సాక్షి, కాంచీపురం: ఆగివున్న లారీని కారు ఢీకొనడంతో నలుగురు టెక్కీలు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన కాంచీపురం జిల్లా మధురాంతకం సమీపంలోని చెన్నై– తిరుచ్చి జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. వివరాలు...చెన్నై ఐటీ పార్కులో ఉద్యోగం చేస్తున్న కొందరు టెక్కీలతో ప్రయాణిస్తున్న కారు విల్లుపురం నుంచి చెన్నై వైపుగా వెళ్తూ పట్టాలం సమీపంలోని పలపాక్కం వద్ద మరమ్మతులకు గురై నిలబడి ఉన్న సరుకు లారీని వెనుక వైపు నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐశ్వర్య(23), ప్రశాంత్(25), దీపన్(22) అక్కడికక్కడే మృతి చెందారు.
చికిత్స పొందుతూ ఏపీలోని ఒంగోలుకు చెందిన గుర్రం మెహర్ సుకుమార్ (25) మృతి చెందాడు. గాయపడిన అఖిల(25), శరత్(25)ను చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం జరిగిన సమయంలో వర్షం కురుస్తుంది. తీవ్ర గాయాలతో కారులో ఇరుక్కున వారిని స్థానికులు, వాహనచోదకులు గమనించి బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలిసిన వెంటనే పట్టాలం పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ప్రమాదం గురించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించారు. లారీ కింద చిక్కుకున్న కారును అతి కష్టం మీద బయటకు తీశారు. జాతీయ రహదారిపై రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది.
మృతులు కేరళ, ఏపీకి చెందినవారు..
మృతిచెందిన నలుగురిలో ముగ్గురిది కేరళ, ఒకరిది ఏపీ. ఐశ్వర్య స్వస్థలం కేరళలోని తిరుచ్చూరు, ప్రశాంత్,దీపన్‌ల స్వస్థలం నామక్కల్ జిల్లా తిరుచెంగోడు తాలుకా కైలాసనాథ పాళయం, మేఘర్ స్వస్థలం ఏపీ. ప్రమాద విషయాన్ని కుటుంబ సభ్యులకు పోలీసలు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment