ఇళ్ల పేరుతో ‘పక్కా’ దగా | TDP leaders Collections | Sakshi
Sakshi News home page

ఇళ్ల పేరుతో ‘పక్కా’ దగా

Published Wed, Oct 5 2016 12:25 AM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

ఇళ్ల పేరుతో ‘పక్కా’ దగా - Sakshi

ఇళ్ల పేరుతో ‘పక్కా’ దగా

– అధికార పార్టీ నేతల మోసపు మాటలు
–పేదలపై జన్మభూమి కమిటీల ఆశల వల
–తొలిజాబితాలో మీపేరు అంటూ... దందా

తిరుపతి తుడా:   
‘‘ మీరు ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. పేరు జాబితా చివరిలో ఉంది. జాబితా ప్రకారం మీకు ఇల్లు కేటాయించాలంటే 6 నెలల పైగా పడుతుంది. ఫస్ట్‌ లిస్ట్‌లోనే మీపేరు ఉండేలా చూసుకుంటా. అయితే ఇందుకు అదనంగా రూ.15వేలు ఖర్చు చేసుకోవాల్సి ఉంటుందని ఎమ్మార్‌పల్లిలో ఓ పేద కుటుంబానికి అధికార పార్టీకి చెందిన ఒకనేత భేరం పెట్టారు. దీనిపై స్పందించిన ఆ పేదకుటుంబం అయ్యా అంతడబ్బు ఇచ్చులేం. దయ ఉంచి ఇల్లు వచ్చేలా చూడండని కాళ్లావేళ్లాపడ్డా ఆ నేత కనికరం లేకుండా వెళ్లిపోయాడు.
‘‘ ఏమమ్మా... మీరు ఇంత వరకు ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకోలేదని మనోడు చెబుతున్నాడు. మీరు అన్నివిధాలా అర్హులే కదా?. ఎందుకు చేసుకోలేదు. ఏం మించిపోయింది లేదు.  హౌసింగ్, కార్పొరేషన్‌ వారితో మాట్లాడి పేరు లిస్ట్‌లో చేర్పిస్తా. ఎక్కడ కావాలో చెప్పండి. అక్కడే ఇల్లు వచ్చేలా చూసుకుంటా. అందర్నీ మేనేజ్‌ చేయడానికి పాతిక వేలు ఖర్చు అవుతుంది. ఇందుకు  ఒకే అంటే రెండురోజుల్లోగా చెప్పండి మీకు ఇల్లు ఇప్పించే పూచీ నాది అని చెప్పడంతో సంబరపడ్డ ఆ కుటుంబం అప్పుచేసి ఆ నేతకు రూ. 25వేలు ఇచ్చుకున్నారు. ఇలా ఎందరో టీడీపీ నేతలను నమ్మి వేలరూపాయలు అప్పుజేసి ఇచ్చుకుంటున్నారు.
తిరుపతి నగరంలో ప్రభుత్వం పాడిపేట–3216, దామినేడులో 4056, వికృతమాలలో1800,అవిలాలలో 144 ఇళ్ల నిర్మాణాలను చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఇదే అదనుగాసొంతిళ్లు లేని పేదలే టార్గెట్‌గా జన్మభూమి కమిటీ సభ్యులు బడుగులపై కాసుల కక్తుర్తితో ఆశల వల వేస్తున్నారు. తమ పరిధిలోని వార్డు వార్డూ తిరుగుతూ ఇల్లు ఇప్పిస్తామని, ఫస్ట్‌ లిస్ట్‌లోనే పేరు ఉండేలా చూస్తామని దళారుల అవతారమెత్తుతున్నారు. ఇళ్లకు చెల్లించాల్సిన మొత్తంతో పాటు అదనంగా మరో రూ. 15 నుంచి 30 వేలు వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని బహిరంగంగా చెబుతున్నారు. ఇచ్చుకుంటే ఇల్లు ఇప్పించే బాధ్యత మాదేనని హామీ ఇస్తున్నారు. వీరి హామీలు వింటున్న పేదలు నిజమేనా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారులేమో లక్కీడిప్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న వరుస ప్రకారం ఇళ్లను కేటాయిస్తామని చెబుతుంటే  ఈ అధికార దళారులేమో వాటితో మీకు పనిలేకుండా ఇల్లు ఇప్పిస్తామని చెప్పడం తిరుపతిలో చర్చనీయాంశంగా మారింది.
ఇల్లు కావాలా నాయనా..!
వికృతమాల, అవిలాల, దామినేడు ప్రాంతాల్లోని ఇల్లకు అధిక డిమాండ్‌ ఉంది. ఈ ప్రాంతాల్లోనే ఇల్లు కావాలని అధికమంది కోరుకుంటున్నారు. వికృతమాల దూరమైనా ఇల్లు చాలా బాగుండటం, విమానాశ్రయంకు దగ్గరగా ఉండటంతో ఎక్కువ మంది వికృతమాలవైపు మొగ్గుచూపుతున్నారు. ఆ తరువాత పాడిపేట, దామినేడు బ్లాకులవైపు మొగ్గుచూపుతున్నారు. ఇదే అదునుగా పచ్చనేతలు రెచ్చిపోతున్నారు. ప్లాట్లను నడివీదిలో అమ్మేస్తున్నారు.  ఒక్కో ఏరియాకు ఒక్కో రేటు పెట్టి మీరు కోరుకున్న చోటే ఇల్లని చెబుతున్నారు.
నగదు చెల్లించినవారే టార్గెట్‌
దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి పలు దఫాల్లో కార్పొరేషన్, హౌసింగ్‌ అధికారులు బెనిఫిషర్‌ కాంట్రీబ్యూషన్‌ను కట్టించుకున్నారు. వీరి జాబితాను తీసుకున్న టీడీపీ నాయకులు వారి ఇళ్లకెళ్లి బేరసారాలు మొదలు పెట్టారు. తొలిజాబితాలో ఇవ్వలంటే రూ. 30 వేలు అదనంగా ఇస్తేనే అంటూ మాయమాటలు చెబుతున్నారు. జన్మభూమి కమిటీ సూచించిన వారికే ఇళ్లంటూ చెప్పడంతో లబ్ధిదారులు చేసేది లేక కొంత మంది చెల్లించుకుంటున్నారు. డబ్బులు ఇచ్చిన వారికే మంచి బ్లాక్‌లలో చూపిస్తామని చెబుతున్నారు. చాలా మంది ఇప్పటికే ఇచ్చేశారు.
అధికారుల వాదన ఇలా...
సంబంధిత కార్పొరేషన్‌ , హౌసింగ్‌ అధికారులను అడగ్గా  లక్కీడిప్‌ ద్వారానే లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తామని చెబుతున్నారు. ప్రీమియం చెల్లించిన లబ్ధిదారులకు వరుస క్రమంలో లక్కీడిప్‌ నిర్వహించి దానిప్రకారం కేటాయింపులు జరుగుతాయని చెబుతున్నారు. జన్మభూమి కమిటీల హావా ఉండడంతో లబ్ధిదారులు ఆందోళనలో పడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement