కర్నూలు, న్యూస్‌లైన్: రంజాన్, నాగులచవితి పండగలను దృష్టిలో ఉంచుకుని సమైక్య ఉద్యమానికి రెండు రోజులు విరామం ప్రకటించినప్పటికీ జిల్లా వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా ఆందోళనలు చేపట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ పెద్ద ఎత్తున నినదించారు. సమైక్యాంధ్ర జేఏసీతో పాటు రాజకీయ పక్షాలు మౌనం పాటించినా.. ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పదో రోజు ఆందోళనలు కొనసాగించారు. విభజనను సమర్థించే నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
కర్నూలు నగరంలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద, జిల్లా పరిషత్‌లో పంచాయతీరాజ్ ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలు యథావిధిగా నిర్వహించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్ వద్ద చేపట్టిన నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. డీసీసీ ఆధ్వర్యంలో 6వ రోజు పార్టీ కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి.
ఆళ్లగడ్డలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఇదే సందర్భంలో నంద్యాల ఎంపీ ఎస్.పి.వై.రెడ్డి దీక్షా శిబిరం పక్కనుంచి అహోబిలం వెళ్తుండగా సమైక్యవాదులంతా కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. కాంగ్రెస్ డౌన్ డౌన్.. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ నినదించారు. వాహనంలో నుంచి ఎస్.పి.వై.రెడ్డి కిందకు దిగి తాను రాజీనామా చేశానంటూ ఆందోళనకారులకు నచ్చజెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు.
ఆదోనిలో సమైక్యాంధ్ర జేఏసీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగించారు. చిప్పగిరిలో సామాజిక సేవా కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఆత్మకూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. వెలుగోడులో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. డోన్‌లో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పాతబస్టాండ్‌లో రుద్రాభిషేక హోమం చేపట్టారు. బుడగజంగాల సంఘం, చిన్న వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీలు నిర్వహించి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కోడుమూరు, గూడూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. బెళగల్‌లో సమైక్యవాదులు మౌన ప్రదర్శన చేశారు. మద్దికెరలో రజక సంఘం ఆధ్వర్యంలో సోనియా గాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను గాడిదలపై ఊరేగించి బస్టాండ్ వద్ద దహనం చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ ముస్లింలు కదం తొక్కారు. జామియా మసీదు అధ్యక్షుడు డాక్టర్ హాజీ నద్దిముల్లా ఆధ్వర్యంలో ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పెద్ద మసీదు నుండి సోమప్ప సర్కిల్ వరకు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సంఘీభావం ప్రకటించారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీనారాయణరెడ్డి, పార్లపల్లి జయన్నల ఆధ్వర్యంలో స్థానిక సోమప్ప సర్కిల్‌లో న్యాయవాదుల రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఏపీ ఎన్‌జీవోస్, ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ఈశ్వరయ్య, మద్దిలేటిల ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం నుండి పుర వీధుల్లో మోటర్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు సైతం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
దీక్షాదక్షులు
Published Sat, Aug 10 2013 2:19 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement
Advertisement