విషప్రయోగంతో చనిపోయిన దివ్యాంగుడు గోపాలు, చికిత్స పొందుతున్న కదిరమ్మ
చిత్తూరు, మదనపల్లె క్రైం: మదనపల్లె మండలంలో దారుణం చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఆస్తి కోసం తల్లీ బిడ్డలపై విషప్రయోగం జరిగింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అన్నం తినకుండా ఉండి పోయిన తండ్రికి ప్రాణ గండం తప్పింది. తీవ్ర కలకలం రేపిన ఘటనకు సంబంధించి బాధితులు, రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కోళ్ల బైలు పంచాయతీ మిట్టామర్రి దళితవాడకు చెందిన దంపతులు కదిరప్ప, కదిరమ్మ(70)లది చిన్నపాటి రైతు కుటుంబం. వీరికి నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అందరికి పెళ్లిళ్లు కావడంతో వారంతా వేరువేరుగా కాపురాలు ఉంటున్నారు. వారిలో పెద్ద కుమారుడు కమతం గోపాలు(56) మతిస్థిమితం లేని వికలాంగుడు. ఇతనికి పెళ్లి కూడా కాలేదు. రెండవ కుమారుడు నరసింహులు ఇతనికి పెళ్లయ్యింది. భార్య అమరావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే నరసింహులు కూడా ఆరు నెలల క్రితం అనా రోగ్యంతో చనిపోయాడు. ఇక ఉన్న నలుగురు ఆడబిడ్డలకు వృద్ధ దంపతులు ఎక్కడ ఆస్తిని రాసిచ్చేస్తారోనని.. కొందరు ఆందోళన చెందారు. తర్వాత పథకం ప్రకారం వృద్ధులు తినే అన్నంలో గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి ఫ్లోరైడ్ గులికల పొడి కలిపి వెళ్లిపోయారు. ఆకలి లేని కారణంగా కదిరప్ప(75) ఆ రాత్రి అన్నం తినకుండా పడుకున్నాడు. విషం కలపడాన్ని పసిగట్టలేని కదిరమ్మ, ఆమె కుమారుడు గోపాలు ఒకరి తర్వాత ఒకరు అన్నం తిన్నారు. మొదటగా అన్నం తిన్న కదిరమ్మ తీవ్రఅస్వస్థతకు గురైంది. తర్వాత తేరుకుని వెంటనే ఆమె అతి కష్టం మీద అదే ఊరులోనే ఉన్న తన కూతురు గోపాలమ్మ వద్దకు వెళ్లింది.
గోపాలమ్మ వెంటనే తన తల్లిని చికిత్స కోసం 108లో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. సకాలంలో చికిత్స పొందిన కదిరమ్మ ప్రాణాపాయం నుంచి బయటపడింది. అయితే రాత్రి అదే అన్నం తిన్న గోపాలు ఇంట్లోనే పడుకున్నాడు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించి అతన్ని 108లో చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొం దుతూ గోపాలు చనిపోయాడు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇంతటి దుర్మర్గానికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment