డబ్బే..డబ్బు | Plans to make additional income | Sakshi
Sakshi News home page

డబ్బే..డబ్బు

Published Wed, Dec 31 2014 12:42 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

Plans to make additional income

ఒంగోలు టౌన్: జిల్లా స్థూల ఉత్పత్తిని ఆధారం చేసుకొని రానున్న ఐదేళ్లలో జిల్లాలో 30,276 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. తాము రూపొందించిన ప్రణాళికలను జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందిస్తే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఇదేవిధమైన ప్రణాళికలు రూపొందించేలా చూడాలని ప్లానింగ్ సెక్రటరీకి సూచించినట్లు తెలిపారు.

మంగళవారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఏడాది సాధించిన ప్రగతి, రానున్న సంవత్సరాల్లో చేపట్టే కార్యక్రమాలను వివరించారు. వ్యవసాయం ద్వారా 4618 కోటు ్ల(15.3 శాతం), పరిశ్రమల ద్వారా 7992 కోట్లు (26.4 శాతం), సర్వీస్ సెక్టార్ ద్వారా 17666 కోట్లు(58.3శాతం) అదనపు ఆదాయం కోసం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. వ్యవసాయం, దాని అనుబంధ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు.

నిమ్జ్ ద్వారా లక్షా 75వేల మందికి ఉపాధి
జిల్లాలోని పామూరు - పీసీపల్లి మధ్య 38 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్) ద్వారా ప్రత్యక్షంగా 75 వేల మందికి, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. దొనకొండలో మెగా ఇండస్ట్రియల్ హబ్‌కు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లక్ష్మీపురం నుంచి దొనకొండ వరకు 18 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి నీటిని అందించేందుకు ఎన్‌ఎస్‌పీ టెక్నికల్ కమిటీ అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు.

రామయపట్నం పోర్టు అభివృద్ధి, గుండ్లకమ్మ వద్ద పార్కు, ఒంగోలులో అంబేద్కర్ కళా క్షేత్రానికి రూ.3 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రంగారాయుడు చెరువుద్ద 1200మంది ఒకేసారి కూర్చునే విధంగా టౌన్ హాల్  నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. సిటీ స్క్వేర్‌లో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఏర్పాటుచేసి 10వేల మంది కూర్చొని వీకెండ్స్‌లో పాత చిత్రాలు చూసేవిధంగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఒంగోలుకు సమీపంలోని గుత్తికొండవారిపాలెం వద్ద ఐదు ఎకరాల్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

పలు శాఖలకు సంబంధించిన కార్యక్రమాల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ వెల్లడించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 83.6 శాతం పోలింగ్ సాధించి దేశంలోనే ఉత్తమమైన పోలింగ్‌గా నమోదైందన్నారు. మహిళా ఓటర్ల శాతం కూడా పెరిగిందన్నారు.  ఎస్సీ కార్పోరేషన్‌కు సంబంధించి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు 29 కోట్ల రూపాయల సబ్సిడీ నిధులు కేటాయిస్తే, అందులో  జిల్లాలోనే 11.2 కోట్లు ఇచ్చామన్నారు.ఆధార్ సీడింగ్‌లో  జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు.

ఆసుపత్రుల్లో ఆర్‌ఓ ప్లాంట్లు...
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నీటి వసతి ఉన్నచోట్ల ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.  ఆపరేషన్ థియేటర్లు ఉన్నచోట్ల పూర్తి స్థాయిలో పరుపులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు జిల్లాలో ఉన్నాయని, వాటితో రెసిడెన్షియల్ హాస్టల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
 
ఆ సంతృప్తి చాలు...
జిల్లా కలెక్టర్‌గా ఉన్న తనను ఇటీవల కురిచేడు నుంచి అద్దంకిలోని మారుమూల ప్రాంతాలకు చెందిన రైతులు చీకట్లో వచ్చి తనను అభినందించిన తీరు ఎంతో సంతృప్తినిచ్చిందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం మారింది, పార్టీ మారింది అయినప్పటికీ మీరు మాత్రం సమన్యాయం చేస్తున్నరంటూ వారు అనడం ఆశ్చర్యం కలిగించిందని, అదే సమయంలో సంతృప్తి కలిగిందన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో అర్జీల సంఖ్య తగ్గుతుందన్నారు.  విలేకరుల సమావేశంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ ప్రకాష్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషాఖాశిం, ముఖ్య ప్రణాళికాధికారి పీబీకే మూర్తి పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement