నెక్ట్స్‌పై రోడ్డెక్కిన మెడికోలు
నెక్ట్స్‌పై రోడ్డెక్కిన మెడికోలు
Published Wed, Feb 1 2017 9:44 PM | Last Updated on Tue, Oct 9 2018 7:43 PM
– మీరు పెట్టిన పరీక్షలపై మీకు నమ్మకం లేదా?
–వైఎస్ హయాంలో ఇచ్చిన ఫీజు రీయింబర్స్ తర్వాత ఇప్పటికి పైసా లేదు
–ప్రభుత్వ విధానాలతోనే వైద్యులు వ్యాపారులవుతారంటూ ఆందోళన
–ఆందోళన బాట పట్టిన జిల్లాలోని నాలుగు వేలమంది వైద్య విద్యార్థులు
–‘నెక్ట్స్ పరీక్ష నిషేధించాలంటూ ధర్నా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ) : రూ.లక్షల ఫీజులు కట్టి ప్రభుత్వం పెట్టిన పరీక్షలన్నీ కష్టపడి పాసైన తర్వాత తిరిగి వైద్య డిగ్రీ ఇవ్వడానికి మరో పరీక్షా...అంటే ఇప్పటివరకు పెట్టిన పరీక్షలపై వారికి నమ్మకం లేదా...అటువంటి స్థాయి పరీక్షలను ప్రభుత్వం నిర్వహించిందా..మెడికోల జీవితాలతో ఆటలాడుకుంటే వైద్య విధానంలో వచ్చే వ్యతిరేక మార్పులకు ప్రభుత్వమే దోషిగా నిలబడాలంటూ స్టెతస్కోప్‌లు పట్టుకున్న చేతులతో ప్లకార్డులు చేబూని వైద్య విద్యార్థులు రోడ్డెక్కారు.జిల్లాలోని మెడికోలు బుధవారం కలెక్టరేట్, సబ్‌కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేశారు. మెడికోలకు వైద్య డిగ్రీ అందించేందుకు ప్రభుత్వం ఎన్నో పరీక్షలను నిర్వహిస్తోంది. అయితే అవి సరిపోనట్టు డిగ్రీ పొందేందుకు ‘నెక్ట్స్’అనే పరీక్షను ప్రవేశపెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా మెడికోలంతా ధర్నాలు, ఆందోళనలు ప్రారంభించారు. దీనిలో భాగంగా జిల్లాలోని మెడికోలు ఐఎంఏ సహకారంతో ధర్నా చేశారు. వీరంతా ఐఎంఏ మెడికో అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. జిల్లాలో మొత్తం మూడు వైద్య కళాశాలలున్నాయి. రాజమహేంద్రవరంలోని జీఎఎస్‌ఎల్ మెడికల్ కళాశాల, కాకినాడలో రంగరాయ వైద్య కళాశాల, అమలాపురంలోని కిమ్స్ కళాశాలున్నాయి. వీటిలో మొత్తం నాలుగువేల మంది వైద్య విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. ఈ ధర్నాకు ఐఎంఏ వైద్యులు తరలివచ్చారు. వీరంతా కలసి సబ్‌కలెక్టర్ కార్యాలయాలకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. అనంతరం మొమెరాండం ఇచ్చారు. ఇలాంటి విధానాలను అనుసరిస్తుంటే వైద్యం వ్యాపారంగా మారిపోతుందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని వారు ఆరోపిస్తున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో వైద్య విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరేవన్నారు. ఫీజు రీయింబర్స్ విడుదలై తమకు ఎంతో ఉత్సాహంగా వైద్య విద్యనభ్యసించే అవకాశం ఉండేదని, ఆయన మరణం తర్వాత ఇప్పటివరకు తమకు ఫీజు రీయింబర్స్ ఒక్కపైసా కూడా రాలేదని మెడికోలు ఆవేదన చెందారు.
Advertisement
Advertisement