రైతుల సొమ్ము ప్రభుత్వ పరం!
- రూ.102 కోట్లు సర్కారు ఖాతాలో జమ
- రుణమాఫీకి.. వేరుశెనగ వాతావరణ బీమా పరిహారానికి లంకె
- పరిహారాన్ని ఖజానాలో జమ చేస్తామన్న సర్కారు
- ప్రభుత్వ వింతపోకడపై కోర్టును ఆశ్రయించనున్న రైతు సంఘాలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : పంట రుణాల మాఫీ ఎప్పుడు చేస్తామన్నది తేల్చని సర్కారు.. వేరుశెనగ రైతుకు మంజూరయ్యే పరిహారాన్ని మాత్రం ఖజానాలో జమ చేసుకోవడానికి ఉబలాటపడుతోంది. రుణమాఫీకి బీమా పరిహారానికి లంకె పెట్టిన సర్కారు వింతపోకడపై న్యాయపోరాటం చేసేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే..
పంట, డ్వాక్రా రుణాల మాఫీకి గురువారం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిన విషయం విదితమే. ఈ మార్గదర్శకాల్లో పంట రుణాలను ఎప్పటిలోగా మాఫీ చేసేది.. ఎప్పటి నుంచి కొత్త పంట రుణాలు పంపిణీ చేసేది ప్రభుత్వం తేల్చిచెప్పలేదు. కేవలం బకాయిదారుల జాబితాను సిద్ధం చేయడానికి మాత్రమే మార్గదర్శకాలు జారీచేశారని బ్యాంకర్లు స్పష్టీకరిస్తున్నారు.
అయితే, ఆ మార్గదర్శకాల్లో రైతులకు దక్కాల్సిన బీమా పరిహారాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసుకోవాలని పేర్కొనడం వివాదాస్పదమవుతోంది. గతేడాది ఖరీఫ్‌లో 1,36,400 హెక్టార్లలో వేరుశెనగ సాగుచేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. పంట రుణాలు తీసుకునే సమయంలోనే వేరుశెనగ రైతులు వాతావరణ బీమా ప్రీమియం కింద హెక్టారుకు రూ.550 చొప్పున రూ.7.5 కోట్లను బ్యాంకర్లకు చెల్లించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరో రూ.7.5 కోట్లను వేరుశెనగ రైతుల ప్రీమియం కింద చెల్లించాయి.
ఈ రూ.15 కోట్ల ప్రీమియంను జాతీయ వ్యవసాయ బీమా సంస్థకు బ్యాంకర్లు చెల్లించారు. గతేడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 1.18 లక్షల హెక్టార్లలో మాత్రమే వేరుశెనగ సాగుచేశారు. వేరుశెనగ పంట రైతులకు దుర్భిక్షం తీవ్రమైన నష్టాలను మిగిల్చింది. ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల రూ.వెయ్యి కోట్లకుపైగా రైతులకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి జిల్లా అధికారయంత్రాగం అప్పట్లో నివేదిక పంపింది. పంట నష్టపోయిన వేరుశెనగ రైతులకు వాతావరణ బీమా పరిహారం కింద కనిష్టంగా రూ.102 కోట్ల మేర పరిహారం మంజూరవుతుందని అధికారవర్గాలు అంచనా వేశాయి.
వేరుశెనగ రైతుకు బీమా పరిహారం సెప్టెంబర్‌లో మంజూరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత ఖరీఫ్‌లోనూ వర్షాభావమే రాజ్యమేలుతోంది. కరవుతో తల్లడిల్లుతోన్న రైతుకు వాతావరణ బీమా పరిహారం కాసింత ఊరటనిస్తుందని రైతు సంఘాలు భావించాయి. కానీ.. గురువారం ప్రభుత్వం జారీచేసిన పంట రుణమాఫీ మార్గదర్శకాల్లో బీమా పరిహారాన్ని రైతులకు కాకుండా సర్కారు ఖజానాలో జమా చేసుకుంటామని పేర్కొనడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి.
సెప్టెంబర్‌లో మంజూరయ్యే రూ.102 కోట్ల బీమా పరిహారం ప్రభుత్వ ఖజానాలో చేరనుందన్న మాట. చట్టప్రకారం ఇది విరుద్ధం. ప్రీమియం చెల్లించి.. పంట నష్టపోయిన రైతుకే బీమా పరిహారం చేరాలన్నది వాతావరణ బీమా పథకంలో నిబంధన. ఇదే నిబంధన ఆధారంగా ప్రభుత్వ వింతపోకడపై న్యాయపోరాటం చేసేందుకు రైతు సంఘాలు సిద్ధమవుతున్నాయి. రుణమాఫీతో సంబంధం లేకుండా నష్టపోయిన రైతులకు బీమా పరిహారంతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేస్తున్నాయి.