యూజర్ చార్జీలపై నిర్ణయం సీఎందే
యనమల ఈ ప్రతిపాదన తెచ్చారు: మంత్రి కామినేని
వైద్య కౌన్సెలింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం గడువు కోరుతోంది
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు యూజర్ చార్జీల ప్రతిపాదన తెచ్చారని చెప్పారు. అయితే యూజర్ చార్జీలు వసూలు చేయాలా? వద్దా? అనే అంశం ముఖ్యమంత్రి నిర్ణయాన్ని బట్టి ఉంటుందని తెలిపారు.
మెరుగైన పారిశుద్ధ్యం, ఆస్పత్రుల నిర్వహణ కోసం ఆర్థిక మంత్రి ఈ ప్రతిపాదన తెచ్చినట్టు చెప్పారు. ఎయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలన కోసం కేంద్ర బృందం త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తుందని తెలిపారు. ఈ ఏడాది ఎయిమ్స్ పనుల కోసం కేంద్రం రూ.125 కోట్లు కేటాయించిందన్నారు. తొలిదశలో 100 ఎంబీబీఎస్ సీట్లు, 500 పడకలతో ఎయిమ్స్ ఏర్పాటవుతుందన్నారు. ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఆగస్టులోనే ప్రారంభించాల్సినా తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ చివరి వరకూ గడువు కోరుతోందన్నారు. దీనివల్ల విద్యా సంవత్సరంలో తేడాలొస్తాయని, ఇదే విషయంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారన్నారు. గవర్నర్‌ను కూడా కలసి వివరించామన్నారు.