గుప్పుమంటున్న గుడుంబా
గుప్పుమంటున్న గుడుంబా
గండేడ్, :
గ్రామాల్లో సారా విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పచ్చని పల్లెల్లో సారా రక్కసి కోరాలుచాచి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో అక్రమార్కుల వ్యాపారం సాఫీగా సాగుతోంది. దీంతో కల్తీసారాతో జనం మృత్యువాతపడుతున్నారు.
మండల పరిధిలోని మొకర్లాబాద్, మహమ్మదాబాద్, షేక్‌పల్లి, చిన్నాయపల్లి, కొంరెడ్డిపల్లి, కొండాపూర్, పగిడ్యాల్, పెద్దవార్వాల్, చిన్నవార్వాల్, రుసుంపల్లి, గాధిర్యాల్,నంచర్ల తదితర గ్రామాల్లో విచ్చలవిడిగా సారా అమ్మకాలు జరుగుతున్నాయి. అధిక ధరలు పెట్టి మద్యం కొని తాగలేని పేదలు సారాకు బానిసవుతున్నారు. ఇటీవల మొకర్లాబాద్ గ్రామంలో ఇద్దరు సారా మత్తులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రమాదకరమైన కాలిపోయిన బ్యాటరీసెల్స్, పటిక, నవసాగరం, యూరియా తదితర సామగ్రితో అక్రమార్కులు సారా తయారు చేయడంతో జనం అనారోగ్యం పాలవుతున్నారు.
కనిపించని ఎక్సైజ్ దాడులు
ఎక్సైజ్ అధికారులు సారా తయారీదారుల నుంచి మామూళ్లు తీసుకొని దాడులు నిర్వహించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఫోన్‌లో సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని మండిపడు తున్నారు.