తిరుమలేష్ (ఫైల్) ప్రమాదానికి కారణమైన జలపాతం పైఅంచు
పలమనేరు(చిత్తూరు జిల్లా) : సెల్ఫీ సరదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆదివారం కావడంతో సరదాగా స్నేహితులతో కలసి విహారయాత్రకు వెళ్లిన వ్యక్తి శవమైన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండిపేట కోటూరు కౌండిన్య అటవీ ప్రాంతంలోని గంగనశిరసు జలపాతం వద్ద ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. సముద్రపల్లి గ్రామానికి చెందిన కట్టెల సుబ్బయ్య కుమారుడు కట్టెల తిరుమలేష్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవల కురిసిన వర్షాలకు గంగనశిరసు జలపాతం హోరెత్తుతోందని తెలిసి స్నేహితులతో కలసి వెళ్లాడు.
అత్యంత ప్రమాదకరమైన ఈ చోటుకెళ్లి అక్కడి ఎత్తైన కొండల నుంచి కిందికి ప్రవహిస్తున్న నీటితో సహా తాను సెల్ఫీ తీస్తూ ప్రమాదవశాత్తు జలపాతంలోకి పడ్డాడు. పైకి రావడానికి సాధ్యం కాక అక్కడే మృతిచెందాడు. గుహల మధ్య వచ్చే నీటి ప్రవాహంలో ఓ చోట బండరాళ్ల మధ్య అతని మృతదేహం ఇరుక్కుపోయింది. తమతో వచ్చిన స్నేహితుడు లోయలో పడ్డారని ఆందోళన చెందిన వారంతా అతన్ని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినా వీలుకాలేదు. ఈ విషయం తెలిసి గ్రామానికి చెందిన పలువురు, చుట్టుపక్కల గ్రామస్తులు జలపాతానికి చేరుకున్నారు. అతికష్టమ్మీద మూడుగంటల పాటు కష్టపడి మృతదేహాన్ని బయటకులాగారు. ఆపై మూడు కిలోమీటర్ల మేర శవాన్ని మోసుకొచ్చి స్వగ్రామానికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తిరుమలేష్ మృతితో సముద్రపల్లిలో విషాదచాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment