'అబద్ధాల కోరును ప్రధానిగా ఎన్నుకోవద్దు'
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశానికి తదుపరి ప్రధానమంత్రిగా 'అబద్ధాల కోరు'ను ఎన్నుకోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ పేరు ప్రస్తావించకుండానే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆమె మాట్లాడారు. కొంతమంది విపక్ష నేతలు తమ కలలను అమ్మేస్తున్నారని, ఒక్కరోజులోనే మంత్రదండంతో అన్నీ మార్చేస్తామన్నట్లుగా చెబుతున్నారని, అబద్ధాల కోరును ఈ దేశం ప్రధానమంత్రిగా ఎన్నుకుంటుందా అని సోనియా అన్నారు.
హజారీబాగ్ జిల్లాలోని రాంగఢ్లో ఆమె మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పడితే వాళ్లు అధికారాన్ని లాక్కోడానికి అనుమతించకూడదని చెప్పారు. మావోయస్టులు హింసను మాని జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బొగ్గుగనులను జాతీయం చేసి కార్మికులకు మేలుచేశారని, వాళ్లు దాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరారు. అలాగే గత పదేళ్లలో యూపీఏ ప్రభుత్వం సాధించిన విజయాలంటూ కొన్ని పథకాలను వల్లెవేశారు.