టిక్కెట్లు సరే..బోగీ ఏదీ?
టిక్కెట్లు సరే..బోగీ ఏదీ?
Published Sun, Jan 15 2017 11:02 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM
–ఆదోనిలో రైలును ఆపి ఆందోళనకు దిగిన ప్రయాణికులు
–పోలీసుల జోక్యంతో గంట ఆలస్యంగా గుంటకల్‌కు బయలు దేరిన నాంథేడ్ ఎక్స్‌ప్రెస్
ఆదోని/అర్బన్: రిజర్వేషన్ టిక్కెట్లు జారీ చేసిన రైల్వే అధికారులు సంబంధిత బోగీని మాత్రం నాంథేడ్ ఎక్స్‌ప్రెస్‌కు ఏర్పాటు చేయలేక పోయారు. దీంతో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు తమకు బెర్త్‌లు లేక ఆదోనిలో రైలును నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆదోని రైల్వే స్టేషనులో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. బాధిత ప్రయాణికుల సమాచారం మేరకు..నాంథేడ్ నుంచి బెంగళూరు నాంథేడ్ ఎక్స్‌ప్రెస్(నం.16593) శనివారం బయలు దేరింది. బెంగళూరు వైపు వెళ్లాల్సిన ప్రయాణికులు చాలా మంది దాదాపు రెండు నెలల క్రితం నుంచి రిజర్వేషన్ చేసుకున్నారు. ఇందులో కొందరికి రైల్వే అధికారులు ఎస్6 బోగీలో బెర్త్‌లు రిజర్వు చేశారు. అయితే రైలుకు మాత్రం రైల్వే అధికారులు సంబంధిత బోగిని ఏర్పాటు చేయలేదు. రాఘవేంద్రస్వామి దర్శనం కోసం మంత్రాలయానికి వచ్చిన భక్తులకు తిరుగు ప్రయాణంలో ఎస్6 బోగిలోనే అధికారులు బెర్తులు రిజర్వు చేశారు. దాదాపు 50 మంది ప్రయాణికులు తమ బోగీ కోసం మంత్రాలయం స్టేషనులో వెతికారు. అది దొరకక పోవడంతో రైలు కదిలే సమయంలో అందుబాటులో ఉన్న దానిలోనే ఎక్కేశారు. అయితే టీసీ టిక్కెట్లపై అనుమానం వ్యక్తం చేయడంతో ప్రయాణికుల్లో ఒక్క సారిగా ఆగ్రహం తెంచుకు వచ్చింది. తాము 2 నెలల క్రితం రిజర్వు చేస్తే బోగస్ టిక్కెట్లు ఎలా అనుమానిస్తారంటూ టీసీని నిలదీశారు. ఆదోని స్టేషన్‌లో ఆగగానే ఫ్లాట్ ఫారంపై దిగి ఆందోళనకు దిగారు. తమకు బెర్తుల సదుపాయం కల్పించి న్యాయం చేసేంత వరకు రైలును కదలినివ్వబోమని పట్టుపట్టారు. ప్రయాణీకులతో ఆడుకుంటారా అంటూ స్టేషన్ మాస్టర్‌ని నిలదీశారు.
సమాచారం గుంతకల్లుకు పంపామని, అక్కడ అదనపు బోగీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని స్టేషన్ మాస్టర్ నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. చిన్న పిల్లలు, వృద్ధుళు ఉన్నారని, బెర్తులు లేక పోతే రాత్రి పూట ఎక్కడ నిద్రపోవాలని ప్రశ్నించారు. తమకు ఖచ్చితమైన హామీ ఇచ్చేంత వరకు రైలును కదలనివ్వబోమని మొండికేశారు. పరిస్థితి కొద్దిగా ఉద్రిక్తంగా మారడంతో స్థానిక టూటౌన్ పోలీసులకు రైల్వే అధికారులు సమాచారం అందించారు. సీఐ గంటా సుబ్బారావు, ఎస్‌ఐ రమేష్‌బాబు, సిబ్బందితో స్టేషన్‌కు వచ్చి గట్టిగా హెచ్చరించారు. గంతకల్లులో ఉన్నత స్థాయి అధికారులు..ఉంటారని, వారికి సమస్యను పరిష్కరించే అధికారం ఉందని, మొండిగా వ్యవహరించి వేల మంది ప్రయాణికులు ఇబ్బంది తేవద్దంటూ సీఐ నచ్చజెప్పారు. వినకపోతే చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటోందని హెచ్చరించారు. పోలీసుల జోక్యంతో దాదాపు గంట తరువాత రైలు గుంతకల్లుకు బయలు దేరి వెళ్లింది.
Advertisement
Advertisement