కళ్లు తెరవక ముందే కాటికి | Five Doctors Held For Conducting Gender Determination Tests At Hyderabad | Sakshi
Sakshi News home page

కళ్లు తెరవక ముందే కాటికి

Published Mon, Feb 11 2019 1:45 AM | Last Updated on Mon, Feb 11 2019 4:44 AM

Five Doctors Held For Conducting Gender Determination Tests At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/రంగారెడ్డి: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పలు రేడియాలజీ సెంటర్లు అడ్డదారులు తొక్కుతున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని తెలిసినా గర్భిణుల కుటుంబ సభ్యులు అడిగినంత ఇస్తే గర్భంలో ఉన్నది ఆడో, మగో చెప్పేస్తున్నాయి. పేదరికం వల్ల ఆడపిల్ల పుడితే భారమనే అజ్ఞానంతోనో లేదా అప్పటికే ఆడపిల్లలు పుట్టారన్న కారణంతోనో మళ్లీ కాన్పులో ఆడపిల్లను వద్దనుకునేవారు లింగ నిర్ధారణ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అలాంటి వారి నుంచి స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకులు భారీగా డబ్బు వసూలు చేసి పుట్టబోయేది ఆడబిడ్డో లేక మగ శిశువో చెప్పేస్తున్న నాలుగు సెంటర్లపై షీ టీమ్స్‌ మెరుపుదాడి చేశాయి. ఇబ్రహీంపట్నంలోని ప్రత్యూష స్కానింగ్‌ సెంటర్‌తోపాటు ఉప్పల్‌లోని శ్రీకృష్ణా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, మేడిపల్లి పీఎస్‌ పరిధిలోని బుద్ధనగర్‌లోని శ్రీ వెంకటేశ్వర డయాగ్నస్టిక్స్,చౌటుప్పల్‌లోని ప్రశాంతి ఆస్పత్రిలోని డయాగ్నస్టిక్‌ కేంద్రంలో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తించాయి. నలుగురు వైద్యులు, ఓ మధ్యవర్తిని అరెస్టు చేసి వారిపై ప్రీ నేటల్‌ డయాగ్నస్టిక్‌ టెక్నిక్స్‌ (పీఎన్‌డీటీ) నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశాయి. అల్ట్రాసౌండ్‌ మిషన్లు సహా రికార్డులను సీజ్‌ చేశాయి. 

వైద్య ఆరోగ్యశాఖ పట్టించుకోకపోవడం వల్లే.. 
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాలు అవినీతికి నిలయంగా మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్ల యాజమాన్యాలను తనిఖీల పేరుతో బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. గ్రేటర్‌లో చిన్న, పెద్ద అన్నీ కలిపి 3 వేలకుపైగా ఆస్పత్రులు ఉండగా వాటిలో 1,140 స్కానింగ్‌ సెంటర్లు ఉన్నాయి. కొన్ని కేంద్రాల్లో రేడియాలజిస్టులకు బదులు లింగనిర్ధారణ చట్టంపై కనీస అవగాహన లేని కాంపౌండర్లు, నర్సులతో పరీక్షలు చేయిస్తున్నాయి. వారు కాసులకు కక్కుర్తి పడి గర్భంలో ఉన్నది ఆడో, మగో
 చెప్పేస్తున్నారు. స్కానింగ్‌ సెంటర్లలో జరుగుతున్న ఈ అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో షీ టీం బృందం రంగంలోకి దిగింది. ఆయా కేంద్రాలపై డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించి కేసులు నమోదు చేసింది. హైదరాబాద్‌ జిల్లాలో గత నాలుగేళ్ల నుంచి ఇప్పటివరకు సుమారు 20 కేంద్రాలపై కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత అడిగినంత ఇస్తే చాలు నమోదు చేసిన కేసులు కోర్టుల్లో వీగిపోయేలా చేయడంతోపాటు ఆయా ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లను పునరుద్ధరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం ఆయా జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు తమకు అనుకూలమైన సిబ్బందిని డెప్యుటేషన్‌పై వెంట తెచ్చుకుంటుండటం గమనార్హం. 

స్కానింగ్‌ సెంటర్ల నిబంధనలివీ... 
స్కానింగ్‌ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణకు కఠిన నిబంధనలు ఉన్నాయి. స్కానింగ్‌ మిషన్లు కొనుగోలు చేయాలన్నా జిల్లా వైద్యాధికారి అనుమతి తప్పనిసరి. ఆస్పత్రుల్లో స్కానింగ్‌ కేంద్రాలు భాగమైనప్పటికీ స్కానింగ్‌ సెంటర్‌కు విడిగా అనుమతి పొందాల్సిందే. కచ్చితంగా రెండేళ్లపాటు రోగుల రికార్డులు నిర్వహించాలి. న్యాయపరమైన కేసులు ఉంటే పదేళ్లపాటు రికార్డులను భద్రపర్చాలి. సెంటర్‌కు వచ్చే రోగుల పూర్తి వివరాలు నమోదు చేయాలి. స్కానింగ్‌ చేయించుకోవడానికిగల కారణాలను రోగుల నుంచి లిఖితపూర్వకంగా స్వీకరించాలి. స్కానింగ్‌ను రేడియాలజిస్ట్‌లే నిర్వహించాలి. రేడియాలజిస్ట్‌ల పేర్లు, విద్యార్హతలు, అందుబాటులో ఉండే వేళలు తప్పనిసరిగా స్కానింగ్‌ కేంద్రాల్లో కనిపించేలా బోర్డులు పెట్టాలి. స్కానింగ్‌ నివేదికలపైనా ఈ వివరాలతోపాటు రేడియాలజిస్ట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్, సంతకం తప్పనిసరిగా ఉండాలి. కానీ ఇవన్నీ లేకుండా కేవలం స్కానింగ్‌ కేంద్రాల పేరుతో రిపోర్టులను యథేచ్ఛగా ఇచ్చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేరు. 

ప్రజల్లో చైతన్యం కరువు... 
తరాలు మారుతున్నా సమాజంలో ఆడపిల్లలపట్ల ఇంకా చిన్నచూపు కొనసాగుతోంది. బాలికలపట్ల వివక్షను రూపుమాపేందుకు ప్రభుత్వ విభాగాలు పనిచేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమాత్రం మారడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులకు ఆడపిల్లలపట్ల వివక్ష ఉండడం, వారిని సాకే స్థోమత లేకపోవడం తదితర కారణాల వల్ల గర్భంలోనే పిండాలను చిదిమేస్తున్నారు. ఇటువంటి వారిని గుర్తించి కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. ఆడపిల్లలు తక్కువేం కాదన్న భావనను వాళ్లలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement