-
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
-
వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్లేనని సూసైడ్ నోట్
అంబాజీపేట :
తాహతుకు మించి చేసిన అప్పులు ఆ యువకుడినే బలిగొన్నాయి. జీవితంలో స్థిరపడేందుకు అక్కరకు వస్తుందనుకున్న రుణమే.. అతడి పాలిట యమపాశమైంది. స్థానిక పెద్దవీధికి చెందిన సిరిపెల్ల నాగవెంకట సతీష్‌కుమార్(25) సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం అతడి బంధువు ఇంట్లోకి వెళ్లిచూడగా, ఫ్యాన్ హుక్కుకు మృతదేహం వేలాడుతూ కనిపించింది. అమలాపురం రూరల్ సీఐ జి.దేవకుమార్, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కొంతకాలంగా సతీష్‌కుమార్ అంబాజీపేట సెంటర్ సమీపంలో ఇంటర్నెట్ కేంద్రం నిర్వహిస్తున్నాడు. తన కుటుంబ సభ్యులకు తెలియకుండా కొందరి వద్ద రూ.10 లక్షలు పైబడి వడ్డీకి అప్పులు చేశాడు. అసలుకు వడ్డీ ఎక్కువ కావడంతో అప్పులు తీర్చలేకపోయాడు. దీంతో అప్పులు ఇచ్చినవారు అతడి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో అతడి తండ్రి రాంబాబుపై గత నెల 16న దాడి చేసి, గాయపరిచారు. ఈ సంఘటనపై అప్పట్లో రాంబాబు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అలాగే వడ్డీ వ్యాపారులు కూడా సతీష్‌కుమార్ తీరుపై ఫిర్యాదు చేశారు. దీంతో సతీష్‌కుమార్ పరారీలో ఉన్నాడు. తాను చేసిన అప్పులకు తన తండ్రిని కొట్టడంతో పాటు వడ్డీ వ్యాపారుల వేధింపులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ పేర్కొని, ఉరి వేసుకున్నాడు. రాంబాబు ఫిర్యాదుతో పాటు సూసైడ్ నోట్ ఆధారంగా, దీంతో సంబంధం ఉన్న వారిపై కేసు నమోదు చేస్తున్నట్టు సీఐ దేవకుమార్ తెలిపారు. అల్లవరం ఎస్సై డి.ప్రశాంతకుమార్ సంఘటన స్ధలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.