ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్వతి
తూర్పుగోదావరి , రామచంద్రపురం రూరల్: రామచంద్రపురం మండలం ఉట్రుమిల్లి గ్రామానికి నరాల పార్వతి పేదింటి మహిళ. ఏఎన్‌ఎం కోర్సు పూర్తి చేసిన ఆమె 2006 నుంచి 2014 వరకు ఆశా వర్కర్‌గా పనిచేసేది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ గ్రామ సర్పంచ్ సుంకర సత్తిరాజు(చిన కాపు) అరకొర జీతంతో ఏం చేస్తావని, పంచాయతీలో బిల్లు కలెక్టర్‌గా వేయిస్తాను, పర్మినెంటు అయ్యేలా చేస్తాను అంటే సరేనంది. అన్నట్టుగానే పంచాయతీలో తీర్మానం చేయించి 2015 లో ఆమెను గుమస్తాగా నియమించాడు. మూడేళ్లు పనిచేసిన తరువాత వేరొక మంచి ఉద్యోగంలోకి మారుస్తానని చెప్పి ఉన్న ఉద్యోగం నుంచి తప్పించాడు. ఆ తరువాత ఆమె ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదు. దీనితో ఆమె స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును ఆశ్రయించింది.
ఆయన తన పీఏ కుమార్‌తో చెప్పానని, తనతో మాట్లాడుకోమని చెప్పడంతో పదమూడు నెలలుగా వారి చుట్టూ తిరుగుతున్న ఆమె ఇప్పటికీ ఉద్యోగం కల్పించకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది ఈనెల 20న ఆత్మహత్యకు పాల్పడి రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలిసిన వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, రామచంద్రపురం కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ నాయకులతో కలసి శుక్రవారం ఏరియా ఆసుపత్రిలో ఆమెను కలసి పరామర్శించారు. వారి వెంట పార్టీ జిల్లా కార్యదర్శి టేకుమూడి సత్యనారాయణ, పట్టణ, మండల కన్వీనర్లు గాధంశెట్టి శ్రీధర్, పంతగడ విజయప్రసాద్, పార్టీ నాయకులు సత్తి శంకరరెడ్డి, గుబ్బల గణ, చప్పిడి వీర్రాజు, దంగేటి అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment