సంపాదకీయం
సాధారణ సమయాల్లో సామాన్యుల కడుపులు కాలుతున్నా, గుక్కెడు నీళ్లు లేక వారి గొంతెండుతున్నా, అనేకానేక సమస్యలతో వారంతా సతమతమవుతున్నా ఆసరా ఇచ్చేవారు కనబడరు. కానీ, ఎన్నికలొచ్చే సరికి మాత్రం కరెన్సీ కట్టలు, మద్యం, బంగారం, మాదకద్రవ్యాలు సర్వత్రా దర్శనమిస్తాయి. ప్రజలను సమ్మోహనపరిచేందుకు రెక్కలు కట్టుకువాలుతాయి. ఎన్నికల సంఘం(ఈసీ) ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు ఈ ధోరణి అంతకంతకూ పెరుగుతున్నదే తప్ప ఎలాంటి నియంత్రణ లకూ లొంగడం లేదు. ఈసారి ఎన్నికల్లోనూ అదే పునరావృతమైందని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన డబ్బు, మద్యం వగైరా లెక్కలు చూస్తే అర్ధమవుతుంది. కార్లు, బస్సులు, ద్విచక్రవాహనాలు, ఏటీఎంలు, బ్యాంకు ఖాతాలు...ఏదో ఒక తోవన డబ్బు జనం జేబుల్లోకొచ్చి కూర్చుంటున్నది. ఈ ప్రవాహాన్ని దారి కాసి నిలువరిం చామని అధికారులు భ్రమపడనవసరం లేదు. పారే ప్రవాహంలో వారికి లభిస్తున్నది చాలా స్వల్పమేనని నిపుణుల అంచనాలు చెబుతున్నాయి. తాము ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకున్న డబ్బు, వివిధ రకాల సామగ్రి విలువ రూ. 1,100 కోట్లు వరకూ ఉన్నదని ఈసీ అధికారులు అంటు న్నారు. ఇందులో డబ్బు రూ. 300 కోట్లయితే... మద్యం లక్షా 33వేల లీటర్లు. ఈ రెండూ కాక పట్టుబడిన మాదకద్రవ్యాలు 30,000 కిలోలు. ఈ మాదకద్రవ్యాల విలువ వేల కోట్ల రూపాయలుంటుంది. మన రాష్ట్రంలోనే తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థి ఏజెంటునుంచి రూ. 90 లక్షల విలువైన కరెన్సీ కట్టల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఎన్నికల కోడ్ అమలయ్యాక జరిగిన దాడుల్లో లభ్యమైనవే . అంతకుముందే జ్ఞానోదయమై అవసరమున్న ప్రాంతాలకు డబ్బు, మద్యం వగైరాలను తరలించిన అభ్యర్థులు ఉండొచ్చు. అలాగే, ఏ నిఘా నేత్రానికీ చిక్కకుండా ఇప్పటికీ దర్జాగా వెళ్తున్నవి ఉండొచ్చు. ఆంతరంగికులుగా ఉంటూ కడుపుమండి పక్కా సమాచారం ఇచ్చిన సందర్భాల్లో మాత్రమే ఎక్కువ భాగం స్వాధీనమవుతున్నాయని గుర్తుంచు కోవాలి. అందువల్లే పట్టుబడిన సొమ్ము ఓటర్లకు పంపిణీ చేస్తున్న డబ్బులో పదోవంతు దాటదని ఎన్నికల సంఘం వర్గాలే చెబుతున్నాయి.
ఎన్నికల సంఘం ఈసారి అనేకానేక విధాలుగా అభ్యర్థుల వ్యయంపై నిఘా పెట్టింది. లక్ష రూపాయలు మించిన ఆర్ధిక లావాదేవీలను తమ దృష్టికి తీసుకురావాలని బ్యాంకులను కోరింది. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి ఆరా తీసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకు అధికార్ల వ్యవస్థను ఏర్పాటుచేసింది. అభ్యర్థుల ఖర్చుల పర్యవేక్షణకు వివిధ విభాగాలకు చెందిన సీనియర్ అధికార్లతో ప్రత్యేక వ్యవస్థ, క్షేత్రస్థాయి నిఘా బృందాలు ఉంటున్నాయి. పోలీసు, ఆదాయపన్ను శాఖ, ఆర్ధిక నిఘా విభాగం వగైరాలన్నీ రంగంలోకి దిగాయి. వీడియో రికార్డింగుల హడావుడీ ఎక్కువే. వీటన్నిటితోపాటు ఈసారి అభ్యర్థులు చేసే వ్యయ పరిమితిని కూడా పెంచారు. లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థి రూ. 70లక్షల వరకూ, అసెంబ్లీకి పోటీచేసేవారు రూ. 28 లక్షలవరకూ ఖర్చుపెట్టవచ్చునని తాజా నిబంధనలు చెబుతున్నాయి. గతంతోపోలిస్తే ఈ మొత్తం ఎక్కువేగానీ...ఇప్పుడు పెట్టిన పరిమితులతో ఒక పంచాయతీ వార్డు మెంబరు కూడా గెలిచే పరిస్థితి ఉండదని గుర్తుంచుకోవాలి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో తాను రూ. 8 కోట్లు ఖర్చుచేయాల్సివచ్చిందని మహారాష్ట్ర బీజేపీ నేత గోపీనాథ్ ముండే ఆమధ్య నోరుజారారు. ఆయన 2009లో ఈసీకి సమర్పించిన జమాఖర్చుల జాబితాలో చూపించింది కేవలం రూ. 19 లక్షలు మాత్రమే. చుట్టూ కెమెరాలు లేవు కదానని ఆయన నిజం చెప్పి ఉండొచ్చుగానీ...ఎన్నికల బరిలో ఉంటున్నవారందరూ ఆయన చేసిన ఖర్చుకు దాదాపు దరిదాపుల్లోనే ఉంటారన్నది బహిరంగ రహస్యం.
ఎన్నికల నిర్వహణకు ఈసారి అయ్యే వ్యయం రూ. 2,000 కోట్లు ఉండొచ్చని ఈసీ అంచనా వేస్తుండగా ఇంతవరకూ పట్టుబడిన డబ్బు, మద్యం వగైరాల విలువ ఇప్పటికే అందులో సగం వరకూ ఉంది. అభ్యర్థులంతా దాదాపు రూ. 30,000 కోట్లు ఖర్చు చేస్తారని ఎన్నికల రంగ నిపుణుల అంచనా. ప్రజాస్వామ్యానికి ప్రాణధాతువు అనదగ్గ ఎన్నికలు ఇలా అఘోరించి ప్రపంచంలోనే మన పరువు తీస్తున్నాయి. ప్రతిసారీ డబ్బు, మద్యం, క్రికెట్ కిట్లు, చీరెలు, వంటసామగ్రి వగైరాలు పట్టుబడుతుంటే ఈసారి ఆ జాబితాలోకి మాదకద్రవ్యాలు కూడా వచ్చిచేరి మరింత నగుబాటుపాలు చేశాయి. ఎన్నికలంటే ధనమదం, కండబలం అని ఈ ఉదంతాలన్నీ చెప్పకనే చెబుతున్నాయి. ప్రతి ఎన్నికల అనుభవాలనూ రంగరించి ఈసీ కొత్త కొత్త చర్యలు తీసుకుంటున్నది గానీ...అభ్యర్థుల, పార్టీల కపటనాటకాల ముందు అవన్నీ తేలిపోతున్నాయి. కనుక ఇక సమూల, సమగ్ర ప్రక్షాళనకు పూనుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికల వ్యవస్థను ఎలా తీర్చిదిద్దవచ్చునో గతంలో లా కమిషన్, దినేశ్ గోస్వామి కమిటీ, ఇంద్రజిత్ గుప్తా కమిటీలు సవివరమైన సూచనలు ఇచ్చాయి. వాటిపై మరోసారి దృష్టిపెట్టాలి. తాజా అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకుని సమగ్రమైన విధానానికి రూపకల్పన చేయాలి. అభ్యర్థులకయ్యే వ్యయంలో ప్రభుత్వమే కొంత భాగం భరించే పద్ధతి అమలుచేస్తే ధన ప్రభావాన్ని తగ్గించవచ్చునని గతంలో సూచనలు వచ్చాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికే అలాంటి విధానం అమల్లో ఉంది. ఆచరణలో అది ఎలా ఉన్నదో పరిశీలించి, తగిన మార్పులు చేసి ఇక్కడా అనుసరించవచ్చునేమో పరిశీలించాలి. ఈ విషయంలో ఇక ఏమాత్రం జాప్యం చేసినా పరిస్థితి మరింత వికృత రూపం దాల్చే ప్రమాదముంటుందని గుర్తించాలి.
ఓటు చుట్టూ నోట్ల జాతర!
Published Fri, Apr 25 2014 12:49 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement