సీమను విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
సీమను విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
Published Sat, Nov 12 2016 10:35 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM
– బీడీఎస్‌ఎఫ్ శిక్షణ తరగతుల్లో వక్తలు
కర్నూలు(అర్బన్): అభివృద్ధి విషయంలో రాయలసీమ ప్రాంతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని పలు విద్యార్థి, ప్రజా సంఘాలు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక అంబేడ్కర్ భవన్‌లో బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (బీడీఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో రాయలసీమ స్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. బీడీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం. రవి అధ్యక్షతన జరిగిన ఈ తరగతులకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, బీడీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోనేటి వెంకటేశ్వర్లు, రాయలసీమ ప్రజా వేదిక కన్వీనర్ సీవై రామన్న, రాయలసీమ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ టి. శేషఫణి, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవపూజ ధనుంజయాచారి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి బి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమకు చెందిన యువత, విద్యార్థులు సీమ అభివృద్దే ధ్యేయంగా, ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ఇచ్చిన హామీని నేటి వరకు కూడా పాలకులు నెరవేర్చలేదన్నారు. సంక్షేమ వసతి గృహాలను రద్దు చేసి రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మార్చడంతో బాల కార్మికులు పెరిగిపోతున్నారన్నారు. సీమలోని పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని, రాయలసీమ వర్సిటీ అభివృద్ధికి రూ.200 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, ఐటీ కారిడార్, గుంతకల్లులో రైల్వే జోన్, కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలన్నారు. అలాగే గుండ్రేవుల రిజర్వాయర్, హంద్రీనీవా, సిద్దేశ్వరం అలుగు ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో బీడీఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జె. రాజరత్నం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సురేష్, కర్నూలు డివిజన్ కార్యదర్శి ఎం. వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement