ఘజియాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వరుస అత్యాచారాలు. ఆపై హత్యల కేసులో దోషులైన వ్యాపారవేత్త మొనీందర్‌సింగ్, అతని సహాయకుడు సురేందర్ కోలీలకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. 2006లో పనిమనిషి అంజలిపై అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశారని, అందువల్ల కఠినాతికఠినమైన శిక్షకు వారు అర్హులని న్యాయమూర్తి పీకే తివారి తీర్పు సందర్భంగా శుక్రవారం వ్యాఖ్యానించారు. సురేందర్ కోలీ బాధితురాలిని ఇంటిలోకి ఈడ్చుకొచ్చాడని, ఆ తర్వాత ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయేలా చేశాడని, అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడని, అంతటితో ఆగకుండా ఆమె మాంసం తిన్నాడని, అందువల్ల చట్టం ప్రకారం మరణశిక్ష విధించడం తప్ప అంతకుమించిన శిక్ష లేదన్నారు. తుదిశ్వాస విడిచేదాకా ఉరి తీయాలని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారిరువురినీ జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని సూచించారు.
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (అత్యాచారం), సెక్షన్ (302 (హత్య), సెక్షన్ 201 (సాక్ష్యాలను చెరిపివేయడం)కింద వీరిరువురినీ న్యాయస్థానం గురువారం దోషులుగా నిర్ధారించడం తెలిసిందే. పసికూనల అపహరణ, లైంగిక వేధింపులకు గురిచేయడం, ఆ తర్వాత నోయిడాలోని పాంధేర్ నివాసంలో హత్య చేయడం కేసుల్లో వీరిరువురు ప్రధాన నిందితులు. పాంధేర్‌పై సీబీఐ...అభియోగపత్రం దాఖలు చేయకపోయినప్పటికీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని 319వ సెక్షన్ కింద నిందితుడికి సమన్లు జారీచేసి విచారణ జరిపింది. 25 ఏళ్ల క్రితం నాటి ఈ వ్యవహారం ఎలా బయటపడిందనే దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2006, అక్టోబర్, 12వ తేదీన పనిమనిషి ఇంటికి రాలేదు.
దీంతో ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. అదే ఏడాది డిసెంబర్, 26వ తేదీన పోలీసులు కోలీని అరెస్టు చేశారు. ఆ ఇంటి వెనుకభాగంలో కొన్ని పుర్రెలు పోలీసులకు లభించాయి. అందులో ఒక పుర్రె ... అంజలి తల్లి, సోదరుడి డీఎన్‌ఏలతో సరిపోలింది. దీంతో ఈ కేసుకు సంబంధించి బలమైన ఆధారం లభించింది. ఇదే వారు దోషులని రుజువు చేసేందుకు తోడ్పడింది. కుటుంబసభ్యులు బాధితురాలి దుస్తులను గుర్తించారు. మరో ఎనిమిది కేసుల్లో కోలీ దోషిగా తేలాడు. మొత్తం 19 కేసులు నమోదు కాగా అందులో 16 కేసుల్లో వీరు నిందితులు. అందులో పది కేసులకు సంబంధించి కోర్టు ఓ నిర్ణయానికొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment