నిలువనీడ లేక పట్టణ ప్రజలు పడుతున్న బాధలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజనపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పథకం ద్వారా పట్టణ, నగర ప్రజలకు గృహవసతి కల్పించాలని కేంద్రం భావించింది. కానీ ఈ పథకంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు ఏరుకుంటోంది. తనకు నచ్చిన సంస్థలకు గృహనిర్మాణ బాధ్యతలు అప్పగించడంతో అవి అంచనాలు పెంచేసి లబ్ధిదారుడిపై ఆర్థిక భారం మోపుతున్నాయి. వీటికితోడు పచ్చనేతల అవినీతి, బ్యాంకర్ల నిబంధనల కారణంగా పట్టణ గృహనిర్మాణం నత్తనడకన సాగుతోంది. సబ్సిడీ వస్తుందనే నమ్మకంతో సొంత నగదుతో ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారులు రుణభారంతో నలిగిపోతున్నారు. పట్టణ గృహనిర్మాణ పథకంపై పాలకులు చెబుతున్న మాటలకు భిన్నంగా క్షేత్రస్థాయి పరిస్థితులు ఉన్నాయి. ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా లేకపోవడం, నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించడం, ఇంటి లోపల వసతులు సంతృప్తిగా లేకపోవడం, టీడీపీ నేతల అవినీతి కారణంగా ఇప్పుడీ పథకం పట్ల ప్రజలు ఆసక్తి చూపడం లేదు.
సాక్షి, అమరావతి: కేవలం డబ్బు ఉన్నవారికే కాకుండా ప్రతి ఒక్కరికీ (పేద, మధ్య తరగతివారితో సహా) పక్కా గృహ వసతి కల్పించాలనే ఉద్దేశంతో అందరికీ ఇళ్లు (హౌసింగ్ ఫర్ ఆల్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్రంలో పట్టణాలు, నగరాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 5.24 లక్షల ఇళ్లను (ఫ్లాట్‌లు) నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఇళ్లను మూడు కేటగిరీలుగా 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఇంటి నిర్మాణ వ్యయం విస్తీర్ణాన్ని బట్టి రూ.7.30 లక్షలు, రూ.8 లక్షలు, రూ.9 లక్షలుగా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు సబ్సిడీగా ఇస్తున్నాయి. ఇంటికయ్యే మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడికి బ్యాంకు రుణంగా అందిస్తారు. లబ్ధిదారుని వాటా, బ్యాంకు రుణం ఆధారంగా నెలసరి వాయిదాల చెల్లింపులను నిర్దేశించారు. నెలకు రూ.2,500, రూ.2,900, 3,500 వాయిదాలుగా నిర్ణయించి 20 ఏళ్ల పాటు చెల్లించే విధానాన్ని రూపొందించారు.
నచ్చిన సంస్థలకు అప్పగింత
రెండేళ్ల క్రితం పిలిచిన టెండర్లలో నచ్చిన సంస్థలకు గృహనిర్మాణ బాధ్యతలను అప్పగించడంతో ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క ఇంటి నిర్మాణమూ పూర్తికాలేదు. ఆ జిల్లాల్లో 1.39 లక్షల ఇళ్ల నిర్మాణ బాధ్యతలు పొందిన ఈ సంస్థలు ఒక్క ఇంటినీ నిర్మించలేదు. రాష్ట్రం మొత్తం 5.24 లక్షల ఇళ్ల నిర్మాణాల్లో ఇప్పటివరకు 64,370 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. లబ్ధిదారుల చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి బ్యాంకర్లు రుణాలు మంజూరు చేస్తుండటంతో అనేకమంది దరఖాస్తుదారులు అనర్హులుగా మిగిలిపోతున్నారు. 3.36 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని జిల్లాల స్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 2,534 మంది లబ్ధిదారులకే మాత్రమే రుణాలు మంజూరయ్యాయి. మిగిలినవన్నీ ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయి. దరఖాస్తు చేసిన నాటి నుంచి స్థానిక కార్పొరేటర్, జన్మభూమి కమిటీ, గృహనిర్మాణ సంస్థ అధికారులు, బ్యాంకర్లు చుట్టూ తిరగలేక ఆర్థిక వెసులుబాటు కలిగిన కొందరు లబ్ధిదారులు సొంతంగా ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే వీరు కూడా బ్యాంకు రుణం పొందడానికి అనేక వ్యయప్రయాసలకు గురవుతున్నారు.
ఇళ్ల కేటాయింపునకు భారీ వసూళ్లు
టీడీపీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, జన్మభూమి కమిటీలు తమ మామూళ్లు తీసుకుని ఇళ్ల కేటాయింపునకు సిఫారసు చేశారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారు. అయితే ఆ లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితులు, నెలవారీ వాయిదాలు చెల్లించే సామర్థ్యం తదితర అంశాలను బ్యాంకులు పరిగణనలోకి తీసుకోవడంతో రుణాలకు దరఖాస్తు చేసుకున్నవారిలో చాలామంది తిరస్కరణకు గురయ్యారు రాష్ట్రంలో మొత్తం 5.24 లక్షల ఇళ్లను మంజూరు చేయగా, జిల్లా స్థాయి కమిటీలు 3.36 లక్షల ఇళ్లకు ఆమోదం తెలిపాయి. వీటిలో 1.87 లక్షలు పెండింగ్‌లో ఉండగా 27,379 దరఖాస్తులు మాత్రమే రుణాల కోసం బ్యాంకుల వద్దకు చేరాయి. ఇప్పటివరకు బ్యాంకులు 2,534 మంది లబ్ధిదారులకు మాత్రమే రుణాలు మంజూరు చేశాయి. అనర్హులుగా మిగిలిన లబ్ధిదారులు రెంటికీ చెడిన రేవడిలా మారారు. ఇటు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు ఇచ్చిన మామూళ్లు తిరిగి తీసుకోలేకపోతున్నారు. అటు బ్యాంకర్లు అడిగిన రీపేమెంట్ సామర్థ్యాన్ని చూపించలేకపోతున్నారు.
అధ్వానంగా క్షేత్రస్థాయి పరిస్థితులు
ప్రభుత్వం అర్బన్ గృహనిర్మాణంపై చేసుకుంటున్న ప్రచారానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నాయి. ఇళ్ల నాణ్యతా ప్రమాణాలు, ఇంటి లోపల వసతుల కల్పన, అధికారులు, టీడీపీ నేతల అవినీతిపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంటిలోపల వసతులు సంతృప్తిగా లేవని 39.67 శాతం మంది లబ్ధిదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా, ఇంటి కేటాయింపులు పారదర్శకంగా జరగలేదని 31.16 శాతం మంది, దరఖాస్తు చేసినా ఇల్లు కేటాయించలేదని, కనీసం సమాచారం కూడా రాలేదని 16.95 శాతం మంది, అధికారులు అవినీతికి పాల్పడ్డారని 4.94 శాతం మంది, ఇంటి నిర్మాణం బాగోలేదని 3.88 శాతం మంది, టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని 3.42 శాతం మంది లబ్ధిదారులు ప్రభుత్వ సర్వేలోనే పేర్కొన్నారు.
పేదలపై భారీగా భారం
ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొన్ని నిర్మాణ సంస్థలు టెండర్ల సమయంలో సిండికేటు కావడంతో అంచనాల వ్యయం పెరిగింది. దీనికితోడు ఆ సంస్థలకు రెండేసి జిల్లాల్లో ఇళ్లను నిర్మించే టెండర్లు రావడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. నాగార్జున, షాపూర్‌జీ పల్లోంజీ, లార్సెన్ అండ్ టూబ్రో, వీఎన్‌సీ, సింప్లెక్సు సంస్థలు ప్రతి జిల్లా టెండరులో కుమ్మక్కె ఒక్కరికే ఆ పనులు దక్కేలా చేశాయి. నాగార్జున నిర్మాణ సంస్థకు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలు, షాపూర్‌జీ పల్లోంజీకి కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఇళ్ల నిర్మాణ టెండర్లు లభించాయి. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సెంట్రింగ్, ఇతర పరికరాలు ఈ సంస్థలకు పూర్తిగా లేకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయి. ఈ సంస్థల పనితీరును అధికారులెవరూ ప్రశ్నించలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం నిర్మాణ సంస్థలకు చదరపు అడుగు నిర్మాణానికి రూ.900 నుంచి రూ.1,290 వరకు ధర చెల్లిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉండే సంస్థలకు చదరపు అడుగుకు రూ.1,600 రేటును నిర్ణయించింది. దీంతో లబ్ధిదారులపై ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి సగటున రూ.400 ఆర్థిక భారం పడింది. 300 చదరపు అడుగుల విస్తీర్ణం కల ప్లాట్‌ను పొందే ఒక్కో లబ్ధిదారుడిపై రూ.1.20 లక్షలు, 365 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని పొందే ఒక్కో లబ్ధిదారుడిపై రూ.1.46 లక్షలు, 430 చదరపు అడుగుల విస్తీర్ణం ఇంటిని పొందే ఒక్కొక్కరిపై రూ.1.72 లక్షల ఆర్థిక భారం పడుతోంది. ఈ మొత్తమంతా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే నిర్మాణ సంస్థలకే దక్కుతోంది.
ఇళ్ల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం
టీడీపీ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చదరపు అడుగుకు రూ.2,200లు పేదల నుంచి వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతోంది. ఉయ్యూరు లాంటి పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తే డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ చదరపు అడుగుకు అయ్యే ఖర్చు కేవలం రూ.1,800 నుంచి రూ.2200 వరకు ఉంది. ప్రభుత్వమే స్థలాన్ని సేకరించి, ఉచిత ఇసుక విధానం అమలులో ఉన్నప్పుడు చదరపు అడుగుకు రూ.2,200 ఎందుకవుతోంది? తెలంగాణలో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లకు చదరపు అడుగుకి కేవలం రూ.900 నుంచి రూ.1100 మాత్రమే అవుతోంది. ఫ్లాట్ల కేటాయింపులో, లబ్ధిదారుల ఎంపికలోనూ ప్రజలను టీడీపీ నేతలు మోసం చేస్తున్నారు. ఇళ్ల కేటాయింపులో టీడీపీ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
–జంపాన కొండలరావు, వైఎస్సార్‌సీపీ, ఉయ్యూరు, పట్టణ అధ్యక్షుడు
రాజకీయ నాయకుల ప్రతిపాదనే ప్రధాన అర్హత
హౌసింగ్ ఫర్ ఆల్ పథకానికి సంబంధించి క్షేత్రస్థాయిలో పారదర్శకంగా సర్వే జరగడం లేదు. టీడీపీ నేతలు ప్రతిపాదించిన పేర్లను మాత్రమే ఎంపిక చేస్తున్నారు. నా తర్వాత దరఖాస్తు చేసుకున్నవారికి ఇళ్ల కేటాయింపు పత్రాలు ఇచ్చారు. నాకు మాత్రం మూడు నెలల నుంచి ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుందంటూ రోజూ ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. నిన్న జన్మభూమి కార్యక్రమంలో ఇస్తామని చెప్పారు. అక్కడకు వెళ్తే ఏమీ లేదు. ఓట్ల కోసమే సామాన్యుల ఆశలతో ప్రభుత్వం ఆడుకుంటోంది.
– వి.నాగలక్ష్మి, సీతన్నపేట, విజయవాడ
►విజయనగరం ఒకటో వార్డులో ఉంటోన్న బొడ్డు అన్నపూర్ణ ఇల్లు మంజూరు చేయాల్సిందిగా మూడుసార్లు దరఖాస్తు చేసుకుంది. అయితే ఇప్పటివరకు ఆమెకు ఇల్లు మంజూరు కాలేదు. ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు ఇల్లు ఎందుకు మంజూరుకాలేదో కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నానని, చిన్నచిన్న పనులు చేయగా వచ్చిన ఆదాయంతో ఇంటి అద్దె కట్టుకోవడం భారంగా ఉందని అన్నపూర్ణ వాపోతోంది.
►కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ఆదర్శనగర్‌కు చెందిన నండూరి వెంకటలక్ష్మి (60) నాలుగేళ్ల క్రితం ఇంటికి దరఖాస్తు చేసుకుంది. మంజూరు కావడంతో తాపీ పనులు చేసుకుంటూ కూడబెట్టుకున్న కొద్దిపాటి సొమ్ముతో ఇంటి పనులు ప్రారంభించింది. ఆ డబ్బుకు మరో రూ.2 లక్షలు అప్పు చేసి పిల్లర్స్‌తోపాటు గోడలు నిర్మించింది. ఇది జరిగి ఇప్పటికి నాలుగేళ్లు పూర్తి కావస్తోంది. ప్రభుత్వం నుంచి ఇంతవరకు పైసా ముట్టలేదు. ఇంటి పనులు వీసమంతైనా ముందుకు సాగలేదు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేదు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోలేక మనోవేదనతో పక్షవాతం వచ్చి మంచానపడింది. వచ్చే పింఛన్‌తో మందులు కొనుక్కుంటూ అద్దె ఇంట్లో తలదాచుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment