ఒక్కరోజులో లక్ష!
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓటర్ల నమోదు ప్రహసనంగా ముగిసింది. గంపగుత్తగా ఓటర్ల నమోదు పెద్దఎత్తున జరిగింది. దాదాపు అన్ని డివిజన్లలోనూ ఇదే రీతిలో ఓటర్ల నమోదు జరిగినట్టుగా తెలుస్తోంది. శనివారం విశాఖ ఆర్డీవో కార్యాలయంలో ఇదే రీతిలో ఓటర్ల నమోదుకు నారాయణ విద్యాసంస్థలతో కలిపి ఆళ్వార్‌దాస్ విద్యా సంస్థల యాజమాన్యం విఫలయత్నం చేయగా సీపీఎం నేతలు అడ్డుకుని వాటిని తగలబెట్టారు. అరుునప్పటికీ చివరిరోజు ఏకంగా సుమారు లక్ష ఓట్ల నమోదుకు దరఖాస్తులందినట్టుగా అధికారులు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మరో రెండు నెలల్లో ఖాళీ కానున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు చేపట్టిన కసరత్తులో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గత నెల 1న ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టారు.
తొలి ఎనికల్లో 1,61,374మంది ఓటుహక్కు నమోదు చేసుకోగా, గడిచిన పదేళ్లలో పెరిగిన పట్టభద్రుల సంఖ్యను బట్టి 2.50 లక్షలకు పైగా ఓట్లు నమోదవుతాయని అంచనా వేశారు. ఏదైనా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే సిబ్బందిలో ఎవరైనా గ్రాడ్యుయేట్స్ ఉంటే వారి తరపున ఎవరో ఒకరు సమర్పించే అవకాశం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు గంపగుత్తగా ఓటర్ల నమోదుకు తెగపడ్డారుు. ఆళ్వార్‌దాస్ కళాశాల సెక్రటరీ రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆళ్వార్‌దాస్‌తోపాటు మున్సిపల్ శాఖా మంత్రికి చెందిన ‘నారాయణ’ విద్యాసంస్థలు కూడా ఉత్తరాంధ్ర పరిధిలో పెద్ద ఎత్తున ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులను ఎన్నికల ఏజెంట్లుగా ఇంటింటికీ పంపి పట్టభద్రుల నుంచి పెద్ద ఎత్తున ఓటర్ల నమోదు పత్రాలను సేకరించారు. వీటిని చివరి రోజైన శనివారం ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో సమర్పించినట్టుగా తెలుస్తోంది.
ఆ విద్యాసంస్థలో 7 వేలమంది సిబ్బంది ఉన్నారట..
విశాఖ ఆర్డీవో కార్యాలయంలో కూడా ఇదే రీతిలో ఆళ్వార్‌దాస్ విద్యాసంస్థలు తమ లెటర్ హెడ్‌పై ‘మా సంస్థలకు చెందిన 7 వేల మంది సిబ్బంది ఓట్లను సమర్పిస్తున్నాం.. అంగీకరించాల్సింది’గా కోరారు. ఇంతలో వచ్చిన ఆర్డీవో వెంకటేశ్వర్లు దరఖాస్తులను పరిశీలించి తొలుత ఇన్ని వేల దరఖాస్తులను తీసుకోలేమని చెప్పారు. మంత్రి ద్వారా ఒత్తిడి తీసుకురాగా, ఇంతలో అక్కడకు చేరుకున్న సీపీఎం నేతలు బల్క్ ఓటర్ల నమోదును అడ్డుకుని అధికారులను నిలదీశారు. కనీసం అభ్యర్థి, గెజిటెడ్ అధికారి సంతకాలు లేకపోగా, ఒక లెటర్ హెడ్‌పై ఇన్ని వేల దరఖాస్తులు ఏ విధంగా తీసుకుంటారని ప్రశ్నించారు. అడ్డగోలుగా ఓటర్ల నమోదుకు సీపీఎం నేతలు బ్రేకులేయడంతో ఆళ్వార్‌దాస్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సోమవారం సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోక్‌నాధం, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వివి శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో పక్క గడువు ముగిసేనాటికి నమోదైన ఓటర్ల వివరాలను సోమవారం సాయంత్రం జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్ బాబూరావునాయుడు ప్రకటించారు.
4వ తేదీ వరకు 48 వేలే నమోదు...
ఓటర్ల నమోదుకు అక్టోబర్ 1న శ్రీకారం చుడితే తొలి పదిరోజులు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఆ తర్వాత 17వ తేదీ నాటికి 2,054 దరఖాస్తులొచ్చారుు. ఇక అక్టోబర్ 30 నాటికి ఆ సంఖ్య 31,011కు చేరింది. నవంబర్ 3వ తేదీ నాటికి 47 వేలకు చేరారుు. 4వ తేదీకి ఆ సంఖ్య 48,835కు చేరింది. ఓటర్ల నమోదుకు చివరి రోజైన ఐదవ తేదీ నాటికి ఆ సంఖ్య ఊహలకు అందని రీతిలో ఏకంగా 1.47,956కు చేరింది. అంటే చివరి రోజైన శనివారం ఒక్కరోజు ఏకంగా సుమారు లక్ష ఓట్లు నమోదైనట్టు అధికారులు ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. ఓటర్ల నమోదులో అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్ల మేరకు కార్పొరేట్ సంస్థలకు అధికారులు దాసోహమైనట్టుగా ఆరోపణలు బలంగా విన్పిస్తున్నారుు. లేకుంటే చివరిరోజు ఏకంగా లక్ష ఓట్ల నమోదు ఏ విధంగా సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది. అందిన దరఖాస్తుల్లో విశాఖ జిల్లా పరిధిలో 89,676, శ్రీకాకుళం జిల్లాలో 28,329, విజయనగరం జిల్లా పరిధిలో 29,951 ఉన్నారుు. డివిజన్ల వారీగా నమోదైన ఓట్ల వివరాలు ఇలా ఉన్నారుు.