారాయణ 1962 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. రామభద్రరాజు పై విజయం సాధించారు. సూర్యనారాయణ తరువాత ఆయన కుమారుడు కుడుపూడి ప్రభాకరరావు సైతం 1967లో స్వతంత్రునిగా గెలిచారు. తండ్రిలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామభద్రరాజుపైనే విజయం సాధించారు. తరువాత ప్రభాకరరావు 1972, 1985, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయ దుందుభిని మోగించారు. 1992లో దివంగత కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖమంత్రిగా పనిచేశారు. ప్రభాకరరావు తరువాత ఆయనకు వరుసకు సోదరుడు కుడుపూడి చిట్టబ్బాయి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో స్వతంత్రునిగా బరిలో దిగి టీడీపీ అభ్యర్థి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావుపై విజయం సాధించారు.
జిల్లాలో అత్యధికంగా స్వతంత్రులను గెలిపించిన ఘనత రామచంద్రపురం నియోజకవర్గానికి దక్కింది. ఇక్కడ నుంచి ఏకంగా ఐదుగురు స్వతంత్రులుగా గెలిచి రికార్డు సృష్టించారు. 1962లో తొలిసారి నందివాడ సత్యనారాయణరావు, కాంగ్రెస్ అభ్యర్థి కంటిపూడి కమలాదేవిపై గెలిచారు. తరువాత జరిగిన ఎన్నికల్లో స్వతంత్రునిగా బరిలో దిగిన నున్నవీర్రాజు, కాంగ్రెస్ అభ్యర్థి నందివాడ సత్యనారాయణరావుపైన, 1978లో పిల్లి అప్పారావు.. జనతా పార్టీ అభ్యర్థి ఎం.వి.స్వామినాయుడుపైనా, 1994లో తాజా మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, టీడీపీ అభ్యర్థి గుత్తుల సూర్యనారాయణబాబుపైనా గెలిచారు.
తరువాత త్రిమూర్తులు 1999 ఎన్నికల్లోను, 2012లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ప్రస్తుత వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వతంత్రునిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులపై విజయం సాధించారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో సాంఘిక సంక్షేమ శాఖమంత్రిగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా తిరిగి గెలిచిన బోస్ వైఎస్సార్ మంత్రివర్గంలో కొంతకాలం పాటు కొనసాగారు.
పిఠాపురం నియోజకవర్గం నుంచి సంగిశెట్టి వీరభద్రరావు 1999లో అప్పటి బీజేపీ అభ్యర్థి పెండెం దొరబాబుపై గెలుపొందారు. ప్రత్తిపాడు నుంచి మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తండ్రి ముద్రగడ వీరరాఘవులు ఏకంగా రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా విజయకేతనం ఎగురవేశారు. 1962లో కాంగ్రెస్‌కు చెందిన పర్వత గుర్రాజుపైనా, తరువాత 1967లో జరిగిన ఎన్నికల్లో వరుపుల జోగిరాజుపైనా గెలుపు సాధించారు. జగ్గంపేట నియోజకవర్గం నుంచి 1967 లో పంతం కామరాజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.ముత్యాలరావుపై, రాజోలు నియోజకవర్గం నుంచి 1972లో బిక్కిన గోపాలకృష్ణారావు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రుద్రరాజు రామలింగరాజుపై, కాకినాడ నుంచి సీవీకే రావు 1965లో కాంగ్రెస్ అభ్యర్థి దండు భాస్కరరావుపై, సంచలన నాయకుడు జక్కంపూడి రామ్మోహనరావు 1989లో కడియం నుంచి టీడీపీకి చెందిన వడ్డి వీరభద్రరావుపై విజేతలుగా నిలిచి స్వతంత్రులుగా సత్తా చాటారు.
వారిద్దరూ ఒకేసారి ..
తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ఆప్తులుగా ముద్రపడ్డ పిల్లి సుభాష్‌చంద్రబోస్, కుడుపూడి చిట్టబ్బాయిలు 2004లోనే స్వతంత్రులుగా బరిలో దిగి గెలుపు సాధించడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీరిరువురికీ పార్టీ టిక్కెట్లు ఇప్పించాలని అప్పటి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్‌పీ) నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రయత్నించినా పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వీరిరువురినీ కాదని వేరేవారికి టిక్కెట్లు ఇప్పించారు. దీనితో బోస్ రామచంద్రపురం నుంచి, చిట్టబ్బాయి అమలాపురం నుంచి స్వతంత్రులుగా బరి లో దిగి టీడీపీ అభ్యర్థులపై గెలుపు సాధించారు. తర్వాత వైఎస్సార్‌పై అభిమానంతో కాంగ్రెస్‌లో చేరారు.
స్వతంత్ర పతాక సత్తాకు ప్రతీక
Published Tue, Mar 25 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM
Advertisement
Advertisement