వ్యవ’సాయంపై’ కోత
వ్యవ’సాయంపై’ కోత
Published Sun, Jan 29 2017 11:58 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
ఉచిత విద్యుత్ సర్వీసులకు దరఖాస్తుల రిజిస్ట్రేషన్ నిలిపివేత
నిరుపయోగంగా బోర్లు
సాగునీరందక మెట్ట రైతుల అవస్థలు
సబ్సిడీ ఎగ్గొట్టడంపైనే ప్రభుత్వ దృష్టి
కొవ్వూరు :
సంక్షేమ పథకాలకు ఎగనామం పెట్టే కార్యక్రమంలో నిమగ్నమైన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ కనెక‌్షన్ల విషయంలోనూ రైతులకు పంగనామాలు పెడుతోంది. లక్ష్యం పూర్తయ్యిందన్న నెపంతో మూడు నెలలుగా వ్యవసాయ విద్యుత్ కనెక‌్షన్లకు రిజిస్ట్రేషన్ నిలిపివేసింది. ఒక వైపు మెట్టలో భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రస్తుతం ఉన్న బోర్లు పూర్తి సామర్థ్యం మేరకు నీరు తోడటం లేదు. పంటలకు తడులందక కొందరు రైతులు అదనంగా కొత్త బోర్లు వేయగా.. మరికొందరు మొదటిసారి సాగునీటి కోసం కొత్త బోర్లు వేసుకున్నారు. వీరంతా విద్యుత్ కనెక‌్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా విద్యుత్ కనెక‌్షన్లు మంజూరు చేయడం లేదు. దీంతో రైతులు లక్షలాది రూపాయలు వెచ్చించి వేసిన బోర్లు అక్కరకు రావడం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అవసరమైన రైతులందరికీ వ్యవసాయ విద్యుత్ కనెక‌్షన్లు ఇచ్చేవారు. వ్యవసాయ విద్యుత్ కనెక‌్షన్ పొందే రైతులకు ప్రభుత్వం రూ.45 వేలు సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా, మిగిలిన సొమ్మును రైతులు వెచ్చించాల్సి ఉంది. టీడీపీ సర్కారు ఈ సబ్సిడీ భారాన్ని కూడా తగ్గించుకునేందుకు వ్యవసాయ విద్యుత్ కనెక‌్షన్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 93,600 వ్యవసాయ విద్యుత్ కనెక‌్షన్లు ఉన్నాయి. కొత్త సర్వీసుల కోసం 571 మంది సొమ్ము చెల్లించారు. వారెవరికీ సబ్సిడీ రూపంలో రూ.45 వేల చొప్పున మంజూరు కాకపోవడంతో విద్యుత్ కనెక‌్షన్లు పెండింగ్‌లో పడ్డాయి. మరోవైపు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకునే కొత్త కనెక‌్షన్లకు సైతం ప్రభుత్వం బ్రేక్ వేయడం విమర్శలకు తావిస్తోంది.
జిల్లాకు 1,800 కనెక‌్షన్లే
జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరానికి 1,800 వ్యవసాయ విద్యుత్ కనెక‌్షన్లు మాత్రమే కేటాయించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం గత ఏడాది అక్టోబర్ నాటికే పూర్తయిపోయింది. జంగారెడ్డిగూడెం డివిజన్‌లో అత్యధికంగా 1,045 కనెక‌్షన్లు, ఏలూరు డివిజన్‌లో 343, నిడదవోలులో 266, భీమవరం ప్రాంతంలో 17, తాడేపల్లిగూడెంలో 129 కనెక‌్షన్ల చొప్పున రిలీజ్ ఆర్డర్లు ఇచ్చారు. వీటిలోనూ అనేక కనెక‌్షన్లు బిగించాల్సి ఉంది.
సబ్సిడీ మిగుల్చుకునేందుకే..
ఒక్కో వ్యవసాయ కనెక‌్షన్‌కు రూ.45 వేల చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా.. ఆ మొత్తాల్ని మిగుల్చుకునేందుకు కొత్త కనెక‌్షన్లు ఇవ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే సర్వీసు ఏర్పాటుకు సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్, స్తంభాల కోసం 571 మంది రైతులు సొమ్ములు చెల్లించారు. వీరితో కలిపి సుమారు 2వేల మంది రైతులు కొత్త కనెక‌్షన్ల కోసం వేచిచూస్తున్నట్టు అంచనా. ఈ రైతులందరికీ కనెక‌్షన్లు మంజూరు చేస్తే సుమారు రూ.9 కోట్ల మేర ప్రభుత్వంపై సబ్సిడీ భారం పడుతుంది. దీనినుంచి తప్పించుకునేందుకే కొత్త కనెక‌్షన్లను నిలిపివేసిందనే విమర్శలు వస్తున్నాయి.
సొమ్ము చెల్లించి నిరీక్షణ
కొత్త వ్యవసాయ కనెక‌్షన్ల కోసం దరఖాస్తు చేసి ప్రభుత్వ సబ్సిడీ పోగా మిగిలిన సొమ్ము చెల్లించిన రైతులు 571 మంది ఉన్నారు. వీరిలో ఏలూరు డివిజన్‌లో 113 మంది, జంగారెడ్డిగూడెం పరిధిలో 326, తాడేపల్లిగూడెం పరిధిలో 59, భీమవరం పరిధిలో 13, నిడదవోలు డివిజన్ పరిధిలో 70 మంది సర్వీసులు కోసం నిరీక్షిస్తున్నారు.
సౌర విద్యుత్ యూనిట్ల జారీలోనూ తాత్సారం
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి సౌర విద్యుత్‌వైపు రైతులు మళ్లేలా చేస్తోంది. ఎన్‌టీఆర్ జలసిరి2 పథకం కింద ఈ యూనిట్‌కు 33 శాతం నెడ్‌క్యాప్, 56 శాతం విద్యుత్ శాఖ, 11 శాతం సొమ్ము రైతు భరించాల్సి ఉంది. ఈ పథకంలో మూడు, ఐదు హార్స్ పవర్ (హెచ్‌పీ) మోటార్లు మాత్రమే అందిస్తారు. సౌర విద్యుత్‌తో తక్కువ లోతులో (50 నుంచి 60 అడుగులు) ఉన్న నీటిని మాత్రమే తొడుకునే అవకాశం ఉంది. జిల్లాలో మెట్ట ప్రాంతాలకు ఈ పథకం పనికిరాదు. ఇక్కడ 300 నుంచి 500 అడుగులకు లోతుకు వెళితేగానీ నీటిచుక్క దొరికే పరిస్ధితి లేదు. కొన్ని చోట్ల 800 అడుగుల లోతు బోర్లు కూడా ఉన్నాయి. వీటి నుంచి నీరు తోడాలంటే 20, 25, 30 హెచ్‌పీ సామర్థ్యంగల మోటార్లు అవసరం. దీంతో సౌర విద్యుత్‌తో మెట్టప్రాంత రైతుల అవసరాలు తీరే అవకాశం లేదు. ఈ పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ కనెక‌్ష్ న్ల భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. జిల్లాలో 207 సౌర విద్యుత్ కనెక‌్షన్లు విడుద చేశారు. కొందరికి కనెక‌్షన్లు ఇచ్చారు. 84 మంది నిర్దేశించిన సోమ్ములు చెల్లించి కొత్త కనెక‌్షన్ల కోసం నీరిక్షిస్తున్నారు. ఈ కనెక‌్షన్లు ఇవ్వడంలోనూ ప్రభుత్వం తాత్సరం చేయడం విమర్శలకు తావిస్తోంది.
ఏప్రిల్‌లో కొత్త కనెక‌్షన్లు
జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన వ్యవసాయ విద్యుత్ కనెక‌్షన్ల లక్ష్యం పూర్తయింది. అందుకే కొత్త కనెక‌్షన్లకు దరఖాస్తుల రిజిస్ట్రేషన్ నిలిపివేశాం. కొత్త కేటాయింపులు వచ్చిన తర్వాత ఏప్రిల్‌లో కనెక‌్షన్లు ఇస్తాం. అప్పటి వరకు వేచి ఉండాల్సిందే. ఇప్పటికే రిలీజు ఆర్డర్ ఇచ్చిన వారికి సర్వీసులు ఇస్తున్నాం.
సీహెచ్ సత్యనారాయణరెడ్డి, ఏపీఈపీడీసీఎల్, ఎస్‌ఈ
Advertisement
Advertisement