సాక్షి, కృష్ణా : చల్లపల్లి బీసీ హాస్టల్లో మంగళవారం బాత్‌రూమ్‌లో అనుమానాస్పద స్దితిలో మృతి చెందిన ఆదిత్య మర్డర్ మిస్టరీని 24 గంటల్లోనే ఛేదించినట్టు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. తనను దూషించాడన్న కారణంతో అదే హాస్టల్‌లో ఉంటున్న పదవ తరగతి విద్యార్థే, ఆదిత్యను హత్య చేసినట్లు తెలిపారు. రెండురోజుల క్రితం హాస్టల్‌లో బట్టలు ఉతుకుతున్న ఆదిత్యకు, పదవ తరగతి విద్యార్థికి మధ్య చిన్న గొడవ జరిగిందని, ఈ నేపథ్యంలో మాటా మాటా పెరిగి ఆదిత్య, పదవ తరగతి విద్యార్థిని దుర్భాషలాడారని, ప్రతి చిన్న విషయాన్ని సెన్సిటివ్‌గా తీసుకునే సదరు విద్యార్థి.. ఆదిత్య మాటలను మనసులో పెట్టుకొని ఎలాగైనా అతన్ని హత్య చేయాలని భావించాడని ఎస్పీ తెలిపారు.
‘సోమవారం అర్థరాత్రి ఆదిత్య ఉంటున్నరూమ్‌లోకి వెళ్లి బాత్‌రూమ్ వరకు తోడుగా రావాలని పిలిచాడు. ఇదే అదనుగా భావించి బాత్‌రూమ్‌కు వచ్చిన ఆదిత్య పీక నులిమి చంపాలని ప్రయత్నించాడు. అప్పటికి చావకపోవడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆదిత్య గొంతు కోసి, హాస్టల్ గోడ దూకి పారిపోయాడు. మరునాడు తెల్లవారుజామున ఎవరికి అనుమానం రాకుండా హాస్టల్‌కు చేరుకొని.. తాను బయటికి వెళ్లాలని, రాత్రి హాస్టల్‌కు రాలేదని నిందితుడు వాచ్‌మెన్‌కు తెలిపాడు. ఆదిత్య హత్యకు ఉపయోగించిన కత్తిని, బట్టలను డాగ్ స్క్వార్డ్ పసిగట్టడంతో, హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకొని సైకాలజీ కౌన్సెలింగ్ నిర్వహించాం. హత్య చేసిన విద్యార్థి తండ్రికి నేర చరిత్ర ఉన్నట్లు తెలిసింది. ఇప్పటి పిల్లలపై సోషల్ మీడియా చాలా ప్రభావం చూపిస్తుంది. హత్య చేసిన తర్వాత ఎలా జాగ్రత్త పడాలో సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు’ అని ఎస్పీ రవీంద్రనాధ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment