సత్తెనపల్లి(గుంటూరు జిల్లా): మెట్రో నగరాల్లోని ఆస్పత్రులకే పరిమితమైన కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్సను గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావడం ద్వార ఎల్‌వీపీఈఐ అరుదైన ఘనతను సాధించిందని ఎల్.వి.ప్రసాద్ నేత్రవైద్య విజ్ఞాన సంస్థ తేజోకోలి కార్నియల్ ఇనిస్టిట్యూట్ డెరైక్టర్, ప్రముఖ కార్నియల్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్‌కృష్ణ వడ్డవల్లి తెలపారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలోని ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వెద్యశాలలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ శస్త్రచికిత్స చేయించుకోవాలంటే నగరాలకు వెళ్లడంతోపాటు ఆర్థి వ్యయప్రయాసలు పడాల్సివచ్చేదని, రోజువారి కూలీలు, వ్యవసాయ కార్మికులు అయితే తమ వేతనాలను ఫణంగా పెట్టాల్సివచ్చేదన్నారు.
ఈ శస్త్రచికిత్స గ్రామీణ ప్రాంతానికి తీసుకు రావడం ద్వారా ఎల్‌వీపీఈఐ ప్రజల ముంగిటకు నేత్ర వైద్యాన్ని పూర్తిస్థాయిలో తెచ్చినట్లు అయిందన్నారు. ధూళిపాళ్లలోని ఎడ్వర్డ్ అండ్ సూనా బ్రౌన్ సెకండరీ సెంటర్ నేత్ర వైద్య విజ్ఞాన రంగానికి సంబంధించి పూర్తిసౌకర్యాలతో ఉందన్నారు. కేవలం కాటరాక్ట్, గ్లకోమాకు సంబంధించిన చికిత్సలే కాకుండా కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా నిర్వహించడం ద్వారా అరుదైన ఘనత సాధించిందన్నారు.
హైదరాబాద్ ఎల్‌వీపీఈఐకు సంబంధించి రామాయమ్మ ఇంటర్నేషనల్ ఐ బ్యాంకు ద్వారా దాతల నుంచి సేకరించిన టిష్యూని ధూళిపాళ్లకు రవాణాచేసి ఎల్‌వీపీఈఐ తేజోకోలి కార్నియా ఇనిస్టిట్యూట్‌కు చెందిన సర్జికల్ బృందం ఈ ప్రక్రియ పూర్తి చేయగలిగారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 15సెకండరీ సెంటర్ల ద్వారా ఎల్‌వీపీఈఐ ప్రజలకు తన సేవలు అందిస్తుందన్నారు. కార్నియల్ ప్లాంటేషన్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. శ్రస్త్రచికిత్స అనంతరం సేవలు కూడా ఇక్కడే పొందవచ్చన్నారు. కార్నియా సంబంధిత వ్యాధుల కారణంగా దేశంలో అనేకమంది అంధత్వం బారిన పడుతున్నారని, 1.1 మిలియన్ల ప్రజలు రెండు కళ్లల్లో కార్నియా సంబంధిత వ్యాధుల కారణంగా పూర్తిగా అంధులయ్యారన్నారు.
కార్నియా సంబంధిత అంధత్వం నుంచి పరిరక్షించబడాలంటే కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే పరిష్కార మార్గమన్నారు. ఈ దిశగా గత 25ఏళ్లుగా ఎల్‌వీపీఈఐ కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియ గురించి పరిశోధనలు జరపడమేకాక అంధత్వం నుంచి ప్రజలను రక్షించేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ సెంటర్ ద్వారా డయాబేటిక్ రెటినోపతి, గ్లకోమా, చిన్నపిల్లల కంటి వైద్యసేవలు కూడా లభ్యమవుతాయన్నారు. తెనాలికి చెందిన షేక్ బీబీకి కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు వెల్లడించారు. సమావేశంలో ఎల్‌వీపీఈఐ వైద్య బృందం, సిబ్బంది పాల్గొన్నారు.
ఆ శస్త్రచికిత్స ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ..
Published Mon, Mar 28 2016 10:49 PM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM
Advertisement
Advertisement